[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ప్రేమానురాగాల పౌర్ణమి పండగ!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పర్వదినపు ఆనందాల రోజిది!
నదీ జలమంత పవిత్రమైనది!
కాంతులీనే అన్నయ్యల నుదుట
చెల్లెళ్ళు దిద్దే మంగళతిలకంతో
రోజంతా శోభాయమానమై వెలుగులీనుతుంది!
వసంతాలు.. శిశిరాలు
ఎన్నో ఎన్నెన్నో కాలగర్భంలో..
జీవన ప్రవాహంలో..
కలిసి మాయమై పోయాయి!
బంగారుతల్లీ!
నువ్వెక్కడున్నా..
నీ జ్ఞాపకాల మధురిమలు మాత్రం
నా మది లోయలలో..
కదలాడుతూనే వున్నాయి!
శ్రావణ పూర్ణిమ పర్వదినాన
నాలుగు దశాబ్దాల కావల
నువ్వు కట్టిన ‘సిల్కుదారం’
మిగిల్చిన జ్ఞాపకాలు..
నా ముంజేయి చుట్టూ
ఇప్పటికీ అల్లుకునే వున్నాయి!
నువ్వు కట్టిన సప్తవర్ణాల ‘రాఖీ’
శాశ్వతం కాకపోవచ్చు..
నువ్వు నాకు పంచి ఇచ్చిన
ప్రేమానురాగాలకు ప్రతీకలా –
నేను నీపై పెంచుకున్న
నమ్మకానికి శ్వాసలా..
ఎంతో నాజూకైనది!
నా జీవితకాలంలో తుంచేయలేనిది!!
నువ్వు మాత్రం..
దానిని కేవలం
సిల్కుదారమనే అనుకున్నావు!
కానీ.. నేను మాత్రం
ఆ దారాన్ని నా హృదయబంధంగా..
జీవితమంతా నిలబడే ప్రాణశక్తిగా..
అపురూపమైన భావనను అనుభూతించి..
హిమవత్ పర్వతమంత నమ్మకాన్ని పెంచుకున్నాను!
ఎంత దృఢమైనవైనా –
భౌతికమైన వస్తుబంధాలు..
ఎప్పటికైనా తెగిపోతాయి!
కానీ.. కంటికి కనిపించనిది
ఎవరి చేతికి దొరకనిది
హృదయ బంధమే కదా!
దానిని ఎవరు తుంచేయగలరు!?
సిరిసంపదలు.. అధికారాలు
అహంకారాన్ని పెంచుతాయి!
అంతస్తులు.. ఆస్తులు
అనుబంధాలను దూరం చేస్తాయి!
అన్నాచెల్లెళ్ళ ఆత్మీయ బంధానికి..
జీవిత కాలమంతా
ఒకరికొకరం
తోడు నీడగా వుండామనే ప్రేమ భావనకు..
ప్రతీకగా నిలిచేది
రక్షాబంధన మొక్కలే కదా!
ఇదిగో..
ఈ రోజు కూడా..
నా జ్ఞాపకాల దొంతరలో
గత సంవత్సరం లాగే కలిసిపోయింది!
మళ్ళీ వచ్చే శ్రావణ పూర్ణిమ దాకా
నువ్వు పంచి ఇచ్చిన
జ్ఞాపకాలను అనుభూతిస్తూ..
బ్రతుకు బరువును భారంగా మోస్తూ..!?

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.