[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‌ని అందిస్తున్నాము.]
సగటు మనిషికి చిన్నప్పటి నుంచీ ప్రతి ఒక్కరూ చెప్తూనే వున్నారు. సగటు మనిషి కూడా అనుభవాల ఆధారంగా తెలుసుకున్నాడు. మేధావులు ఏం చెప్పినా వినాలి తప్ప, తన అభిప్రాయాన్ని సగటు మనిషి చెప్పకూడదు. ఎవరెంతగా బలవంతపెట్టినా సగటు మనిషి స్వీయ అభిప్రాయాలను తెలుపకూడదు. ఇటీవలె జరిగిన కొన్ని అనుభవాలు సగటు మనిషికి వయసయితే రోజురోజుకీ పెరుగుతున్నది కానీ, బుద్ధి వికసించటం లేదని, ఇంకా మౌనంగా వుండటం అలవడలేదని నిరూపించాయి. ఈ జన్మకు సగటు మనిషికి ఎదుగుదల లేదని అర్థమయింది.
సగటు మనిషి ఒక మేధావితో అనుకోకుండా కాస్త సమయం గడపాల్సివచ్చింది. మేధావి కదా, ప్రతి విషయం గురించీ అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. ఖచ్చితమైన అభిప్రాయాలుండటమే కాదు, ఆ అభిప్రాయాలే అసలు సత్యం అని, అవి తప్ప మిగతావన్నీ తప్పు అన్న తిరుగులేని నమ్మకం ఉంటుంది. మిగతా అన్నీ తప్పు అన్న తిరుగులేని నమ్మకమే కాదు, తన అభిప్రాయాలతో ఏకీభవించనివాడు తెలివిలేని వాడనీ, మూర్ఖుడనీ, తప్పుదారి పడుతున్నాడనీ, వాడిని తాను ఉధ్ధరించాలనీ నిశ్చితాభిప్రాయంతో వుంటాడు. నిశ్చితాభిప్రాయమే కాదు, తాను ఎంత చెప్పినా విననివాడు, తన అభిప్రాయానికి వ్యతిరేక అభిప్రాయం వున్న వాడు తన చుట్టుపక్కల వుండకూడదు. అలాంటి వాళ్ళను వెలివేసి, దూరంపెట్టి, ఎదురుగా కలసినా మనిషి మనిషి కానట్టు, ధూళి కన్నా కనాకష్టమనీ, గాలికన్నా పారదర్శకమనీ, తేలు కన్నా విషమున్నవాడనీ, రాళ్ళ కన్నా కఠినుడని వాడిని కారం చూపులతో చూస్తూ, ఘోరం అనిపించే పడికట్టు మాటలతో విమర్శిస్తూంటాడు. అందుకే మేధావులు చెప్పింది వినాలి తప్ప, ఏమీ అడగవద్దు, ఏమీ అనవద్దు, అభిప్రాయాలసలే చెప్పవద్దు. సగటు మనిషికి ఇది తెలుసు. కానీ, తెలిసి తప్పులు చేసేవాడే సగటు మనిషి. తెలిసినవాడితో తప్పులు చేయించేవాడే మేధావి.
ఒక పార్కులో కలిశారు. మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్నామంటే, మేధావి చెప్తున్నాడు. సగటు మనిషి వింటున్నాడు.
ఇంతలో ఎదురుగా ఆడుకుంటున్న పిల్లల గుంపులో ఏదో వివాదం వచ్చింది. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. గాలివాన రాళ్ళవాన అయింది. అయిదారుగురు పిల్లలు కలసి ఒక పిల్లవాడిపై రాళ్ళు విసురుతున్నారు.
“అయ్యో.. ఒక్కడిని ఇంతమంది కొడుతున్నారు” అని వాళ్ళని ఆపాలని అడుగు కదపబోయాడు సగటు మనిషి.
మేధావి అతన్ని పట్టుకుని ఆపాడు.
