[‘రాధికా, ఆలకించు!’ ఖండకావ్యంపై విశ్లేషణా వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీమతి శ్రీదేవి మురళీధర్.]
ప్రేమ నుంచి ప్రజ్ఞకు..
రాధ సాక్షిగా శ్రీకృష్ణుని ఆత్మావిష్కరణ
(మాధవ్ కౌశిక్ మూలరచనకు కృష్ణుడు అనువదించిన ‘రాధికా, ఆలకించు!’ ఖండకావ్యంపై ఒక అవగాహన)
రాధాకృష్ణుల అనుబంధం భారతీయ సాహిత్యం అత్యంత విస్తృతంగా వ్యాఖ్యానించిన భావక్షేత్రం. శృంగారం, విరహం, భక్తి, ఆత్మ – పరమాత్మల ఐక్యం, జీవ – బ్రహ్మ సంబంధం వంటి అనేక వ్యాఖ్యాన సంప్రదాయాలు ఈ అనుబంధం చుట్టూ అల్లుకున్నాయి.
మాధవ్ కౌశిక్ రచించిన ‘సునో రాధికా’ ఖండకావ్యానికి ‘కృష్ణుడు’ (శ్రీ కృష్ణారావు) కూర్చిన భావపూర్ణమైన తెలుగుసేత ‘రాధికా, ఆలకించు!’
ఐతే ఈ సేత వ్యాఖ్యాన సంప్రదాయానికి మరొక భావుక పునరుక్తి కాదు. రాధను తలచుకుంటూ శ్రీకృష్ణుడు తన ప్రేమజీవితాన్ని మాత్రమే స్మరించే ప్రణయ కావ్యమూ కాదు. చరిత్ర తనపై ఆపాదించిన పాత్రలను, రాజకీయం తనలో మిగిల్చిన మానని గాయాలను, యుద్ధం కలిగించిన నైతిక సంక్షోభాన్ని, స్త్రీ అస్తిత్వంపై సమాజం చేసిన దురాక్రమణను, మానవ సంబంధాల నిజమైన విలువను శ్రీ కృష్ణుడు రాధ ఎదుట పునఃపరిశీలించే దీర్ఘ అంతరంగ సంభాషణ ఇది.
ఈ కావ్య విశిష్టత దాని కథావస్తువులో కంటే దాని దృష్టిలో ఉంది. శ్రీకృష్ణుడిని కీర్తి శిఖరంపై ప్రతిష్ఠించి పూజించడం సులభం. కానీ ఆ శిఖరం వెనుక దాగిన అలసటను, బాధ్యతను, ఏకాంతాన్ని, అపరాధ భావనను, నిర్ణయాల భారాన్ని ఊహించటం కష్టం. మాధవ్ కౌశిక్ తన కావ్యసృజనకు ఆ క్లిష్ట మార్గాన్నే ఎన్నుకున్నారు.
కావ్యభూమికలో కవి యుగపురుషుడిని తన కాలానికి అతీతునిగా కాక, ఆ యుగంలోని సంఘర్షణలను, వైరుధ్యాలను తన లోలోపల అనుభవించిన వ్యక్తిగా అర్థం చేసుకోవాలని సూచిస్తారు. భక్తి, ఆరాధనల తీవ్రతలో ఒక మహనీయుని చింతన మరుగునపడి పోవచ్చనే హెచ్చరికతోనే కావ్యానికి తాత్త్విక పునాది నిర్మిస్తారు.
అందువల్ల ఈ రచనలో శ్రీకృష్ణుడు దివ్యమూర్తిగా కనిపించినా, కవి దృష్టి అతడిలోని మానవీయకోణంపై, వహించిన బాధ్యతలపై నిలుస్తుంది. కావ్య ప్రారంభంలోనే ఈ దిశ స్పష్టమౌతుంది.
జీవితంలోని అనంత ప్రవాహాన్ని చూసి, భరించి, దాని వేగాన్నీ, అంతరార్థాన్నీ గ్రహించిన తరువాత కూడా తానెందుకు మునుపటిలా భావుకుడైనాడో శ్రీకృష్ణుడికే తెలియదు. చెప్పవలసినదీ, పంచుకోవలసినదీ ఎంతో ఉంది. అయినా రాధ ఎదుట తాను పలికేది వివరణ కాదని అతడు ముందుగానే స్పష్టం చేస్తాడు.
“ఇది స్పష్టీకరణ కాదు
అసలు నీకు ఏమి స్పష్టం చేయగలను”
ఈ రెండు పంక్తుల్లోనే రాధాకృష్ణుల అనుబంధానికి కవి ఇచ్చిన అపూర్వ నిర్వచనం నిక్షిప్తమై ఉంది.
రాధ ఎదుట శ్రీకృష్ణుడికి తనను తాను సమర్థించుకోవలసిన అవసరం లేదు. ఆమెకు అతడి జీవితంలోని సంఘటనలు మాత్రమే కాదు, వాటి వెనుక దాగిన మౌనం, వేదన, సంకటమూ తెలుసు. ప్రపంచం ముందు అతడు తన చర్యలకు అర్థం చెప్పవలసి రావచ్చు. రాధ ముందు మాత్రం అతడు తన అంతరంగాన్ని యధాతథంగా విప్పవచ్చు. అక్కడ వివరణకు చోటు లేదు. ఎందుకంటే అవగాహన ముందుగానే ఉంది.
తనను నిరూపించుకోవలసిన అవసరం లేని చోటనే మనిషి మర్మం లేకుండా నిజం చెప్పగలడు. తన మాటలను తీర్పుల కొలమానాలపై నిలబెట్టని సాన్నిధ్యంలోనే సంపూర్ణ ఆత్మావిష్కరణ సాధ్యమౌతుంది. రాధ శ్రీకృష్ణుడికి అలాంటి సాన్నిధ్యం. అందుకే ఈ స్వగతం సమర్థనగా కాక, దాచుకోవలసినదేమీ లేని ఒక అంతరంగ సమర్పణగా రూపుదిద్దుకుంటుంది. అందుకే శ్రీకృష్ణుని మాటలలో ఎక్కడా ఉపన్యాసధోరణి కనిపించదు. అతడి మాటలు జ్ఞాపకాలు, వేదన, ఆత్మపరిశీలన, కృతజ్ఞత, ప్రశ్న, తాత్త్విక నిర్ధారణల మధ్య సంచరిస్తాయి.
