ఫేస్బుక్ తెరిస్తే చాలు ‘రంగమార్తాండ’ అన్న సినిమాను పొగడ్తున్న పోస్టులు కనబడుతూంటే ఆ సినిమా గురించి ఆసక్తి కలిగింది. అయితే, తెలుగు సినిమాకు మాతృక మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ అనీ, ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫారం అయిన అమేజాన్ ప్రైమ్‌లో వుందని తెలిసింది. వెంటనే వీలు చూసుకుని మరాఠీ సినిమాను చూశాను. నానాపాటేకర్ తనకలవాటయిన రీతిలో వీలయినంత ఓవర్ యాక్షన్ చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా అనిపించాయి. అయితే, స్క్రీన్ ప్లేలో పెద్ద లోపం సినిమాలో సంభాషణలు సంఘటనలను డామినేట్ చేయటం. సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవారికి ఒక సలహా ఇస్తారు. కథలో ఉపన్యాసాలుండకూడదు. చెప్పదలచుకున్నది కథలో చొప్పించినట్టు ఉపన్యాసాల రూపంలోవుంటే కథనం దెబ్బతింటుంది. కాబట్టి చెప్పాల్సినదాన్ని సంఘటనలలో చెప్పాలి అని సలహాలిస్తారు. ఈ సలహా ‘నటసామ్రాట్’ దర్శకుడికీ వర్తిస్తుంది. ఎంత నాటకానికి సంబంధించిన సినిమా అయినా అతి సంభాషణలు సినిమాని దెబ్బతీశాయనిపించింది. కొన్ని దృశ్యాలలో సంభాషణలు అసహజంగా చొప్పించినట్టు అనిపించి విసుగు కలిగింది. అదీకాక, సినిమా ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. చిన్నప్పుడు చూసిన ధర్మదాత, బడిపంతులు నుంచి మొన్న మొన్నటి బాఘ్బన్ వరకూ, అంతకుముందరి, అవతార్, అమృత్, శంకరాభరణం వంటి అనేకానేక సినిమాలు గుర్తుకువచ్చాయి. ఏ దృశ్యం కూడా కొత్తగా అనిపించలేదు. పిల్లకు తాత చెడు నేర్పుతున్నాడన్న ఆవేదన నుంచి, డబ్బు దొంగతనం అంటగట్టటం వరకూ, ‘తాత మనవడు’తో సహా అనేకానేక సినిమాలు మనసులో మెదిలాయి. అందుకేనేమో బహుశా నాకు ‘నటసామ్రాట్’ అంతగా నచ్చలేదు.


‘నటసామ్రాట్’ చూసిన తరువాత ప్రైం వాడు, ఈ సినిమా చూశావు కాబట్టి నీకు ఈ సినిమాలూ నచ్చవచ్చు అని కొన్ని సినిమాల బొమ్మలు చూపించాడు. వాటిల్లో అన్నిటికన్నా ముందు కనిపించిన ‘బాలగంధర్వ’ అన్న సినిమా బొమ్మ ఆకర్షించింది. బాలగంధర్వ పేరు నాకు చిరపరిచితమే. నాటకాలు సమాజాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలో బాలగంధర్వ ఒక ప్రభంజనం. ఒక సంచలనం. ఆకాలంలో బాలగంధర్వ అంటే పురుషులే కాదు, మహిళలు కూడా వెర్రి ఆరాధనను కనబరిచేవారు. ముఖ్యంగా, మగవారే మహిళల వేషాలు వేసే ఆ కాలంలో మహిళల వేషధారణతో మహిళలను సైతం మెప్పించినవాడు బాలగంధర్వ. నటి వేషం వేసే నటుడిగా బాలగంధర్వ ప్రభావం ఎంతగా వుండేదంటే, అతడు మహిళలకు ఒక స్టైల్ ఐకాన్. అతనిలా చీరకట్టాలని, అతను కట్టినటువంటి చీరలు కట్టాలని లాహోర్ నుంచి లాతుర్ వరకూ మహిళలు తపించేవారు. అయితే, ఇదొక్కటే కాదు, బాలగంధర్వ గొప్ప సంగీత విద్వాంసుడు, గాయకుడు. ఆ కాలంలో మరాఠీ సంగీత ప్రపంచంలో ఎంతో ఖ్యాతిని గౌరవాన్ని పొందినవాడు. నాటకాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు పాడేవాడు. ఉత్తమ గానానికి గీటురాయి బాలగంధర్వ. