[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]
కం॥ అధికారము వెలిగెడి తరి విధిగా తిరుపతికి వచ్చు విభవముదనరన్ మాధువుని మరచిపోవును అధికారము లుప్తమైన, నది తప్పుకదా!
సీ॥ రాజకీయ పదవి రాణించుచున్నచో వేంకటేశ్వరు జూడ వేగవచ్చు రాజ్యాంగపదవిలో రాజసం బొప్పగ నేడుకొండలవాని జూడవచ్చు న్యాయమూర్తి పదంబునధివసించెడివేళ తిరుమలేశుని జూచు తేరగాను సినిమాల వెలుగొందు ఘనతారగా సైత మాది దేవునిగన నరుగు దెంచు
తే.గీ.॥ ఒక్కసారియె యనుకొన్న పెక్కుసార్లు వేంకటాద్రిని దర్శించు వీరివలన భక్త జనమున కెంత ఇబ్బంది కలుగు? క్యూలనాపుచు, జనులెల్ల క్రుద్ధులవగ
కం॥ వేచుచు గంటల తరబడి యాచిన్మయుజూడవచ్చున స్తోక ప్రజల్ తోచక తిరుపతికొచ్చెడు రాజరికపు పోకడలను రౌద్రతగనరే?
తే.గీ.॥ పరగ మేదిని నేలు భూపాలుడైన మనగ చెప్పులు కుట్టు సామాన్యుడైన నొకటి పరమాత్మ దృష్టిలో, నుర్వినెల్ల సమత జూడగ కనిపించు సత్యపథము
శా॥ నానా కష్టములన్ భరించి మదిలో నారాయణున్ నిల్పుచున్ కోనల్ కొండలనెక్కి వేంకటపతిన్ గోవిందనామంబులన్ ఆనందంబుగ, భక్తి పెంపునను తామారీతి దర్శించగాన్ ఈ నేతల్, ప్రముఖుల్ విశేష ఘనతన్ ఈరీతి రానొప్పునే?
తే.గీ.॥ దేవదేవుని యెదుటనా? నీవు చూపు పిచ్చి యాధిక్య భావన? వీడు భ్రమను దర్శనంబును నీ కివ్వ తగదు యటుల కనుము యహమును విడుచుచు కామజనకు
కం॥ సమదర్శనయోగంబును అమలిన భక్తియునుగూడి నంతనెకలుగున్ సమహిత దర్శన భాగ్యము తమమే నశియించి సత్య తత్త్వము తెలియన్
ఆ.వె.॥ లక్షలాది భక్తులాతురతను కదల నీవు మాత్రమటుల నిముసమందె స్వామి దర్శనమును సాధించెదవు, వారి నందరి నటు నిలిపి, న్యాయమిదియె?
ఉ॥ స్వామిని వచ్చి చూచెనని వార్తలు రాసి ప్రసార మాధ్యమా లేమియు జంకులేక పలు రీతులగున్, ఘనకార్యమోయనన్ తామటు కీర్తిచాటెదరు దానిని వార్తగ నెంచబాడియే? దేమునినుద్ధరించెదరె తేరగ దర్శనమంది వారటుల్
చం॥ మనది మతప్రమేయముగ పాలనసాగెడు రాజ్యమెప్టుగా దని, మన పూర్వనేతలు వదాన్యత జూపిరి రాజ్యగ్రంథమున్ కొనకొని యేమతంబయిన కోరిక మేరకు నాదరింపగా తన వర పౌరులందరికి దక్కెను హక్కు, విశాలభావనన్
తే.గీ.॥ సత్యమొక్కటె; దానినే సంతులెల్ల వివిధమగు రీతులైనట్లు విప్పి చెబుదు రన్ని మతముల సారంబు నదియునొకటే దీని నెరిగిన వాడె పో ధీరమతుడు
తే.గీ.॥ అల్పసంఖ్యాక వర్గాలనాదరింప కొన్ని చట్టములొనరించి కూర్మితోడ వారు యెటువంటి కొతుకును బాయుటకును దేశ రాజ్యాంగమది తాను తీర్చికూర్చె
కం॥ భారత దేశమునందున వేరగు యస్తిత్వమది, వివేకము తోడన్ తీరగు ఘనసిద్ధాంతము పేరిమితో వ్రాసిరపుడు ప్రేమాస్పదులై
కం॥ మైనారీటీల ఓట్లను వైనముగా బొంద కొన్ని పార్టీలెపుడున్ పూనిక మేలొనరించెడు గానము వినిపించు వారికనయముహితులై
తే.గీ.॥ కొన్ని మత తత్త్వ పార్టీలు కోరిమిగుల నధిక సంఖ్యాక ప్రజలను అనునయించు నదియు దోషమె, మతమెప్టు యగునతీత మైన విషయము, వరపరిపాలనందు
కం॥ మతసామరస్య దీక్షా రతులై ప్రజలెల్ల సహన లక్షితులగుచున్ మతమను హద్దును దాటక నతిధీరత మనగనగును నతిశయయశముల్
చం॥ మతమును గైకొనన్, వివిధ మార్గములన్ తగ సుప్రచారమున్ సతతము జేయ, మారగను, శాశ్వత హక్కు లభించె; దానినే వితరణ తోడ జేయవలె వీడుచు దుర్వినియోగ హీనతన్ మత సహనంబె రక్ష మన మానవజాతికి, లౌకికార్థికిన్
తే.గీ.॥ “ఆకలంచును నిరుపేదలలమటింప వారికెందుకు మతమ”నె స్వామియెపుడొ విశ్వసువివేకమానంద విశదమయ్యె యానరేంద్రుని మాటల నరసిచూడ
కం॥ భావోద్వేగపు వీచిక సవి, మీదగు మూఢభక్తి, సారవిహీనం బవిరళ క్రతు పరమార్థము కావింపుడు మానసికము కలుగును వెలుగే!
