రామాయణం ఆధారంగా రచించిన, మనదైన సంస్కృతి తాలూకు మధుర పరిమళం పరచుకున్న కథలు కొన్నిటిని ఎంపిక చేసి ‘రామకథాసుధ’ కథాసంకలనంలో పొందుపరచారు ముగ్గురు సాహితీవేత్తలు- కస్తూరి మురళీ కృష్ణ గారు, కోడిహళ్ళి మురళీమోహన్ గారు, కొల్లూరి సోమశంకర్ గారు.
ఒక రచయిత సృజించిన పాత్రను ఆధారం చేసుకుని కాల్పనిక రచన చేసేటప్పుడు మూల రచయిత సృజనను దెబ్బతీస్తూ విరుద్ధమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే పాత్రలతో పునఃసృజించిన కథలను కాకుండా వాల్మీకి రామాయణ స్ఫూర్తికి దగ్గరగా ఉన్న కథలనే ఎంపిక చేసి ప్రచురించారు సంపాదకులు.
కాల్పనిక కథ అయినా చరిత్ర అయినా, చదివే పాఠకులు ఆ కాలపు సమాజ వ్యవస్థ ఎలా ఉందో, ఆనాటి సామాజిక నిబంధనలూ, విలువలూ ఎలాంటివో వాటిననుసరించి ఆయా వ్యక్తుల/పాత్రల వ్యక్తిత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. డెబ్బై ఏళ్ల క్రితం రాసిన రాజ్యాంగానికే మనం ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకోవలసివచ్చింది. రెండువేల సంవత్సరాలకి ముందు సృజించబడిన రామాయణాన్ని ఈనాటి దృష్టికోణంతో విశ్లేషించి, విమర్శించే సాహితీ వాతావరణంలో మనమున్నాం. ఈ నేపథ్యంలో రామకథాసుధ సంకలనం చదువుతుంటే నాకొక చల్లని సాహితీవనంలో సేద తీరుతున్న అనుభూతి కలిగింది.
ఇందులో 28 కథలున్నాయి. కథాక్రమం రామాయణం కథ జరిగిన క్రమంలోనే కనిపిస్తుంది. అన్ని కథలూ చదివాను. అన్నిటా రామాయణ రమణీయత పరిఢవిల్లుతూ ఉంది. ప్రత్యేకించి ఒక కథ నా కౌమారపు ఒక జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చింది.
నేను బడిలో చదువుకుంటున్న రోజుల్లో ఒక రోజు నా మిత్రురాళ్లు కొందరు నాతో పాటు బస్సెక్కి మా ఇంటికి వచ్చారు. ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య మా ఇల్లు ఒకటే ఉండేది. నాన్నగారు వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకుని మెరకపొలాలు సాగుచేస్తున్న రైతు. ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదివిన విజ్ఞాని. మా తోట చూడాలని నాతో వచ్చిన మిత్రులందరినీ అమ్మా మామ్మా ఇంట్లోకి ఆహ్వానించి ఫలహారాలూ పానీయాలూ ఇచ్చాక, నాన్నగారు కూడా మాతో కూర్చుని సంభాషణ సాగించారు.
చక్కని సంభాషణా చాతుర్యమూ, విస్తృతమైన పఠనానుభవమూ, జీవితానుభవమూ ఉన్న నాన్నగారు మాట్లాడుతుంటే సమయం తెలియసేది కాదు. పిల్లలు తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు సంభాషణలో చొప్పించి ఆసక్తికరంగా చెప్తూ ఉండేవారు.నాన్నగారితో కబుర్లంటే మాకెంతో ఇష్టంగా ఉండేది. ఆ రోజు కూడా అలాగే సరదాగా ప్రశ్నలేవో వేస్తూ నవ్విస్తూ మాట్లాడుతూండగా చాలాసేపు గడిచింది. నాకు లోలోపల బెరుకుగా ఉంది, ‘నాగలక్ష్మీ వాళ్ళ తోట చూద్దామని వెళ్తే, వాళ్ళ నాన్నగారు ఎక్కడెక్కడి విషయాలో చెప్తూ బోర్ కొట్టించేశారు’ అని నా స్నేహితులు అనుకుంటారేమో అని. ఏమైనా అనాలంటే నాన్నగారిని అగౌరవపరచినట్టు అవుతుందేమో అని మరోవైపు సంకోచం.
