[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[ఏదైనా మరో ప్రదేశానికి వెళ్ళిపొమ్మని సమీర్కి సలహా ఇస్తాడు రజనీశ్. ఏం చేద్దామని జో ని అడుగుతాడు. హోటల్‌కి వెళ్ళక తప్పదనీ, తాను పారిపోయానని జనాలు అనుకుంటే అదీ మరీ ప్రమాదమని అంటాడు. జాగ్రత్తగా ఆలోచించమని అంటాడు జో. ఇలా రోడ్దు మీద చర్చించుకోడం సరికాదని చెప్పి, మరొక అడ్డా వైపు పోనిస్తాడు కారుని. రజనీశ్ ఏమన్నది, ఒక్కో పదాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తాడు జో. చివరికి కారు ఓ ప్లాంటేషన్ లోకి వెళ్తుంది. సమీర్, జో ఇద్దరూ అక్కడున్న బంగ్లా లోకి వెళ్తారు. లోపల ఇద్దరు వయసు మళ్ళిన ఆడవాళ్ళుంటారు. ఒకావిడ జో ను చూసి, గట్టిగా అరిచి హత్తుకుంటుంది. తమ ఫోన్లు ఛార్జింగ్ అయిపోయాయని ఆమె ఫోన్ అడిగి తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తాడు జో. టీ, కాఫీ అని ఒకావిడ అడిగితే, టీ అంటాడు సమీర్. కాల్ కనెక్ట్ అవుతుంది, వీరమణి మనుషులకు చేశానని చెప్తాడు జో. స్పీకర్లో పెట్టబోతుంటే, వద్దని సమీర్ సైగ చేస్తాడు. జో బయటకు వెళ్ళి మాట్లాడుతాడు. మరో ఆవిడ తన ఫోన్ తెచ్చి, సమీర్ని సెల్ఫీ అడుగుతుంది. బయట మాట్లాడుతున్న జో ని చూపించి, అతను లోపలికి వచ్చాకా, అన్నట్లు సైగ చేస్తాడు సమీర్. జో లోపలికి వచ్చి, కాసేపట్లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో ఏముందో తెలుస్తుందని అంటాడు. ఈ లోపు టీ వస్తుంది. కాసేపు ఒకావిడతో మాట్లాడుతాడు జో. ఈలోపు రెండో ఆవిడ మొబైల్ తీసుకుని, సమీర్ పక్కన కూర్చుని సెల్ఫీ తీసేసుకుంటుంది. ఒకావిడ తన వయొలిన్ కళనీ, సెల్ఫీ తీసుకున్నావిడ సాఫ్ట్ టాయ్స్ చేసే తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. జో ఫోన్‌ని ఆమెకి ఇచ్చేస్తూ, తను చేసిన ఫోన్ నెంబర్ చూపిస్తూ, ఆ నెంబర్ నుండి ఏ కాల్ వచ్చినా జవాబివ్వద్దనీ, రాంగ్ నెంబర్ అని కట్ చేసేయమని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ్నించి బయల్దేరిపోతారు. పోస్ట్ మార్ట్మ్ రిపోర్ట్ వచ్చిందనీ, తల మీదా, మెడ మీదా గాయాలున్నాయని తెలిసిందనీ, ఆమె గదిలోకి కూడా ఎవరూ వెళ్ళలేదని హోటల్ రికార్డ్స్ చెబుతున్నాయని తెలిసిందని చెప్తాడు జో. ఏం చేద్దామని సమీర్ అడిగితే, అంతా తాను చూసుకుంటానని చెప్తాడు. సమీర్ హైదరాబాద్ వెళ్ళాడని చెప్పిస్తాననీ, తమకు అండగా వీరమణి మనుషులుంటారనీ, సమీర్ గోవాలోనే ఉంటాడనీ, సమీర్ వెనుక మొత్తం గోవా ఉంటుదనీ, ఈ లోపు అసలు నిజమేమిటో కనుక్కుందామని అంటాడు జో. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో సమీర్ అర్థం కాదు, ప్రయాణం కొనసాగింది. – ఇక చదవండి.]
సమీర్ కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చాడు.