“ఇది కుళ్ళిన దేశం. వయసు మళ్ళిన దేశం. దీని కీళ్ళు విరిచి వేయాలి. వ్రేళ్ళు నరికి వేయాలి. ఆ అయిదుగురు పేదవారు. వాళ్ళు ఈ గొప్పోడి కొడుకుని కొట్టొచ్చు” అన్నాడు.
సగటు మనిషికీ లాజిక్ అర్థం కాలేదు. పిల్లలు పిల్లలే. వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే పెద్దలు ఆపాలి. కలసిమెలసి వుండాలని చెప్పాలి. అంతే కానీ, ఇలా పేదలు, డబ్బున్నవారు అనటం ఏమిటి? కానీ, అడగాలంటే భయం వేసింది సగటు మనిషికి. ఎంతయినా మేధావి కదా! ఆయన ఏమాట వెనుక ఏ రహస్యపు మూట వున్నదో?
ఇంతలో, ఆ పిల్లవాడు ముందు రాళ్ళనుంచి తప్పించుకున్నాడు చాకచక్యంగా. తరువాత, ఒక కర్ర దొరకబుచ్చుకుని ఆ అయిదారుగురు పిల్లలను చికుబుకు చికుబుకు రైలే అని పాడుతూన్నట్టు లయబద్ధంగా బాదసాగాడు.
‘వీడు గొప్ప ఫైటర్’ అనుకున్నాడు సగటు మనిషి. పైకి అదే అనబోయాడు. అక్కడికి అదృష్టం తిన్నగానే వుండటంతో మాట పైకి రాలేదు.
మేధావి ముఖం మాడిపోయింది. పెదవులు వణికిపోయాయి. కళ్ళల్లో నీళ్ళు ఉబికివచ్చాయి.
“తరతరాలుగా ఇదే జరుగుతున్నది. బలహీనుడిని బలవంతుడు అణచివేస్తున్నాడు. పేదవాడిని ధనవంతుడు దోచేస్తున్నాడు. ఈ అన్యాయాన్ని సహించకూడదు. దీన్ని సమర్థించకూడదు.”
“వీళ్ళు కదా ముందు రాళ్ళు విసిరింది? వాళ్ళు రాళ్ళు విసిరితే వాడు కొడుతున్నాడు” అనుమానాన్ని అంతలోనే అదిమిపట్టాడు సగటుమనిషి.
అతని నోటినుంచి మాట ఇంకా పూర్తిగా వెలువడనేలేదు, ఓ గంపెడుమంది గునగునమంటూ వచ్చేశారు ఆందోళనయే జీవంగా కల ఆందోళన జీవులయిన కవులు.
“ఇది ఉచ్చల దేశం. ఇది బురద సంస్కృతి. ఇది అశుద్ధ అర్ణవం. ఇక్కడ అన్యాయమే సర్వం. ఇది దుర్మార్గ ధర్మం. ఇది చేతకాని సహనం. అందుకే సాగుతున్నాయి నా ఆటలు. పాడుతున్నా ఇష్టమొచ్చిన పిచ్చి పాటలు. అయినా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ నాకు స్వేచ్ఛ లేదు. కావాలి స్వేచ్ఛ. స్వేచ్ఛ. స్వేచ్ఛ” అంటూ స్వేచ్చుచ్చను కలవరిస్తూ ఒక ఆందోళన కవి జీవాత్మ వచ్చింది.
అదేమిటి, పిల్లలు కొట్టుకుంటుంటే దేశాన్ని, సంస్కృతిని తిడతాడేమిటో అర్థం కాలేదు సగటు మనిషికి. కానీ, వాళ్ళు మేధావులు. పరమత స్వీకృతావేశబాంకృతులు. విచ్చిన్నకర భావనల భూంకృతులు. అందుకే సగటు మనిషి నోరు మూసుకోలేక తెరచి ఆందోళన జీవుల అత్యంతోత్సాహోత్తేజితూన్మత్త ప్రేలాపనల ఆలాపనలు మౌనంగా విన్నాడు.
