[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘ప్రకృతి కన్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


సముద్రం, చేపలు, పక్షులు, పువ్వులు
నదులు, జలపాతాలు పచ్చని ప్రకృతి,
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు
అంటే ఇష్టం లేనివారు ఎవరు?
ఇష్టమైనదాన్ని సందర్శించే అవకాశం
కల్పించుకుంటాం కదూ!
అప్పుడు మనం పొందే అనుభూతికి
మాటలు వుండవు అవునా?
కళ్ళు కెమెరా ఐతే
హృదయం అనుభూతులను
దాచుకునే ఖజానా
సముద్రపు ఒడ్డున కూర్చుంటే
గలగలమంటూ సవ్వడితో
మనలను పలకరిస్తాయి కెరటాలు
ఇంటి బాల్కానీలో నిలబడితే
రివ్వుమని వచ్చి వాలుతాయి
పిడికిట్లో ఇమిడిపోయే పిచ్చుకలు
ఎక్కడైనా నీటిలో ఈదులాడే
రంగు రంగు చేపలను చూస్తే
మనలను కదలనీయవు
నదులలో నౌకా విహారాలు
ఆనందాల పరవళ్లు
గిలిగింతలు కలిగించే పరవశాలు
పచ్చని చెట్లతో
ఆహ్లాదం కలిగించే వనాలు
మదిని పులకింప చేసే మధురోహలు
వర్షం కురిపించిన
తుంటరి మేఘాలు
అదను చూసి దూసుకు వచ్చే
ఉదయకిరణాలు
పోటీ పడితే మంచు కరిగిన జలపాతం
మిడిసిపడుతూ ఎక్కడికో జారిపోతూ
దారులు వెతుకుతోంది
లోయలో మడుగులు కట్టి
సరిగంగ తానాలు చేయమని పిలుస్తుంది
గజ గజ వొణికించే చలిలో ఐనా
గడ్డకట్టిన కరిగిపోని సుందర దృశ్యాలు
చూసిన కొద్దీ చూడాలనిపించే
మంచుపూల వానలు
వయసుని మరపించిన కేరింతలు
ఓహ్ ఎంత అందమో ఆనందమో
చెప్పలేం మాటలతో
పంచుకునే తోడు వుండాలి అంతే
అదేమిటో మనమొస్తే చాలు
మరింత విరగబాటుతో
అందాలు ప్రదర్శిస్తుంది ప్రకృతి కన్య!

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.