[శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం గారి ‘రక్షాబంధం’ అనే చారిత్రక పద్యనాటకాన్ని సమీక్షిస్తున్నారు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి.]
ఆధునిక యుగంలో అవతరించిన ఆంధ్ర సాహితీ ప్రక్రియలలో ఉదాత్తమైన ప్రక్రియ నాటకం. జాతీయోద్యమకాలంలో దేశస్వాతంత్ర్య కాంక్షను జనులు హృదయాలలో పాదుకొల్పటంలోనూ, సామాజిక రుగ్మతలను రూపుమాపి జాతిని జాగృతం కావించటంలోనూ నాటక ప్రక్రియ అందించిన ప్రేరణ, కలిగించిన ప్రభావం అనితర సాధ్యం. “Drama is the most rigorous form of literary Art” – అని హడ్సన్ తదితరులైన విమర్శకులు అనేకులు పేర్కొన్నారు.
తెలుగులో నాటక ప్రక్రియ ఎన్నెన్నో పుంతలు తొక్కింది. ఆరంభం నుండి నేటి వరకు చారిత్రక, పౌరాణిక, సామాజికేతివృత్తాలతో నిర్మింపబడిన అనువాద, స్వతంత్ర నాటకాలు సాహిత్యావరణంలో మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. సాంస్కృతికమైన విలువలను, సనాతన ధర్మాలను, మానవ సంబంధాలను ప్రతిబింబించే నాటకాలు ఆదరింపబడుతున్నాయి. ఇతివృత్తం ఏదైనా నాటక రచనలో కవి ప్రతిభ, తాను బోధింపదలచిన సందేశం శక్తిమంతంగా అందించిన తీరుతెన్నులు నాటకానికి జీవం పోస్తున్నాయి.
దేశభక్తిని, భారతీయ సాంస్కృతిక ధర్మాలను, మానవత్వపు విలువలను బహుముఖీనంగా ప్రతిఫలింప చేస్తూ రచింపబడిన నేటి మేటి నాటకాలలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కార గ్రహీత శ్రీ చిటిప్రోలు వేంకటరత్నంగారు రచించిన ‘రక్షాబంధం’ చారిత్రక నాటకం పేర్కొనదగినది. అపరిచిత యువతి చేత రక్షాబంధ నిబద్ధుడై, ఆమె క్షేమం కోసం మహాత్యాగం చేసిన పురుషోత్తమ చక్రవర్తి పరమోజ్జ్వల గాథ ఈ నాటకేతివృత్తం.
నాటక కర్త వేంకట రత్నం గారి తండ్రి కవిరాజశేఖర, కవిసుధాకర బిరుదాంకితులైన కీర్తిశేషులు శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తిగారు రచించిన ‘పురుషోత్తముడు’ చారిత్రక కావ్యానికి ‘రక్షాబంధం’ నాటకీకరణం. 2008వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించిన పద్యకావ్యం ‘పురుషోత్తముడు’.
దేశకాలబద్ధమైన వ్యక్తి చరిత్రను ఆధారం చేసికొని కళాదృష్టితో, శిల్ప చమత్కారంతో శాశ్వత ధర్మాన్ని, సనాతన సత్యాన్ని నిరూపించగలిగినది, బోధింపగలిగినది చారిత్రక కావ్యం. పురుషోత్తముడు పేరుకు తగినట్లుగానే ఉత్తమ గుణ సంపన్నుడు. దేశభక్తి ప్రపూర్ణుడు. జగజ్జేత కావాలనే దురాశతో యవనరాజు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి వచ్చినప్పుడు తన మహోన్నత వ్యక్తిత్వంతో అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించి గౌరవించిన మహోదారుడు పురుషోత్తముడు.
భారతదేశం మహోత్కృష్టమైన సంప్రదాయాలకు, ధర్మనిష్ఠకు నెలవు. భారతదేశంపై దండెత్తి వచ్చిన అలెగ్జాండర్‌ను ప్రేమించిన ఇరాను రాకుమార్తె రుక్సానా భారతీయుల సోదరీసోదరుల అనుబంధాన్ని ఆలంబనంగా చేసికొని అలెగ్జాండరును రక్షించుకొని పతిగా పొందింది. పురుషోత్తమునికి, అలెగ్జాండరుకు నడుమ సమరం ప్రారంభం కాబోతున్న తరుణంలో రుక్సానా సమమోచిత ప్రజ్ఞతో పురుషోత్తమునికి రక్షాబంధనం చేసి అన్నా! అని పిలిచింది. ఆ పిలుపునకు కట్టుబడిన పురుషోత్తముడు సమర రంగంలో అలెగ్జాండరు తన చేతికి చిక్కినా సంహరింపక ధర్మాచరణకు కట్టుబడినాడు. భారతీయ సంస్కృతి వైభవాన్ని అలెగ్జాండరుకు వివరించి రుక్సానాను అతడికి కానుకగా అందించి మహావీరుడైనాడు. యుద్ధ సందర్భాలలో తాను ఇచ్చిన మాట కోసం కన్న కుమారుడు అమరసింహుడు అమర లోకం చేరుకున్నప్పటికీ చలించని ధీరుడు పురుషోత్తముడు. ఎనిమిది ఖండాల ఈ పద్యకావ్యాన్ని ఏడు అంకాల రసవత్తరమైన దృశ్యకావ్యంగా మలచారు వేంకటరత్నం.
