[లేఖ కథానికని అందిస్తున్నారు శ్రీ మెట్టు మురళీధర్]
“నాన్నా!
ఉక్రెయిన్ దేశంలోని ‘ఖార్కివ్’ నగరంలో ఒక బంకర్లో కూర్చొని ఈ ఉత్తరం రాస్తున్నాను. రాయనైతే రాస్తున్నాను గాని దీన్ని మీకు ఎలా చేరవేయాలో తెలియడం లేదు. ఈ ఉత్తరాన్ని ఈ పరిస్థితుల్లో మీకు పంపలేను కాబట్టి మీ అడ్రసును తెలియజేస్తూ, దీన్ని మీకు అందజేయాలని అభ్యర్థిస్తూ నా జేబులోనే పెట్టుకుంటాను. ఒకవేళ నేను ఏ బాంబుదాడిలోనైనా మరణిస్తే, నా జేబులో ఉన్న ఈ ఉత్తరాన్ని ఎవరైనా మీకు అందజేస్తారని నమ్మకంతో ఉన్నాను.
నాన్నా! కలం కదలడం లేదు. చేతులు ఆడడం లేదు. దుఃఖం ఆగడం లేదు. ఐనా రాసే ప్రయత్నం చేస్తున్నాను.
గత మూడు రోజులుగా తమ్ముడు, నేను ఈ బంకర్లోనే తలదాచుకున్నాము. ఆహారం లేక, నీళ్ళు కూడా సరిపడా దొరుకక ఏదోలా ప్రాణాలు నిలుపుకున్నాము. ఆహారం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అన్న నిరాశలో ఉన్న మాకు ఇక్కడే ఒక చోట బ్రెడ్ ఇస్తున్నట్టు తెలిసింది. బంకర్లో ఉన్న కొందరు ప్రాణాలకు తెగించి బ్రెడ్ కోసం బయలుదేరారు.
నేను కూడా బ్రెడ్ కోసం బయలుదేరబోయాను కాని తమ్ముడు నన్ను వారించి ‘నేను పోతాను’ అంటూ బయలుదేరాడు. అక్కడికి వాన్ని ‘జాగ్రత్త’ అని చెప్పే పంపాను.
బ్రెడ్ కోసం అక్కడ పెద్ద ‘క్యూ’ ఉందట. మా బంకర్లోంచి పోయినవారు ఆ క్యూలో నిలుచున్నారట. అంతలోనే ఎవరూ ఊహించని విధంగా రష్యా సైనికులు వేసిన బాంబులు వారిమీద పడ్డాయట. వెంటనే పదిమంది అక్కడికక్కడే చనిపోయారట. ఆ భయానక వాతావరణానికి క్యూలో ఉన్న జనం తలా ఒక దిక్కు పారిపోయారట. ప్రాణాలతో ఉన్నవారు బంకర్ చేరుకున్నారు
వచ్చిన వారిలో నేను తమ్ముని కోసం చూశాను. వాడు రాలేదు. వచ్చిన వాళ్ళు అక్కడ జరిగిన విషయమంతా చెప్పారు. నా మనసు కీడును శంకించింది. ఏం జరిగినా ఫరవాలేదని తెగించి నేను ఆ సంఘటనా స్థలానికి పోయాను. అక్కడే.. అక్కడే నాన్నా! తమ్ముడు విగతజీవియై దుమ్ముకొట్టుకొని నడి బజార్లో పడిఉన్నాడు. వాన్ని చూడగానే నాకు ఊపిరి ఆగినంత పనయింది. వాని మీదపడి విపరీతంగా ఏడ్చాను. కాని అక్కడికి వచ్చిన ఉక్రేయిన్ సైనికులు నాకు ఏడవడానికి కూడా అవకాశమియ్యలేదు. నన్ను లేపి అక్కడ ఉండడం ప్రమాదమని, తొందరగా బంకర్లోకి పొమ్మని హెచ్చరించారు. నేను చూస్తుండగానే తమ్ముని శవంతో పాటు మిగతా శవాలను ట్రక్కులో వేసుకొని వెళ్ళిపోయారు.
నేను బంకర్ చేరేసరికి ఆప్తులను కోల్పోయిన వారి ఏడుపులతో బంకర్ దద్దరిల్లిపోతోంది. నా ఏడుపు కూడా వారి ఏడుపుల్లోనే కలిసిపోయింది. దేశం కాని దేశంలో, తెలియని మనుష్యుల మధ్య ఓదార్చేవారు లేక నేనెంత నరకం అనుభవించానో ఈ ఉత్తరంలో రాయలేను.
నాన్నా! యుద్ధం గురించి చాలామందికి తెలియదు. వార్తల్లో వినడం, టి.వి.లల్లో చూడడం, తర్వాత మరిచిపోవడం.. అంతమాత్రమే తెలుసు. కాని అక్కడ జరుగుతున్నది నరమేధమని తెలియదు. అది సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్య అహంకారానికి పతాకస్థాయి అని, ఆ అహంకారానికి కొన్ని దేశాలు నామరూపాల్లేకుండా పోతున్నాయని కూడా తెలియదు కాని అక్కడ జరుగుతున్నది అదే నాన్నా!