రాధ ఇక్కడ శ్రోత మాత్రమే కాదు. శ్రీ కృష్ణుని వాక్యాలకు ఆమె ఒక నిశ్శబ్ద ప్రమాణం. యోగీశ్వరుడు, రథసారథి, రాజనీతిజ్ఞుడు,ధర్మసంస్థాపకుడు.. వంటి అనేక ప్రజారూపాల వెనుక ఉన్న వ్యక్తి గురించి నిజమైన ఎరుక కలిగిన ఏకైక సాన్నిధ్యమే రాధ.
కవి చిత్రించిన శ్రీకృష్ణుడు తన మహిమకు తానే బందీ అయిన వ్యక్తి. ప్రజల ప్రేమ, విశ్వాసం తనను విరాట్ స్వరూపుడిగా మార్చాయని అతడు చెప్పుకుంటాడు. ఆ గౌరవం నుంచి తప్పించుకోవాలనుకున్నా, దాని ఆకర్షణలో చిక్కుకున్నానని అంగీకరిస్తాడు. ఇది దైవత్వాన్ని నిరాకరించడం కాదు. మనిషి లోపలి మనిషి ప్రజల ఆరాధన వెనుక ఎలా కనుమరుగౌతాడో కళ్ళకు కట్టినట్లు చూపించడం.
అందరూ శ్రీకృష్ణుని శక్తినే చూశారు. రాధ మాత్రమే అతడి నిస్త్రాణను, అలసటను చూసింది.
“కానీ నువ్వు తప్ప నా కన్నీళ్లు
ఎవరూ చూడలేదు” అంటాడు శ్రీకృష్ణుడు.
ఈ పంక్తులు కావ్యానికి హృదయకేంద్రం వంటివి. శ్రీకృష్ణుని కన్నీళ్లు ఇక్కడ వ్యక్తిగత వియోగానికి మాత్రమే చెందినవి కావు. అవి ప్రజల ఆశల పెనుభారం మోయవలసిన వాడి కన్నీళ్లు, కీలక నిర్ణయాల మూల్యం చెల్లించవలసినవాడి కన్నీళ్లు, అందరికీ ధైర్యం చెప్పి తన బాధను దాచుకోవలసినవాడి కన్నీళ్లు.
“శుష్క నయనాలే అన్నిటికన్నా ఎక్కువ రోదించి ఉంటాయి” అనే భావచిత్రం బాహ్య స్థైర్యం అంతరంగ కల్లోలాన్ని ఎల్లప్పుడూ వ్యక్తం చేయదనే సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
అనువాదకుడు ఇటువంటి అనేక సందర్భాలలో భాషను అలంకారాలతో బరువెక్కించకుండా భావాన్ని నిర్మలమైన వాక్యాలలో ప్రవహింప జేశారు.
ఈ కావ్యంలో రాజకీయం కేవలం రాజ్యాలు, యుద్ధాలు, అధికార పోరాటాలకే పరిమితం కాకుండా, మనిషి అంతరంగాన్ని, అతడి సంబంధాలను, నైతిక నిర్ణయాలను ప్రభావితం చేసే సమగ్రశక్తిగా ప్రతిపాదించబడింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడు రాజకీయ విజయాల కంటే, వాటి వెనుక ఉన్న మానవీయ మూల్యాన్ని విశ్లేషించడంపై ఎక్కువ దృష్టి సారిస్తాడు. అధికారం కంటే మానవత్వమే శ్రేష్ఠమని, ధర్మం కూడా మానవరక్షణకే వినియోగపడాలనే భావన ఈ కావ్యంలోని రాజకీయ దృష్టికి కేంద్రంగా నిలుస్తుంది.
శ్రీకృష్ణుడు తనను కాలాతీతునిగా ప్రకటించుకోడు. “యుగపురుషుడిని కూడా యుగ మర్యాదలు కట్టి బంధిస్తాయి” అని చెప్పడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు చరిత్ర విధించే హద్దులను అంగీకరిస్తాడు. ఇది కావ్యంలో అత్యంత గంభీరమైన తాత్త్విక నిర్ధారణలలో ఒకటి.
మహనీయుడు కాలాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ అతడు కాలానికి పూర్తిగా వెలుపల నిలువలేడు. ఆ కాలంలో విజృంభించిన వైరుధ్యాలు, సమష్టి భయాలు, సామాజిక ఒత్తిళ్లు అతని నిర్ణయాలలోకి జొరబడతాయి. అందువల్ల శ్రీకృష్ణుని కార్యాలను కేవలం దైవలీలలుగా కాక, చరిత్ర విధించిన బాధ్యతల నిర్వహణగా చూడాలని కవి కోరుతున్నారు.
రాధ అతడికి ఆ బాధాకరమైన, బాధ్యతాయుతమైన చరిత్ర నుంచి పారిపోయే ఆశ్రయం కాదు. దానిని ఎదుర్కొనే అంతరంగ బలం.
రాజభవనాల మిరుమిట్ల వెనుక దాగిన కుటిలత్వాన్ని ఎదుర్కోవడం కాళీయమర్దనం కంటే కఠినమని శ్రీ కృష్ణుడు చెబుతూ, తనను రక్షించినది రాధ ప్రేమేనని అంగీకరిస్తాడు.
ఇక్కడ ప్రేమ, రక్షణ, అంటే బాహ్య ప్రమాదం నుంచి కాపాడటం కాదు. అధికార వ్యవస్థ మధ్య జీవిస్తూ తనలోని మానవత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టడం. ఈ భావాన్ని అనువాదంలో “నీ ప్రేమే రక్షాకవచమై నన్ను కాపాడింది” అనే సుపరిచితమైన పదబంధంతో వ్యక్తం చేసినప్పటికీ, దాని చుట్టూ ఉన్న సందర్భ నిర్మాణం వల్ల అది సామాన్య ప్రేమోక్తిగా మిగలిపోదు.
శ్రీకృష్ణుడు రాధను ఆలింగనం చేసుకోవడం కంటే ఆమె పాదాల వద్ద కూర్చుని కృతజ్ఞత చెప్పాలని కోరుకోవడం వారి మధ్య గల బంధానికి కవి ప్రదానం చేసిన గౌరవానికి ప్రతీక. రాధ శ్రీకృష్ణ ప్రేమి మాత్రమే కాదు. అతడి జీవనసత్యానికి మూలం. అతడిని పసిపాపగా ఏడ్వనివ్వ గల ఏకైక సాన్నిధ్యం.
