[డా. మధు చిత్తర్వు రచించిన ‘క్వాంటమ్ దోపిడీ’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]


“ఇంకో గంటలో చేరిపోతాం. త్వరగా పోనీ!” అంది రూప. ల్యాండ్ రోవర్ కార్ మెలికలు తిరిగిన మంచు పర్వతాల మధ్య జాతీయ రహదారి నంబర్ వన్ పైన ప్రయాణిస్తుంటే కిటికీలో నుంచి ధవళ కాంతిలో మెరుస్తున్న హిమాలయాలు, పక్కనే ఉన్న లోయలో నుంచి మంచుతో తెల్లబడ్డ చెట్ల మీద పడి మెరుస్తున్న అస్తమించే సూర్యుడి ఎర్రటి కిరణాలు.. ఒక అద్భుతమైన దృశ్యం కళ్లార్పకుండా చూసేలా ఉంది.
“మరో అందమైన సూర్యాస్తమయం! ఆగి ఫోటో తీసుకుందాం” అన్నాడు రాజేష్.
“నో! సమయం లేదు. చీకటి పడితే కష్టం! కారు పోనీ!” అంది రూప.
లడక్ లోని మైనస్ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ చలిని తట్టుకోవడానికి దట్టమైన వులెన్ సూటూ, వులెన్ టోపీ, కాంతి కిరణాల గ్లేర్ తట్టుకునే గాగుల్స్, ధరించినందువల్ల పొడుగ్గా తెల్లగా అందమైన ముఖ కవళికలున్న రూప ఆకృతి గానీ ఫిగర్ గానీ ఇప్పుడు సరిగ్గా కనబడటం లేదు. ఒక వూలు దుస్తుల ముద్దలా ఉంది. రాజేష్ కూడా అలానే చలి దుస్తులతో ఉన్నాడు. ల్యాండ్ రోవర్ వెనక సీటు నిండా కంప్యూటర్లు ఏంటెనాలు ఉన్న రిసీవర్లు, ఇంకా ఏవేవో ఎలక్ట్రానిక్ పరికరాలు నిండి ఉన్నాయి. రెండు సూట్‌కేసులలో మాత్రం వారికి కావాల్సిన బట్టలు ఇతర కాస్మెటిక్స్, మందులు లాంటివి పెట్టుకుని వున్నవి ఉన్నాయి. కనీసం పది గంటల నుంచి మనాలీ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు వారిద్దరూ. ఇద్దరూ వచ్చింది ఒక ముఖ్యమైన లక్ష్యం కోసం.
“ఫోకస్! మనం వచ్చింది ప్రకృతిని ఆరాధించటానికి సైట్ సీయింగ్కీ కాదు. ముందు మన పని అవ్వాలి. ఆ తర్వాతే మిగిలిన కార్యక్రమాలు.” అంది రూప.
కాసేపట్లోనే ‘వెల్కమ్ టూ లేహ్’ అనే బోర్డు కనిపించింది. లడక్ ముఖ్యపట్టణం లేహ్ నగరం. దూరాన రంగు రంగుల పై కప్పులు వున్న ఇళ్ళు, బౌద్ధారామాలు, ఒక శాంతి స్థూపం కూడా ఉన్న పురాతన నగరం లేహ్ క్రమంగా దగ్గరకొస్తోంది. ‘మౌంటెన్ వ్యూ’ హోటల్ మనం ఉండబోయేది, అని మొబైల్ ఫోన్లో లొకేషన్ పెట్టుకోగానే కార్ లోని బ్లూటూత్‌లో తెరమీద లొకేషన్ మ్యాప్ ప్రత్యక్షమైంది.
“ఓకే!” అన్నాడు రాజేష్ . “ఆగు!” అన్నది రూప.
ఒక పక్క లోయలో ఎక్కడో తళుక్కుమని మెరిసిన సూర్య కిరణాలు తాకిన బహుళ అంతస్తుల భవనం చూపించింది.
“అదే మన లక్ష్యం! ఆగు!” బైనాక్యులర్స్ లో నుంచి కిందికి చూస్తే ‘ది వాల్ట్ డేటా సెంటర్’ అనే బోర్డు మీది అక్షరాలు మసకగా కనిపించినా మనస్సులో సంతృప్తి కలిగించాయి ఆమెకి.
ఎందుకంటే వాళ్ళు వచ్చింది ది వాల్ట్ కోసమే. రూప ఒక నిపుణురాలైన కంప్యూటర్ హ్యాకర్. రాజేష్ ఆమె బాయ్‌ఫ్రెండ్. ప్రియ స్నేహితుడే కాక మరొక మంచి కంప్యూటర్ ఎనలిస్ట్ క్వాంటం కోడ్ ఎక్స్పర్ట్. హ్యాకర్ కూడా.
ఇద్దరూ ‘ది వాల్ట్’ అనే మల్టీ నేషనల్ కంపెనీ క్వాంటం డేటా సెంటర్లో నుంచి కొంత సమాచారాన్ని హ్యాక్ అంటే దొంగతనంగా తీసుకువెళ్లడానికి వచ్చారు. ఇద్దరూ హ్యాకర్లే. నిజానికి వారు ప్లాన్ చేసింది ఒక క్వాంటమ్ దోపిడీ. క్వాంటమ్ హీస్ట్ (quantum heist) అనవచ్చు. అది రూపకు చాలా ముఖ్యం. రాజేష్ కేవలం ఆమె కోసం ఆమె మీద ప్రేమతో కూడా వచ్చాడు. కనీసం రెండున్నర కోట్ల విలువ ఉండే ల్యాండ్ రోవర్ లేహ్ పట్నంలో ఒక చిన్న, ఇరుకుగా ఉన్న వీధిలోని మౌంటెన్ వ్యూ హోటల్ ముందు ఆగింది.
