[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[సమీర్కి వీడ్కోలు పలికి ‘సాయా’ అనే మరో లోకం నుంచి బయల్దేరుతారు సుందర్, మాధవ్. వీరిని తీసుకువెళ్ళడానికి కారు, డ్రైవర్ సిద్ధంగా ఉంటారు. కారు ఇంకా స్టార్ట్ కాక ముందే ఓ జీప్ వచ్చి, కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది. అందులోంచి ఓ వృద్ధుడు దిగి వచ్చి, డ్రైవర్‌కి ఒక గన్ ఇస్తాడు. ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతాడు. వెనుక డోర్ తెర్చుకుని, మాధవ్ పక్కన కూర్చిని అతన్ని పరీక్షగా చూస్తాడు. కాసేపు ఆలోచించి మరో గన్ మాధవ్ చేతిలో పెట్టి జాగ్రత్తలు చెప్తాడు. ఆ గన్ చూస్తే, అందరూ పక్కకి వెళ్ళిపోతారనీ, ఎవరూ మీ దగ్గరకు రారని చెప్తాడు. కారు దిగి వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ వచ్చి, మీకు గన్ ఇవ్వలేదని ఆలోచిస్తున్నారా అని సుందర్‌ని అడుగుతాడు. సుందర్ నవ్వేసి ఊరుకుంటాడు. ఆ వృద్ధుడు కొన్ని సూచనలు చేసి బయల్దేరమంటాడు. రెండు కిలోమీటర్ల ముందర ఆ జీప్, దానికి ముందర బైక్, వెనుక ఒక పాల టాంకర్ కలిసి ప్రయాణం చేస్తున్నట్లు సుందర్ గ్రహిస్తాడు. సుందర్, మాధవ్‌లు ధైర్యంగా ఉన్నారా లేదో తెలుసుకోడానికి డ్రైవర్ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఇంతలో హైదరాబాద్ నుంచి కిరణ్ ఫోన్ చేసి, గోవాలో పోలీసులు సుందర్ కోసం వెతుకుతున్నారని చెప్తాడు. ఎందుకంటే, సుందర్ కనబడడం లేదని చిత్ర కంప్లయింట్ చేసిందని చెప్తాడు. రజనీశ్ గురించి, సమీర్ గురించి తనకు తెల్సిన విషయాలు చెప్తాడు. మీకేమీ సందేహాలు కలగటం లేదా అని డ్రైవర్ అడిగితే, లేవంటాడు సుందర్. వాళ్ళని సురక్షితంగా పంజిమ్ చేర్చడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో చెప్తాడు. గోపా గనుల గురించి చెప్తాడు. ఇంతలో ఎక్కడో పెద్ద శబ్దం వినబడుతుంది. – ఇక చదవండి.]
ఆ శబ్దానికి మాధవ్ రెండు చేతులూ నెత్తి మీద పెట్టకుని సీటు క్రిందకి నక్కినంత పని చేసాడు.
డ్రైవర్ ఏ మాత్రం తొణకలేదు. కారు ముందుకు నడుపుతూనే అన్నాడు – “అవి మైనింగ్ తాలూకు శబ్దాలు.”
“ఓ దగ్గరలోనే ఉన్నాయా?”
“అవును. మాములుగా రాళ్లని పగులగొట్టే సమయంలో ఇలా జరుగుతుంది. కానీ ఇది ఎక్కడో లోపల సొరంగాలకు ఏదైనా అడ్డుపడ్డప్పుడు చేసే పేలుళ్లు.”
“మీరు డ్రైవర్ అని నేననుకోవడం లేదు.”
“ఎవరనుకుంటున్నారు?”
“డ్రైవింగ్ కూడా చేస్తారనిపిస్తోంది.”
నన్ను ఓరకంట చూసాడు.
“మిమ్మల్ని పంజిమ్‌లో దింపేసాక నా పని పూర్తవుతుంది. కానీ మీతో మరో విషయంలో పని మొదవుతుంది.”
“ఏంటది?”
“ఇదిగోండి..”, అంటూ నా చేతిలో ఒక కార్డు పెట్టాడు.
రాజ్ కిరణ్ రావ్ అని ఉంది దాని మీద. ఆ పేరు క్రింద చాలా సన్నని అక్షరాలలో ‘పంచశబ్ద పరిశోధకులు’ అని ఉంది. దాని క్రింద మరింత సన్నని అక్షరాలలో మొబైల్ నంబరుంది.
“అనుకున్నాను” అన్నాను.
“ఈ చెట్ల క్రింద మరో ప్రపంచం అలా నిదురిస్తోంది. దానిని వెతికి తీయటం సరైన పనా కాదా అన్నది ఆలోచించవలసిన విషయం.”
“సరైన పని కాదని మీకెందుకనిపిస్తోంది?”
“అలా నేననలేదు.”
“సంబందం ఉందంటారు.”