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సమకాలికుడు. మంచి మిత్రుడు. దీనానాథ్ మంగేష్కర్‌ను తన నాట్యమండలికి ఆహ్వానించినవాడు బాలగంధర్వ. లతా స్వరంలో గాంధారం పలుకుతుందని ప్రశంసించినవాడు బాలగంధర్వ. దీనికితోడు, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ మోహన్ కుల్కర్ణి రాసిన బాలగంధర్వ జీవిత చరిత్ర చదివి ఆయనను అభిమానిస్తున్నవాడిని. అందుకే ఆ సినిమావైపు ఆకర్షితుడనయ్యాను. అదీగాక, ఈ సినిమా మరాఠీ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిందనీ, జాతీయ స్థాయి అవార్డులందుకుందనీ తెలుసు. అందుకే, ఈ సినిమా కనబడగానే, వెంటనే చూడడటం ఆరంభించాను. ఒక రెండు గంటలపాటూ ఒక అద్భుతమయిన ప్రపంచంలో విహరించి, జీవితాంతం మరచిపోలేని, మరపుకు రాని అనుభూతులను మూటకట్టుకున్నాను. మనకు ఏదైనా మంచి తెలిస్తే పదిమందికీ చెప్పాలన్న నియమాన్ని అనుసరిస్తూ, సంచిక పాఠకులకు బాలగంధర్వ సినిమాను పరిచయం చేస్తున్నాను. ఆ పరిచయంలో భాగంగా నటసామ్రాట్, బాలగంధర్వ సినిమాలూ నాటకానికి, నటుడికీ సంబంధించినవి కాబట్టి రెంటినీ పోల్చిచూసే ప్రయత్నమూ చేస్తున్నాను.


బాలగంధర్వ సినిమా ఆరంభ దృశ్యమే కట్టిపారేస్తుంది. ఒక పిల్లవాడు సంగీతం పాడుతూంటాడు. పక్కగదిలో ఏదో రాసుకుంటున్న బాల గంగాధర తిలక్ ఆ పాటవిని ముగ్ధుడయి బయటకువచ్చి పిల్లవాడిపాట ఆసాంతం వింటాడు. అతడిని బాలగంధర్వుడని అంటాడు. అప్పటినుంచీ నారాయణ్ శ్రీపాద రాజహంస్, బాలగంధర్వగా విఖ్యాతి పొందుతాడు. సంగీతనాటకాలకు ప్రసిధ్ధి పొందుతాడు. ఇక్కడినుంచీ ‘బాలగంధర్వ’ సినిమా ఆరంభమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా, ఎదిగిన తరువాత బాలగంధర్వ ఎలా నాటకాలలో నాయిక పాత్రలు వేసి ప్రజలను మెప్పించేవాడో చూపిస్తారు. నిజానికి ఎదిగిన బాలగంధర్వ మహిళలా పరిచయం ఆశ్చర్యంతో పాటూ ముగ్ధులను చేస్తుంది. నటుడు సుబోధ్ భావే అందమయిన అమ్మాయిగా మనసు దోచేస్తాడు. అంత అందమయిన అమ్మాయి మగ గొంతుతో పాడుతూంటే ఎబ్బెట్టుగా అనిపించదు. పాట మాధుర్యం సృజించిన మధుర రస స్రవంతిలో మునకలేస్తూ సర్వం మరచిపోతాం. నిజంగా ఇదొక అద్భుతమయిన అనుభవం. ఆ కాలంలోవారు నటులను నటీమణులుగా గత్యంతరం లేక పోవటంవల్ల ఆమోదించారన్న భావనతో వున్నవారికి, ఈ కాలంలోకూడా, తెరపై ఒక పురుషుడు సినిమాల్లో మనకలవాటయిన వెకిలి వేషంలా కాక, నిజంగానే మహిళ వేషం వేసి నమ్మించగలగటమే కాదు, ఒప్పించి మెప్పించటం పరమాద్భుతం అనిపిస్తుంది. సినిమా సాంతం ఈ భావన ప్రేక్షకుడిని వెన్నంటివుంటుంది. బాలగంధర్వ మామూలుగా కనిపించేదానికి, ఆడవేషం