[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[బయట ఎక్కడో పెద్ద శబ్దం వినబడితే, మాధవ్ భయపడి, రెండు చేతులూ నెత్తి మీద పెట్టుకుని సీటు కిందకి నక్కుతాడు. డ్రైవర్ మాత్రం తొణకడు. అవి మైనింగ్ తాలూకూ శబ్దాలని అంటాడు. అతని విషయ పరిజ్ఞానాన్ని బట్టి అతన్ని డ్రైవర్ అని అనుకోవడం లేదని సుందర్ అంటాడు. వాళ్ళిద్దరిని పంజిమ్‌లో దింపేశాకా, తన పని పూర్తవుతుందనీ, ఆపైన మరో విషయంలో సుందర్‌తో పని మొదలవుతుందని చెప్పి, తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడా డ్రైవర్. పేరు రాజ్ కిరణ్ రావ్ అనీ, అతను పంచశబ్ద పరిశోధకుడనీ ఆ కార్డులో ఉంటుంది. మైనింగ్ గురించి ఆయన, సుందర్ మాట్లాడుకుంటారు. తన వద్ద ఉన్న ఓ హార్డ్ డిస్క్‌ని తీసి సుందర్కిచ్చి, అందులో చాలా డేటా ఉందని, తనని ఫోన్ చేసి, పద్ధతి తెలుసుకుని తెరవమంటాడు. కాసేపటికి పంజిమ్ దగ్గరకి వస్తారు. పోర్వోరిమ్ వెళ్లే బ్రిడ్జ్ క్రింది కారు ఆపి వాళ్ళని దిగమంటాడు. పోలీసులు కొద్దిగా సతాయిస్తారనీ, పట్టించుకోవద్దనీ, వాళ్ళేమీ చెయ్యరనీ చెప్పి, ఏదైనా ఆటో పట్టుకుని వెళ్ళిపోమని చెప్పి ఆయన ముందుకు సాగిపోతాడు. అటుగా వెళ్తున్న ఓ ఆటో అతను వీళ్ళను చూసి బండి ఆపుతాడు. – ఇక చదవండి.]
ఆటో లోకి దూరి పోయి ఇద్దరం నేరుగా చిత్ర, జ్యోతి ఉన్న ఇంటి దగ్గర ఆగాం. సామాను జాగ్రత్తగా దింపుకుని లోపలికి నడిచాం. ఇక్కడ ప్రతిక్రియలు ఎలా ఉంటాయో ఊహించుకునే ఓపిక్ కూడా మాలో నశించింది.
కొద్దిగా జాగ్రత్త వహిస్తూనే తలుపు తోసాను. తలుపు లోపలి నుంచి మూయలేదని తెలుస్తోంది. హాల్లోకి వచ్చాం. అక్కడ ఒక ఈజీ చెయిర్లో జ్యోతి పడుకునుంది. నుదుటి మీద ఏదో గుడ్డ లాంటిది పెట్టుకుంది. సామాను జాగ్రత్తగా టేబిల్ మీద పెట్టి నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాం. ఫాన్ తిరుగుతోంది..
కొద్ది సేపటికి అదే తలుపులోంచి బయట నుండి చిత్ర లోపలికి వచ్చింది. మొబైల్ చెవి దగ్గర ఉంది. మా ఇద్దరినీ చూసి ఫోన్లో, “మళ్లీ మాట్లాడతాను” అని చెప్పి, “ఎప్పుడొచ్చారు?” అంది.
“ఇలా వచ్చి కూర్చున్నాం, నువ్వు వచ్చావు” అన్నాను.
“మీరు తప్పిపోయినట్లు కంప్లెయింట్ ఇచ్చాను తెలుసా?”
“తొందరపడ్డావు.”
“అదేంటి?”
“ఈ వ్యవహారంతో పోలీసు డొమైన్‌కు చేరటం సరైన పని కాదు.”
“ఏదో విధంగా మాకు మెసేజ్ ఇవ్వవచ్చు కదా?”
“అక్కడ ఆ వీలు లేదు. ఏం చేస్తాం?”
జ్యోతి కళ్ళు తెరచింది.
“మనతో అవసరం తీరిపోయాక మన గురించి వాళ్లకెందుకు?” అని చిత్రమైన కంఠంతో పలికింది.
“ఎలా ఉన్నావు జ్యోతి?” మాధవ్ అడిగాడు.
జ్యోతి కొద్దిగా దగ్గింది.
“నువ్వు ఓ సంగతి మరిచి పోతున్నావు మాధవ్.” అంది.
“ఏంటది?”
“నువ్వు కేవలం బెయిల్ మీద ఉన్నావు.”
“కరెక్ట్.”
“ఏంటి కరెక్ట్? నేను చెప్పేది కరెక్టో కాదో నువ్వు చెబుతావా?”