“అదండీ జరిగిన కథ. ఆ రోజు నుండీ ఇప్పటి వరకూ ఇలా ఆజ్ఞాతంలో ఉన్నాను. హైదరాబాదు వెళ్లిపోయానని అందరూ చెప్పుకున్నారు. ఇక్కడి పోలీసులు అక్కడి వాళ్ళ మీద పడేసి ప్రశాంతంగా కూర్చున్నారు. కాలం కరిగిపోతూ వస్తోంది. గోవా ప్రజానీకం నిజంగానే నా వెంట ఉంది. పోలీసు వ్యవస్థ కూడా నన్ను సమర్థిస్తున్నట్లు నాకు తెలుసు.”
సమీర్ తన కథ చెబుతుండగా తన గదిలోంచి మాధవ్ లేని వచ్చి ఎంతో ఆసక్తితో కూర్చుని వింటున్నాడు. కొద్దిగా దగ్గడు.
“సార్..”, అడిగాడు. “..మరి ఇప్పుడెందుకు కొత్తగా గొడవ ప్రారంభమయింది? అక్కడి పెద్దలు, నాయకులు, వ్యాపార వర్గాలు కలసి కలుగజేసుకుంటున్నారే?”
“నిజానికి నాతో ఎవరికీ పని లేదు. నేను సినిమాలు చేస్తే చేసుకుంటాను. కాకపోతే లేదు. గోవాలో నేను గనుల సిండికేట్‌ను నడుపుతున్నానని, బేరియమ్ నా చేతిలో ఉన్నదని వాళ్ల పిచ్చి నమ్మకం.”
“ఓ. మీ ద్వారా వీరమణి, తదితరులు తెర ముందుకు రావాలా?”
“అవును. నేను చక్రవ్యూహంలో ఇరుక్కున్నాను. సారిక గొడవ ఎవరికీ అక్కరలేదు.”
“ఇంతకీ అసలు సారిక హత్య ఎలా జరగిందో కొంతైనా తెలియాలి కదా?” అడిగాను.
సమీర్ ప్రక్కన మరో ఇద్దరు కూర్చున్నారు.
“ఇక తెలిసే సమయం వచ్చింది.” అన్నారు.
ఓ అమ్మాయి వచ్చి ఏదో తెలియని భాషలో మాట్లాడింది. అందరం లేచి లోపలికి నడిచాం.
అందరం అప్పటికే ఏర్పరచి ఉన్న ఆసనాలలో కూర్చున్నాం.
రెండు కుండలూ – అప్పటి వరకూ వాటిలోని పూల మందు కొన్ని ప్రక్రియలకు గురి చేసినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటికి ఓ పెద్దాయన లోపలి నుంచి వచ్చాడు. నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు.
“మీకు కావాల్సిన పదార్థం ఇదిగోండి. సిద్ధంగా ఉంది” అని ఆ రెండు కుండలనీ చూపించాడు.
“చాలా శ్రమ పడ్డారు సార్” అన్నాను.
“శ్రమ మాది కాదు, మీది. ఇక్కడికిక రాగలగటమే ఎంతో సాహసంతో కూడిన పని. ఇంతకీ మీ పని పూర్తి అయింది. మరి మా సంగతి?”
అర్థం కాలేదు. డబ్బులు గురించా అనుకుని సమీర్ వైపు చూసాను. అతను కాదనట్లు తల అడ్డంగా ఊపి నవ్వాడు.
ఆ పెద్దాయన కూడా నవ్వాడు.
“మా సంగతి అంటే.. ఈ రెండింటికీ ఆ అమ్మాయి వద్దకి చేర్చి వ్యవహారం నడపటం.”
“వ్యవహరం అంటే? “
“పూలు ప్రతీకారం తీర్చుకుంటాయి.. ఇది విన్నారా?”
అప్పటి వరకూ బుద్దిగా కూర్చున్న మాధవ్ అక్కడ ఉన్న నీళ్ల బాటిల్ మొత్తం గడగడా ఖాళీ చేసాడు. పెద్దాయన కూర్చున్నాడు.
“ఏం లేదు. కాఫీ ప్లాంటేషన్స్ ఎప్పుడైనా చూసారా?”
“కూర్గ్‌లో చూసాము.”
“గుడ్. అక్కడ ఆ మొక్కలు విరివిగా వేరే మొక్కలతో కలిసి పెరుగుతాయి – కోకో, మిరియాలు, ఇతర స్పైసెస్, ఏలకులు.. ఇలా.. ఎందుకో తెలుసా?”
“కాఫీ లక్షణం కావచ్చు.”