కొంతసేపయాక ధైర్యం చేసి “మా నాన్నగారలా ఏవేవో చెప్తూనే ఉంటారు. మీకు విసుగుపుడుతుందేమో! మీరు తోట చూడాలని కదా వచ్చారు? వెడదామా?” అనడిగాను.
వెంటనే అమ్మ “అదేంటమ్మా అలా అన్నావు? నాన్నగారు ఎంతో ఆసక్తి కలిగేలా చెప్తుంటే, నీకు విసుగ్గా ఉందా? మీ ఫ్రెండ్స్ చూడు, ఎంత శ్రద్ధగా వింటున్నారో?” అంది.
అపుడు నాన్నగారు అమ్మతో, “లేదు పార్వతీ! మనకిలా అనిపించచ్చు గాని వాళ్లకి లోలోపల విసుగు పుట్టినా మర్యాద కోసం బలవంతాన కూర్చుని ఉండచ్చు కదా. తీరా చేసి రోజంతా గడిచిపోయాక రేపు మళ్ళీ కలుసుకున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చినా చేయగలిగింది ఉండదు. ఇపుడు మనమ్మాయే అలా అడగడం వల్ల, వాళ్లకి నచ్చినది ఎన్నుకునే చాయిస్ ఇచ్చినట్టవుతుంది.” అన్నారు.
నా స్నేహితురాళ్లంతా “అంకుల్ చెప్తున్నదంతా మాకెంతో నచ్చింది. ఇంకొంచెం సేపు వినాలనుంది. తోటకి కాసేపాగి వెళదాం” అన్నారు. నా ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకున్న నాన్నగారి పట్ల ఆ క్షణంలో నాకెంతో గౌరవం అనిపించింది. చిన్ననాటి ఆ సంఘటన నా మనసులో స్పష్టంగా గుర్తుండి పోయింది.
ఇపుడు రామకథాసుధ సంకలనం చదివినవారికి, నాకీ బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసిన ఆ కథ పేరు వేరే చెప్పక్కర్లేదు. అయినా చెప్తాను. ఆ కథ కస్తూరి మురళి కృష్ణ గారి ‘ప్రేమాగ్ని పరీక్ష’. మిగిలిన కథలన్నీ కూడా ఏర్చి కూర్చిన ఆణిముత్యాలే. మృష్టాన్నం తినబోయే వారికి రుచులు చెప్పడం అనవసరం. మీరే ఆస్వాదించి తెలుసుకుంటారుగా! ఈ చక్కని పుస్తకానికి రూపకల్పన చేసిన సంపాదకులకూ, తమ కథలతో ఈ పుస్తకాన్ని పరిపుష్టం చేసిన రచయితలకూ నా అభినందనలు.
***
రామకథాసుధ (కథా సంకలనం) సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్ సంచిక – సాహితి ప్రచురణ పేజీలు: 215 వెల: 175/- ప్రతులకు: సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890 ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha
వారణాసి నాగలక్ష్మి పేరుమోసిన కథారచయిత్రి, కవి, గేయ రచయిత్రి. చిత్రలేఖనంలోనూ విశేష నైపుణ్యం ఉంది. ఆలంబన, ఆసరా, వేకువపాట, శిశిర సుమాలు వీరి కథా సంపుటాలు. బోలతీ తస్వీర్ హిందీ అనువాద కథల సంపుటి. ‘కలవరాలూ కలరవాలూ’ కవితా సంపుటి. వాన చినుకులు లలిత గీత మాలిక, ఊర్వశి నృత్య నాటిక వీరి ఇతర పుస్తకాలు. వీటిలో ‘వానచినుకులు’ పుస్తకానికి తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం లభించింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రాంతీయ దర్శనం -16: రాజస్థానీ – నేడు
సంచిక – పద ప్రతిభ – 109
కరనాగభూతం కథలు – 15 దోపిడి దొర
ప్రకృతి చర్య ప్రశ్నార్థకమే!
కలవల కబుర్లు-36
దుష్టచతుష్టయం
మహాభారత కథలు-8: నాగజాతి పుట్టిన విధానం
కావేవీ అనర్హం అని నిరూపించే పుస్తకం ‘మృగయాపురి’
అమెరికా ముచ్చట్లు-9
ఏం మాయ చేశావే
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®