[శ్రీ జూకంటి జగన్నాథం రచించిన ‘రహదారి ఒక వాచకం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఒక సంవత్సరం తరువాత
ఆ రహదారి వెంట పోతుంటే
అనేక విషయీవిషయాలు
పాఠంలా బోధిస్తున్నాయి
అడ్డు వస్తున్నాయని
ప్రాణవాయువును దానం చేసే
పచ్చని మహా వృక్షాలను
దయ లేకుండా కొట్టేస్తున్నారు
ఎడారి గుండా
తడిలేని ప్రయాణం
పశుపక్షులకు నీడయోగ్యం కాని
గడ కొయ్యలా పెరిగిన మొక్కలు
మీద దుమ్ము పేరుకుపోయి
అద్దం ఊర్లు
కళతప్పి కనిపిస్తున్నాయి
రహదారి పక్క భూముల్లో
అమ్మే బోర్డులు వెలిసాయి
రోడ్డు వెంట నడుస్తుంటే
షోకిల్లా దుకాణాలు
రమ్మని పిలుస్తుంటాయి
మీకు నాలుగు వరుసల
రహదారి అంటే
హాయిగా ఉయ్యాల ఊగినట్టు
ప్రయాణం చేయడం
నాకు ఈ నల్లని దారి లో
కాటగలసిన కాలి బాటల
ముద్రలు కనిపిస్తాయి
అంతేగాదు నిరసనలు ధర్నాలు
ఎలుగెత్తిన నినాదాలు
మహా పాదయాత్రలో రైతుల
రక్తమోడిన పాదాలు
దర్శన భాగ్యం కలుగుతుంది
రైతు ఉద్యమాన్ని అణచ
రాజ్యం కవాతు ధ్వనిస్తుంది
దారిని నిర్మించిన కూలీల
ఆకలి దుక్కయాత్రా చరిత్ర
వాస్తవ గాథలు దొరుకుతాయి
కూడబలుక్కొని
చదువ గలిగితే
రహదారి ఒక వాచకం
4 Comments
గోపగాని రవీందర్
రహదారి విస్తరణ పనులతో కోల్పోయిన
దుర్భరమైన జీవితాన్ని దృశ్యమానం చేశారు సార్
అభినందనలు
విలాసాగరం రవీందర్
రహదారి వాచకమే సార్
మరింగంటి శ్రీకాంత్
దారులన్నీ జ్ఞాపకాలే….మననం చేసుకుంటూ పోతే మధుర భావాలు…..
-మరింగంటి శ్రీకాంత్….
పుట్టి నాగలక్ష్మి
అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలను పేదవారిగా మార్చిన చేదునిజం.చెట్లను నరికి ప్రకృతివినాశనానికి పునాదులు వేశాం.మంచి కవిత.