“అలా కాదు. నాకు తెలుసు అని చెప్పాను.”
“అవన్నీ కాదు. న్యాయం పట్టి పిండితే..”
“పిండితే?”
“నువ్వు లోపల.. కాదు, లోపలే ఉండవలసిన వాడివి..”
మాధవ్ నన్ను చూసాడు. పెద్దగా ఏమీ మాట్లాడకు అన్నట్లు కళ్లతోనే సైగ చేసాను. చిత్ర నన్ను లోనికి రమ్మని సైగ చేసింది.
ఇద్దరం ఆ ఇంట్లో ఉన్న కిచెన్ వైపు నడిచాం. దాని ప్రక్కగా ఒక వసారా ఉంది. అందులోంచి పెరట్లోకి వెళ్లాం.
“మందులు వాడుతున్నా జ్యోతి చిత్ర విచిత్రంగానే ప్రవర్తిస్తోంది”, అంటూ అక్కడున్న ఓ పాత కుర్చీలో కూర్చుని నాకూ అలాంటి కుర్చీనే చూపించింది.
“భయం లేదు..”, చెప్పాను, “మనకు మందులు లభ్యమయ్యాయి. ఈ రెండు ముంతలలోని మందులు ఎప్పుడు ఎలా వాడాలో ఇదిగో ఈ కాగితంలో ఉంది.
కాగితం తీసుకొని చదివింది.
“ఒక్క విషయం చెప్పండి.”
“ఏంటి?”
“మీరు ఈ రోజు ఇక్కడికి వస్తున్నట్లు ఇంకెవరికైనా తెలుసా?”
“నాకు తెలిసి ఎవరికీ తెలియదు.”
“గవడె గారు ఎందుకు ఇక్కడికి వస్తున్నట్లు ఫోన్ చేసారు?”
ఆలోచించాను. ఈయన అంత తేలిగ్గా కొట్టిపడేసే వ్యక్తి కాడు. చాలామందితో లింక్‌లున్నాయి.
“ఎప్పుడు చేసాడు?”
“చాలాసేపయింది. ఈపాటికి వస్తూ ఉండవచ్చు.”
“ఆ మందులు కనబడని చోట దాచెయ్యండి” అటూ లేచాను.
చిత్ర కూడా గబగబా లేచి ఆ ముంతలను కిచెన్ లోని అల్మరాలో పెట్టింది. ఇటు తిరిగి షాక్ అయింది. జ్యోతి అక్కడ నిలబడి ఉంది. నుదుటి మీద నుండి ఆ గుడ్డ తీసేసింది.
“ఏంటది?” గంభీరగా అడిగింది.
“నీవు పుచ్చుకోవాల్సిన మందు”, వెనుక నుండి నేనన్నాను.
నన్ను క్రిందామీదా చూసింది. కొంపదీసి ‘నువ్వెవరు?’ అంటుందా?
“రెండు ముంతలున్నాయి. ఏది మందు?”
ఇరకాటంలో పడ్డాను. రెండూ అని చెప్పాలా? ఆ తరువాత ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెబుతాం?
“వివరాలు చిత్ర దగ్గరున్నాయి. నీకు మెల్లగా చెబుతుంది. నువ్వు మామూలు మనిషివి అయిపోతావు. ఇక ఎటువంటి బాధా లేదు.”
జ్యోతి నేల మీద ఏదో చూస్తూ నిలుచుంది. ఏమనుకుందో ఏమో నాలుగడుగులు వేసి చిత్రను కౌగిలించుకుంది.
కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తెరిచే ఉంది. అక్కడ గవడె గారు నిలబడి ఉన్నాడు.
నన్ను చూసి, “వెల్కమ్ బాక్”, అన్నాడు.
“కూర్చోండి.” అన్నాను.
ఇద్దరం కూర్చున్నాం. మాధవ్ ఎందులో బయటకెళ్లి గేటు దగ్గర నిలుచున్నాడు. చిత్ర, జ్యోతి లోపలే ఉన్నారు. నన్ను చూస్తూ ఎక్కడో ఆలోచిస్తున్నట్లున్నాడు ఆయన. ఫోన్ మ్రోగుతోంది, కిరణ్ ఎందుకో కాల్ చేస్తున్నాడు. ఈయన ముందర ఆ ఫోన్ ఎత్తాలని అనిపించలేదు.
“పాయింట్‌కి వస్తాను”, అన్నాడు
“యస్?”
“హైదరాబాద్ ఎప్పుడు ప్రయాణం?”
“ఇంకా తెలియదు.”
“గోవా వచ్చిన పని అయిపోయిందా?”
“ఇది అయిపోయే పని అని నేననుకోలేదు, అనుకోవటం లేదు కూడా.”
“నా సంగతేంటి?”
