అది అక్షరాల వర్షాన్ని కప్పుకునే
ప్రశాంత సముద్రం.
కుదురుగా ఉండలేని వరద గూళ్ళ ఒడి
వానలో తడవడానికి
తరలి వచ్చిన తోటలు
లేత ఆకుల వేళ్ళతో మబ్బులను తడిమినట్టు
ర్యాకులనుంచి పుస్తకాన్ని తీసుకుని
గొడుగులు లేకుండా నానే పిల్లలు.


చిత్రం: శ్రీ నరేంద్రనాథ్
కమ్మగా మట్టి వాసన చిప్పిల్లే బురద
చప్పుడు లేకుండా కురిసే
లోపలి చినుకులతో
ముద్దై పోయే లోగిలి.
ఊహలకు ఊపిరి పోసుకుంటూ
వర్ణ ప్రపంచాల ద్వారంలో ‘ధరణి’
భావాల మాలలల్లుకుంటూ’నిశ్చల’ ‘గీతిక’లు
సందేహాల తీరంలో సంతృప్తితో ‘ఇజ్రా’
పంక్తుల మధ్య పరవశంలో ‘సౌరభ్’
పాదలేపనంతో ‘మణికంఠు’ని ప్రపంచ విహారం.
కణుపు కణుపులో లక్ష్యాన్ని నింపుకుంటూ ఎన్నెన్ని మొక్కలో
విత్తులై రాలి అంకురాలైన
ఎన్నెన్ని విత్తనాలో…
వనానికి ప్రాణం పోస్తున్న వాననూ
వానను బతికించుకుంటున్న వనాన్ని
అక్కడే చూశాను.
బోసి కొమ్మలతో వచ్చి
పూల గొడుగులై విచ్చుకోవడం
గాలి గాలంతా
సీతాకోకచిలుకల మైదానమై
మురిసిపోవడం
లోపలికి అడుగు పెట్టిన పాదాలు
నాదాత్మల పెదాలై పలవరించటం
ఓ ప్రత్యక్ష అనుభవం.
నా నిశ్శబ్ద పర్యవేక్షణను
సార్థకం చేసిన శబ్ద ఋతురాగ స్పర్శ
నా లైబ్రరీ
పుస్తకాల పుష్యరాగం
పున్నమి పుప్పొడుల
పారిజాత పవనం .
నిరంతరం
మూగ సంకెళ్ళను తెంపే ముసురు.
అలుపు లేని జ్ఞానధార
దైన్య శూన్య వర్తమానాల మీద కురిసే
తపనల సారం …
బీటలువారిన బాటలకు
పచ్చిక సోయగాలద్దే తడి పలకరింపు
కదిలే అడుగులకు
లోచూపు లోచనాలిచ్చే
పుస్తక మేఘాల దయా దృష్టి …
1 Comments
Knnath
Pustakala varshamlo thadachela Chesina kavi vajjala gariki
Manasporthiga abhinandanalu