***
2045వ సంవత్సరం. ప్రపంచంలోనే సమాచార సాధనాల్లో క్రమంగా ఊహించలేని శక్తి కలవిగా క్వాంటమ్ కంప్యూటర్లు అభివృద్ధి చెందాయి. 2020 ప్రాంతాల్లో డిజిటల్ కంప్యూటర్లు ఎక్కువగా ఉండేవి. అంటే అవి 0101 కలయికలతో అంతులేని సమాచారం చిత్రాలు ధ్వనులలా నిక్షిప్తమై కంప్యూటర్లు ఇంటర్నెట్ శాటిలైట్ల ద్వారా సమాచారాన్ని అందించేవి. మామూలు కంప్యూటర్ల కంటే క్వాంటం మెకానిక్స్ ద్వారా అనేక రెట్లు ఎక్కువ వేగంగా పనిచేయగలిగే క్వాంటమ్ కంప్యూటర్లు క్రమక్రమంగా అభివృద్ధి చెందాయి. సాధారణ డిజిటల్ కంప్యూటర్లు బిట్స్ అంటే 01 ఆఫ్ ఆన్ లాంటి వాటి ద్వారా పనిచేస్తాయి. ప్రతి బొమ్మ, యాప్, వెబ్ సైట్ కూడా కొన్ని లక్షలపైన డిజిటల్ బిట్స్‌ని కలిగి ఉంటుంది. ఈ 01 బిట్స్‌ని కాకుండా క్వాంటం బిట్స్‌ని వాడతాయి క్వాంటమ్ కంప్యూటర్లు.
‘క్వాంటమ్’లు అణువుల కంటే చిన్నవి. ఇవి ఎలక్ట్రాన్లు లేక ఫోటోన్లు. వీటిని ‘క్యూబిట్స్’ అంటారు. క్యూబిట్స్ యొక్క లక్షణాలు ఏమిటంటే సూపర్ పొజిషన్, ఇంకా ఎంటాంగిల్‌మెంట్. సూపర్ పొజిషన్ అంటే ఒక క్యూ బిట్ అనేక రకాలైన భౌతిక ప్రమాణాలలో ఉంటుంది, ఒకే సమయంలో. దీని వల్ల క్యూ బిట్లు అనేక రకాల పనులు ఏకకాలంలో చేయగలవు. ఉదాహరణకి ఒక గేమ్ ఎలా గెలవాలో మామూలు కంప్యూటర్ని అడిగితే అది ఎన్నో రకాల వ్యూహాలు ఆలోచించి ఎప్పటికో గానీ ఒక గెలుపు మార్గం చూపలేదు. అదే ఒక క్వాంటమ్ బిట్‌తో తయారుచేసిన కృత్రిమ మేధ ఉన్న కంప్యూటర్ అయితే ఎంతో వేగంగా అన్ని వ్యూహాలకి పరిష్కారం చెప్పగలదు, కొన్ని నిమిషాల్లోనే.
రెండవ లక్షణం ‘ఎంటాంగిల్ మెంట్’. అంటే రెండు క్యూ బిట్స్ ఎంత దూరంగా ఉన్నా కనెక్ట్ అయి ఉంటాయి. ఒక దాని మీద చేసే రసాయనిక చర్యలు అదే సమయంలో సుదూరంలో ఉన్న క్యూబిట్ మీద పని చేయగలవు. ప్రతి క్యూబిట్కి ఎన్నో రెట్లు గణక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఎన్ని ఎక్కువ క్యూబిట్స్ ఉంటే ఆ కంప్యూటర్‌కి అంత ఎక్కువ శక్తి ఉంటుంది. 2020 సంవత్సరంలో కేవలం 5 క్యూ బిట్లు వున్న కంప్యూటర్లు వుండేవి. వాటి శక్తి చాలదు వీటిని ఇంకా అభివృద్ధి చేయడం ఎంతో మిలియన్ల డాలర్ల ఖర్చుతో కూడిన పనిగా వుండేది. ఇది కాక క్వాంటమ్ కంప్యూటర్లకీ బాగా చల్లటి వాతావరణం, ఎలెక్ట్రికల్ నిరోధాలు లేని ప్రాంతాలు కావాలి.
ప్రస్తుతం అంటే 2045 సంవత్సరంలో సుమారు పదివేల క్యూబిట్స్ వున్న కంప్యూటర్లు అభివృద్ధి చెందాయి. అందుకనే ‘ది వాల్ట్ డేటా సెంటర్’ అతి శీతలమైన లడఖ్ ప్రాంతంలో లేహ్ నగరంలో నిర్మించారు. దీనిని అనేకమైన ముఖ్య కార్యకలాపాలకి సమాచారం దాయడానికి వినియోగిస్తున్నారు. పూర్వం కేవలం ఐదు క్యూ బిట్స్ వున్న కంప్యూటర్లు వుంటే ఇప్పుడు పదివేల క్యూ బిట్స్ వున్న కంప్యూటర్లు వున్నాయి.