“అవును.”
“ఎందుకని?”
“ప్రతి సహజమైన ప్రక్రియ వెనుక ఒక కాలానుగుణమైన రహస్యం దాగి ఉంటుందనిపిస్తుంది. ఒక సమయం వచ్చినప్పుడే అది ఆవిష్కరింపబడుతుంది.”
“మరి ఈ లోపల ఎంతో హాని, అన్యాయం జరిగిపోగలవు కదా?”
“అవి ఎందుకు జరుగుతాయి? మనం వాటిని అగౌరవపరచి, అవహేళన చేసి దానిని మించిపోయిన వాళ్లం అనుకోవటంతో అది దాని గౌరవం నిలుపుకోవటం కోసం నిశ్శబ్దంగా అవతలకి వెళ్లిపోతుంది. మన తత్త్వ చింతన యావత్తూ అలాగే తప్పుకుంది.”
“స్వతంత్రంగా పరిశోధన చేస్తున్నారా లేక ఏదైనా విశ్వవిద్యాలయంలో, ఇన్స్టిట్యూటన్లో..”
నవ్వాడు.
“చాలా చోట్ల చేసాను. ఉదాత్తమైన విషయం ఒకరి దగ్గర ఉన్నది అని తెలుసుకున్న వాళ్ల వెంటనే మన గొంతులోకి పంపేందుకు విషాన్ని వెతుకుతారు.”
“మన దేశంలో అది అందరూ పాటించే గోల్డ్ స్టాండర్డ్”
“ఇక్కడికెందుకొచ్చారు?”
“కొలంబస్ ఒక నావను సముద్రంలో నడుపుకుంటూ వెళ్లాడు. సుదూర తీరాన ఒక ద్వీపం, ఏదో భూభాగం ఉన్నదని గట్టిగా నమ్మాడు. అతనికి సహయంగా కొందరు కలసి ప్రయాణం చేసారు. వాళ్లందరికీ నావేగేషన్ మీదనే మక్కువ అనుకోవటం పొరపాటు.”
“మరి?”
“అక్కడే రత్నాలూ, మణులూ దొరకగలవనే ఆశ ఉండి ఉండవచ్చు.”
“కరెక్ట్.”
“కొలంబస్‌కి ఏ ఆశలున్నాయో ఎవరు చూసారు?”
“మీ వెనుక మరి ఎవరున్నారు?”
“నన్ను ఈ మాఫియా స్పాన్సర్ చేస్తోంది.”
“అర్థమైంది.”
ఏదో కారులో సిగ్నల్ చూసి ఒక్కసారి ప్రక్కకి తీసుకుని ఆపేసాడు.
కొద్ది సేపు ఏమీ మాట్లాడలేదు. మాట్లడ వద్దని సైగ చేసాడు.
ఒక పది నిముషాల తరువాత మా ప్రక్క నుండి ఏవో ప్రభుత్వం వారి జీపులు వెళ్లిపోయాయి.
“మన గురించి కాదు..” అన్నాడు. “..వీళ్లు గనుల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు.”
“అవి వెళ్లాక మనం వెళ్లాలా?”
“అంతే అనుకోండి.” అంటూ ఒక హర్డ్ డిస్క్ తీసాడు.
“ఇది దగ్గరుంచండి. చాలా డేటా ఉంది ఇందులో. నాకు కాల్ చేసి పద్ధతి తెలుసుకుని తేరవండి. అర్థమైతే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరికీ అర్థం కాదు. ఏంటి చూస్తున్నారు.”
ఈ లోకం లోకి వచ్చాను. ఆ హర్డ్ డిస్క్‌ను లోపల పెట్టాను.
“ఏం లేదు. నేను ఇక్కడికి కొన్ని విషయాలు సేకరించటం కోసం వచ్చాను. మనసులో ఏదీ పెట్టుకోకుండా వచ్చాను. ఓ జన్మకి సరిపడ గనులు దొరికాయి.”
“విస్పోటనలు జరిగాయా?”
“జరిగాయి. జరుగుతున్నాయి కూడా. అవి ఏమిటో తెలియక పోవటం వలన బహుశః భయం తెలియలేదనుకుంటున్నాను. ఆ లోపలున్న పూల మొక్కలను చూడండీ ఎంత అందంగా ఉన్నాయో..”
“అవును.”
“ఒక పూలతోట ఒక కుటుంబం అయితే పూలన్నీ ఆ కుటుంబంలోని బిడ్డలంటారు..”
కారు స్టార్డ్ చేసాడు.
“కొద్దిగా ముందరకి వెళదాం..” అన్నాడు. “..ఆడ, మగ గురించి కూడా మాట్లాడుకుందాం.”
“ఒకే.”
“ఒక మొక్కకి అసలు పూవు ఎందుకు పూస్తుంది?”
“అన్నిటికీ పూయదు కదా?” మాధవ్ వెనుక నుండి అన్నాడు.