ఆలోచించాను. ఇదేంటి? ఈయన సంగతేంటి?
“నాకర్థం కాలేదు సార్. నేను మీకేమైనా ఇవ్వవలసినవి ఉన్నాయా?”
“యస్.”
“ఏంటది?”
“మీరు సేకరించిన డేటా యావత్తు నాకు కావాలి.”
“తప్పకుండా, అదంతా మీ సొత్తే.”
“నో. మీరు చెబుతున్న డేటా చరిత్రకి సంబంధించినది. నేను నాలుక గీసుకునేందుకు కూడా పనికిరాదు.”
“మరి?”
“మూడు డ్రాయింగులు. నాకు తెలుసు. అవి మీ దగ్గర ఉన్నాయి.”
“ఏంటవి?”
కిరణ్ వరుసగా కాల్ చేస్తున్నాడు.
“మీరు కేవలం గోవా చరిత్ర గురించి ఏవో వ్రాయటానికి ఇక్కడికి వచ్చినట్లు నేను ఏ రోజూ నమ్మలేదు.”
విచిత్రం ఏమిటంటే వాస్తవం అదే.
“మీరేమనుకున్నారు?”
“మీరు వచ్చింది మైనింగ్ వ్యవహారం కోసమే. అదే నిజం కాకపోతే ప్రభుత్వం వారు ఎవరి కోసమైతే నిరంతరం గాలిస్తున్నారో, వాళ్లతో మీకేం పని?”
రోడ్డు మీద ఏదో గొడవగా ఉంది.
“సమీర్ మీద కేసులు ఎత్తేయాలి, పోలీస్ ఫోర్స్ డవున్ డవున్” అంటూ అరుస్తున్నారు.
“నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్.” అన్నాను.
“అవన్నీ ప్రక్కన పెట్టండి, ఆ కుశావతీ డ్రాయింగ్స్ నాకిచ్చెయ్యండి.”
“సారీ. మైనింగ్కి సంబంధించినవి నా దగ్గర ఏవీ లేవు.”
ఆయన నిట్టూర్చి వెనక్కి వాలాడు.
“మీకు నా మాట అర్థం కాలేదు. ఒకటి ఈ అమ్మాయి.. పేరేంటి? జ్యోతి, యస్, ఈ అమ్మాయి ఇచ్చిన డ్రాయింగ్స్, రెండు – సమీర్ అండ్ కంపెనీ వాళ్ళవి, మూడు, ఈ రెండింటినీ క్రోఢీకరించి మీరు చెయ్యబోతున్న దాని స్కెచ్! క్లియర్?”
బొమ్మ నిజంగానే ఇప్పుడు వివరంగా తెలుస్తోంది. ఈయన మనుషులే నన్ను వెంబడించారన్నమాట! ఈయనకు తెలిసిన విద్యతో ఈ వ్యవహారాన్ని కూడా మేళవించి కోట్లతో వ్యాపారం చెయ్యాలకున్నాడు!
“సారీ. నాకు అంత తొందరగా కోపం రాదు. అయినా చెబుతున్నాను! నా వద్ద మీకు ఆ విధంగా ఉపయోగ పడే స్కెచ్ ఏదీ లేదు.”
“నన్ను విడిపించకండి. నాకు కావలసింది నాకు ఇవ్వకుండా ఈ ప్రదేశం వదలి మీరు వెళ్లలేరు.”
నాకూ తిక్క వచ్చింది.
“మీ వల్ల కాదు.”
మీసాల మీదకి ఎడమ చేతితో ఏదో కెలికినట్లు కెలికాడు. ఏదో జీప్ వచ్చి ఆగిన శబ్దం అయింది. గబగబా ముగ్గురు పోలీస్ దుస్తులతో లోపలికి వచ్చారు.
“సుందరం మీరేనా?”, నన్న్ ఎస్.ఐ. అడిగాడు.
“యస్.”
“మీ మీద వారంట్ ఉంది.”
లేచి నిలబడ్డాను. మాధవ్ తలుపు దగ్గరకి వచ్చి బిత్తర చూపులు చూస్తున్నాడు. లోపలి నుండి చిత్ర వచ్చింది.
“ఆరోపణ ఏమిటి?”
“సమీర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆయనతో మీరు సన్నిహితంగా ఉన్నారు. అతను ఎక్కడున్నారో మీకు తెలుసు. కమాన్, నేరస్థుడితో సహకరిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేయటం పెద్ద నేరం.”
బయట గోలగా ఉంది. “పోలీస్ ఫోర్స్ డవున్ డవున్” అని బిగ్గరగా వినిపిస్తోంది.
నా మొబైల్ మ్రోగుతోంది. కిరణ్ మరల కాల్ చేస్తున్నాడు.
(ఇంకా ఉంది)

వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.