వాటితో బాటు, అదే వేగంతో క్వాంటం కంప్యూటర్ సహాయంతో సమాచారం అతివేగంగా దొంగిలించే హ్యాకింగ్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది.
ఇప్పుడు రూపా, రాజేష్ వచ్చింది ఈ డేటా సెంటర్ హ్యాకింగ్ చేయడానికే!
***
కొన్ని నెలల క్రితం ……ఢిల్లీలో..
నోయిడాలోని ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు రూప, రాజేష్. సమయం రాత్రి 9:00 గంటలు.
“ఏదో ఒక నిర్ణయం చేయి. నేను ఇలా చిల్లర హ్యాకింగ్లు చేసి జీవితం గడపలేను. ఒక్కసారి ఒక పెద్ద మొత్తం చేతులలోకి తీసుకుని ఎక్కడికైనా వెళ్లి సెటిల్ అవుదాం” అన్నాడు రాజేష్.
ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. కృత్రిమ మేధ, దాని వల్ల వచ్చిన ఇతర సాధనాల వల్ల కంప్యూటర్ ఉద్యోగులు ఎంతో మందికి ఉన్న ఉద్యోగాలు పోయాయి. కానీ ఇద్దరికీ కంప్యూటర్ హ్యాకింగ్‌లో మాత్రం తెలివితేటలు చాలానే ఉన్నాయి.
“పెద్ద మొత్తం అంటే? నీకు ఎంతైతే తృప్తి కలుగుతుంది?” అంది రూప, బీర్ సిప్ చేస్తూ.
ఆమెకు ఇంట్లో జబ్బు పడిన తల్లి తండ్రులు, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అనబడే లింఫ్ నోడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఒక్కగానొక్క 14 ఏళ్ల తమ్ముడు గుర్తుకొచ్చారు. తండ్రికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం పౌరులందరికీ ప్రస్తుతం ఇచ్చే ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’, కాక తరచూ తాను చేసే హ్యాకింగ్ వల్ల వచ్చే కొద్ది సంపాదన, ఇవే కుటుంబానికి ఆధారం. అంటే ఇంటి అద్దె, నెలవారీ దినుసులు పాలు, బియ్యం లాంటివే కాక కేన్సర్ మందులు డాక్టర్ ఖర్చులకు ఇంకా ఎక్కువ కావాలి. ఇంట్లో వారికి మాత్రం, తాను మల్టీ నేషనల్ డిజిటల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెబుతూ వస్తోంది.
రాజేష్ అన్నాడు “నాకు ఒక ఆఫర్ వచ్చింది. అది ఒక ఛాలెంజ్ కింద తీసుకొని చేద్దాం.”
“ఏమిటి? ఎంత?”
“నీకు సతోషి నకమోటో అనే పేరు తెలుసా?”
“ఆగు! కొంచెం ఆలోచించనీ.” కొన్ని క్షణాలు ఆగి అంది. “ఓకే! నువ్వే చెప్పు. గుర్తుకు రావడం లేదు. విన్నట్లు అనిపిస్తోంది.”
“2007సంవత్సరం ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ అనేది కనిపెట్టి తర్వాత అజ్ఞాతంగా మాయమైపోయిన సతోషి!”
“ఆగు! గుర్తుకు వచ్చింది.” అని ఆగి, “సతోషికి వున్న బిట్‌కాయిన్ వ్యాలెట్ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాకర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిట్‌కాయిన్ వ్యాలెట్లకి ఒక పబ్లిక్ కీ (బహిరంగ తాళం), ఒక ప్రైవేట్ కీ (వ్యక్తిగత తాళం) ఉంటాయి. సతోషి వాలెట్ విలువ కనీసం 100 బిలియన్ డాలర్ల పైనే ఉండొచ్చేమో. కానీ ఎవరూ ఆ వ్యాలెట్ ప్రైవేట్ కీ ని ఛేదించలేకపోయారు. ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోయారు. అప్పుడు వ్యాలెట్ కీలు బైనరీ డిజిటల్ కోడ్ లోనే వుండేవి. కానీ చాలా క్లిష్టమైనవి కావడంతో వాటిని ఛేదించగలిగే కంప్యూటర్లకు పని కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని అనుకునేవారు. అలాగే చాలా మంది చనిపోయినవారి వ్యాలెట్లు కూడా ఎవరికీ దొరక్కుండా వుండిపోయాయి. అయితే ఇప్పుడు క్వాంటం కంప్యూటర్లు వచ్చాయి.”
