[శ్రీ నమిలికొండ విశ్వేశ్వర శర్మ గారి ‘ప్రకృతి విలయ తాండవం – మానవ ధర్మం – శ్రీమద్భగవద్గీత సూత్రం’ అనే రచనని అందిస్తున్నాము.]
ॐ శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
~
గత కొన్ని రోజులుగా ఎప్పుడు టీవీ పెట్టినా ప్రకృతి విలయ తాండవానికి చెందిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు. చెరువులు, వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వాటికి ప్రవహించడానికి స్థలం లేదా అన్నట్లు ఊళ్లలోకి, నగరాలలోకి అందులో మానవ నివాసస్థలాల లోకి వస్తున్నాయి. మానవ నివాస స్థలాలను ముంచేస్తున్నాయి. పూర్వం ఈ విధంగా జరగలేదు. నా చిన్నప్పుడు కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇంతకంటే ఎక్కువ కూడా కురిశాయి. నాకు జ్ఞాపకం 9 లేదా 11 రోజులు ఏకధాటిగా ముసురు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా చెరువులు, నదులకు సమీప ప్రాంతాలు మునిగిపోయేవి. కాని నేడు తీర ప్రాంతాలు మాత్రే కాదు, గ్రామాలలోకి, నగరాల లోకి వరద నీరు భయంకరంగా ప్రవేశిస్తుంది. మానవ నివాసాలను ముంచేస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అట్టి ప్రాంతాలలో నివసించే వారు విలవిలలాడి పోతున్నారు. ఇక మూగ జీవుల సంగతి చెప్పనవసరం లేదు. పరిస్థితి చూస్తుంటే యుగాంతం అప్పుడు సంభవించే ‘జల ప్రళయం’ వలే అనిపిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విధమైన ప్రకృతి విలయాలను ఎదుర్కుంటున్నాయి. ప్రస్తుతం విజయవాడ, అంతకు ముందు, కేరళ, గుజరాత్, బిహార్, ఉత్తరాఖండ్, తెలంగాణ ప్రధానంగా హైదరాబాద్ ఇత్యాది అనేక కాష్టాలు ఈ విధమైన ప్రకృతి ప్రకోపానికి గురౌతున్నాయి.
ఇది ఎవరి తప్పిదం? ఎందుకు ఈవిధంగా జరుగుతుంది? దీనికి బాధ్యులు ఎవరు? జరుగుతున్న నష్టానికి బాధ్యులు ఎవరు?
ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారు విశ్లేషణ చేసుకోవాలి. రోజురోజుకు జనాభా పెరుగుతుంది. మనిషి నివసించడానికి స్థలం దొరకడం లేదు. అందుకే ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ స్థలాలను ఆక్రమించు చున్నారు. ఇళ్ళు కడుతున్నారు, వ్యాపార సముదాయాలు, ఆకాశ హర్మ్యాలు ఇత్యాదివన్నీ కడుతున్నారు. భోగలాలసుడైన మానవుడికి ఎంత వున్నా సరిపోవడం లేదు. తరతరాలుగా తరగని సంపత్తి ఉన్నా ఇంకా-ఇంకా కావాలనే తపన రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ విధమైన ‘ప్రకృతి విలయం-అది చేకూర్చు నష్టం’ అనే విషయాన్ని ధర్మ సూత్రాలు మరియు భగవద్గీత సూత్రాలతో విశ్లేషించి చూద్దాము.