స్థైర్యం, నియంత్రణల మాటున, కన్నీటికి దూరంగా పురుషత్వాన్ని ప్రతిష్టించి, కొలిచే భావజాలానికి ఇది సున్నితమైన ప్రతివాదం. స్థితప్రజ్ఞత అంటే అనుభూతి రాహిత్యం కాదని, గురుతర బాధ్యత మోసినవాడికి విరిగిపడే స్వేచ్ఛ కూడా ఉండాలని కవి సూచిస్తారు.
కావ్యం మొదటి అధ్యాయంలోనే రాధ వ్యక్తిత్వం ప్రేమికురాలి పరిధిని దాటి ఆదిమశక్తిగా, పునఃసృజన శక్తిగా విస్తరిస్తుంది. విధ్వంసాల అంధకారంలో కాంతిరేఖను గీసి విశ్వాసాన్ని మరణించనివ్వని శక్తిగా ఆమెను శ్రీ కృష్ణుడు దర్శిస్తాడు. ఈ రాధ నిరాకారమైన ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు. “మనిషితో పాటు మనిషిగా పుట్టి మానవాళి అంతం వరకూ ఉండే మనిషితనం”తో ఆమెను అనుసంధానించడం ద్వారా కవి దైవత్వానికి మానవతా నిర్వచనం ఇస్తారు. రాధ అంటే కరుణ, జీవన పునరుద్ధరణ, నశించని మానవ విశ్వాసం.
విరహాన్ని కూడా కవి ఏకపక్ష భావనగా చూడరు. బృందావనంలో మిగిలిన యశోద, నందుడు, గోపికలు, యమున, పశువులు, వృక్షాల వియోగవిలాపం అందరికీ కనిపించింది. కానీ అందరినీ వదిలి విశ్వవేదిక నుంచి నిష్క్రమించవలసి వచ్చిన శ్రీకృష్ణుని వియోగ దుఃఖం ఆ సామూహిక రోదనలో కనుమరుగై పోయిందని కవి చెబుతాడు.
ఇది వియోగసాహిత్యంలో అరుదైన దృష్టి. వెనుక మిగిలినవారి దుఃఖమే సాధారణంగా కథనమౌతుంది. వెళ్లవలసి వచ్చినవాడి బాధను కవి వినిపిస్తారు. అయితే శ్రీకృష్ణుడు తన బాధను వారి బాధకు ప్రతిగా నిలబెట్టడు. అందరి బాధను భరించవలసిన బాధ్యత తనదేనని అంటాడు. వ్యక్తిగత వేదనను సమష్టి బాధ్యతలో కలిపివేయడమే కృష్ణ ప్రేమకు విస్తృతి.
“ఏది ఎడబాటు, ఏది విరహం” అంటూ రాధ పలికే మాటలతో ఈ కావ్యం తన అత్యంత కీలకమైన తాత్త్విక మలుపును చేరుకుంటుంది. దూరం భౌతిక ప్రమాణం మాత్రమేనని, అపరిమితమైన తనను పరిమితం చేసుకోవద్దని ఆమె శ్రీకృష్ణుడికి చెబుతుంది. ఇక్కడ ప్రేమను ఆమె స్వాధీనభావానికి అతీతంగా నిలబెడుతుంది. తన దగ్గరే ఉండమని కోరదు. తనలో వికసించిన ప్రేమను ఒక వ్యక్తి సాన్నిధ్యానికే పరిమితం చేయకుండా సమస్త జీవనానికి, దశదిశల విస్తరించమని ఆమె శ్రీకృష్ణుడిని ప్రేరేపిస్తుంది.
అందువల్ల వారి వియోగం అనుబంధ విఘాతం కాదు. వ్యక్తిగత ప్రేమ విశ్వమానవ ప్రేమగా పరిణమించిన అపురూప సందర్భం.
మానవ సంబంధాలపై కవి చేసిన పరిశీలన కూడా లోతైనది. సంబంధాలు వారసత్వం వల్ల మాత్రమే ఏర్పడవని, తపస్సు, కార్యం, విశ్వాసం, అనుభవం ద్వారా కూడా సృజించబడతాయని శ్రీకృష్ణుడు చెబుతాడు. యశోద, నందుడు, సుదాముడు, బలరాముడు, గోపికలు, రాధలను ఉదాహరిస్తూ రక్తసంబంధాల కంటే అనుభవం, విశ్వాసం, ఆత్మీయతలతో నిర్మితమైన బంధాలే మనసుకూ ఆత్మకూ సన్నిహితమైనవని కవి ప్రతిపాదిస్తారు.
ఈ భావంలో కుటుంబాన్ని నిరాకరించడం లేదు. జననం మానవ సంబంధాలకు ఆరంభం. కానీ వాటికి జీవం, గాఢత, చిరస్థాయిత్వం ప్రసాదించేది ప్రేమతో కూడిన సహజీవనమేనని శ్రీకృష్ణుడు సున్నితంగా తెలియజేస్తాడు.
రెండవ అధ్యాయంలో బృందావనం శ్రీకృష్ణుని బాల్యస్మృతిలోని ఒక భౌగోళిక ప్రదేశంగా కాక, కోల్పోయిన సహజ జీవన సౌందర్యానికి ప్రతీకగా, అతడి చైతన్యాన్ని పరిపోషించిన మనోభూమిగా ఆవిష్కృతమౌతుంది. గోవుల మెడల్లో మోగే గంటల ధ్వని, అమాయక గోపికల ఆటపాటలు, యమునానది ప్రశాంత, నిరంతర ప్రవాహం, ప్రకృతిని లయింపజేసే వేణునాదం.. ఇవన్నీ కేవలం స్మృతి శకలాలు కావు. రాజభవనాల కుట్రలు, అధికార వ్యామోహం, హింసలతో కలుషితమైన ప్రపంచంలో స్వచ్ఛమైన జీవన సమగ్రతకు చిహ్నాలు.
“నిశ్శబ్దం స్వరమైనప్పుడు అది కోలాహలాన్ని దాటివేస్తుంది” అనే వాక్యం కవితా భావనను మించి జీవనదృష్టిగా నిలుస్తుంది. బాహ్య అధికారానికి ఘోష అవసరం. అంతర్గత సత్యానికి నిశ్శబ్దం చాలు.