“కానీ టీ ప్లాంటేషన్స్ అలా ఉండవు. ఆ తేయాకు తోటలలో కేవలం ఆ ప్లాంటేషన్స్ మాత్రమే ఉంటాయి.”
“అది వాటి లక్షణం కావచ్చు”, నవ్వాను.
“పెద్ద పెద్ద వృక్షాల నీడలో కొన్ని అద్భుతమైన మొక్కలు ఎదిగి రకరకాల విన్యాసాలు చేసుకుని సమాజానికి ఉపయోగపతాయి.”
“మీరు మొక్కలు ప్రతీకారం అన్నారు..” మాధవ్ ఆగలేకపోతున్నాడు.
“వస్తున్నాను. ఈ ప్రాంతంలోకి ఎవరూ ఎందుకు రాలేరో తెలుసా?”
“ఆ రకమైన మొక్కలు పెంచారనుకుంటున్నాను” అన్నాను.
“అదొక కారణం. పెద్ద పెద్ద చెట్లన్నీ వాటి వ్రేళ్ల ద్వారా భూమి లోపల సంభాషించుకుంటాయి.”
“అవునా?”
“అవును. ఆ వ్రేళ్ల కొసలలో న్యూరాన్స్ లాంటివి ఉంటాయి. ఒక వృక్ష కుటుంబాన్ని ఉనికి లేకుండా రాక్షసత్వంతో ఎవరైనా నరికేసినప్పుడు ఈ వృక్ష కుటుంబం ఎంత విస్తీర్ణంలో వ్యాపించి యున్నదో, అంత వ్యత్యాసాన్ని వదిలేసి దక్షణ దిక్కుగా సరిగ్గా ఎనిమిది సంవత్సరాల తరువాత ఒక్కసారిగా పెరిగి అందరినీ అబ్బుర పరుస్తాయి.”
“అంటే ఇదే ప్రతీకారమా?” మాధవ్ నవ్వాడు.
అందరూ నవ్వారు.
“ఈ అబ్బాయి ఎవరి మీదనో ప్రతీకారంతో వచ్చినట్టున్నాడు..” అన్నాడాయన.. “అక్కడితో అయిపోదు. చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేసిన వారు బాగా ఆలోచించాలి. అటువంటి క్రొత్త వృక్ష సముహంలోకి వెళ్లిన ఆ దుర్మార్గులు వాటిని నరికిన వాళ్లు బ్రతికి బట్టకట్టరు!”
“ఛా.”
“ఛా కాదు. అది వాస్తవం. అలాంటి అడవులలో ఆశ్రమాలు నిర్మించుకుని ఋషులు తపస్సులాచరిస్తారు. ఎన్నో ఆద్భుతమైన విషయాలను వారు దర్శిస్తారు. ప్రకృతితో కలసి పోవటమే తపస్సు.”
ఇది ఇంటికెళ్లాక ఆలోచించాలనిపించింది.
“నేనేదో వ్యవహారం నపాలన్నారు?” పాయింట్‌కి వచ్చాను.
ఆయన ఒక కుండ చేతిలోకి తీసుకున్నాడు.
“వ్యవహారం అంటే పెద్దగా ఏమీ లేదండీ..” చెప్పాడు.
“..థాయిలాండ్‌లో ఒక విచిత్రమైన వయెలిన్ ఉంటుంది. అది తాడు తీగెలతో తయారవుతుంది. కొబ్బరి బొండంతో, కొంత చెక్కతో తయారు చేస్తారు దానిని. గుర్రం జుట్టుతో, కొన్ని విశేషమైన వృక్షాల నుంచి తీసిన రెసిన్ని కలిపి ఆ తీగెలను తయారుచేస్తారు. ఇరవై నాలుగు గంటలలోని కొన్ని సమయాలను ఎంచుకుని కొన్ని ప్రాంతాలను జాగ్రత్తగా ఎంచుకుని ఆ కార్యానికై నిర్ధారించిన రాగాలను వాటి మీద పలికిస్తారు. సరిగ్గా ఏడు రోజుల తరువాత ఆ ప్రాంతం చుట్టుప్రక్కలకి శత్రువు వచ్చి ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తాడు.”
ఆయన కుండ టేబుల్ మీద పెట్టాడు.