బిర బిర ఒకరికి తెలిస్తే అందరూ వాలిపోయే ఆందోళన కవుల నెట్వర్క్ కల్లోలిత తరంగిణి అయింది.
“అన్యాయమే న్యాయంగా అన్యాయం చేస్తున్న ఈ అన్యాయ వ్యవస్థ న్యాయంగా నశించాలి. ఇదిగో నా కవిత.”
“న్యాయమైన అన్యాయం న్యాయంగా చేయలేని న్యాయ వ్యవస్థ వర్ధిల్లాలి. అందుకోండి నా కవిత.”
“కవితల కాలం కాదిది. కక్కుల కాలం. కుక్కల కాలం. నక్కల కాలం..” ఇంకా ఏమనేవాడో కానీ, అప్పటికే ఆ కవి మత్తెక్కువయి మత్తేభాలు అదిరి పారిపోయేలా ధబ్బని నేలమీద పడ్డాడు, మద్యం మేధామధనాన్ని ఆరంభించటంతో తాత్కాలికంగా కవితాకాలానికి తాళం (lock) పడింది.
“చెలి చెక్కిలి మీద కవిత రాయలేను. ఉలితో చెక్కుతూ ఉండలేను. ఈ అన్యాయాన్ని కవితతో ఖండించకుండా వుండలేను” అంటూ, తన మాట వింటే అన్ని అవార్డులు వచ్చేట్టు ఫేమస్ చేస్తానని వాగ్దానం చేసిన కవితకేసి చూసి కన్నుకొట్టి కవిత చదివాడొకకవి.
“కుళ్ళిన పుండు భళ్ళుమంది. గోడ మీద బల్లి ఖళ్ళుమంది. గగనంలో గానుగ ఘొల్లుమంది. తరతరాల అన్యాయానికి ఛెళ్ళుమంది. నా కవిత విన్న సరస్వతి గుండె గుభిల్లుమంది. ఈ అన్యాయాన్ని ఉతికి అరేసి, ఎండగట్టి, తుండుచుట్టి, ఉండచేసి, మండజేస్తా… నా రంకెలతో, సంకెలలు దుంకిల(దుంకి+ఇల) పడేట్టు చేస్తా.. ఇది నా కవిత.”
ఇలా ఒక్కొక్కరు ఎక్కడినుంచి వస్తున్నారో, ఎలా పుట్టుకొస్తున్నారో, ఏ చెట్టునుంచి దూకి వస్తున్నారో, ఇంతకాలం ఏ పుట్టలో పడుకుని ఇప్పుడే నిద్ర లేచొస్తున్నారో, ఏ బురదలో పొర్లుతూ, వందలవందల పందుల చిందులబిందెల బిందుల నింపుతూ, సయ్యాటలాడుతూ హఠాత్తుగా ఉలిక్కిపడి కవితకు కాలం దాపురించిందని దులపరించుకుని, పలవరించుతూ, పరవశించుతూ, ఆత్రంగా, వడివడిగా కవిత తుంచుతూ, అశుద్ధంలో ముంచుతూ, జలజల చకచక, ఇక ఇక, పక పక, లుకలుక, బెకబెక, నకనక, నకనక, ఇనమినడికడిక, డైడమనిక, మకనక మకనకచికపిక రొలరిక రంపంపోచ్రంపంపోచ్ అంటూ చపలత్వ పైత్యమంతా చూపే కవితలతో దెబ్బలు తింటున్న ఆ అయిదుగురు పిల్లల గురించి కన్నీళ్ళ పన్నీళ్ళ చన్నీళ్ళ జాలిగొలిపే గాలి