“మోసకారి” అనే రాధ సంబోధనను శ్రీ కృష్ణుడు కోట్లాది గౌరవనామాల కంటే ప్రియమైనదిగా ఇష్టపడటం కావ్యంలో మానవీయమైన సుకుమార హాస్యాన్ని మిళితం చేస్తుంది. ప్రజలు అతనికి పెట్టిన పేర్లు వారి విశ్వాసాల నుంచి పుట్టినవి. రాధ పెట్టిన పేరు మాత్రం వారి మధ్య ఉన్న నిర్భయ సాన్నిహిత్యానికి చిన్నపాటి సంకేతం.
శ్రీకృష్ణుడిని పరమాత్మగా ఆరాధించేవారు దైవ – మానవ అంతరాన్ని పాటిస్తారు. ప్రేమించేవారు మాత్రమే అతడిని ఆట పట్టించగలరు. ఆ చనువు శ్రీకృష్ణుడికి అత్యంత విలువైనది. అనువాదకుడు ఇటువంటి చోట గాంభీర్యాన్ని తగినంత మాత్రమే సడలిస్తూ సంభాషణలో స్వాభావికతను చక్కగా నిలబెట్టారు.
రాసక్రీడను కవి శరీరానుభవానికి పరిమితం చేయరు. దేహాన్ని, కాలాన్ని, శబ్దాన్ని, భావాన్ని అధిగమించే విశ్వానుభూతిగా చిత్రిస్తారు. భూమి, ఆకాశం, దిక్కులు, ఉల్కలు, పాలపుంత.. అన్నీ నృత్యంలో ఏకమౌతాయి. ఈ విశ్వరూపకల్పనలో ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మీయ అనుభవంగా ఆవిర్భవించి, విశ్వానుభూతిగా పరిణమిస్తుంది.
“నీవు అక్కడున్నావు, అక్కడ లేవు కూడా” అనే విరోధాభాసం రాధ సాన్నిధ్యాన్ని భౌతికమైన ఉనికికి అతీతం చేస్తుంది. రాధ తనను చిన్నతనంలోనే యోగిగా మార్చిందని శ్రీకృష్ణుడు చెప్పడం కూడా గమనించదగినది. యోగం ఇక్కడ జీవితం నుంచి వైదొలగే మార్గం కాదు. వేణువు, నృత్యం, ఆట, నవ్వు, ప్రేమల మధ్య సహజ జీవనంలోనే యోగానుభూతిని పొందడం.
శ్రీకృష్ణుని యోగీశ్వరత్వానికి కురుక్షేత్రం కంటే ఎంతో ముందే బృందావనమే పునాది వేసిందని కవి సూచిస్తారు. రాధ అతడికి విరక్తిని బోధించలేదు. అనురాగంలో అహాన్ని కరిగించుకోవడం నేర్పింది.
బృందావనం నుంచి బయలుదేరిన తరువాత శ్రీకృష్ణుడికి కనిపించిన ప్రపంచం అరాచకం, అన్యాయం, నైతిక పతనంతో నిండినది. ఇక్కడి నుంచి కావ్యం వ్యక్తిగత స్మృతి నుంచి సామాజిక సంఘర్షణకు చేరుతుంది.
శ్రీకృష్ణుడు నిరాయుధుడిగా బయలుదేరినా, రాధ తన పక్కన ఉన్నదనే అంతర్గత విశ్వాసం అతడిని ముందుకు నడిపిస్తుంది. ప్రజల శక్తి అతడి భుజాలుగా, అడుగులుగా, స్వరంగా మారుతుంది. ఈ రూపకల్పనలో నాయకత్వం వ్యక్తిపూజ కాదు. సమష్టి చైతన్యానికి కేంద్రబిందువుగా నిలిచే బాధ్యత.
మహాభారత యుద్ధాన్ని కవి విజయగాథగా చిత్రించరు. గాయపడిన సైనికులు, వితంతువుల రోదనలు, అనాథల ఆక్రందనలు, బూడిద, కుళ్లిన శరీరాలు శ్రీకృష్ణుని జ్ఞాపకంలో నిలిచి ఉంటాయి. యుద్ధం అనివార్య పరిస్థితిలో జరిగిందని చెప్పినా, దాని బీభత్సాన్ని ధర్మం పేరుతో పవిత్రీకరించరు.
చివరి ప్రయత్నం వరకు శాంతి సాధ్యమని ఆశించినవాడిగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. యుద్ధానికి కారణమైన నిరంకుశత్వాన్ని విమర్శిస్తూ, యుద్ధం ముగిసినా క్రూరభూయిష్టమైన మనస్తత్వం అంతరించదని కవి మరింత కఠినమైన సత్యాన్ని చెబుతారు. “మానవులు, దానవులు రెండు కులాలు కాదు” అనే భావన కావ్యంలోని సామాజిక దృక్కోణానికి మూలవాక్యం.
కంసుడు, దుర్యోధనుడు, ద్రోణుడు, అశ్వత్థామ వంటి పేర్లను వ్యక్తులుగా మాత్రమే కాక మనస్తత్వాలుగా చదవాలని కవి సూచిస్తారు. వ్యక్తిని సంహరించడం సులభం. అతడు సృష్టించిన భావజాలాన్ని నిర్మూలించడం కష్టం. చరిత్రలో ఒక దుర్మార్గుడు మరణించినా, అతడి నైచ్యం, అధికార దాహం కొత్త రూపాల్లో మళ్లీమళ్లీ ఉద్భవించవచ్చు. ఈ అవగాహన వల్ల మహాభారతం గతంలోని యుద్ధంగా కాక, ప్రతి యుగంలో పునరావృతమయ్యే నైతిక సంఘర్షణగా మారుతుంది.
ఈ కావ్యానికి స్త్రీ దృక్పథం అత్యంత బలమైన పార్శ్వాలలో ఒకటి. ద్రౌపది అవమానాన్ని శ్రీకృష్ణుడు వ్యక్తిగత విషాదంగా కాక, సమాజ పౌరుషానికే విసిరిన ప్రశ్నగా స్వీకరిస్తాడు. ఆమె మానాన్ని కాపాడగలిగానని, కానీ ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయానని అంగీకరిస్తాడు. ఇది శ్రీకృష్ణుడి సర్వసామర్థ్యాన్ని కీర్తించే ప్రయత్నం కాదు. యుగధర్మం తనపై విధించిన పరిమితులను అతడే సవినయంగా ఒప్పుకునే అరుదైన క్షణం.
ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సాధారణంగా అద్భుత రక్షణ కథగా చెబుతారు. మాధవ్ కౌశిక్ దృష్టి మాత్రం రక్షణ తరువాత కూడా సమాధానం లేని ప్రశ్నలపై నిలుస్తుంది.
స్త్రీని పణంగా పెట్టే హక్కు పురుషుడికి ఎవరిచ్చారు అనే ద్రౌపది అభిమాన ఆక్రోశం పితృస్వామ్య వ్యవస్థను యావత్తు నిలదీసి ప్రశ్నిస్తుంది. ఆమె ఇక్కడ బాధితురాలు మాత్రమే కాదు. దుర్మార్గాన్ని మొట్టమొదట ప్రశ్నించిన నిర్భయస్వరం. తన అవమానాన్ని సామూహిక నైతిక విచారణగా మార్చిన చైతన్యం. ఈ కారణంగానే కవి ఆమెను మహోన్నతురాలిగా దర్శిస్తారు.
మూడవ అధ్యాయంలో స్త్రీ అణచివేతను ఒక చారిత్రక, సామాజిక పరిణామంగా కవి విశ్లేషిస్తారు. పురుషుడు సాధించిన ప్రతి విజయానికి స్త్రీ సమాన సహచరిగా నిలిచినా, కాలక్రమంలో ఆమెను ఆస్తిగా, వారసత్వ సంపదగా, చివరికి విలాస వస్తువుగా మార్చిన నాగరికతపై శ్రీకృష్ణుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. అర్ధనారీశ్వర భావనను గర్వంగా ప్రకటించిన సంస్కృతి ఆచరణలో మాత్రం స్త్రీని దాస్యంలోకి నెట్టివేసి, తాను గర్వించే తాత్త్విక పునాదినే దెబ్బ తీసుకుందనే విషాద వైరుధ్యాన్ని కవి హృద్యంగా ఆవిష్కరిస్తారు. అంతేకాక స్త్రీలను స్త్రీలకు శత్రువులుగా మార్చడంలో పురుష సమాజం విజయవంతమైందనే సూక్ష్మ పరిశీలన అణచివేత తన ప్రతినిధులను బాధిత వర్గంలోనే ఎలా సృష్టించుకుంటుందో సూచిస్తుంది.
కుబ్జపై కవి చేసిన పునర్వ్యాఖ్యానం ప్రత్యేక ప్రస్తావనకు అర్హం. కుబ్జను శారీరక వైకల్యానికి ప్రతీకగా కాక, సమాజం తన సామర్థ్యాన్ని గుర్తించనీయని స్త్రీగా చిత్రిస్తారు. ఆమె అస్తిత్వాన్నే ఆమెకు అపరిచితం చేసిన సామాజిక దృష్టినే శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తాడు.
వికలత్వాన్ని శరీరంలో కాక, సమాజ దృష్టిదోషంలో వెతకాలని సూచిస్తాడు.
“ఏ స్త్రీ అయినా సౌందర్యహీనంగా ఉంటుందా?” అనే ప్రశ్న ద్వారా శరీరాకృతులను ఆధారంగా చేసుకొని సౌందర్యాన్ని కొలిచే సామాజిక ప్రమాణాన్నే కవి తిరస్కరిస్తారు.
కుబ్జను సుందరిగా చేసినవాడిగా శ్రీకృష్ణుడు తనను చిత్రించుకోడు. ఆమెలో మొదటి నుంచీ ఉన్న సౌందర్యాన్ని గుర్తించడమే తన స్పర్శ అని సూచిస్తాడు. “అఖిలం మధురం” అన్నప్పుడు అది కుబ్జ పట్ల వ్యక్తమైన ప్రశంస మాత్రమే కాదు. సమాజం నిరాకరించిన సౌందర్యాన్ని గుర్తించిన తన అంతరంగంలో సంభవించిన ‘విస్ఫోటనాని’కి అది ఒక స్వరమౌతుంది. సౌందర్యాన్ని చూసే దృష్టిలో సంభవించిన అంతరంగ పరివర్తనకు శ్రీకృష్ణుడు పెట్టిన పేరు.
ఈ భాగాల అనువాదంలో కృష్ణుడు ప్రదర్శించిన నైపుణ్యం ప్రత్యేకంగా ప్రశంసించదగినది. హిందీ భావప్రవాహంలోని సామాజిక పదజాలాన్ని తెలుగులో కఠిన సిద్ధాంతభాషగా మార్చకుండా, పాఠకుని హృదయానికి చేరేలా సరళసుందరంగా వ్యక్తం చేశారు.
“మన సంవేదనలే సౌందర్యహీనం”, “మన దృక్పథమే సంకుచితం” వంటి నిర్మాణాలు భావాన్ని స్పష్టంగాను, కవితా లయను కోల్పోకుండా వ్యక్తీకరిస్తాయి. కుబ్జ గురించి మాట్లాడే చోట అనువాదకుడు జాలి, సానుభూతి ప్రదర్శించే పదజాలం ఉపయోగించకుండా గౌరవభాష వినియోగించటం చక్కని అనువాద నైపుణ్యం.
సౌందర్యాన్ని దర్శించాలంటే దృష్టి కావాలని, మనసు ముక్త విహంగంలా స్వేచ్ఛ పొందాలని కవి అంటారు. ఇక్కడ సౌందర్యం అలంకార ప్రమాణం కాదు. జీవిని దాని సంపూర్ణతలో స్వీకరించే నైతిక సామర్థ్యం.
కళలను కూడా కవి ఇంద్రియాల నుంచి అతీంద్రియాలకు తీసుకువెళ్లే జీవన మార్గంగా దర్శిస్తారు. కళ, సంగీతం, నృత్యం, రసం, గంధం అన్నీ నరుడిని నారాయణుడిగా మార్చే సాధనాలని చెప్పడం ద్వారా మానవోన్నతికి సృజనాత్మకతను కేంద్రంగా నిలుపుతారు.
అయితే ఈ కావ్యం కళానుభూతిలోనే ఆగిపోదు. రాగాత్మకతకు లోకకల్యాణంతో అనుబంధం లేకుంటే అది సంపూర్ణతను పొందదని స్పష్టం చేస్తుంది. సౌందర్యం సామాజిక బాధ్యతకు ప్రత్యామ్నాయం కాదు. ఇతరుల వేదనను తనదిగా అనుభవించగల మానవీయ చైతన్యానికి అదే మూలం.