“శిక్షితధూర్త వివక్షుని
రక్షిత శరణాగతార్తురాజేశ్వరునిన్
రక్షాబంధ నిబంధిత
దక్షిణహస్తుని నొనర్చి తన్వి యెలర్చెన్”
– పురుషోత్తముడు 4-24
ఈ పద్యంలో కృష్ణమూర్తిగారు ప్రయోగించిన ‘రక్షాబంధ’ పదాన్ని నాటకానికి పేరుగా స్వీకరించారు నాటకకర్త.
పురుషోత్తమునికి రుక్సానా రాఖీ కట్టిన సన్నివేశం కథాగమనంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కనుక నాటకానికి ‘రక్షాబంధం’ నామకరణం సార్థకమైనది. కావ్యంలోని కొన్ని పద్యాలను యథాతథంగా నాటకంలో స్వీకరించారు రచయిత. తమ తండ్రి గారి రచనాశైలిని పాఠకులకు చక్కగా పరిచయం చేశారు.
నాటకానువాదంలో నాటక లక్షణాలు సందర్భోచితంగా పాటింపబడ్డాయి. ‘ఆశీర్నమస్ర్కియావస్తు నిర్దేశోవాఽపి తన్ముఖమ్’ అని నాటకంలో నాందీ ప్రస్తావన లక్షణాలను నిర్వచించింది అలంకారశాస్త్రం. నాటక ప్రారంభంలోని నాందీ ప్రస్తావనలు ఆశీస్సు రూపంలో కాని, నమస్ర్కియారూపంలో కాని, నాటక వస్తు నిర్దేశ రూపంలో కాని ఉండవచ్చు. ఈ నాటకం నాందీ పద్యంలో ధర్మసంరక్షణ, ఆర్తరక్షణ, సత్యాలాపన ఇత్యాది సద్గుణోన్నతులైన భారతీయులను, ఈ నాటకంలో కథానాయకుడు జీరోదాత్తుడైన పురుషోత్తముని గుణ గరిష్టతను సూచించారు రచయిత. ప్రస్తావనలో సోదరీ సోదరుల సంభాషణ రూపంలో రాఖీ పర్వదినం ప్రత్యేకత, రుక్సానా పురుషోత్తమునికి రాఖీకట్టిన ఉదంతం ఇత్యాది అంశాలు ప్రస్తావింపబడ్డాయి. వస్తునిర్దేశ రూపమైన నాందీ ప్రస్తావనలు ప్రేక్షకులను నాటక దర్శనోన్ముఖులను గావించటానికి దోహదం చేశాయి.
నాటకంలోని ప్రతి అంకమూ, ప్రతిరంగమూ పాత్రల స్వభావ చిత్రణంతో, కథాగమనానికి అనువైన సన్నివేశాలతో వస్తు నిర్వహణ గమ్యం దిశగా సాగినప్పుడే నాటకం రససిద్ధిని కలిగిస్తుంది. ఇతఃపూర్వమే ‘అశోకపథం’ చారిత్రక నాటక రచనకు విశ్వవిద్యాలయ పురస్కారం స్వీకరించిన వెంకటరత్నం నాటక రచనలో, అందునా చారిత్రక నాటక రచనలో అందెవేసిన చేయిగా ఈ నాటకం నిరూపిస్తుంది.
నాటకం సంభాషణాత్మకం. సంభాషణలు నాటకీయతను పండించే మూలసూత్రాలు. అవి సందర్భోచితంగా, వ్యంగ్య విలసితంగా, ధ్వనిగర్భితంగా కూర్చబడినప్పుడు నాటకం ప్రదర్శనయోగ్యమై రాణిస్తుంది. శ్రవ్యకావ్యాలలో పద్యాలను మరల మరల చదువుకొని రసాస్వాదనం పొందవచ్చు. ప్రదర్శన కళ అయిన నాటకంలో సంభాషణలు సరళశైలిలో, విన్నవెంటనే ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొనే రీతిలో సాగవలసి ఉంటుంది. భాషానుడికారంతో, సులభతర పద విన్యాసంతో దృశ్యకావ్యంలో సంవాదాలు రచింపబడటం అత్యంతావశ్యకం. ‘రక్షాబంధం’ నాటకంలోని సంభాషణలలో రచయిత ఈ సూత్రాన్ని ప్రభావవంతంగా అనుసరించారు.
