కొల్హాపూరంలో అమ్మ మహాలక్ష్మి. ఆమె శ్రీరంగధామేశ్వరి. అమ్మవారు మహాపతివత్ర. అయ్యవారిని తలిస్తే అమ్మ మరింత సంతోషపడుతుంది. అందుకు సందేహము లేదు. అందుకని ‘అమ్మా! నా మంత్రం ప్రక్కన పెట్టి నీకు కృతజ్ఞతగా శ్రీరాముని జపిస్తా’ నని మనసున చెప్పుకున్నాను. అమ్మవారి ఎదురుగా వున్న మంటపము ఎత్తుగా వుంటుంది. పది మెట్లు ఎక్కాలి. ప్రక్కన విశాలమైన అరుగులు. ఆ అరుగల వద్దకు ఎవ్వరూ రారు. అందరూ దేవాలయ శిల్ప సౌందర్యము చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఈ మూల అరుగు మీద వుంటే ఎవరికీ అడ్డు కాదు. ఇలా భావించి, అర్ధపద్మాసనములో కూర్చొని నా తులసిమాలతో “శ్రీరామ రామ రామేతి….” అంటూ జపము మొదలెట్టాను. అలా జపిస్తూ ఒక మాల ఆవృతము అయినాక రెండో మాలలో గాఢమైన నిద్రలా మైకం కమ్ముకు వస్తుంటే… ఎవరో చిన్నగా తొడ మీద తట్టారు.
కళ్ళు తెరిస్తే ఒక క్షణం అర్థము కాలేదు. ఎవరో ఒక వృద్ధురాలు, మెట్లపై నిలబడి నా తొడ మీద తట్టి, చేతులు త్రిప్పుతూ మధురముగా నవ్వుతూ ఏదో చెబుతోంది. ఆమె మాట్లాడేది మరాఠీనో మరోటో. నాకు అయోమయంగా అనిపించింది. నవ్వు ఆమె ముఖములో, కళ్ళలో వెలుగుతున్నది. ప్రకాశవంతమైన నవ్వు చూడముచ్చటగా వుంది. ముఖమంతా ముడతలు. అయినా వెలిగిపొతున్న ముఖము. బీదతనపు చీర కాని పరిశుభ్రముగా వుంది. చేతులు త్రిప్పుతూ ఏదో చెబుతోంది. నే కూర్చున్న అరుగుకవతల మరో అరుగుమీద ఒక స్త్రీ పిల్లలను ఆడిస్తూ కూర్చొని వుంది. ఆమె మమ్మల్ని చూస్తూ వుంటే ఆమెనడిగాను
“ఈ ముసలామె ఏమి చెబుతోంది?” అని.
“నీ జపమాల అడుగుతోంది” అంది ఆ పిల్లల తల్లి.
“ఆ…. జపమాల ఆమె ఏమి చేసుకుంటుంది” ఆశ్చర్యంగా అడిగాను. బిచ్చగత్తె అయితే డబ్బులడగాలి. అడగేవారయినా తిరుగుతున్న వాళ్ళని భిక్ష అడుగుతారు. ఇలా దేవాలయంలో మూలకు ఎత్తున ఎవరికీ అడ్డురాని ప్రదేశములో కూర్చొని కళ్ళు మూసుకున్న వారిని తట్టిలేపి అడగరు. అందునా జపమాల అస్సలు అడగరు.
“ఏమో. మీ జపమాల ఇవ్వమని అడుగుతున్నది” అంది ఆమె. ఈ వృద్ధురాలు నవ్వుతూ చూస్తుంటే, నేను తత్తరబిత్తరగా చుశాను. ఆమె మళ్ళీ ప్రకాశవంతమైన నవ్వు నవ్వి మెట్లు దిగి నడిచుకు పోతున్నది. నాకు బుఱ్ఱలో ఫ్లాష్‌లా వెలిగింది. వచ్చినది అడుగుతున్నది ఆ తల్లేనని. లేకపోతే తలా తోకా లేక ఈ జపమాల అడగటమేమిటి?
నేను పరుగున “మాజీ” అంటూ పరిగెత్తాను.
ఆమె వద్దకు వెళ్ళి “అమ్మా! ఇది స్వామి ప్రసాదము. పరమ పాతది. ఒక పూస కూడా వూడింది. నీవు కొత్తది తీసుకో, ఇక్కడ దుకాణములో” అంటూ నా పర్సు తీసి అందులో వున్న వంద రూపాయలు నోట్లు కొన్ని ఆమె చేతిలో పెట్టాను.
“ఏ స్వామీజీ” అంది ఆమె
“చిన్నజియ్యరు.”