తే.గీ॥ ఆడవారికి వేరుగా, చూడ పురుషు లకును వేరైన పనులని రాసిలేదు పనియటన్నను పనియే! సవాలు కాదు లైంగికంబగు ముద్రది రద్దునొందె
చం॥ ముదితలు నేర్వలేనిదని భూమిని విద్యయె లేదటంచుదా విదితము ‘చిల్కమర్తికవి వేడ్కగ జేసెను; ఎట్టిదేనియున్ సుదతులు చేయజాలుదురు సుంతసుశిక్షణ నివ్వగల్గినన్ మదినతి శ్రద్ధతోడ, పరిపాలన సైతము, నేర్పుమీరగన్
కం॥ స్త్రీ వాదము మగవారిని కావించుటకాదు నింద, కాదది మహిళల్ భావించు దమన దృక్పథ మావేశవిహీనమైన మగు తౌల్యమగున్
మ॥ ఒక స్త్రీవాదిటు బల్కె “మీరుసుతులన్ యొప్పించుడీ, వంటయున్ సకలంబౌ గృహ కృత్యముల్ మనుగడన్ సాఫల్య మొందించు చే యక వానిన్ మగవారు తప్పుకొనగా నౌనే? పనుల్ ఆడవై, వికటించే మగవై రహించునె భువిన్, వెర్రిన్ వీడి తర్కించుడీ!
ఆ.వె.॥ ఇరువురాలుమగలు తరతమ హీనత ఇంటి పనుల పంచు కొంటిమంచు కొలువు విధుల మిగుల కూర్మిని నేర్పున నెఱపు వెసులు బాటు కోరుకొనరె?
తే.గీ.॥ వంటొచ్చిన మగడని, తన కంటే మెరుగైన రీతి, కమ్మనివంటల్ వంటింట్లో చేస్తాడని అంటే తన భార్య; ధన్యుడౌ గాదె యికన్
కం॥ పాత రోజులు కావివి రీతి మారె భార్య కనువైన విధమున భర్త యెపుడు అన్ని పనులను తోడుగా నున్నతరము దీని జూడగ హర్షంబు, తీరుమనసు
కం॥ సుకుమారులు యబలల్ మరి యిక మీదట గారు మహిళలే పనినైనన్ చకచక నైపుణ్యముతో వికసిత మతి చేయజాలి వెలుగుదురిలలో!
కం॥ మాలులు, మల్టీప్లెక్సులు హేలగ బలహీనతలను హెచ్చింపుచు, నా కీలలు యువతను క్రమ్మగ నాలింపరు మంచిమాట, యవివేకముతోన్
చం॥ నిరతము వస్తుజాలమును నేటి తరంబు అమర్చుకోగ, చే కురునటు తృప్తి; కాని తమకున్న ధనంబున సింహభాగమున్ మరి మరి ఖర్చుబెట్ట ప్రతి మాసము కంతులు గట్టి, వ్యర్థమై సిరియటుబోవ గ్రుంగెదరు సేమము దప్పి, రుణంబుపెంపునన్
తే.గీ.॥ ‘ఫాల్సుప్రిస్టేజి’ కొరకెప్టు పాకులాడి వస్తువులనెల్లకొని వాని మస్తుగాను ఇల్లునింపుచు సంతృప్తి త్రుళ్లుయువత వినిమయంబునె భావించు ఘనమటంచు
తే.గీ.॥ బాగుజేయుట నచ్చరు పారవేత్రు ఎన్ని ‘ఎక్స్ఛేంజి ఆఫరుల్?’ ఎచట జూడ పాత వస్తువునమ్మిన ‘వంద’లొచ్చు కొత్త వస్తువు ‘వేలలో’ కొనగవలయు
కం॥ ‘యూజండ్త్రో’ పద్ధతియే రోజుకు రోజుకును మనకు రూఢిగ నిలిచెన్ నిజమిది మనుషుల సైతము త్యజియింతురు వాడుకొనిన తదనంతరమున్
కం॥ ‘డీమార్టులు’ ‘స్పెన్సర్లు’ను ఏమాత్రము జంకులేక నెన్నియె పధకాల్ ఏమార్చుచు ప్రకటించగ ఈమాయను బడని యువత ఇప్పుడు గలదే?
తే.గీ.॥ వస్తుకాంక్షది మితిమీర బాయు సుఖము ఖర్చుపెట్టుట యదిగాదు ఘనత యెపుడు పొదుపు చేయుట యెసుగుణమదియె నిలుచు భావివెలుగొంద జేసెడు ప్రథమ సూక్తి
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఫస్ట్ లవ్-16
బహుమతి పొందిన కథల విశ్లేషణ-1
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-17
దివినుంచి భువికి దిగిన దేవతలు 7
పూచే పూల లోన-58
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-52
మంత్రకత్తె ఆటకట్టు
గ్లోబల్ ఎయిడ్ – పుట్టుక, ప్రస్థానం, ప్రస్తుతం..!!
మహాభారత కథలు-81: సుబాహుపురం చేరిన దమయంతి
బంగారు తీగ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®