వేసే సమయంలో కనిపించేదానికి నడుమ తేడా అబ్బురపరుస్తూనే అలరిస్తుంది. నటుడిగా సుబోధ్ భావేకు విజయం ఇది. అతని ముఖం భావాలు అద్దంలా ప్రతిబింబిస్తుంది. తల్లీతండ్రి బలవంతాన పెళ్ళికి ఒప్పుకున్న బాలగంధర్వ, పెళ్ళికూతురు ముఖాన్ని చూడగానే అతని వదనంపై ప్రతిఫలించిన నిరాశ, తిరస్కృతిభావనలను అత్యద్భుతంగా ప్రదర్శిస్తాడు సుబోధ్ భావే. అక్కడినుంచీ నటుడిగా బాల గంధర్వ ఎదగటం, నాటక రంగంలోని రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలపట్ల అంత ఆసక్తిలేక, సంపాదించిన ధనాన్ని నాటకంలో మహిళ పాత్ర వేషధారణ విషయంలో రాజీ లేకుండా వెచ్చించటం, మోసపోవటం, నాటకాలలో పడి కుటుంబాన్ని విస్మరించటం, మారుతున్న పరిస్థితులకు ఎదురునిల్చి పోరాడాలని ప్రయత్నించటం, ఏది ఏమయినా, కళతో రాజీపడలేకపోవటం.. ఇలా బాలగంధర్వ జీవితంలోని ప్రధాన అంశాలను అత్యంత రమణీయంగా, ప్రతిభావంతంగా, మనసుకు హత్తుకుపోయేలా ప్రదర్శిస్తుందీ సినిమా. సినిమా చూస్తూంటే, కాస్సేపటికి సినిమా చూస్తున్న భావననను మరచిపోతాము. మారుతున్న కాలంతోపాటూ మారలేక ఎదురునిలచి వోడిపోయే పోరాటాన్ని వీరోచితంగా పోరాడిన ఒక విషాదాంత నాయకుడిని చూస్తాము.
ఈ సినిమాలో ప్రధానంగా సుబోధ్ భావే అగ్రతాంబూలం అందుకుంటాడు. మొదటి దృశ్యం నుంచి చివరి దృశ్యం వరకూ మనకు బాలగంధర్వ కనిపిస్తాడు. అత్యద్భుతమయిన హావభావాలతో, మనసుదోచే అతిసుందరమయిన మహిళగా, కుటుంబంపై ఎంత ప్రేమ వున్నా కళపై వున్న తీవ్రమైన ప్రేమవల్ల సర్వం విస్మరించే కళాకారుడిగా అనేకానేక భావనలను అవలీలగా ప్రదర్శించాడు సుబోధ్. వెండి తెరపై ఇంత పరిణత నటన ప్రదర్శన చాలా అరుదుగా చూసేందుకు లభిస్తుంది. అయితే, ప్రధానంగా స్క్రిప్ట్ లోపంవల్ల కావచ్చు, వయసెదిగిన తరువాత బాలగంధర్వ పాత్రలో సుబోధ్ నటన అంత కన్విన్సింగ్‌గా వుండదు. స్క్రిప్ట్ కూడా ఈ సంఘటనలను అంత లోతుగా ప్రదర్శించకుండా పైపైనే చూపిస్తుంది. ముఖ్యంగా సినిమాలు రంగప్రవేశం చేశాక, నాటకాలకు ఆదరణ తగ్గి వారి జీవిక ప్రమాదంలో పడిన సంఘటనలలో మానసిక సంఘర్షణల వంటివి లేకపోవటం, అంతవరకూ మహిళ వేషాలలో అలరించిన నటుడు, వయసు మళ్ళటంవల్ల అవే మహిళ వేశాలలో మెప్పించలేకపోవటం వల్ల కలిగే మానసిక వేదన వంటి అంశాలను సినిమా స్పృశించదు. అలాగే, భార్య పిల్లలను ప్రేమించే మనిషి, హఠాత్తుగా ఓ అమ్మాయి కోసం కుటుంబాన్ని వదిలివెళ్ళేందుకు కూడా బలమైన కారణం, మానసిక వేదన వంటి వాటిని సినిమా చూపకపోవటం నిరాశ కలిగించటమే కాదు, ప్రధాన పాత్ర వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది. అయితే, సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి లోపాలను చూసీ చూడనట్టు వదిలేయాల్సివుంటుంది. మొత్తంగా సినిమా కలిగించే అత్యద్భుతమయిన భావన ఈ లోపాలను కప్పిపుచ్చుతుంది.