“అయినా అందరికీ అన్నీ ఇచ్చే తల్లివి. నీకు నేనెమివ్వగలను?” అంటూ ఆమె పాదాలకు నమస్కారము చేశాను. ఆమె నా ముఖము పుణికిపుచ్చుకు “అంతా మంచి జరుగుతుంది” అని నన్ను దీవించింది. నేను తలవూపాను. క్షణములో మాయమైయ్యింది. ఎటు వెళ్ళిందో తెలియదు.
హృదయము పులకరించింది. కళ్ళు ధారాపాతముగా వర్షించాయి, “జగదంబా” అనుకుంటూ!
అమ్మ దయా మూర్తి. మనము ఒక అడుగు అటుగా వేస్తే, తనుగా కదలివచ్చి మనలను రక్షించగల ఆ అపార కరుణకు మనమేమివ్వగలము?’
“హరిస్త్వామారాధ్యప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపు మహి క్షోభనయత్
స్మరోఽపిత్వాం నత్వా రతినయన లేహ్యేన మహతామ్
మునీనా మప్యంతః ప్రభవతిహి మోహాయ మహతామ్॥” (సౌందర్యలహరి)
(తల్లీ జగజ్జననీ! నమస్కరించెడి భక్తులకు సౌభాగ్యము ప్రసాదిస్తావు.)
జగదంబపై హృదయములో కలిగిన ఆనందపారవశ్యము అలా నిలబడిపోయింది.
***
ఆనాటి రాత్రి నేను షిర్డి వెళ్ళే బస్సు ఎక్కాను. ఆ బస్సు మరునాటి ఉదయము షిర్డి చేర్చింది.
షిర్డిలో కరివేళ్ళు సత్రములో నా బస. మా నాయనగారు శ్రీశైల కరివేలు సత్రములో ఒక గది కట్టించి ఇచ్చినందుకు వారు ఒక నెలరోజులు ఆ సత్రములో వుండటానికి కొన్ని టికెట్లు పంపుతారు. అవి అక్కయ్య వద్ద వుంటాయి. షిర్డిలో ఆ సత్రము వుందని, నన్ను అక్కడ వుండమని, నే బయలుదేరుతుంటే, నాకు కొన్ని టిక్కెట్లు ఇచ్చింది. వాటిని చూపి నేను షిర్డిలో వున్న ఒకరోజు ఆ సత్రంలో వున్నాను.
సత్రము పర్వలేదుగా వుందనాలేమో. నాసి రకపు మంచాలు. బాతురూములో పెద్ద ఎలుకలు. మట్టిగా వున్నది. హంగులు లేక సామాన్యముగా వున్న ఆ సత్రము నాకు ఎప్పటిలాగానే పెద్ద ముఖ్యమైన విషయము కాదు. కానీ బ్రాహ్మలు కరివేలు సత్రానికి చాలా ప్రాముఖ్యాన్నిస్తారు. కొద్దిగా శుభ్రముగా పెట్టుకోవచ్చును దానిని అనిపించింది.
సత్రములో ఉచితముగా వుండవచ్చుకాని, ఉచితముగా ఏ సేవ తీసుకోవద్దన్న బాబా సూక్తిని నేను మనసా వాచా పాటిస్తాను. అసలు బాబా సూక్తులు పాటిస్తూనే నే నా జీవితము గడపే ప్రయత్నము సదా చేస్తూవుంటాను కాబట్టి, వారికి అన్నదానానికి కొంత పైకము కట్టాను.
షిర్డిలో నేను ఉదయము దర్శనము చేసుకొని, ధునికి నమస్కరించి, గురుచరుత్ర పారాయణము చేసుకున్నాను. మధ్యాహ్నము NRI లకు ప్రత్యేక కోటా దర్శనము వుందంటే, మరోమారు బాబాను దర్శించాను. మనసులో కూడా మౌనముగా వుంది. “సర్వము తెలిసి నన్ను నడుపుతున్న నీకు నే చెప్పేది అడిగేదీ వున్నవా బాబా” అనిపించింది.
ఈ యాత్రలో నాకు వున్న ఆందోళనా, దేవతామూర్తులను చూచి కలిగే కన్నీరు వంటి భావాలు నాకు షిర్డిలో కలగలేదు. నేను చాలా శాంతముగా, మౌనముగా వుండినాను. నా మనసులో మంత్ర మననము తప్ప మరో ఆందోళన లేదు.
గురువు గురించి, గురువును ఎలా సేవించాలో నేర్పిన బాబా వద్ద అలా వుండటము సమంజసము.
అవును మరి నే చేరినది నా జీవితనౌకను నడుపుతున్న బాబా సన్నిధికి. ఇక ఆందోళనలు తుఫానులు దరిచేరవు కదా!