ప్రథమాంకంలోని ‘అంభి, ప్రార్థన’ సోదరీసోదరుల సంభాషణ దృశ్యం దీనికి ఒక మచ్చుతునక. సోదరుడైన అంభి తన స్వార్థం కోసం శత్రురాజైన అలెగ్జాండర్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నప్పుడు సోదరి ప్రార్థన తన అన్నగారిని ఆక్షేపిస్తుంది. మాతృభూమికి ద్రోహం తలపెట్టవద్దని, శత్రువు దండెత్తినప్పుడు భరతభూమిలోని రాజులందరు ఐకమత్యంతో పోరాడవలసి ఉన్నదని హితవు పలికింది. అంభి తన నిర్ణయాన్ని నిష్కర్షగా వెల్లడించాడు. ఆ సందర్భంలో ‘పురుషోత్తముడు’ కావ్యంలో కృష్ణమూర్తిగారు ఈవిధంగా ప్రార్థన చేత పలికించారు. మూడు పద్యాలలో ప్రార్థన పలుకులలో దేశభక్తిని, మాతృభక్తిని సమన్వయ రూపంగా చెప్పించారు.
“తనతల్లిన్ జెఱవట్ట నొక్కడెవడోదైత్యోద్యమంబూనిపై
కొనియేతెంచుట గన్నులన్ గనియుశక్తుల్ యుక్తులేపార మా
ర్కొని మాయింపగబోక నీచతుకునీరుంబోయుచున్ జీమ కు
ట్టినయట్లైనను నొచ్చుకోనిమగబిడ్డన్ గంటి నీ నాటికిన్.”
– పురుషోత్తముడు. 2-111 ప.
ఈ సన్నివేశంలోని మూడు పద్యాల సారాంశాన్ని వెంకటరత్నంగారు అత్యంత శక్తిమంతంగా వచనరూపంలోనికి తర్జుమా చేశారు.
“ఒకదుష్టుడు తల్లిని చెరబట్టటానికి రావడం కళ్ళారా చూస్తూ కూడా నీచాలోచనతో కాలక్షేపం చేస్తూ చీమకుట్టినట్లైనా లేని మగబిడ్డను ఈనాటికి చూస్తున్నాను. హుఁ – అచంచల శౌర్య ధైర్య సాగరులై. రణ విద్యాదురంధరులై, అసమ యశస్తేజ స్వంతులైన పుత్రులు పుట్టిన భారతమాత పవిత్ర గర్భంలో ఇలాంటి పుత్రులు పుట్టారు. ఏమి దౌర్భాగ్యమో.” (ప్రథమాంకం. 16పు.)
పద్యాలలోని భావం ప్రేక్షకుల హృదయాలలోనికి సూటిగా చొచ్చుకొని పోయింది. ప్రతి వ్యక్తి గుండెలో దేశభక్తిని రగిలించే రీతిలో సంభాషణ సాగింది. నాటక ప్రయోజనం దిశగా కథను నిర్వహించటానికి ప్రేరకమైన ఈ ప్రారంభ సన్నివేశం ఉద్వేగభరితంగా కూర్చబడింది. ఔచిత్య భరితమైన సంభాషణ రచనతో నాటకం ప్రదర్శన పటిమను సాధించుకున్నది. దేశప్రగతి సాధన కోసం స్త్రీలు సైతం సాహసంతో ముందుకు ఉరకవలసిన ఆవశ్యకతను బోధించింది. ఆనాటి జాతీయోద్యమంలో ఎందరో స్త్రీలు మహాత్మాగాంధీ పిలుపునందుకొని ఉద్యమానికి చేయూత నందించిన ఉదంతాలను స్మరింపచేసింది.
నాటకంలో రంగస్థలంపై ప్రదర్శన యోగ్యం కాని కథాంశాలను ప్రేక్షకులకు సూచించే విధానాలను అర్థోపక్షేపకాలుగా ఆలంకారికులు పేర్కొన్నారు.
“విష్కంభశ్చూలికాచైవ తథాచైవ ప్రవేశకః
అంకావతారో అంకముఖ మర్థోప క్షేప పంచకమ్”
-నాట్యశాస్త్రం, భరతుడు. 21-107
1.విష్కంభం, 2. చూళిక, 3. ప్రవేశకం, 4. అంకాస్యం, 5. అంకావతారం ఇవి అర్థోపక్షేపకాలు. అంక ప్రారంభంలో కాని అంకాంతంలో కాని ఇవి ప్రయోగింపబడతాయి.