“అవును 2025 లోని బిట్‌కాయిన్ విలువ $70,000 ఉంది. ఇప్పుడు $3,00,000 ఉంది. చనిపోయినవాళ్లవి ఎంతోమందివి బిట్ కాయిన్ వ్యాలెట్లలోని క్రిప్టోలను దోచుకోవటానికి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రైవేట్ కీ ని హ్యాకింగ్ చేయడం అసాధ్యం. వాటి ఎన్క్రిప్షన్ ఎంతో క్లిష్టంగా ఉండడమే కాక పూర్వపు బైనరీ డిజిటల్ కంప్యూటర్లలో వాటిని భేదించటానికి తీసుకునే సమయం, చాలా పడుతుందని కొన్ని వందల సంవత్సరాలు కూడా పడుతుంది అనీ చెబుతారు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినాక ఈ డీ-ఎన్క్రిప్షన్ చాలా సులభమయింది.ఇది తెలిసి వ్యాలెట్ ప్రెవేట్ కీ లు క్వాంటం హ్యాకింగ్‌కు కూడా లొంగకుండా అప్పటికే రూపొందించడం మొదలుపెట్టారు. అయినా కానీ కొన్ని పాత వ్యాలెట్లు ఇంకా మిగులున్నాయి అంటారు. వాటి యజమానులు కీ మరిచి పోయి వుండవచ్చు. లేదా చనిపోయి వుండవచ్చు. ఈ కంపెనీ మనకి ఒక వ్యాలెట్ అడ్రెస్ యొక్క పబ్లిక్ కీ ఇచ్చింది. PTPK private to public key అంటారు. ఆ రోజులలో ఇవి పబ్లిక్ గానే వుండేవి. దాని ప్రైవేట్ కీ బ్రేక్ చేయగలిగితే ఆ మొత్తంలో మనకు 40% కమిషన్ ఇస్తామంటున్నారు. సతోషి పబ్లిక్ కీ నుంచి మనం దాని ప్రైవేట్ కీ కనిపెట్టి బ్రేక్ చెయ్యాలి. ఆ డేటా సెంటర్లకు వెళ్లి సర్వర్ రూమ్‌లో కంప్యూటర్ హ్యాకింగ్ చేసి ఆ ప్రైవేట్ కీ ని బ్రేక్ చేసి..”
“అర్థం అయింది క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతో వేగంగా ప్రైవేట్ కీ బ్రేక్ చేయగలదు. ఇప్పుడున్న పదివేల క్యూబిట్స్ కంప్యూటర్ని ఉపయోగించి అది చేయాలి. మనకది లేదు కదా?”
“ఆ పరికరాలను, డేటా సెంటర్లకు వెళ్లే పద్ధతి, అంతా వాళ్లే మనకి వివరాలు ఇస్తారు. మనం పని చేయటమే.”
“పట్టుబడితే?”
“ఆ రిస్క్ మనమే తీసుకోవాలి. జైలుకు పోయినా, శిక్ష పడినా, మనమే అనుభవించాలి, రిస్క్ ఉంది. సందేహం లేదు. కానీ నీకు ఇష్టమైతేనే తీసుకోవాలి. ఒక జీవితకాలం సెటిల్ అయిపోవాలి. సతోషిది కాకుండా ఇతరుల వ్యాలెట్ ఎడ్రస్లు కూడా ఉండొచ్చు. నువ్వు ఒప్పుకుంటే బయల్దేరుదాం. నాకైతే అంత అవసరం లేదు. నీ కోసమే నేను వస్తాను. నీకు హ్యాకింగ్‌లో నా కంటే ఎక్కువ సామర్థ్యం వుంది.”
బాటిల్లో ఉన్న ఆఖరి చుక్క దాకా తాగేసి చుబుకం కింద చేయి పెట్టుకొని ఒక్క నిమిషం ఆలోచించి అంది రూప.
“మరేదీ దారి లేదు. వాళ్ళతో షరతులు, ఒప్పందాలు ఫిక్స్ చేయి. ఏ మోసం జరగకుండా ఉండాలి. నీదే బాధ్యత!”
“డన్. ఇది మనిద్దరి కోసం. మన భవిష్యత్తు కోసం. అంతా నాదే బాధ్యత!” అలా రాజేష్ ముగించాడు.
ఫలితమే ఈ ప్రయాణం!
***
ఇద్దరూ మెయింటెనెన్స్ వర్కర్స్ (అంటే టాయిలెట్లు, ఇతర పరికరాలు బాగు చేసే పనివాళ్లు) లాగా దుస్తులు ధరించారు. చేతులలో వ్యాక్యూమ్ క్లీనర్ లాంటివి, కానీ వాటిలో లేజర్ పరికరాలు, భుజాన మోసే బ్యాక్ ప్యాక్‌లలో హ్యాకింగ్ చేసే ల్యాప్ టాప్‌లు, లేజర్ గన్సు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారికి ఆ అనామక కంపెనీ ఇచ్చినవి. ఖరీదైనవి.
దూరంగా లోయలో ఎండకి తళుక్కున మెరుస్తోంది డేటా సెంటర్. ఒక అరగంటలో, అద్దెకు తీసుకున్న మినీ వ్యాన్‌లో కిందికి మలుపు తిరిగే రోడ్డు మీద ప్రయాణించి చేరుకున్నారు. ల్యాండ్ రోవర్లో వెళ్తే అనుమానం వస్తుంది.
ప్రధాన ద్వారం వద్ద నలుగురు సెక్యూరిటీ గార్డులు గన్స్ పట్టుకుని ఉన్నారు. ఇదికాక ప్రతి నిమిషానికి నాలుగు డ్రోన్లు ఆకాశంలో పెద్ద స్టీల్ గేట్ ద్వారం పైన పర్యవేక్షిస్తూ తిరుగుతున్నాయి.
స్టీల్ గేట్ కి కంప్యూటర్ కీబోర్డ్ లో కోడ్ నెంబర్ తో మూసివేసే తాళాలు ఉన్నాయి.
దగ్గరికి రాగానే ‘ఐ.డి’ (గుర్తింపు కార్డు) అడిగారు సెక్యూరిటి గార్డ్స్ ఇద్దరు.
చూపించారు. వారి ఐడీలని కంప్యూటర్లో స్కాన్ చేసి చెక్ చేస్తారు. ఆ నకిలీ ఐడీలు. కంపెనీ సప్లై చేసింది.