‘బాలగంధర్వ’ సినిమా స్థాయిని పెంచే అంశాలు ప్రధానంగా సెట్లు, దుస్తులు, సంగీతం. ఈ మూడూ ఈ సినిమాను పరమాద్భుతమయిన కళాఖండం స్థాయికి ఎదిగిస్తాయి. ముఖ్యంగా, సినిమాలో నాటకాల కోసం సృజించిన సెట్లు అద్భుతంగా వుండి, గొప్ప చిత్రలేఖనాలను చూస్తున్న ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. నటీనటులు దుస్తులు పరమ సుందరంగావుండి ఆయా పాత్రలను అందంగా చూపుతాయి. బాలగంధర్వ మహిళ వేషంలో కనిపించినప్పుడలా, ఆ దుస్తులు సమ్మోహనంగా వుండి, ఆ పాత్ర అందాన్ని ఇనుమడింపచేస్తాయి. విక్రం గైక్వాడ్‌కు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా, నీతా లుల్లాకు ఉత్తమ దుస్తుల రూపకర్తగా జాతీయ అవార్డులు లభించటం సమంజసమే అనిపిస్తాయి. జాతీయ అవార్డులు కూడా అప్పుడప్పుడు అర్హులకు అందుతాయన్న విశ్వాసాన్ని కలిగిస్తాయి వీరిద్దరికీ అవార్డులు లభించటం. సంగీతానికి కౌశల్ ఇనామ్దార్ కు బహుమతి రాకపోవటం నిరాశకలిగించినా, ఆనంద్ భాటేకు ఉత్తమ గాయకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు లభించటం సంతృప్తినిస్తుంది. ఎందుకంటే, మొదటి దృశ్యం నుంచి చివరి దృశ్యంవరకూ సినిమాలో అంతటా తానే అయి కనిపించేవి సంగీతం గానం. సినిమాలో మొత్తం 16 పాటలున్నాయి. ఇందులో రెండు పాటలు మాత్రం సినిమా కోసం ప్రత్యేకంగా సృజించినవి. మిగతావన్నీ బాలగంధర్వ నాటకాలలో పాడిన పాటలు. ఆ పాటలను ఈ కాలంలో ఆ కాలంనాటి పాటలలా రూపొందించి, ఎలక్ట్రానిక్ వాయిద్యాలపై కాక, అప్పటి వాయిద్యాలపైనే వినిపించటంతో అత్యద్భుతమైన ఎఫెక్ట్ వస్తుంది. మనం తెరపై జరిగేవి చూస్తూ ఆ కాలాన్ని అనుభవిస్తాము. నిజంగా, నటన, సంగీతం, దుస్తులు ఆర్ట్ వంటివి సినిమా స్క్రిప్ట్ లోని లోపాలు, ఇతర నిరాశకలిగించే అంశాలను వెనక్కు నెట్టివేస్తాయి. సినిమా పూర్తయ్యేసరికి ఒక గొప్ప కళాఖండాన్ని చూసిన సంతృప్తిని కలిగిస్తాయి.