‘రక్షాబంధం’ నాటకంలో రచయిత గేయరచనతో ఈ ప్రయోజనాన్ని సాధించారు. ప్రథమాంకాంతంలో ప్రార్థన తన అన్నగారి స్వార్థపరత్వాన్ని ధిక్కరించి తాను ఎంచుకున్న మార్గంలో తాను వెళ్ళటానికి నిశ్చయించుకొని నిష్ర్కమించింది. ఆమె ఆలోచన ప్రేక్షకులకు అర్థం కాకపోతే తరువాతి కథాంశాలు అర్థం కావు. ప్రయాణం రంగస్థలంపై ప్రదర్శనకు నిషిద్ధం. ఈ రెండు ప్రయోజనాలను నెరవేర్చటానికి నేపథ్యం నుండి గేయం వినిపింప చేశారు.
“దేశహితాచరణాశయుణ్ణి చే
రేందుకేగింది చెల్లి
పరరాజ్యరమాహరణలాలసుడి
వద్దకు కదిలాడన్న” – ప్రథమాంకం పుట. 19
ఇలా సాగిన గేయం అన్నాచెల్లెళ్ళ సహజ ప్రకృతులను వ్యక్తం చేసింది. తరువాతి సన్నివేశానికి ప్రేక్షకులను ఉన్ముఖులను చేసింది. దీన్ని చూళిక అనే అర్థోపక్షేపకంగా పేర్కొనవచ్చు.
పంచమాంకం ప్రారంభంలో అలెగ్జాండరు సైనికులు జీలం నదిని దాటుతున్న సన్నివేశంలోనూ, సప్తమాంకం రెండోరంగం చివరలోనూ, ఐదోరంగం ప్రారంభంలోనూ నేపథ్య గీతాల ద్వారా కథాంశాలు వర్ణింపబడ్డాయి. రచయిత వెంకటరత్నం గేయరచనలో సిద్ధహస్తులు. ‘అమ్మకథ’ పేరుతో క్యాథరిన్ స్పింక్ ఆంగ్లంలో రచించిన మదర్ థెరిసా జీవితగాథను గేయరూపంలో తెలుగులో అనువదించారు. ‘రక్షాబంధం’లోని గేయాలు నాటక రచనాకళకు స్వారస్యం చేకూర్చాయి.
సత్యవ్రతాచరణలో భాగంగా రక్షాబంధానికి నిబద్ధుడైన పురుషోత్తమ చక్రవర్తి పాత్ర చిత్రణ తరతరాలకు దేశభక్తిని ప్రబోధించే రీతిలో చేయబడింది.
“నిజమైన ప్రజాభిమానం నిరంకుశత్వంతో రాదు. భుజబలం కూడ దుర్మార్గ నిర్మూలనకుపయోగ పడినప్పుడే సార్థకమవుతుంది. విశ్వ శ్రేయోభిలాషుల మెప్పులంది ధన్యత కలిగిస్తుంది” (సప్తమాంకం. 110 పు.) అని సమరరంగంలో పురుషోత్తముడు అలెగ్జాండరుకు చేసిన హితబోధ సార్వకాలికమైన సందేశంగా, నాటక ప్రయోజనాన్ని సమర్థంగా సాధించింది.
కరుణశ్రీ, జాషువా, తుమ్మల, ఏటుకూరి, రాయప్రోలు, విశ్వనాథ ప్రభృతులైన ఆధునిక సుప్రసిద్ధ పద్యకవులు భారత జాతీయోద్యమ స్ఫూర్తిని తమ రచనల ద్వారా జనులలో పాదుకొల్పినవారు. ఆంధ్రుల ఆత్మాభిమానానికి అద్దం పట్టారు. ఆ కోవలో చారిత్రక ఇతివృత్తంతో దేశభక్తిని, సాంస్కృతిక వైభవాన్ని రంగరించి కృష్ణమూర్తిగారు వెలయించిన పద్యకావ్యం ‘పురుషోత్తముడు’. దానిలోని జాతీయతను తిరిగి నేడు మననం చేసికోవలసిన ఆవశ్యకత తెలుగువారికి ఉన్నది. ఆ పరమ ప్రయోజనాన్ని చక్కగా నిర్వర్తించింది ‘రక్షాబంధం’ నాటకం. ఇది వేదికలపై ప్రదర్శింపబడి నాటకాభిమానుల మన్ననలను పొందింది. తండ్రిగారు అందించిన సిద్ధాన్నం వంటి కావ్యేతివృత్తాన్ని ఒకింత వాఙ్మయరూప పితృసేవగా భావించి పితృఋణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు వెంకటరత్నం.
***


చిటిప్రోలు వేంకటరత్నం
పుటలు : 113, వెల. రూ.165/-
ప్రాప్తిస్ధానం : 401, మహతి టవర్స్,
బరిస్తా హోటల్ ప్రక్క రోడ్,
ఇన్నర్ రింగ్‌రోడ్, గుంటూరు.
చరవాణి : 77023 58616