“సెకండ్ ఫ్లోర్ టాయిలెట్లు బ్లాక్ అయినాయి. అని మెయింటెనెన్స్ కాల్ వచ్చింది.” తన తల ముసుగు లోంచి అస్పష్టంగా అంది రూప.
సెక్యూరిటీ గార్డు “ఆఁ. మీ ఐడీలు స్కాన్ ఇంకా చేయాలి. మీ పరికరాలన్నీ పరిశీలించాలి” అని ఇంకా ఏదో అనబోతున్నాడు.
ఈ లోపలే రాజేష్ తన కోటు జేబులోంచి ఒక పరికరం తీశాడు. ఎలెక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రయోగించే ఆ పరికరంతో ఇఎమ్పీ(EMP) సిగ్నల్ గార్డ్ వైపు, గేట్ వైపు ప్రయోగించాడు. ఒక్కసారిగా కరెంట్ పోయింది. లైట్లు, కీబోర్డులు అన్నీ ఆగిపోయాయి. మరుక్షణం పెద్ద గొంతుతో సైరన్ మోగ సాగింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కంగారుగా లోపలికి పరిగెత్తారు. “పవర్ ఫెయిల్యూర్ !!!ఎమర్జెన్సీ!!!” అని అరుస్తూ. జనరేటర్ ఆటోమెటిక్‌గా వచ్చేసరికి ఒక నిమిషం 40 సెకండ్లు అవుతుంది. మళ్లీ డ్రోన్ కెమెరాలు వచ్చేసరికి ఒక్క నిమిషం పడుతుంది.ఈ లోపల డేటా సెంటర్ భవనం లోపలికి ప్రవేశించాలి.
మిగిలిన ఇద్దరు గార్డులు “మీరిక్కడే ఆగండి” అని వారిని హిందీలో ఆజ్ఞాపించి భవనం వెనక్కి పరిగెత్తారు. మూసి ఉన్న తలుపు పవర్ మళ్లీ వచ్చినట్లుంది. గబగబా వేగంతో తన దగ్గర ఉన్న కాంబినేషన్లు కీబోర్డ్ మీద టైప్ చేయసాగింది రూప. మూడో నంబర్ కాంబినేషన్‌కి తలుపు తెరుచుకుంది. లోపలికి ప్రవేశించేశారు. ఇప్పుడు డేటా సెంటర్ అంతా చీకటితో నిండి ఉంది. హిమాలయాలలోని చల్లదనం. మొదటి అంతస్తులో వున్నారు. ఇక్కడ కారిడార్ అంతా చీకటి, చల్లదనంతో నిండిపోయింది. రెండో అంతస్తులోకి వెళ్ళాలి.
పొడుగాటి కారిడార్‌కి అటూ ఇటూ తెల్లని గోడల మీద సీ.సీ. కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ లేదు. సరిగ్గా 1.45 నిమిషాలకు లైట్లు మిణుకు మిణుకు మంటూ మళ్లీ వెలిగాయి. దూరంగా కారిడార్లలో గార్డులు చేసే హెచ్చరికల గొంతులూ, వారి పరిగెత్తే పాదాల చప్పుడూ వినిపిస్తున్నాయి. ఈ అంతస్తులో ఒక ఫైర్‌వాల్ ఉంది. రెటినల్ స్కాన్. ఒక గార్డ్ కూర్చుని ఉన్నాడు. రాజేష్ రూప వారి కంపెనీ ఇచ్చిన ధర్మల్ సూట్లు వేసుకుని ఉన్నారు.
“మేము మెయిన్టెన్స్ వర్క్‌కి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి.” అంది రూప.
“రెటినల్ చెక్ ఐడి చేయాలి.”
“మాకు రెటినల్ చెక్ ఐడి లేదు. మేము పారిశుద్ధ్య మెయింటెనెన్స్ పనివాళ్ళం. కంపెనీ లెటర్ హెడ్‌తో పర్మిషన్ లెటర్ మా ఐడితో మీకు పంపింది. మీ దగ్గర కూడా ఉండాలి. ఇదిగో మా కాపీ.”
స్కాన్ మెషీన్లో చూసి నా అతనికి ఏమీ కనబడలేదు. అసలే పవర్ ఫెయిల్యూర్ అయింది. టాయిలెట్ బ్లాక్ అంటే అర్జంటే. ఐడీలు ఇంకా తెరమీద రావటం లేదు.
“వెళ్ళండి త్వరగా, పైన మళ్ళీ చెకింగ్ వుంది. అక్కడ మీ లెటర్ ఐడిలు చూపించి వెళ్ళండి!” అన్నాడు విసుగ్గా.
హమ్మయ్య అనుకుని సెకండ్ ఫ్లోర్ చేరుకున్నారు
ఇక్కడ మళ్లీ రెటీనల్ చెక్, వేలిముద్రల చెక్, కంపెనీ లెటర్ చెకింగ్ మళ్లీ వుంటాయి. ఎలా?
రూపా రాజేష్ తమకిచ్చిన థర్మల్ సూట్ల నుంచి డేటా సెంటర్లో పనిచేసే వారి శరీర కాంతి సిగ్నల్స్ లా సృష్టించడం వల్ల స్కాన్ దాటేశారు. ఇది ఉద్యోగస్థుల డేటా బేస్ నుంచి దొంగిలించి తీసుకుని వాడినది. ఇది రెటీనల్ చెకింగ్‌కి పనికి రాదు. దానికి కూడా ఇదివరకు హ్యాకింగ్ చేసిన రెటీనా బింబాల్నివారి కళ్ళజోడులో స్టోర్ చేసి ఉపయోగించారు. ఇది మెయిన్టెనెన్స్ వర్కర్స్వి కావని వారు గ్రహించే సరికి రెండు రోజులు పడుతుంది.