కర్మాచరణ రెండు విధాలుగా ఉంటుంది. 1) మొదటిది ఫలాపేక్ష రహితంగా ఆచరించు కర్మ, 2) రెండవది ఫలాసక్తితో ఆచరించు కర్మ. ఈ రెండు విధములైన కర్మలలో కూడా మనిషి కర్మను మాత్రం తప్పక ఆచరిస్తాడు. కాని ఫలాన్ని తాను అనుభవించుటయా లేదా లోకహితార్థం వినియోగించుటయా అన్నదే ప్రశ్న. స్వకీయ బుద్ధితో కర్మను ఆచరించు వారిలో ఫలాపేక్ష ఉంటుంది. కర్మను ఒక ‘యజ్ఞం’ గా భావించి, అట్టి యజ్ఞము శ్రీ మహా విష్ణువు స్వరూపమని భావించి ఈశ్వర ప్రీత్యర్థం అట్టి కర్మను ఆచరించు వాడు ‘యోగి’. యజ్ఞాలను ఈశ్వరుడి ద్వారా సృష్టించబడిన లోకాలను మరియు ప్రకృతిని కాపాడుటకు ఆచరించాలన్నది వేద ప్రమాణం. అందుకే ‘యజ్ఞోవైవిష్ణుః’ అట్టి యజ్ఞమే శ్రీ మహా విష్ణువు. ‘యజ్ఞం’ అనగా అగ్ని ప్రతిష్ఠ చేసి ఆహుతులు ఇవ్వడం కాదు. ఈశ్వర ప్రీత్యర్థం నిత్యం ఆచరించు కర్మ కూడా యజ్ఞమే. ‘యజ్ఞ ఏవా అన్తతః ప్రతి తిష్ఠతి’ చివరిగా అట్టి యజ్ఞంలోనే ఆయన నివసించి యున్నాడు. మానవుడు యజ్ఞ సమానమైన కర్మను ఆచరించాలి. అప్పుడే లోకాలు కాపాడబడతాయి. ప్రకృతి కాపాడబడుతుంది. తద్వారా అది మనను కూడా కాపాడుతుంది. కాని నేడు కోరికలు విపరీతంగా పెరిగిపోయి ‘పుత్రైషణ. విత్తైషణ మరియు లోకైషణా’ ప్రధాన ధ్యేయంగా మానవుడు కర్మను ఆచరించుచున్నాడు. ‘యా హ్యేవ పుత్రైషణా సా విత్తైషణా, యా విత్తైషణా సా లోకైషణా’ (బృహదారణ్యక ఉ. శ్రీ శఙ్కర భాష్యం) – ఒకటి మరొక దానికి దారితీస్తుంది. ‘పుత్రైషణ’ పుత్ర సంతానం కావాలనే కోరిక. అంతకంటే ముందు ‘దారైషణ’ మంచి భార్య/భర్త కావాలి. పుత్ర సంతానాన్ని పోషించుటకు గాను ‘విత్తైషణ’ ధన సంపాదించాలి. అది అంతటితో ఆగదు. అది ‘లోకైషణ’ కు దారి తీస్తుంది. అనగా లోకాలకు తాను అధిపతి కావాలని, తనకు అధికారం ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటను ఎవరూ కాదన కూడదని, తనను మించిన వారు మరొకరు ఉండకూడదని, ఇత్యాది ఎన్నో రకాలను ‘అహఞ్కార’ ప్రవృత్తులు వాడిలో వృద్ధి చెందుతాయి. నిజానికి ‘శరీరయాత్రకు’ సరిపడా సంపాదించాలని భగవద్గీత బోధించు చున్నది. ‘శరీరయాత్ర’ అనగా శరీరం జీవించి ఉండడానికి కావలసిన ఆహారం, వస్త్రం, తల దాచుకోవడానికి ఒక గృహం. మిగిలిన దాన్ని ఈశ్వరార్పణం చేయమని భగవద్గీత బోధించు చున్నది. అప్పుడే అట్టి కర్మలు వాడిని బంధించవు. లేని ఎడల కర్మలలో బంధించబడి తత్సంబంధిత ‘ఇష్టానిష్ట’ ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇంతవరకు ఇది బాగానే ఉంది.
కర్మాచరణలో మనిషి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
ఇట్టి కర్మలే యజ్ఞ సమానమైన కర్మలు. వీటినే ‘యజ్ఞార్థ’ కర్మలను కూడా అంటారు.
ఈ విధమైన కర్మలను ఆచరించిన నాడు సృష్టి అంతా కూడా కాపాడబడుతుంది. మానవజాతి కల్యాణం జరుగుతుంది. నేడు చెరువులలో నిర్మాణాలు చేస్తున్నారు. అందుకే చెరువు నీళ్ళు నిర్మాణాల లోకి వస్తున్నాయి. దీనికి చాలామంది బాధ్యులు ఔతారు. ముందుగా చెరువు అని, నది అని తెలిసి కూడా అందులో నిర్మాణానికి పూనుకున్న వాడు ప్రథమ దోషి. అట్టి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వాడు (ఇందులో ప్రభుత్వం, దాని నడిపిస్తున్న నాయకత్వం కూడా ఉంటుంది) రెండవ దోషి. అందులో గృహాన్ని కొన్నవాడు మూడవ దోషి. వీరందరూ శిక్షార్హులే. గృహాన్ని కొన్న వాడు దోషి ఎలా అవుతాడనే ప్రశ్న తలెత్తవచ్చు. అది చెరువు ప్రాంతమని తెలిసి, జలాలు ప్రవహించే స్థలమని తెలిసి, అక్కడ నిర్మాణం ప్రకృతి నియమాలకు విరుద్ధమని తెలిసి అందులో ఇల్లు కొనుక్కోవడానికి సిద్ధమైన వాడు కూడా దోషే. అనుమతి ఉండి, అందులో కాంట్రాక్టర్ గృహ నిర్మాణం చేసినా దాన్ని కొనడానికి ఎవరూ సిద్ధం కాకపోతే వారు అట్టి స్థలాలో గృహాలను ఎందుకు నిర్మిస్తారు. ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే. ప్రజలు ఇద్దరినే దూషిస్తున్నారు. కాని వారు కూడా ఇందుకు బాధ్యులే. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ధనాన్ని వెచ్చిస్తున్నప్పుడు ఆ మాత్రం బుద్ధిని ప్రయోగించాల్సిన అవసరం లేదా? లేకుంటే ఈ విధంగానే జరుగుతుంది మరి. ఈ విధమైన ప్రకృతి విపత్తుల ద్వారా లోకాలు కాపాడబడాలని చెరువులకు రెండు మైళ్ల దూరంలో, నదులకు ఒక ఆమడ దూరంలో (1 ఆమడ=4 క్రోసులు=8 మైళ్ళు=13 కిలోమీటర్లు), సముద్రానికి 5 ఆమడాల దూరంలో గల ప్రాంతమే మానవ నివాస యోగ్యమైన ప్రాంతంగా పరిగణించారు. దాన్ని ఎవరూ అతిక్రమించేవారు కాదు. నాడు బుద్ధిని ప్రయోగించి సమస్త మానవాళి క్షేమానికై ఇట్టి నియమాలను ఏర్పాటు చేశారు. నేడు కర్మాచారణలో బుద్ధి ప్రయోగం జరగడం లేదు. స్వకీయ తత్త్వం మనిషి బుద్ధిని పొగతో కప్పేసింది. కర్మాచారణలో బుద్ధిని ప్రయోగించని ఎడల జరిగే ప్రమాదాలు ఇవి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలి, నాయకులలో బాధ్యతా ఉండాలి. నేడు దౌర్భాగ్యం ఏమిటంటే అధికారాన్ని కోల్పోయినవాడు తన కాలంలో ఏమి చేశాడో దాన్ని మరిచి, అధికారంలో గల వాడిని దూషిస్తాడు. ఇదే మన దౌర్భాగ్యం. వాడు ఉన్నన్ని రోజులు చేసి వెలగబెట్టింది ఏమీ ఉండదు. వారి స్వీయ ప్రయోజనాలను మాత్రం చక్కగా కాపాడుకుంటారు. అది ఏ రాజకీయ పార్టీ అయిన నేమి! ప్రతి ఒక్కరూ ఈ కోవకు చెందిన వారే. ఈ ధర్మ సూత్రాలకు కులంతో గాని, మతంతో గాని, ప్రాంతంతో గాని సంబంధం లేదు. మానవుడి జీవన ప్రమాణాలు ఇవి. ఇవి సార్వత్రిక ప్రమాణాలు. కాని ఇట్టి ధర్మ సూత్రాలను, ప్రమాణాలను కులం మతంతో ముడి వేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.
మనమందరం మేల్కోవాలి. ధర్మబద్ధమైన కర్మాచరణ వైపు అడుగులు వేయాలి. కర్మాచరణ కంటే ముందు మనస్సును నియంత్రించాలి. అందుకు బుద్ధిని ప్రయోగించి కర్మను విశ్లేషించాలి. రాజకీయం, నాయకత్వం అన్నది ఉద్యోగం కాదు. అది ప్రజా సేవ. నేటి నాయకులలో, రాజకీయాల్లో ‘ప్రజాసేవ’ ఏనాడో అదృశ్యమై పోయింది. అదే మన దౌర్భాగ్యం. రామ రాజ్య స్థాపన కంటే ముందు శ్రీ రామచంద్రుడు ఆచరించిన ధర్మాలను ఆచరించాలి. అప్పుడే తనకు తానుగా రామరాజ్య స్థాపన జరుగుతుంది. స్వస్తి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –
న్యాయేన మార్గేణ మహీం మహీశాః।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥
శ్రీ నమిలికొండ విశ్వేశ్వర శర్మ మహాశయులకు మా హృదయపూర్వక పాదాభివందనములు.. తమరి విశ్లేషణాత్మకమైన విషయాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి .. ఇవన్నీ శాస్త్ర సమ్మతమైనవే.. జ్ఞానులైనవారందరూ అంగీకరించక మానరు.. ఈనాడు దినపత్రికలు తెరవాలంటేనే భయం మరియు అసహ్యం వేస్తున్నది.. ఏ పేజీ చూసినా నేరాలు ఘోరాలు, చంపడాలు ఆత్మ హత్యలు చేసుకోవడాలు, యుద్దోన్మాదాలు, మోసాలు ఆక్రమణలు, ప్రకృతి విపత్తులు..