కొంతమంది ప్రతిభామూర్తుల గురించి చిన్నతనంనుంచే వింటూ ఆరాధన పెంచుకుంటాం. ఆ ఆసక్తి అన్వేషణగా మారాకా… హఠాత్తుగా ఆ వ్యక్తులు జీవితంలో తారసపడినప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. అదే నాకు అనుభవంలోకి వచ్చింది.


మా అమ్మ (పరిపూర్ణ) చిన్నప్పుడు మద్రాసులో దరిశి చెంచయ్యగారింట్లో చదువుకుంటున్న రోజుల్లో మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో రజనీకాంతరావుగారి పరిచయం… ఆమెని ఓ రేడియో కళాకారిణిగా మార్చింది. ‘ఎన్నెన్నో కార్యక్రమాలూ సంగీతభరితమైన నాటకాల్లో పాడలు పాడించి ఎంతగానో ప్రోత్సహించేవారూ… నన్ను సానబెట్టారు…’ అని మాకు కథలు కథలుగా చెబుతూండేది అమ్మ.
అమ్మ పాటలు వింటూ పెరగడం వల్ల రజనీగారి సంగీతం, సాహిత్యం మాకు చాలా సన్నిహితమయ్యాయి. “ఓ విభావరీ నీహార హీర నీలాంబర ధారిణీ మనోహారిణీ” వింటుంటే ఎవరీ సంగీత రసజ్ఞుడు…? ఇన్ని ప్రక్రియల్లో ప్రజ్ఞావంతుడు? ఎవరు… ఎవరు…? అనే జిజ్ఞాస మొదలయింది. అదో సంచలనం. ఆయన సంగీతం సమకూర్చిన సినిమా పాటల గురించి విని సంతోషపడేదాన్ని. ఆయన్ని ‘రజనీ’ అనే ఎందుకు పిలుస్తారు అని కొంటెగా ప్రశ్నించేదాన్ని. ఆ అజ్ఞాతమైన పరిచయం ముందు ముందు నాకు నిజమైన పరిచయంగా మారుతుందని ఊహించలేదు నేను.


ఆ తర్వాత కాలం వేగంగా సాగింది. మా స్నేహితులు స్థాపించిన ఆలంబనకి ఓ మంచి అవకాశం అచ్చింది. అదేలాగో కొంచెం వివరిస్తాను. హేమచంద్ర గారిని ప్రసన్న కుమార్ ఇంట్లో కలవడం… రజనీకాంతరావు గారు వారి చిన్న కొడుకు ఇంట్లో హైదరాబాద్లో ఉన్నారని తెలియడం… నేనా కబురు అమ్మకి చేరవేయడం జరిగింది. “ఆయన నాకు గురువు… ఆయనని కలిసి సముచితంగా సన్మానించుకోవడం గొప్ప స్మృతి. నాకు ఓ పెద్ద కోరిక” అని అమ్మ అనడంతో మేం ఆలంబన తరపున ఓ సాంస్కృతిక కార్యక్రమానికి రూపుదిద్దేశాం.
రజనీగారిని కలిసి ఆహ్వానించేందుకు నేనూ, ప్రసన్నా, హేమచంద్ర గారూ వెళ్ళాం. “మద్రాసు… పరిపూర్ణ…” అని జ్ఞాపకం చేయగానే, ఆయన “తెలుగు, తెలుసు” అని ఆనాటి విషయాలు, విశేషాలూ పునశ్చరణ చేసుకున్నారు. వారి జ్ఞాపకశక్తి ఎంత అమోఘమో అప్పుడు అర్థమయింది.


ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వారి చిన్నబ్బాయి ఇంట్లో అందరం కలిసి ఆయన జ్ఞాపకాలనీ, అనుభవాలనీ కలబోసుకున్నాం. ఆయనకి నచ్చిన సైగల్ పాటలని ప్రసన్నకుమార్ హార్మోనియమ్తో పాటు పాడి వినిపించారు. మా మిత్రబృందానికి మంచి వారధి సంగీతమే. వారి సమక్షంలో పాటల కార్యక్రమపు కొనసాగింపు మొన్న మొన్నటి వరకూ సాగుతూనే ఉంది.
ఇదంతా మా జీవితాలలో పన్నెండేళ్ళ క్రిత్తం మొదలయిన ఒక చక్కని అధ్యాయం. ప్రసూన, హేమచంద్ర గారి కుటుంబమంతా సంగీత సాహితీ ప్రియులు. స్నేహానికి విలువిచ్చే సంస్కార మూర్తులు. వారి ఆధ్వర్యంలో మా బృందంలో ప్రసన్న కుమార్ సర్రాజువీ, అమరేంద్రవీ, నావీ ఇంకొంతమంది మిత్రులవీ పుస్తక పరిచయాలూ, ఆ తర్వాత సంగీత సంబరాలు జరుగుతూండడం మామూలైపోయింది. ఓపికగా, శ్రద్ధగా అన్నీ గమనిస్తూ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలీ, కళానిధీ మాతో పాటుగా ఎంతసేపయినా అలా కూర్చునుండిపోయేవారు. ఒకనాటి శక్తివంతుడైన సంగీత చక్రవర్తినీ, సాహితీ కోవిదుడినీ ఇంకోక రకంగా చూడడం బాధాకరమే అయినా కాలానికి తలవంచక తప్పదు కదా! అన్ని సంవత్సరాలు ఆయన సంరక్షకులుగా ఉంటూ కాపాడుకున్న ప్రసూనా హేమచంద్రగార్లూ, వారి బంధువర్గం… అభిమానులందరికీ రజనీకాంతరావుగారిని దర్శనీయంగా విజయవాడ వెళ్ళిన స్నేహితులకి అదొక ముఖ్యమైన అంశంగా చేశారు.
అనేక రకాల సంగీత సమ్మేళనాలతో కొత్త ఒరవడి సృష్టించి… ఒక తరానికి ప్రతినిధిగా తర్వాత తరాలకి గొప్ప సృష్టికర్తగా జీవించిన రజనీగారి గురించి జ్ఞాపకాలు పంచుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నాను (వారి సంగీతపు అంచులని తాకి ఆ విశిష్టతని వివరించేటంత విజ్ఞానం నాకు లేదే అని విచారంగా ఉంది).
సంగీత ప్రపంచాన్ని అందంగా, స్నిగ్ధంగా, నాజూకుగా సంప్రదాయ రీతుల్ని పాటిస్తునే ఉన్నతంగా తీర్చిదిద్దిన…
ఆ సజీవమూర్తికి నా హృదయమంతా నిండిన నివాళి.

దాసరి శిరీష కథా, నవలా రచయిత్రి. వీరి కథలు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘మనోవీథి’, ”కొత్త స్వరాలు’ అనే కథా సంపుటాలు, ‘దూరతీరాలు’ అనే నవల వెలువరించారు.
3 Comments
Rekha Singh
Madam meeru Amerendra Dasari gari chellelu kadaa ?? vyasam bagundi abhinamdanalu
Anil అట్లూరి
She is his elder sister.
Anil Prasad Lingam
Manchi Samsmarana