“రెండో ఫ్లోర్ లో మళ్లీ ఈఎమ్‌పీ అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ వాడక తప్పదు” అన్నాడు రాజేష్.
చెకింగ్ దాటగానే మళ్లీ కరెంట్ ఆఫ్ అయ్యింది. మళ్ళీ గందరగోళం సృష్టించారు.
ఇక మెయిన్ క్వాంటమ్ కంప్యూటర్ సర్వర్లు వున్న సర్వర్ రూమ్ లోకి వెళ్ళాలి.
తలుపు బలంగా వున్నా కీబోర్డ్ మీద చేతి ముద్రవేసి నంబర్ టైప్ చేస్తే ఆ తలుపు తెరుచుకుంది!
హమ్మయ్య అని తలుపు వారి వెనుక మూసి వేశారు.
ఇంతవరకూ ఓకే. “ఇక వారి క్వాంటం సిస్టంలని మన క్వాంటమ్ కోడ్‌తో బద్దలు కొడదాం” అన్నాడు రాజేష్.
చాలా క్లిష్టమైన ఎన్క్రిప్షన్తో మూసివేయబడిన సమాచారం రూపా తన క్వాంటమ్ కోడ్‌తో బ్రేక్ చేయగలదు. ఈ గది అతి శీతలమైన వాతావరణంలో వుంది. కరెంట్ పోయినా జనరేటర్ సహాయంతో పనిచేస్తుంది. గోడలు నీలి రంగుతో వెలుగుతున్నాయి డజన్ల కొద్దీ కంప్యూటర్లు వరుసగా పేర్చబడి ఉన్నాయి. వాటి తెరలు నీలి రంగుతో మెరుస్తున్నాయి. వాటి మీద వివిధ రకాల కోడ్ సింబల్స్ మెరుస్తూ తెల్లటి సింబల్స్, అక్షరాలతో సాగిపోతున్నాయి. ఇద్దరు బ్యాక్ ప్యాక్‌లు తెరిచి తమ కంప్యూటర్ ల్యాప్ టాప్‌లతో డీ-ఎన్‌క్రిప్ట్ చేయడం మొదలుపెట్టారు.
రెండు నిమిషాలు అయిపోయింది. కరెంట్ మళ్లీ వచ్చింది.
అన్ని కంప్యూటర్లు ఓ క్షణం ఆరి మళ్లీ వెలిగాయి. ఎయిర్ కండిషన్ల మెత్తటి చప్పుడు, కంప్యూటర్ల బీప్ బీప్ మనే శబ్దాలూ తప్ప ఇక్కడ ఏ శబ్దం లేదు. ఎవరూ మనుషులు లేరు. ఇది దుర్భేధ్యమైన మెటల్ తలుపులతో మూసి వేయబడిన సర్వర్ రూమ్.. ఎవరైనా వచ్చే లోపల పని పూర్తి చేయాలి.
చకచకా కొన్నివేల డీ-ఎన్క్రిప్షన్ కోడ్లు వారి లాప్టాప్లో టైప్ చేసి సర్వర్ కంప్యూటర్లో కేబుల్‌తో కనెక్ట్ చేశారు. ఒక ఏభై సంవత్సరాల క్రితం కటోషీ వదిలిపెట్టిన బిట్ కాయిన్ వ్యాలెట్ పబ్లిక్ కీ వారిద్దరి దగ్గర ఉంది. దాని ప్రైవేట్ కీ మామూలు కంప్యూటర్లతో హ్యాక్ చేయాలంటే ఎన్నో లక్షల సంవత్సరాలు పడుతుందట! ఇప్పుడు పదివేల క్యూ బిట్స్ వున్న క్వాంటమ్ కంప్యూటర్‌తో ఆ ప్రైవేట్ కీ ని కనిపెట్టి ఆ కాయిన్స్ మొత్తం రూప అకౌంట్లోకి వేయాలి.
చక చకా కోడ్లు టైప్ చేయసాగారు. క్రిప్టోగ్రాఫిక్ కోడ్‌ని బ్రేక్ చేయడానికి చాలా ప్రసిద్ధమైనది షోర్స్ ఆల్గోరిథమ్. దీనిని గణిత శాస్త్రవేత్త పీటర్ షోర్ రూపొందించాడు. దీంతో పెద్ద పెద్ద నంబర్లని కోడ్ లను చిన్న ఫ్యాక్టర్లగా క్వాంటమ్ కంప్యూటర్ సాయంతో బేధించి ఆ ప్రైవేట్ కీ ని కనిపెట్టవచ్చు. రాజేష్, రూప ఒక క్లిష్టమైన షార్ అల్గోరిథంతో సతోషీ వ్యాలెట్ బిట్‌కాయిన్ ప్రైవేట్ కీ ని బ్రేక్ చేయగలిగారు. క్వాంటం కంప్యూటర్ నుండి బీప్‌మని సిగ్నల్ రా సాగింది. అంతా సక్సెస్ అయినట్లే, అంటూ రాజేష్ దూరంగా వెళ్లి చుట్టూ చూస్తూ ఎవరైనా వస్తారేమో అని పర్యవేక్షిస్తున్నాడు. ట్రింగ్.. ట్రింగ్.. మని నాణాల చప్పుడు కంప్యూటర్ సర్వర్ నుండి!