పరదా పడటంతో విస్మృతికి గురయ్యే నాటకాల ద్వారా అజరామరమయిన కీర్తి గడించిన బాలగంధర్వను ఆధునికులకు సినిమాద్వారా పరిచయంచేయటం ద్వారా ఆయనను చిరంజీవిగా నిలపాలన్న మరాఠీ కళాకారుల లక్ష్యం గొప్పది. ఈ సినిమా ద్వారా బాలగంధర్వ గంధర్వ గానాన్ని, దివ్య గంధర్వ కన్య స్వరూపాన్ని, నాటకమే నిజం, నిజమే నాటకంగా జీవించిన కళాకారుడి జీవితాన్ని నవతరానికి పరిచయంచేసి బాలగంధర్వను అమరుడిగా నిలిపింది మరాఠీ కళాకారుల ప్రతిభ.




ఈ రెండు సినిమాలను చూస్తూంటే, మరాఠీ కళాకారులు, తమ తరువాత తరాలకు గతతరంలోని అత్యుత్తమ వారసత్వాన్ని గుర్తుచేయాలని తపనపడటం తెలుస్తుంది. మరాఠీ భాషలో సినిమాలు నాటకాలూ సహజీవనం చేయటం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పలు పాత నాటకాలను సినిమాలుగా మలచటం కనిపిస్తుంది. తెలుగులోనూ ఒకప్పుడు నాటకాలు స్వర్ణయుగాన్ని అనుభవించాయి. సాహిత్యం అత్యంత వైభవాన్ని అనుభవించింది. కానీ, మన మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, కిల్లర్ స్టార్ల ప్రపంచంలో ఇలాంటి లక్ష్యాలకూ, ఉద్దేశాలకూ తావులేదు. కొంపతీసి ఏ పాండురంగడినో, అన్నమయ్యనో తెరకెక్కిస్తే ఆ మహాత్ములు హీరోల హీరోయిజాలకు తగ్గట్టు మారతారు తప్ప మన హీరోలు మారరు. మన సినిమాలు మారవు. అక్కడక్కడా మెరుపులా కొన్ని మంచి సినిమాలు కనిపించినా, అవి పొరపాట్లే తప్ప అలవాట్లు కావు.

10 Comments
k.p.ashok kumar
baagundi.chakkati vishleshana.
రాయపెద్ది వివేకానంద్
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది.
నట్ సామ్రాట్ సినిమాగా తీయాలనుకోవటమే సాహసం. కారణం అది నిజానికి అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం. శ్రీరామ్ లాగు గారు నటించిన ఆ నాటకాన్ని వెండి తెరపైకి ఎక్కించినపుడు ఆ flavour ఉండటం సహజమే కదా.
Aditya
Great review
Sripati
Interesting to remember Balagandharva.
Presenting an art form through another art form requires exceptional skill.
The framework chosen should be sublime.
The artiste does wonders in the framework. Remove the frame or replace it with an eccentric one and he wanes into a rugged monotony.
The canvas is important.
There is a classic play in Telugu by the name Natanaalayam. This is about a poor artiste’s family. The frames chosen are so crafty that anyone would like to jump into it and make a presentation!
The protagonist in Balagandharva is established as a character drawing wonder and awe from all and sundry. His chaste artistry and charm are exemplary. Once established, take him along and he will carry. But one can see that owing to inconsistent choice of frames, he sounds out of place on occasion. Theatre uses contrasts. These can be used both in substance of a situation or with a new character. Lack of that adds to the trouble. The director’s penchant for portraying his skills overtakes the narrative and fails the artiste and the framework on occasion.
Mathew Howard presents an established writer into his own situations throughout a film. He remains there just as the scene changes. There is no monologue. He just blinks!
Where subtlety is lacking, the artiste is left high and dry trying to establish through dialogue and monologue…
Nana Patekar made a mess of Natasaamraat. The play had a better message and import.
Rangamartanda did not establish the characters as proficient through different scenarios. Nor would a layman consider them as respectable or adorable. So no point in taking them through different situations. The framework and contrast… both are absent.
Nice to remember Balagandharva.
Good review.