కవిత్వ తుఫానును సృష్టించి సృష్టికర్తలకన్నా తామేమిన్న, అన్నన్నా మమ్ముల ఎన్ననివాడు ఎన్నన్నావాడికి గన్నన్నా.. అన్నోరన్నా అంటో వికటకవి అకటకటా అంటూ అక్కట్ట్లు, ఇక్కట్లే కాక కవితాక్కట్లతో (కవిత+ ఇక్కట్లు= వికారాదృశ్యవిదేశసంధి, ఎవరూ కనుక్కోకపోతే కొత్త సంధులెలా వస్తాయి?) కకావికలై అణువణువు విఛిన్నమై, చిన్నాభిన్నమై ఖిన్నమై, సున్నమై సున్నా అయిపోయేలాగా వారు ఆ అయిదుగురిని ఉధ్ధరించి, వారి దుస్థితిని తమ కవితల ద్వారా అభంగతరంగమృదంగ ధ్వనులతో నికృష్టోచ్చిష్ట ఉచ్చలం చేశారు. చెడు తప్ప మంచి కనబడని, కనబడ్డా చూడలేని వారంతా దివ్యదృష్టితో అన్ని అశుద్ధాలను తమ కవితలతో శుద్ధిచేసి పవిత్రాత్మల ప్రపంచాన్ని కవితల్లతో ఏర్పాటు చేసి వేసి ఆరేసుకోబోయి పారేసుకున్నారు.
ఇలా ఎవరికివారు తమతమ కవితలను వినిపిస్తూ తన్మయత్వాతీత స్థితికి చేరి ఆ అయిదుగురిని ఉధ్ధరించేశామని భుజాలు చరుచుకుంటూ, ఒళ్ళు విరుఛుకుంటూ, కళ్ళెగరేస్తూ, పళ్ళికిలిస్తూ, మరో ప్రపంచాన్ని కలవరిస్తూ, వెర్రి గొంతుకలై మొర్రి కవితలై సంతృప్తిగా, మిషన్ అకంప్లిష్డ్, మసాన్ పాలిష్డ్, అణచివేత డెమోలిష్డ్ అని ఇంకెక్కడ అణచివేతల వెతల కతలలతలు విరివిగా దొరికితే తమ కువితాతలల దుర్గంధంతో జగతిని ప్రగతి సాధించే అభ్యుదమౌ వెలుగుల ప్రస్తానంవైపు నడిపించేందుకు వెళ్ళిపోయారు.
తీరా చూస్తే, ఆ ఒక్క పిల్లవాడు ఆ అయిదుగురిని కుళ్ళబొడిచి, కీళ్ళు విరిచి, కరువుతీరా దంచి పచ్చడి చేసి, అలసి సొలసి వదలి వెళ్ళిపోయాడు ఎదురుగా వున్న గుడిసెలోకి. ఈ అయిదుగురు పాకుతూ, దేకుతూ, దగ్గరలో ఆగివున్న ఎస్.యూ.వీ. ఎక్కి డ్రైవరెక్కడోవుంటే ఫొను చేసి పిలిచి వెళ్ళిపోయారు.
“ఎవరు వీరు? ఎక్కడినుంచి వచ్చారు? ఎక్కడికి పోతున్నారు? ఈ కవితలేమిటి? ఈ ఉద్ధరింపులేమిటి? అసలు దెబ్బలు తిన్నవాడిని వదలి ఈ ఊళ్ళో ఎవరిదో పెళ్ళయితే అన్నట్టు ఈ కవిత్వం గోల ఏమిటి?” అని ఏమీ అర్థం కాక పక్కన ఉన్న మేధావిని అడిగాడు సగటు మనిషి.. అదే అతను చేసిన పొరపాటు..