“మీ తాలూకు అమ్మాయి జ్యోతికి తరచు జరిగిన కాలంలోని ఇతివృత్తాలు హార్మోన్ల ద్వారా కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఇటువంటి ప్రక్రియలలోని స్పందనల ద్వారా కలుగుతాయి. వైజ్ఞానిక శాస్త్రం ఈ మధ్యనే కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటుంది. ఈ కుండలోనిది ఆమెకు ఇవ్వండి. ఈ రెండో కుండని చాలా జాగ్రత్తగా వాడాలి.”
మాకు అక్కడి అమ్మాయిలు కుండలలోనే ఏవో పానీయాలు తెచ్చారు. పుచ్చుకోనా అన్నట్లు చూసాడు మాధవ్.
“ఇన్ని సందేహాలు ఇతనికే ఎందుకు వస్తున్నాయి?” సమీర్ అడిగాడు.
“జ్యోతి వలన జైల్లోకి వెళ్లి బెయిల్ మీద వచ్చినవాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ముందు తీసుకుని ఏం చెయ్యబోతోందో మరి ఆలోచించాలి కదా?”
పెద్దాయిన నవ్వాడు.
“నాయనా..” అన్నాడు. “..ప్రకృతిని మించిన సత్యం లేదు. నీవు నిజంగా ఏ నేరమూ ఎరుగనప్పుడు నీకు తప్పుకుండా న్యాయం జరుగుతుంది.”
ఆ కుండలోని పానీయం అద్భుతంగా ఉంది.
“ఇది ఏంటండీ?” అడిగాను.
“చెప్పినా అర్ధం కాదు లెండి. అందరం పుచ్చుకున్నాం కదా? భయపడకండి.”
“సార్.. ఇంతకీ రెండో కుండ గురించి చెప్పలేదు.”
“వస్తున్నాను. కొద్ది రోజులు జ్యోతి తన మందు సేవించిన తర్వాత ఏదైనా ప్రదేశానికి ఎప్పుడు తీసుకుని వెళ్లమన్నా అక్కడికి తీసుకుని వెళ్లి ఆమె ఎవరితో మాట్లాడాలనుకుంటుందో వారికి ఇది ఇప్పించాలి. ఇదీ.. మీరు నిర్వహించవలసినది. ఎంతో జాగ్రత్తగా నిర్వహించవలసినది.”
“అది మరో ఊరు అయితే?” అడిగాను.
“అక్కడికి వెళ్లాలి. మొక్కలకి భూమి యావత్తూ, సముద్రం యావత్తూ ఒక ఊరే!”
మేము ఆలోచించటం మొదలు పెట్టాం. ఈలోపల ఆ రెండు కుండలనీ మార్క్ చేసి చక్కగా ప్యాక్ చేసారు వాళ్లు. ఒక సంచీలో సద్ది మా చేతికి అందించారు.
“ఏవైనా సందేహాలున్నాయా” ఆయన అడిగాడు. అడుగుతూనే సమీర్ వైపు చూసాడు.
సమీర్ నన్ను చూసి నా భుజం తట్టాడు.
“నో..” అంటూ లేచాం. “మేము పంజిమ్ చేరే ఏర్పాటు?”
సమీర్ లేచి చెయ్యి కలిపాడు.
“అన్నీ జాగ్రత్తగా చేసాం. బయలుదేరండి.”
‘సాయా’ అనే ఆ చిత్రమైన ప్రదేశం అంచుకి వచ్చాం. మాతో ఇద్దరు మనుషులున్నారు.
సమీర్ చేయి ఊపుతున్నాడు.
“సందరం గారూ..” అంటున్నాడు. అటు తిరిగాను.
“యస్?” అన్నాను. చిన్నగా నవ్వాడు.
“నాలా మాట్లాడుతున్నారా? ఫరవాలేదు. తెగించిన వాడు హీరో అని మీరున్నారు గుర్తుందా?”
“ఉంది.”
“తీగెల్లా అల్లకున్న ప్రకృతి తెగించిన వాడిని తనలోకి అల్లుకుంటుంది.”
నిజమే అనిపించింది. చుట్టూతా అల్లుకున్నవన్నీ అందంతో పాటు ఎన్నో కథలను సృజించినవిలా కనబడుతున్నాయి.
“మరి కొన్ని వింతలకు సిద్ధంగా ఉండండి” అని మరల చెయ్యి ఊపాడు సమీర్.
(ఇంకా ఉంది)

వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.