ప్రస్తుతం నేను ఉక్రెయిన్ లోనే ఉన్నాను. ప్రభుత్వ సహకారంతో చాలామంది మనదేశం తిరిగి వచ్చినా నాలాంటి ఒకరిద్దరం మాత్రం ఇక్కడే చిక్కిపోయాము. నాకూ మనదేశం రావాలనే ఉంది. కాని ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో తెలియదు. వస్తానో రానో తెలియదు. అంతవరకు బతికి ఉంటానో లేదో కూడా తెలియదు. ఈ సమయంలో నాకు కొన్ని గత సంఘటనలు గుర్తుకువస్తున్నాయి. వాటిని మీతో పంచుకుంటున్నాను.
నేను, తమ్ముడు కవలపిల్లలము. మా ఇద్దరి మధ్య నిమిషాల వ్యవధి మాత్రమే ఉన్నా, ముందు పుట్టాను కాబట్టి నేను వానికి అన్ననయ్యాను. మీరు మా ఇద్దరిని కష్టపడి చదివించారు. మేము కూడా కష్టపడే చదివాము కాని మీ కోరిక ప్రకారం మాకు మెడిసిన్లో ఫ్రీ సీట్ రాలేదు. ఐనా మీరు వెనుకకు పోలేదు. మన దేశంలో కోట్ల ఖర్చుతో లభించే డాక్టర్ డిగ్రీ, ఉక్రేయిన్ దేశంలో లక్షల ఖర్చుతో లభిస్తుందని తెలిసి, మన శక్తికి మించిన పనైనా మా ఇద్దరినీ ఉక్రెయిన్ పంపించారు. అంతవరకు బాగానే జరిగింది. మా చదువు కూడా సాఫీగానే సాగింది. కాని అనుకోకుండా యుద్ధం రావడం, ఆ కారణంగా తమ్ముడు పోవడం జరిగింది.
నాన్నా! ఈ సందర్భంగా, ఈ ఉత్తరం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ఉత్తరం ప్రధాన ఉద్దేశం కూడా అదే.
మేము చిన్నప్పుడు మీరు, అమ్మ, తమ్ముడు, నేను ఇంకా చిన్నాన్న, చిన్నమ్మ, చెల్లి అందరం కలిసి ఎంత అన్యోన్యంగా ఉన్నామో, ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ నా మనసు పులకరించిపోతుంది. మనం ఒక్క కుటుంబంలాగా బతికాము, కాని, ఎందుకు నాన్నా మీకు, చిన్నాన్నకు మధ్య అంత పగ ఏర్పడింది? మీ పగల కారణంగా ఇటు అమ్మను, అటు చిన్నమ్మను ఇద్దరినీ పోగొట్టుకున్నారు. మా ముగ్గురిని తల్లిలేని పిల్లలుగా చేశారు. ఏం సాధించారు మీరు? ఏం మిగుల్చుకున్నారు? పెద్ద కారణం లేకుండానే వైరాన్ని పెంచుకున్నారుగదా?
నేను పదో తరగతిలో ఉన్నపుడు మీకు ఇవన్నీ చెప్పేంత వయసు లేదు. ఇంటర్లోకి వచ్చాక కూడా మీకు చెప్పేంత ధైర్యం లేదు. చిన్న కారణం కదా నాన్నా! గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చిన్నాన్న వేరే గ్రూపులో చేరాడనేకదా మీ కోపం? అన్నగా మీ మాట వినలేదనే కదా? ఆ కోపం కుటుంబాలు విడిపోయేదాకా వచ్చిందే! ఇల్లు పంపకం, భూమి పంపకం.. అంతటితో ఆగిందా? గెట్ల దగ్గర పంచాయతి, నీళ్ళ దగ్గర పంచాయతి చివరికి ఒకరికొకరు చంపుకునేంత పగ. అంత అవసరమా నాన్నా?
మీ పగల కారణంగా స్వంత అక్కచెల్లెలైన అమ్మ చిన్నమ్మలు ఒకరినొకరు చూచుకోకుండా, మాట్లాడుకోకుండా ఎంత తల్లడిల్లి పోయారో మీరెన్నడైనా ఆలోచించారా? అన్నాచెల్లెల్లుగా పక్కపక్కనే ఉంటూ పలుకరించుకోకుండా పిల్లలమైన మేము ఎంత మథనపడి పోయామో మీరు ఊహించారా? మీ ఇద్దరి కక్షలను జీర్ణంచుకోలేకనే కదా అమ్మ చిన్నమ్మలు చనిపోయింది? అది మీకు తెలియదా? ఎందుకు నాన్నా, తెలిసికూడా తెలియనట్టుగా నటిస్తారు?
నాన్నా! మీరు, చిన్నాన్న ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు గదా? సమస్య పరిష్కారం కోసం పెద్దవాడిగా ఎప్పుడైనా చొరవ తీసుకున్నారా మీరు? మీరు విడిపోవడానికి కారణమైన ఆ రెండు గ్రూపులు ఎప్పుడో కలిసిపోయాయికదా? మీరెందుకు కలిసిపోరు? చిన్నాన్న లొంగిపోయి, కలిసిపోదామని ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చాడు? ఐనా మీరు కనికరించలేదెందుకు? మీ ఆధిపత్యం పడిపోతుందనా? అది కరక్టు కాదు గదా నాన్నా!