అందుకే అన్యాయాన్ని సహించడమనేది అన్యాయం చేయడం కంటే అధిక పాపమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ వాక్యంలో గీతా కర్మ తత్త్వం సామాజిక ప్రతిఘటనగా పునర్నిర్వచితమౌతుంది.
యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు ఆయుధం చేపట్టకుండా పగ్గాలు పట్టడం కవి దృష్టిలో గాఢమైన ప్రతీకాత్మక అర్థాన్ని పొందుతుంది. ప్రజలకు సేనలు, ఆయుధాలు ఉన్నా ధైర్యం, దిశ, సమర్థమైన సారథ్యం లోపించవచ్చని అతడు సూచిస్తాడు. ఆ లోటును పూరించిన రథసారథిగా తన పాత్రను గుర్తుచేసుకుంటూ నాయకత్వానికి కొత్త అర్థం ఇస్తాడు. నిజమైన నాయకుడు ప్రజల స్థానంలో పోరాడడు. వారిలో నిక్షిప్తమైన శక్తిని మేల్కొలిపి, దానికి సరైన దిశను చూపుతాడు.
“నీవు నన్ను ‘మోసకారి’ అని ఎందుకు పిలిచావో” అని రాధను ఆటపట్టించే శ్రీకృష్ణుడు, “ఆవుల వెనుక నన్ను నడిపించినప్పుడు, ఒక రోజు గుర్రాల పగ్గాలు పట్టవలసి వస్తుందని నీకు ముందే తెలుసా?” అన్నట్లుగా చమత్కారభరితంగా ఆమెను పరిహసిస్తాడు. ఆ పరిహాసంలో బాల్యస్మృతి, ప్రేమ, విధి ఒకే క్షణంలో సంగమిస్తాయి. కావ్యంలోని గాంభీర్యానికి అది సున్నితమైన మానవీయస్పర్శను అద్దుతుంది.
ఇది కేవలం ప్రేమికుల నడుమ పరిహాసం కాదు. బృందావనంలోని సాధారణ జీవితమే కురుక్షేత్రంలోని అసాధారణ బాధ్యతకు సిద్ధతగా మారిందనే అంతర్లీన సత్యాన్ని పరోక్షంగా వెల్లడిస్తుంది. బాల్యంలోని గోపాలకుడే యుద్ధభూమిలో రథసారథిగా అవతరించిన విధానాన్ని ఈ స్మృతి కవితాత్మకంగా వ్యక్తం చేస్తుంది.
నాల్గవ అధ్యాయంలో మైత్రి, సహవాసం, స్వీయ క్రమశిక్షణ, సామరస్యంపై కవి దృష్టి కేంద్రీకృతమౌతుంది. కలిసి ఉండటం మాత్రమే స్నేహం కాదని, దూరమైనా కలుపుకుని పోవడమే నేస్త గుణమని చెప్పడం రాధాకృష్ణుల వియోగానికి కూడా నిర్వచనంగా నిలుస్తుంది. సంబంధమంటే నిరంతర భౌతిక సాన్నిధ్యం కాదని, ఒకరి అంతరంగంలో మరొకరు జీవించగల సామర్థ్యమని కవి నిర్ధారిస్తారు.
రాధపై శ్రీకృష్ణుని ప్రేమ క్రమంగా సమస్త సృష్టిపై ప్రేమగా విస్తరిస్తుంది. రాత్రి, చీకటి, సూర్యకిరణం, నది కలకలం, ఆకుల కోమలత్వం, గాయపడిన సైనికుని ఆర్తనాదం, రక్తరంజిత భూమి, శ్మశానం కూడా అతడికి రాధను గుర్తు చేస్తాయి. ఇది సుఖకరమైన వాటిలో మాత్రమే ప్రియురాలిని దర్శించే భావుకత కాదు. బాధ, క్షయం, మరణంలో కూడా రాధ అంశాన్ని అన్వేషించే విశ్వదృష్టి.
జీవితం నుంచి అసహ్యకరమైనదాన్ని తొలగించి ప్రేమను నిర్మించలేమని, ప్రేమకు సమస్త అస్తిత్వాన్ని యధాతథంగా ఆలింగనం చేసుకునే ధైర్యం అవసరమని ఈ భాగం తెలియజేస్తుంది.
రుక్మిణి ప్రేమ నివేదనను కూడా శ్రీకృష్ణుడు రాధ ప్రసాదించిన అనుభూతి విస్తరణగానే స్వీకరిస్తాడు. రుక్మిణి, సత్యభామలతో సహా తనను ప్రేమించిన ప్రతి స్త్రీలో రాధ అంశం ఉందని చెప్పడం వారిని రాధ ప్రతిరూపాలుగా కుదించడం కాదు. రాధ ద్వారా తనకు లభించిన ప్రేమదృష్టి వల్లనే ప్రతి ప్రేమను దాని స్వరూపంలో గుర్తించి, గౌరవించి, స్వీకరించగలిగానని ఆయన చెబుతాడు.
రాధ అతడి జీవితాన్ని ఆక్రమించలేదు. ఇతర అనుబంధాలకు తెర తెరిచింది. నిజమైన ప్రేమ వ్యక్తిని బంధించకుండా అతడి స్వీకరణ శక్తిని విస్తరిస్తుందని కవి దర్శింపజేస్తారు.
అయిదవ అధ్యాయంలో ద్రౌపది ప్రశ్న మరింత స్పష్టమైన స్త్రీ స్వాతంత్ర్య ప్రకటనగా మారుతుంది. పరాజితుడైన వ్యక్తికి తన భార్యను పణంగా పెట్టే హక్కు ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించడం ద్వారా స్త్రీని పురుషుని ఆస్తిగా భావించే మూల ధారణను కూలదోస్తుంది. ద్రౌపది తన వ్యక్తిగత అవమానానికి మాత్రమే కాదు.. స్త్రీల వ్యథాభరిత జీవితాలకు తన గొంతుకను అరువిస్తుంది. బాధను భరించినందు వల్ల మాత్రమే కాదు, బాధను ప్రశ్నగా మార్చినందుకు ద్రౌపది మహోన్నతురాలు.
ఇది స్వాధీన ప్రేమకు పూర్తి విరుద్ధమైన ముగింపు. రాధను తనదిగా ప్రకటించడం కాదు. ప్రపంచానికి సమర్పించడం. తనలోని మనిషిని జాగృతంగా నిలిపిన శక్తిని సమస్త మానవాళికి కానుక చెయ్యటం. ఈ సమర్పణతో రాధ ఒక వ్యక్తి నుంచి విలువగా, విలువ నుంచి చైతన్యంగా, చైతన్యం నుంచి విశ్వవ్యాప్త మానవతగా పరిణమిస్తుంది.