రూప కంప్యూటర్ మీద ఒకటి పక్కన 13 సున్నాలో ఇంకా ఎక్కువో ఉన్న సంఖ్యలో కాయిన్లు ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు కనిపించింది. మరో నిమిషంలో కంప్యూటర్ తెర ఆకుపచ్చగా మారింది. 10 బిలియన్ల బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. రాజేష్ ఇంకా దూరంగా ఎవరైనా సర్వర్ రూమ్ లోకి వస్తారేమో అని గమనిస్తున్నాడు. రూప ఆ సమయంలో మరొక ఫైల్ ఓపెన్ చేసి చకచకా సెర్చి చేసింది. సర్వర్ కంప్యూటర్ తెరపై వేగంగా వెళ్ళే కొద్ది వేల కెమికల్ ఫార్ములాలు, పరిశోధనలు జరుగుతున్న మందుల రసాయనిక మాలిక్యూల్స్ C6H6K3NH4.. ఈ విధంగా కిలోమీటర్ల దూరం వున్నట్లు సాగిపోతూ కనిపించాయి. ఒకటి సెలెక్ట్ చేసుకుంది. తన ఈమెయిల్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి సెండ్ బటన్ నొక్కింది. అంత పెద్ద ఫార్ములా ట్రాన్స్ఫర్ కావడానికి మరో నిమిషం పట్టింది.
“ఏమిటి ఆలస్యం? తొందరగా పద!” అన్నాడు రాజేష్ తిరిగి వస్తూ.
“డన్!” పద అంది రూప.
ఇద్దరూ మళ్ళీ సర్వర్ రూమ్ తలుపులు తెరిచి రెండో అంతస్తులోని ఫైర్‌వాల్స్ దాటుకుంటూ బయటికి వచ్చేశారు. బయటకి రావడం ఈసారి తేలికైంది. గార్డులు అందరూ హడావిడిలో ఉన్నారు. రాజేష్ రూపా సరిగ్గా బయటకి మెయిన్ డోర్ నుంచి అడుగు పెట్టి అక్కడ ఎగ్జిట్ గేటు చెకింగ్ అవుట్ దగ్గర బొటనవేలి ముద్ర వేసి ఐప్యాడ్ మీద సంతకాలు కూడా చేసేశారు. ఇప్పటికీ అక్కడే కూర్చున్న ఒక గార్డు తన పుస్తకంలో కూడా సంతకం చేయించాడు.
వాళ్ళు తమ కారులోకి చేరుకుని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ‘ది వాల్ట్ డేటా సెంటర్’ అంతా సెక్యూరిటీ అలారం ఒక నక్క వూళ లాగా అరవడం ప్రారంభించింది. “ఎవరో సర్వర్ రూమ్ లోకి దొంగతనంగా ప్రవేశించి రికార్డులు దొంగిలించి పారిపోయారు. వెతకండి! డేంజర్! ఎమర్జెన్సీ !” అంటూ స్పీకర్లలో నుంచి హెచ్చరికలు రాసాగాయి. గార్డులందరూ గన్స్ తో అన్ని అంతస్థులనీ వెతకసాగారు.
రూప రాజేష్ అప్పటికే లోయలోనుంచి పైకి వెళ్లే ఘాట్ రోడ్డు దాటి లేహ్ నగరం మెయిన్ సెంటర్ లోని శాంతిస్థూపం దగ్గరికి చేరుకున్నారు. ఆ తర్వాత తమ ధర్మల్ సూట్లు హెల్మెట్లు మాస్కులు విప్పేశారు. వాటిని ఒక డస్ట్‌బిన్‌లో విసిరేశారు. మాములు దుస్తుల్లోకి వచ్చేశారు. “ఇక హోటల్ ఖాళీ కూడా చేయకుండా వెళ్లిపోదాం. రూమ్‌కి వెళ్లడం ప్రమాదం. హోటల్ గ్యారేజ్‌లో పార్క్ చేసిన ల్యాండ్ రోవర్ కారు తీసుకుని జాతీయ రహదారి ఒకటి మీద వెళ్లి పోదాం పద!” అంది రూప.
‘గ్రాండ్ సక్సెస్! కంగ్రాచులేషన్స్!’ అనుకుంటూ ఇద్దరూ గెలుపు ఆనందం ఒక క్షణం కౌగలించుకొని అనుభవించారు. కొద్ది నిమిషాల తర్వాత ల్యాండ్ రోవర్ వేగంగా హైవే మీద దూసుకుపోయింది.
***
ఈ సందేహం ఎప్పటికీ తీరదు.
సైన్స్‌కి శక్తి ఉందా, లేక మనకి తెలియని ‘విధి’ లేదా దైవానికి ఎక్కువ శక్తి ఉందా? దీనికి సమాధానం ఎప్పటికీ దొరకదు. మనకి అతి తెలివి వుంటే దానికి మించిన తెలివి గలవారు మరొకరు ఇంకా ఉంటారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితానికి అర్థమే లేదు!