ఇవే కన్పిస్తున్నాయి టివీ లలో కూడా ఇవే కన్పిస్తున్నాయి.. వీటిని ఎలా తగ్గించాలి అని మీలాంటి విజ్ఞులైన పెద్దలు ఆలోచించడం కూడా సబబుగానే ఉంది.. ఇదంతా తమలాంటి వారి సంస్కారం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. కానీ నేడు జరుగుతున్న ప్రకృతి విపత్తులన్నింటికీ కారణం గత దశాబ్దాలుగా స్వార్థం మూర్తీభవించిన మానవజాతి మితిమీరిన విధ్వంసమే కారణమని మేధావులందరికీ తెలుసును.. కానీ నోరు మెదపరు.. కాబట్టి నేడు జరుగుతున్న ప్రకృతి భీభత్సం ఫలితాలను వారుకూడా అనుభవించక తప్పదు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఛందమే ఇది మరొక విషయం ఏమిటంటే గురువు గారు ఏనాడో విశ్లేషణ చేసి చెప్పారు.. ఇది కలికాలం ప్రథమపాదం పూర్తయి ఇప్పుడు సంధికాలం జరుగుతున్నది.. ఇది సుమారు 20 వేల సంవత్సరాల పాటు జరుగుతుంది.. ఇప్పటికే భూగోళం పైన అనేక విపత్తులు సంభవించాయి.. ఇంకా సంభవిస్తూనే ఉంటాయి కాబట్టి మానవజాతి అంతా అనుభవించక తప్పదు ఇప్పుడు భగవంతుడిని అనుక్షణం మనస్సులో నిరంతరం స్మరించడం తప్ప ఆత్మోన్నతికోసం ఎవరికి వారు తమకు అనుకూలంగా పాటుబడడం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్నారు శుభం భూయాత్ 🙏
శుభోదయం🙏అయ్యగారు *ప్రకృతి విలయ తాండవం* గురించి ఈ మధ్య కాలంలో రాసిన వ్యాసం నేటి ఆధునిక యుగంలో ప్రకృతి తో మనం ప్రయాణం చేయాలి కానీ ప్రకృతి ని నాశనం( ఆక్రమణ , రక్షించక పోవడం) చేయడం వంటి ఉదాహరణలతో భగవానుడు చెప్పిన విషయాలను మాకు అర్థం అయ్యేటట్లు వివరించారు🙏🙏 అప్పుడే అనుకుకున్న ఈ విషయం మీ శిష్యులమైన మాతో పాటు చాల మందికి తెలిస్తే బావుండు అని…ఆ భగవద్ అనుగ్రహం వల్ల *సంచిక* డిజిటల్ మ్యాగజైన్ లో ప్రచురితమై ఆన్లైన్ వేదికగా ఎందరికో స్ఫూర్తిదాయకం కాబోతుందని కోరుకుంటూ నమస్సులు🙏🙏
విశ్వేశ్వర శర్మ గారి వ్యాసం చదివినాను. బాగుంది. చివరలో శర్మ గారు నీటి తావులకు గృహ సముదాయాలు ఎంత దూరంలో ఉండాలో చెప్పిన ప్రమాణాలను పూర్వ కాలంలో పాటించారు కనుకనే వరదల ప్రమాదాలు ప్రజలను పెద్దగా బాధించలేదు. ఇప్పుడు బాజాప్తా నీటి తావులను కబ్జా చేసి గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. చెరువులకు నీటిని తీసుకు వచ్చే, తీసుకుపోయే నాలాలను ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ప్రకృతిని చెరబడితే అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. నీరు పల్లమెరుగు. అంతే. ఎక్కడ పల్లం ఉంటే అక్కడకే నీరు చేరుతుంది. అది ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నది. వాటి తావుల్లోకి మనిషి చేరుతున్నాడు. ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించిన మనిషిని ముంచి వేయక తప్పదు కదా. అది మనిషి తనకు తాను తెచ్చుకున్న ముప్పు. ఇప్పటికైనా మనిషి ప్రకృతి ధర్మాలను తెలుసుకొని వ్యవహరిస్తే మానవాళి ఇటువంటి ప్రకృతి విపత్తులు మన దారి చేరవు. ఇవ్వాలటి ఈ పరిస్థితికి పాలకులు, నిర్మాణదారులు, కొనుగోలుదారులు.. అందరికీ బాధ్యత ఉన్నది. ఈ అంశాలను శర్మ గారు బాగా వివరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
సాఫల్యం-24
తొలగిన తెరలు-3
డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి జయంత్యుత్సవ సభ
‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన
సామెత కథల ఆమెత-20
మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-9
గళ్ళ నుడికట్టు
కలవల కబుర్లు-7
జ్ఞాపకాల తరంగిణి-34
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®