మాధవ్ కౌశిక్ కవితా శిల్పంలో ప్రధానంగా ఆకర్షించేది ఆయన పురాణ పాత్రలపై ఆధునిక భావజాలాన్ని బలవంతంగా ఆరోపించకపోవడం.
మహాభారతంలోని సంఘటనలను మార్చకుండా, వాటి మధ్య నిశ్శబ్దంగా మిగిలిపోయిన ప్రశ్నలను వెలికి తీస్తారు. శ్రీకృష్ణుని నోట సమకాలీన సామాజిక ఆలోచనను పలికించినా, అతడి వ్యక్తిత్వానికి విరుద్ధమైన వాదనలను జోడించరు. ప్రేమ, కర్మ, ధర్మం, మైత్రి, లోకకల్యాణం, స్త్రీ గౌరవం వంటి విలువలు, శ్రీకృష్ణునితో సంప్రదాయంగా అనుసంధానమైన వాటి నుంచే తన ఆధునిక వ్యాఖ్యానాన్ని నిర్మిస్తారు.
ఆయన చిత్రించిన శ్రీకృష్ణుడు తనను నిర్దోషిగా ప్రకటించుకునే చతురుడైన వక్త కాదు. తన విజయాలను తానే పునర్విమర్శించుకునే సాక్షి. యుద్ధాన్ని నడిపించినవాడే యుద్ధానంతర నరకాన్ని చూస్తాడు. ద్రౌపదిని రక్షించినవాడే ఆమె ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని అంగీకరిస్తాడు. సమాజానికి దిశ చూపినవాడే తనను కూడా కాలం బంధించిందని ఒప్పుకుంటాడు. ఈ స్వీయవిమర్శాత్మకతే పాత్రకు నైతిక విశ్వసనీయతను సమకూరుస్తుంది.
అనువాదకుడు కృష్ణుడు ఈ కావ్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చిన తీరు మూల భావానికి విధేయంగా ఉంటూనే తెలుగు పాఠకుడికి సన్నిహితంగా ఉంటూ, ఒక స్వతంత్ర రచనలా భాసిస్తుంది. ఆయన వాడిన భాష గ్రాంథిక గాంభీర్యాన్ని అనవసరంగా ఆశ్రయించదు. అదే సమయంలో సాధారణ వచనంలోకి జారిపోదు. చిన్న వాక్యాలు, సంబోధనలు, ప్రశ్నలు, విరామాలు కలిసి స్వగతానికి సహజ శ్వాసను అందిస్తాయి. “రాధా”, “రాధికా”, “విశ్వసించు”, “నిజం చెప్పనా” వంటి సంభాషణ సంకేతాలు పాఠకుడిని వక్తకు చేరువ చేస్తాయి.
అనువాదంలో ముఖ్యంగా గమనించవలసింది భావలయ పరిరక్షణ. శ్రీకృష్ణుని మాటలు ఒకే భావస్థాయిలో సాగవు. రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు భాషలో కఠినత్వం ఉంటుంది. బృందావనాన్ని తలచినప్పుడు మృదుత్వం వస్తుంది. ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో ఆగ్రహం, అపరాధ భావన కలుస్తాయి. కుబ్జ సందర్భంలో ప్రశ్నించే కరుణ వినిపిస్తుంది. రాధతో చమత్కరించే చోట అతడి మాటల్లో బాల్య చపలత్వం తిరిగి వస్తుంది. ఈ స్వర భేదాలను అనువాదకుడు సమానమైన పదసంపదలో కలిపివేయకుండా ఆయా సందర్భాలకు తగిన శబ్దగమనాన్ని అనుసరించారు.
“నిశ్శబ్దం స్వరమైనప్పుడు”, “శుష్క నయనాలు”, “మేఘాలు కప్పుకున్న ఎడారి”, “రాజనీతి చదరంగం”, “విధ్వంసపు చీకటిలో కాంతిరేఖ”, “మన సంవేదనలే సౌందర్యహీనం” వంటి పదబంధాలు తెలుగులో స్వతంత్ర కవితా జీవాన్ని పొందాయి. ఇవి మూల భావాన్ని తెలిపే వాక్యాలుగానే కాక, పాఠకుని మస్తిష్కంలో స్మృతిచిత్రాలుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా కఠినమైన తాత్త్విక విషయాలను అర్థంకాని పారిభాషిక పదజాలంలో కాక, అచ్చ తెలుగు సజీవ అక్షరదృశ్యాలలో పొదగడం వల్ల అనువాదం సార్థకమైంది.
అనువాదకుని పాత్ర కవిత్వ భాష మార్చడం వరకే పరిమితం కాలేదు. మూలంలోని స్వగత స్వరాన్ని తెలుగు వాక్యనిర్మాణంలో పునఃసృష్టించారు. శ్రీకృష్ణుడు స్వయంగా మాట్లాడుతున్నాడనే భావం నిరంతరం నిలిచేలా చూశారు. అందువల్ల పాఠకుడు అనువాదాన్ని చదువుతున్నాననే స్పృహ కంటే, ఒక అంతరంగ వాక్యప్రవాహాన్ని ఆలకిస్తున్నాననే అనుభూతి పొందుతాడు.
అయితే ఈ కావ్యాన్ని కేవలం రాధకు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రేమస్వగతంగా చదివితే దానిలోని వైశాల్యం ఊహకు ఆసాంతం అందదు. ఇది ప్రజలు దైవీకరించిన ఒక వ్యక్తి తన మానవత్వాన్ని తిరిగి పొందే దిశగా చేసే ప్రయాణం. రాజకీయ చరిత్ర మధ్య ప్రేమను కాపాడుకోవడం,యుద్ధభూమిలో కరుణను నిలుపుకోవడం, ధర్మగ్లాని జరిగినప్పుడు అవమానాన్ని, హింసను ప్రశ్నించడం, పురుషాధిక్య కథనంలో స్త్రీ స్వరాన్ని వినడం, అధికార పోరాటాల మధ్య తన అంతరాత్మను కోల్పోకపోవడం వంటి అనేక సందర్భాలను ఈ కవిత్వం తనదైన రీతిలో ప్రస్తావిస్తుంది.