“కరెక్ట్. పుష్పించటం ఒక అస్తిత్వం గల దేనికైనా సంతోషకరమైన పరిణామం. అది ఒక ప్రక్రియలోకి వచ్చి ప్రకృతితో పాలు పంచుకుని పరిణతి చెందినది అని అర్ధం.”
“రకరకాల పూలు రకరకాల అందాలను విరజిమ్ముతూ ప్రకృతిలో ఏమేమి ఉన్నది అనేది నిశ్శబ్దంగా చాటుతాయి” అన్నాను.
“విచ్చుకున్న ప్రతి పూవు తన పరిమళంతో అలా నవ్వుతూ తెలియని ఉపాసన చేస్తోంది. ఒకటి కాయగా మారుతోంది. ఒకటి అలాగే ఎండిపోయి వాడిపోయి మట్టిలో కలసి పోతుంది. ఒక విలక్షణమైన మొక్క యొక్క ఉనికిని ఎలుగెత్తి చాటే ఒక పువ్వును కోసి దానితో ఆటలాడకుని మరో తోటని చేర్చటం అనేది చరిత్రలో పలు దురాక్రమణల ద్వారా మనం చూసాం. ఏ జాతికైనా అక్కడి స్త్రీలు ఈ పూల వంటి వారు.”
“కరెక్ట్.”
“అవి ఎందరి ఆటలలోనో భాగంగా పాల్గొనవచ్చు, కానీ ఏ రోజైతే జాతి ఆ పూల సంపదని, సొంపుని, సువాసనని, అవి విచ్చుకునే నైతికపరమైన పర్యావరణాన్నీ వదులుకుని విచ్చలవిడితనానికి ద్వారాలు తెలుస్తుందో ఆ రోజు ఇతరుల దురాక్రమణలతో పని లేదు.”
“తోట యావత్తూ తన ఉనికిని మరచిపోతుంది.”
“ఈ గాలి, ఈ నేల, ఈ రెండూ కూడా మనలను గుర్తు పట్టటం మానేస్తాయి.”
“పంజిమ్ వెళ్లాక అక్కడ మా కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఇప్పుడు మమ్మల్ని గుర్తుపడతారా అన్న ఆలోచన కలుగుతోంది.”
అందరం నవ్వుకున్నాం.
దూరంగా మాండోవీ నది ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ పెరిగింది. ఎక్కడికో వెళ్లిపోయి, ఏవేవో చేసేసి చివరకి తిరిగి రద్దీగా ఉన్న మనుష్య లోకంకి వచ్చేసాము. పెద్ద పెద్ద హోటళ్లు, భవనాలు, ఇది మరో జీవితం, అన్నీ ఇలాగే సాగిపోవాలని నిక్కచ్చిగా చెప్పే యాంత్రికమైన వ్యవస్థ! ట్రాఫిక్ పోలీసు వాడు ఊ.. ఇక వెళ్లిపొండి అంటున్నాడు. పోర్వోరిమ్ వెళ్లే బ్రిడ్జ్ క్రింది కారు ఆగింది.
“మీరు దిగండి” అన్నాడు.
ఇద్దరం క్రిందకి దిగి ఊపిరి పీల్చుకున్నాం. పంజిమ్కి వస్తే ఎందుకో నేరుగా హైదరాబాదుకు వచ్చేసినంత ఆలోచన కలిగింది. అతనూ దిగి ఒకసారి అన్నీ చెక్ చేసుకుని మమ్మల్ని అలాగే ఊండమని సైగ చేసి ఎక్కడికో ఫోన్ చేసాడు. దూరంగా వెళ్లి మాట్లాడాడు. ఫోన్ లోపల పెట్టి మా దగ్గరికి వచ్చాడు.
“సో.. ఉంటాను” అన్నాడు.
“చాలా థాంక్స్ అండీ” అన్నాను.
“మాములు ఆటో చేసుకుని మీరు వెళ్లవలసిన చోటుకి వెళ్లిపోండి.”
“అలాగే” అంటూ సంచీలు సద్దుకున్నాం.
“మీకు ధైర్యం బాగానే ఉంది” అన్నాడు.
“ఏదో.. తప్పదు” అన్నాను.
“చూడండీ, పోలీసులు కొద్దిగా సతాయిస్తారు. పట్టించుకోకండి. ఏమీ చెయ్యరు. మా పరిధి దాటి ఇంకెవరైనా ఏదైనా కార్యక్రమం చేపడితే అది మాకు తెలియదు. ఉంటాను.” అంటూ కారెక్కి స్టార్ట్ చేసి బదులు కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు.
మమ్మల్ని దాటి వెళ్లిన ఓ ఆటో వాడు ఆగి ఇటు తొంగి చూసి కళ్లు ఎగిరేసాడు.
(ఇంకా ఉంది)

వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.