ఇద్దరూ మెలికలు తిరిగిన మంచుకొండల జాతీయ రహదారిపై చాల సేపు ప్రయాణించారు. కొన్ని గంటల తరువాత ఒక ధాబా పక్కన కారు ఆగింది. ఇద్దరూ తమ బ్యాక్‌ప్యాక్‌లతో ఆ చిన్న థాబాలో ఒక మూల ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ఇద్దరికీ టెన్షన్ తగ్గి మంచి ఆకలిగా ఉంది.
“అబ్బ! ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను! పద! మంచి రోటీలు సబ్జీ తిందాము. చాయ్ తాగుదాం.”
కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే లోపల రూప తన ఆధునిక కంప్యూటర్ లాప్టాప్ తీసి పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేసింది.
బ్యాంకు ఖాతా తెరిచి పాస్వర్డ్ కొట్టింది. మొబైల్ కి ఓటీపీ వచ్చింది. దాన్ని టైప్ చేసి ఎకౌంట్ చూసింది. ఎంత హిమాలయాల్లో కూడా బ్యాంకింగ్ పని చేస్తూనే ఉంది.
ఎకౌంట్ చూసింది. ఒకటి పక్కన 13 సున్నాలు: క్రెడిట్.
తర్వాత లైన్ ఇంకొకటి. కింద. ఎర్ర అక్షరాలు. ఒకటి పక్కన 13 సున్నాలు బిట్ కాయిన్స్ డెబిట్ అని ఉంది!
“ఓ మై గాడ్!” అని భీకరంగా అరిచింది రూప.
“మై అకౌంట్ హ్యాక్! ఎవరో నా అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులు తీసేసుకున్నారు!” ఆ అరుపు ధాబా అంతా, బయట కొండల్లో దాకా ప్రతిధ్వనించింది. రాజేష్ స్థాణువై నోరు తెరిచి చూస్తున్నాడు.
“ఇటీజ్ ఆల్ ఓవర్! ఎవరో మనల్ని దారుణంగా మోసం చేశారు.” చేతులలో తల పట్టుకుని ఏడ్వసాగింది రూప.
కాసేపటికి తేరుకున్న రాజేష్ “డోంట్ వర్రీ రూపా! మనని మించిన మోసగాళ్ళే వాళ్ళు. వాల్ట్ డేటా సెంటర్‌కి వెళ్ళకుండానే మన కంప్యూటర్లు మాత్రం హ్యాక్ చేయాలని పథకం వేశారు. ఇవ్వాల్సిన కమీషన్ అటుంచి మొత్తం డబ్బంతా తీసుకున్నారు. ఎన్ని బిలియన్స్ డాలర్స్ ఉంటుందో! ఎన్ని కోట్ల ఇండియా రూపాయలు! విలువ కట్టలేం!”
ఇద్దరు ఆకలి చచ్చిపోయి సరిగ్గా తినలేక పోయారు. తేలు కుట్టిన దొంగలలా ఉంది వారి పరిస్థితి.
మళ్లీ కారు బయలుదేరింది. చుట్టూ చల్లటి మంచు నిండిన కొండలైనా మే నెల వేసవి కాబట్టి కొంచెంగా వున్న ఎండకి తళతళ మెరుస్తున్నాయి. ఎక్కడో గానీ ఒక్క వాహనం కూడా లేదు జాతీయ రహదారిపైన.
కాసేపటికి హఠాత్తుగా రూప అంది. ఏదో గుర్తుకు వచ్చినట్లు.
“పోతే పోనీ! డబ్బు ఎన్ని కోట్లైనా ఏం చేసుకుంటాం? ఎలాగైనా మనకి వాళ్లిచ్చే కమిషన్ మాత్రమే కదా పోయింది. అంతకంటే విలువైనది జీవితం. నా తమ్ముడి ప్రాణం. చూడు ఇంకా ఏం హ్యాక్ చేసి వచ్చానో!”
కారు రోడ్డు పక్కన ఆపాడు రాజేష్.
రూప తన ఈమెయిల్ ఓపెన్ చేసి చూపించింది. “మూడు మైళ్ళ పొడవు ఉన్నట్లుగా ఉన్న కెమికల్ ఫార్ములా. ఇది లింఫ్ గ్రంథుల క్యాన్సర్ అంటే నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాకి అంటే ప్రాణాంతకమైన క్యాన్సర్‌కి కనిపెట్టబడిన కొత్త మందు. ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఏదైనా కంపెనీకి రహస్యంగా కూడా అమ్మితే కొన్ని లక్షలు రావచ్చు అంతకంటే ముఖ్యం తమ్ముడి జీవితం. ప్రాణం. అది అత్యంత విలువ కలిగినది. కాపాడవచ్చు.”
రాజేష్ చిరునవ్వు నవ్వాడు. “ఇది ఎప్పుడు చేసావు రూపా! యూ ఆర్ ఇంపాసిబుల్. యూ ఆర్ గ్రేట్ రూపా! యూ ఆర్ గ్రేట్!”
ల్యాండ్ రోవర్ కారు హిమాలయాల మధ్య NH1 రాజమార్గం మీద మెలికలు తిరిగే రోడ్డుపై ఈసారి సంతోషంగా వేగంగా దూసుకుపోయింది.
***
(ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు ఇంకా ఎక్కువగా లేవు.ఇప్పటి పరిశోధనలు ప్రగతి బట్టి 2040కి కనీసం 5000 qubits తో తయారుచేసిన క్వాంటమ్ కంప్యూటర్లు తయారు అవుతాయి అని భావిస్తున్నారు.)

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.