ఆ తరువాత ఏమయిందో చెప్పాలంటే ముందు వింధ్య హిమాచలయమునాగంగా ఉచ్ఛల/ఉచ్ఛల జలధితరంగాలలో మునకలువేసి పవిత్రుడనై రావాల్సివుంటుంది. ఎంతయినా సగటు మనిషి శౌచానికి ప్రాధాన్యం ఇస్తాడు కదా! ఇంకా అశౌచంలో శౌచం దర్శించే స్థితప్రజ్ఞత రాలేదు. వస్తే ఈపాటికి అభ్యుదయ విశృంఖల మేధావి గణంలో చేరి అశుద్ధ విస్తరణలో అగ్రగణ్యుడయ్యేవాడు కదా! ఆ భాగ్యం ఈ జన్మకు లేదు..
“నీ ఈ జన్మ సగటు మనిషి జన్మనే, నిన్ను ఉధ్ధరించాలన్నా నువ్వు పైకి రానేరావు” అని ఈసడించి వెళ్ళిపోయాడా మేధావి. ఎక్కడో ఏదో జరిగిందట.. దాని గురించి టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్ చానెళ్ళలో, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రాంలు, ఫేస్బుక్, వాట్సప్ వంటి ఆధునిక సమాచార విస్తరణా మాధ్యమాల్లో కనిపించి వినిపించేందుకు సగటు మనిషిని అర్ధాంతరంగా వదలి పరుగెత్తాడా మేధావి.
సగటు మనిషి అక్కడే మిగిలిపోయాడు!
(మళ్ళీ కలుద్దాం)
సగటు మనిషి కష్టాలు, మేధావుల అతితెలివి తేటలను ఉతికి ఆరేశారు. ఇంతకీ ఈ సగటు రచయిత ఎవరో. అభినందనలు.
కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊
వికృత మేధస్సులతో విర్రవీగుతూ,సమూహంలా కదలుతూన్న విషనాగుల ముసుగులను తొలగించి మనకు చూపించిన సగటు మనిషికి నమస్సులు.
చాలా సూపర్.. ఉచ్చల జలధి తరంగాలు పొంగి పొర్లాయి.. బాగుంది.
అద్భుతమైన పదవిన్యాసం.విమర్శ మెత్తగా కత్తితో ఆపరేషన్ చేసినట్లుంది.సగటు మనిషిని ఇంత స్టిమ్యులేట్ చేసిన కవితని అశౌచమైనా మెచ్చుకోవాలేమో.కవిత్వం కాకుండా, సెన్సేషన్ కోసం, ఒక మనిషి ఒకచోట చేసిన తప్పుకి దేశాన్నంతటినీ అవమానించడం ఇది వాక్స్వాతంత్ర్యం,(అది కూడా దేశం ఇచ్చినదే) కింద సమర్థించుకోవడం చూసి సగటు మనిషికి ఆగని జలపాతం లాగా కవితావేశం వచ్చేసింది.మేం కవులం కాదు కానీ సగటుపౌరులం కాబట్టి బాధని దిగమింగుకుని మౌనంగా వుండిపోతాం.It goes on.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రైతుకన్యే రాణి!
‘ఆ రోజుల్లో..’ రాధాయి రచనలు గ్రంథావిష్కరణ సభ – ప్రెస్ నోట్
మానవత్వమై మొలకెత్తాలని…..
చెట్టు మాటలు
గడ్డి పువ్వు గుండె సందుక (బాల్యం చెప్పిన కథలు)
జ్ఞాపకాల పందిరి-74
చిరుజల్లు 18
ప్రేమ కావ్యం..!
చిరుజల్లు-76
ఆచార్య దేవో భవ
Manaspurthi ga meeku abhinandanalu Proud of you Prasunna garu Keep ✍ .
బావుందండి. సమన్వయంతోెసమస్య తీరింది
సర్... మీ సహృదయ స్పందన నన్ను మరింత ఉత్సాహ పరిచింది.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
నమస్సులు
ఆనాటి కాలానికీ నేటీ కాలానికీ సహనం గురించి చక్కటి విశ్లేషణ
All rights reserved - Sanchika®