పేరి ఉదయ్ శంకర్
ఏ సినిమా అయినా రచయిత, కళాకారుడి అంతర్మథనం ఆవిష్కరించదు. సినిమా వాళ్లు లక్ష్మిని,నాటకరంగం వాళ్ళు సరస్వతిని నమ్ముకున్నట్టు తోస్తుంది. రెంటికీ వంతెన కడితే హాస్యనటులు,క్యారక్టర్ నటులు మాత్రమే పుట్టే టట్టు సినిమా రంగం జాగ్రత్తలు ఎప్పటికప్పడు తీసుకుంటోంది.నటుడిగా చచ్చి పోవాలంటే నాటకరంగమే.రచయిత అలా కాదు. సరదాలలో భాగంగా సినిమా ఎంచుకున్న మనం అదే చరిత్ర లాగా చదువుకునే పరిస్థితి వచ్చింది. విజ్ఞులకు, విమర్శకులకు ఏ సినిమా కూడా నచ్చదు.అది వేరే సంగతి.
Valliswar
రంగమార్తాండ గురించి మొదలుపెట్టి మీరు బాలగంధర్వ, నటసామ్రాట్ ల విశ్లేషణ ద్వారా
ఇలాంటి సినిమాలు ఎలా ఉంటే రక్తి కడతాయో వివరించిన తీరు అద్భుతం.
మీ శైలి కొత్త కాదు. మీ నేర్పు ఈ రచనలో మరో విధంగా దర్శనమిచ్చింది.
ASURI HANUMATHSURI
రంగ మార్తాండ కు మూలమైన నటసామ్రాట్ తో మొదలైన మీ రివ్యూ అలాంటి మరో సినిమా బాలగంధర్వ గొప్పదనాన్ని వివరిస్తూ… మరాఠీ నాటకాల గొప్పదనాన్ని చెప్పకనే చెప్పింది. మొత్తానికి రంగమార్తాండ బాగా ఉందని లేదా లేదని చెప్పలేదు. మీ రివ్యూ చూసాక ఓ సారి చూడాల్సిన సినిమా అని అయితే అనిపిస్తోంది. కాదంటారా..?!
కామేశ్వరి
మీ సమీక్ష, రెండు చిత్రాలను పోల్చటం బాగున్నది.
అయితే తెలుగు చిత్రాలను గూర్చిన పరిజ్ఞానమే అంతంత మాత్రం.
ఇతరభాషాచిత్రాలను గూర్చిఒకేసారి తెలుసుకోవటం కష్టం.
రెండుచిత్రాలు మరాటీ నటులను గూర్చి అని తెలిసింది.
అయితే బాలగంధర్వ హిందీ చిత్రమా , మరాటి చిత్రమా అన్నది తెలియలేదు.
తెలుగు హీరోల విషయంలో మీఅభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
అయితే ఆ మాటలకు ఈ వ్యాసంలో సందర్భం లేదేమో అనిపిస్తోంది.
Shyam Kumar Chagal
రెండు విభిన్నమైన సినిమాల గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది. మొదట్లో మీరు సూచించిన రంగమార్తాండ గురించి ఇప్పటికే చాలా చదివేశాను. మీరు కూడా దాని గురించి రాస్తే చాలా బోర్ కొట్టి ఉండేది. మీరు విశ్లేషించినట్టు ఉన్నతమైన సాంకేతిక మరియు ఇతర విలువలని మరాఠీ సినిమాల్లో చాల వరకు చూస్తుంటాం. ఇతర భాషల్లో ఇటువంటి సినిమాల సృష్టికి పడే తపన మన తెలుగు సినిమాల్లో కనపడదు అన్నది నిజం.దానికి కారణం మన పెద్ద హీరోలు అప్పటి హీరోల పుత్ర రత్నాలు వారికి కొన్ని కోట్లను కుమ్మరిస్తున్న ప్రొడ్యూసర్లు, కష్టార్జితాన్ని నేలపాలు చేస్తున్న ప్రేక్షకులు మాత్రమే అని చెప్పాలి.
మీ విశ్లేషణ చదివిన తర్వాత ఈ రెండు సినిమాలు చూద్దాం అనిపించేలా ఉన్నాయి.
రచయిత శ్రీ మురళీకృష్ణ గారికి నా శుభ అభివందనాలు.
రామమూర్తి
చాలా బాగుంది