దేశాలను నిందిస్తున్నాం గాని మనం చేస్తున్నది కూడా అదే కదా? అక్కడ సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యం, అహంకారం. ఇక్కడా అంతే. బలవంతులు బలహీనుల మీద సాగించే పెత్తనం. దేశాలు విడిపోయినంత మాత్రాన స్వతంత్రంగా ఉండకూడదా? ఎప్పటికీ బలవంతులకింద నలిగి పోవలసిందేనా? చిన్నదేశాలైనంత మాత్రాన భయపడుతూ బతకాలా? బలం లేనంత మాత్రాన బానిసగా ఉండాలా నాన్నా? అది అంత పెద్ద విషయం, మనకెందుకులే అనుకుంటే మన విషయమే ఆలోచిద్దాం. మన రెండు కుటుంబాలు విడిపోయినా కూడా ఇంకా మీ ఆధిపత్యమే ఉండాలంటే ఎలా నాన్నా? చిన్నాన్న ఎప్పటికీ స్వతంత్రంగా ఆలోచించగూడదా? రాజకీయంగా మీరు బలవంతులైనంత మాత్రాన చిన్నాన్న మీకు లొంగి ఉండాలనడం న్యాయమేనా?
అలా ఉండకపోతే అతనిమీద కోపం పెంచుకోవడం ధర్మమేనా? నేనంటున్నానని కాదు నాన్నా! మీరు కూడా ఆలోచించండి. దేశాలైనా, కుటుంబాలైనా ఒక్కటే నాన్నా!
కోపతాపాలు లేకుండా ప్రేమతో శాంతంగా బతకడం మంచిది. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకుంటేనే మంచిది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరికిచ్చే గౌరవం వారికిస్తేనే మంచిది. ఇప్పటికే నేను అమ్మను, చిన్నమ్మను, తమ్మున్ని పోగొట్టుకున్నాను. ఇంకా మిమ్ముల్ని, చిన్నాన్నను, చెల్లిని పోగొట్టుకోలేను. అందుకే అప్పుడు చెప్పలేని మాటల్ని ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నాను. మనం కలిసి ఉందాం. చిన్న చిన్న సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందాం. ప్రేమగా ఉందాం. పరిష్కరించుకుందాం. ఈ సూత్రం మనుష్యులకైనా, కుటుంబాలకైనా, దేశాలకైనా ఒకటే నాన్నా!
ఒకవేళ నేను బతికి మనదేశం, మన ఊరుకు వస్తే ఆ ప్రయత్నమే చేస్తాను. లేకుంటే నా ఈ ఉత్తరం నాకు బదులుగా ఆ పని చేస్తుందని నమ్ముతున్నాను.
చివరగా ఒక్కమాట నాన్నా! ప్రేమను మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు .
ప్రేమతో
మీ కుమారుడు”
మెట్టు మురళీధర్ 1951లో జన్మించారు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (తెలుగు) పట్టా పొందారు. 33 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసి 2008లో పదవీ విరమణ గావించారు. విద్యార్థి దశలోను, ఉద్యోగ దశలోను ఆయన రాసిన కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఉద్యోగ విరమణ తర్వాత రెండు మినీ కవితల సంపుటాలను, రెండు కథల సంపుటాలను, రెండు నవలలను ప్రచురించారు. కథానికా రంగంలో మెట్టు మురళీధర్ చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 2018లో ‘ కీర్తి పురస్కారా’న్ని ప్రదానం చేశారు. ఆయన రాసిన ‘ఆ యాభై రోజులు’ నవలకు డా. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్, వరంగల్ వారి ‘ప్రథమ నవలా పురస్కారం’ లభించింది. మెట్టు మురళీధర్ రాసిన మరో నవల ‘కనిపించని శత్రువు’కు తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు 2022 లో ‘ఉత్తమ గ్రంథ పురస్కారా’న్ని అందజేశారు.
2 Comments
ప్రొ.సిహెచ్.సుశీలమ్మ
రెండు దేశాల మధ్య యుద్ధాలు గురించి అంతర్జాతీయ చర్చలు చేస్తాం. కానీ మన కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు పెరిగి పెరిగి కక్షలు గా మారి అన్నదమ్ముల మధ్య మాటలు లేని పరిస్థితులను పెంచుకొంటామే కానీ కూర్చోని మాట్లాడుకొని సామరస్యం చేకూర్చుకోలేం. అంత పెద్ద (చిన్న) విషయాన్ని ఈ లేఖ లాంటి కథ లో చెప్పిన తీరు బాగుంది.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కథా/నవలా,రచయిత శ్రీ మెట్టు మురళీధర్ గారి
కథ అద్భుతంగా వుండి,ఆలోచింప చేసేదిగా వుంది.
మిత్రులు మురళీధర్ గారికి నా హృదయపూర్వక
శుబాకాంక్షలు
—డా కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.