తను 12 సంవత్సరములు గురుసేవా తపస్సు చేశానని చెప్పిన సద్గురువు, నమ్మిన భరద్వాజ మాస్టారు వంటి వారిని హృదయానికి హత్తుకున్న దేవాదిదేవుడు, సర్వదేవతల రూపము తానైన యోగిరాజు, నమ్మికొలచిన వారిని సదా కూడా వుండి నడిపించే ప్రాణశక్తి అయిన సమర్థ సద్గురువు నాథసంప్రథాయంలోనే మణిపూస సాయినాథుని వద్ద కాక మరి నేనెక్కడ అంత మౌనముగా ప్రశాంతముగా వుండగలను?
నేను డిగ్రీ చదివే వరకూ షిర్డికి రాలేదు. మొదటిసారి అమ్మా, నాన్నలతో తమ్ముడూ నేనూ షిర్డి వచ్చాము. నేను ఒకరోజంతా సమాధి మందిరములో బాబా చరిత్ర చదువుతూ గడిపాను. నేనూ తమ్ముడూ దర్శనము చేసుకు బయటికి వస్తుంటే బాబా సమాధి మీద మాలలు తీసి ఇస్తున్నారు. నాకూ ఒక మాల అలా దొరికింది. నేను ఆ మాలను ముఖానికి తాకించి నమస్కారాలు తెలిపి, తమ్ముడి కోసము ఎదురుచూస్తున్నాను. వాడు ఇంకా బయటకు రాలేదు. నా వెనకగా ఒక వృద్ధుడు తెల్లని బట్టలతో మెరుస్తున్న ముఖముతో “ఆ మాల ఎవ్వరూ తొక్కనిచోట పడెయ్యమ్మా” అన్నాడు.
నేను విచిత్రంగా చూసి “నేను పడెయ్యనండి. దాచుకుంటా జీవితమంతా” అన్నాను.
ఆయనకు నేను తెలుగని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాను. చాలా కాంతివంతముగా వున్న ఆయన ముఖము మళ్ళీ చూడాలనిపించి చూస్తే కనపడలేదు ఆయన. తమ్ముడికి చెబితే “ఆ! ఇక్కడంతా తెలుగోళ్ళే వున్నారులే” అన్నాడు తేలికగా. తరువాత నాకు బాపట్లలో సాయిమాతాజీ గారు చెప్పారు ఒక సందర్బములో “నీతో ఆనాడు బాబా వచ్చి మట్లాడారు. గమనించావా” అని. నాకు ఆ కాంతివంతమైన ముఖము గుర్తుకొచ్చింది వెంటనే. ఆ ట్రిప్పులో నే బాబాను తీసిన ఫోటోలో బాబా పాదము మానవ పాదములా కనపడుతోంది. వెంటనే తమ్ముడు తీసిన ఫోటోలో పాలరాయి విగ్రహములా కనపడుతుంది. అలా నాకు గురువు పాదదర్శనము కలిగిందన్న భావన వుంది. ఆ విషయాలన్ని మళ్ళీ గుర్తుకువచ్చాయి.
“సదాసత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్ధాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం” (సాయి ప్రార్థన)
సత్రపు మేనేజరు నన్ను వివరాలు అడిగి “గురుచరిత్ర పారాయణమే ఒక్కటే మార్గము గురువు దర్శనానికి” అన్నాడు తీర్మానించుతూ. నేను తలవూపాను మౌనముగా.
ఆనాటి సాయంత్రము బస్సులో హైద్రాబాదుకు బయలుదేరాను.
అలా నా యాత్రలో ‘దత్త క్షేత్రాల దర్శనం’ అన్న తొలి అంకము ముగిసింది.
(సశేషం)
You’re truly a blessed soul. Normal mortals will never encounter such enlightening exposures. 🙏 Subramanyam Valluri.
మీ అభిమానానికి కృతజ్ఞతలు. జగదంబ సదా మనకు అండ. 🙏🏽🙏🏽
సంథ్య గారు నమస్తే… మీ సత్యాన్వేషణ-12 బాగుంది. దత్తక్షేత్రాలు చూడని వారికి ఒక చక్కని అనుభూతి. పాఠకులను వయా షిరిడి నుంచి భాగ్యనగరంకి తీసుకుని వచ్చారు… mklrao Email : mklamaa@yahoo.vom
🙏🏽😀
Mee Kolhapur lo ammavari blessings and Shiridi lo baba blessings excellent 12th part narration very nice Yes Guru Charithra 🙏🏻🙏🏻🙏🏻 Wishing baba blessings to you.
కృతజ్ఞతలండి🙏🏽
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™