రాధ ఈ ప్రయాణంలో శ్రీకృష్ణుడికి సమాధానాలు చెప్పే గురువు కాదు. అతడు సత్యశోధన చేసే సాన్నిధ్యం. ఆమె అతడి అంతరంగంలో ప్రతిష్ఠితమైన నైతిక దిక్సూచి. అతడిలో మిగిలిన ఆనంద బృందావనం. అతడి విజయాలను మానవ మూల్యంతో కొలిచే మాపదండం. అతడు ప్రపంచానికి ప్రబోధించిన ధర్మబోధ ఆవల అతడిని మానవుడిగా కాపాడిన మౌనచైతన్యం.
అందుకే ‘రాధికా, ఆలకించు!’ నిర్వచించే ప్రేమ కేవలం పొందడం కాదు. ఎదుటి వారిని సొంతం చేసుకుని తమలో బంధించడమూ కాదు. ఒక వ్యక్తిలో నిక్షిప్తమైన అపరిమితత్వాన్ని గుర్తించి, దానిని దశదిశలకు విస్తరించనివ్వడం.
రాధ శ్రీకృష్ణుని తనవాడిగా పరిమితం చేసుకోలేదు. అతడిని ప్రపంచానికి కానుక చేసింది. శ్రీకృష్ణుడు చివరకు రాధను తన స్మృతి పొరలలో దాచుకోలేదు. బ్రహ్మాండానికి సమర్పించాడు. ఈ పరస్పర సమర్పణలోనే కావ్యం తన పరిపూర్ణతను సాధించుకుంటుంది.
మాధవ్ కౌశిక్ పురాణాన్ని పునరుక్తి చేయలేదు. దాని నిశ్శబ్ద అంతరాళాల్లో దాగిన మానవ సందేహాలను, ప్రశ్నలను బహిర్గతం చేశారు.
అనువదిస్తూ కృష్ణుడు ఆ భావసంపదను తెలుగులోకి ప్రవహింపజేసి, దాని స్పందనను, స్వగత లయను, ఆలోచనా తీవ్రతను జాగ్రత్తగా కాపాడారు. కవి సృష్టించిన శ్రీకృష్ణుడు మనకు తెలిసిన దేవుడే అయినా మనం సంపూర్ణంగా ఎరుగని మనిషి. అనువాదకుడు అందించిన తెలుగు స్వరం ఆ మనిషి హృదయాన్ని, మౌనాన్ని కూడా మన అవగాహనకు చేరువ చేస్తుంది.
గ్రంథం ముగిసిన తరువాత పాఠకుడి మనసులో నిలిచేది రాధాకృష్ణుల వియోగవేదన మాత్రమే కాదు. ప్రతి ఘనకార్యం మాటున వినిపించని ఆవేదన, ప్రతి ధర్మవిజయం వెనుక సమాధానం లేని అనేక ప్రశ్నలు, మహానుభావుడిలో కూడా రక్షించవలసిన మానవుడు, ప్రతి ప్రేమ తన పరిధిని దాటి విశ్వవేదనను తాకగలదా అనే అంతర్ముఖ విచారణ.
ఆ ప్రశ్నలన్నింటికీ కావ్యం సమాధానాలు ఇవ్వదు. కానీ ప్రశ్నలను తప్పించుకోకుండా ఆలకించే మనసును పాఠకునిలో మేల్కొలుపుతుంది. అదే ‘రాధికా, ఆలకించు!’ సాధించిన అత్యున్నత సాహిత్య విజయం.
చివరగా ఈ కావ్యానికి కవి ఎంచుకున్న “ఆలకించు” అనే శీర్షిక కూడా ఎంతో అర్థగర్భితమైనది. వినడం చెవులకు సంబంధించిన క్రియ అయితే, ఆలకించడం హృదయానికి సంబంధించిన అనుభవం. అది పలికిన మాటలను మాత్రమే కాదు, వాటి మధ్య నిలిచిన నిశ్శబ్దాన్ని, వ్యక్తమైన భావాన్ని, దాచిపెట్టిన వేదనను కూడా గ్రహించగల అంతరంగ సిద్ధత. ఈ కావ్యంలో శ్రీకృష్ణుడు రాధతో మాట్లాడడు. సంపూర్ణంగా తననెరిగిన ఒక చైతన్యం ముందు తనను తాను ఆవిష్కరించుకుంటాడు.
ఈ స్వగతాన్ని కేవలం చదవడం గానీ, వినడం గానీ సరిపోదు. దానిని ఆలకించాలి. ఎందుకంటే ఈ కావ్యంలో పలుకులే కాదు, వాటి మధ్య నిలిచిన నిశ్శబ్దం కూడా అర్థవంతమైనది. శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా రాధ ప్రత్యుత్తరం వినిపించదు. అయినా ఆమె సాన్నిధ్యం ప్రతి వాక్యాన్నీ ఆవరించి ఉంటుంది. అదే ఈ కావ్యానికి హృదయం.
అందుకే కవి ఈ రచనకు ‘రాధికా, ఆలకించు!’ అనే శీర్షికను ఎన్నుకున్నారు. అది రాధను మాత్రమే ఉద్దేశించిన సంబోధన కాదు. మనిషి తన అంతరంగాన్ని, తన సంబంధాలను, తన కాలాన్ని, తన బాధ్యతను మరింత లోతుగా ఆలకించాలనే మేలుకొలుపు.
శ్రీకృష్ణుడు రాధను కోరినట్లే, ఈ కావ్యం కూడా ప్రతి పాఠకుని నుంచి అలాంటి ఆలకింపునే ఆశిస్తుంది. ఆ ఆలకింపు సంభవించిన క్షణంలో ఇది ఒక కావ్యంగా మాత్రమే మిగలదు. పాఠకుడి అంతరంగంలో నిశ్శబ్దంగా కొనసాగుతున్న సంభాషణగా రూపాంతరం చెందుతుంది. అదే ఈ కావ్యానికి, ఈ శీర్షికకు, ఈ అనువాదానికి లభించే నిజమైన సార్థకత.
***
మూలం: మాధవ్ కౌశిక్
అనువాదం: కృష్ణుడు
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 80
వెల: ₹ 75/
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ ప్రై. లి.
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ – 520004,
ఆంధ్రప్రదేశ్. ఫోన్: 0866-2436643
emescovja@gmail.com
sahithi.vja@gmail.com

