“అసంయతాత్మనా యోగో దుష్ర్పాప ఇతి మే మతిః।వశ్యాత్మనాతు యతతా శక్యోఽవాప్తుముపాయతః॥” (చాందోగ్యోపనిషత్తు)
అభ్యాసవైరాగ్యముచే స్వాధీనము కాని మనసు యోగానుభవముతో స్వాదీనము చేసుకోవచ్చును.
రుషీకేష్‌లో వున్న జియరు మఠము మూడంతస్తుల భవంతి. భవంతిలో మొదటి అంతస్తులో వంటశాల, ఆఫీసు గది, పూజారి గది కాక ఆరు యాత్రికుల గదులున్నాయి. రెండో అంతస్తులో పదిహేను గదుల వరకూ వున్నాయి. ఆ పైన స్వామివారి కోసము గది, వారి తిరువారాధనకూ, పెద్ద హాలు. నే వెళ్ళినది ఫిబ్రవరి కాబట్టి బదిరి ఆశ్రమము (అక్కడ మరో ఆశ్రమము వున్నది) లో వున్న పెరుమాళ్ళును కూడా ఇక్కడకు తెచ్చి, ఇక్కడ సేవిస్తారు ఆ ఆరు నెలలు. రుషికేష్ లోని ఆ ఆశ్రమములో వున్న శ్రీరామ మందిరములో దేవతామూర్తి చాలా విచిత్రముగా వుంటుంది. సీతారామలక్ష్మణులను హనుమంతులవారు మోస్తున్నట్లుగా వుంటారు. ఆ చిన్న దేవాలయము చాలా ప్రశాంతముగా వుంది. చుట్టూ చక్కటి పెద్ద చెట్లు. అందునా పెద్ద మర్రి చెట్టు. మల్లె తీగలు, దేవగన్నేరు వృక్షాలు. ఒక మూలన ఒక షెడ్డు. శ్రీవైష్ణవులు బయట తినరు. వారిది స్వయంపాకము. అలా యాత్రకు వచ్చిన వారికి వంట కోసము ఆ షెడ్డులో ఏర్పాట్లు.
నేను వెళ్ళిన సమయములో వంట బ్రహ్మడు లేరు. ఆయన కూడా సెలవు పుచ్చుకు వెళ్ళారట. కేవలము అర్చనకు పూజారి, బదరి ఆశ్రమ పూజారి, బయట పనులూ లోపలి పనులూ చూడటానికి ఒక కుర్రాడు. అంతే. మొత్తము భవనము ఖాళీ. నాకు మూల వున్న పెద్ద గదిని ఇచ్చి, వుండమన్నారు ఆ అర్చకస్వామి. అతను చిన్న కుర్రాడు. మాతాజీ అంటూ ఆ ఇద్దరు అర్చకులూ నాకు ఏ మాత్రము డిస్టబెన్సు లేకుండా వుండేవారు. నేను రాత్రులు తిననన్నా ప్రసాదమని బలవంతముగా పెట్టేవారు. రామస్వామికి కమ్మటి ప్రసాదాలు వండేవారు. ఆ ప్రసాదము కోసము పిల్లలు చాలా మంది సాయంత్రము వచ్చేవారు. ప్రతి సాయంత్రము విష్ణు సహస్రనామము చదివేవారు. వచ్చిన ప్రతివారి ‘జైశ్రీమన్నారాయణ’ అన్న శరణగోషతో ఆ ఆశ్రమము ప్రతిధ్వనిస్తూ వుండేది. బయట ప్రక్కనే అమ్మవారి దేవాలయముంది. అక్కడ హారతి సమయములో డంకా మ్రోగేది. గంటల గణగణల మధ్య, ఉదయము సాయత్రము తిరువారాధనలతో అది మరో వ్యాసాస్రమములా వుండేది. అంతటి ప్రశాంతత మనసుతో అనుభవించాలి. టూరిస్టు ప్యాకేజులతో వెడితే అనుభవానికి రానిదది.
నేను ఉదయము లేచి, క్రియా యోగా చేసుకొని, కొంత జపము చేసేదాన్ని. ఏడు దాటాక ఎండ వచ్చేది. ఎండలో నడిచి గంగకు వెళ్ళటము, వడ్డున అమ్ముతున్న పూలు అగరుబత్తి కొని తీసుకుపోయేదాన్ని నదికి పూజ చెయ్యటానికి. నాకు నీరంటే చాలా భయముండేది, కారణము నా చిన్నతనమున చెరువు నీటిలో మునిగి మా పెద్దన్న చనిపోయారు. అది నేను చాలా చిన్నతనములో వుండగా జరిగింది. నాకు అప్పటినుంచి నీళ్ళలో మునకంటే బాగా భయం. కానీ గంగ మీద వున్న భక్తి ఆ భయాన్నీ జయించింది. అందుకే వడ్డున వున్న గొలుసు పట్టుకు రాయి చాటున మూడు మునకలూ వేసి వడ్డుకు వచ్చేసే దాన్ని. గంగా ప్రవాహము చాలా వేగము. అందుకే రుషీకేష్‌లో, హరిద్వార్‌లో గంగ వడ్డున గొలుసులు వుంటాయి. అక్కడ స్థానికంగా వుండే వారు గంగలో ఈదుతూ తిరుగుతారు. ప్రవాహము వారిని దడిపించదు.
వడ్డున అలా ఆ తడి బట్టలతో కూర్చొని విష్ణు సహస్ర నామము చదివి, తిరిగి కొంత జపము చేసేదాన్ని. రెండు గంటల సమయము గంగ వడ్డున గడిపి మెల్లగా మళ్ళీ ఆశ్రమము చేరి, కొంత ఫ్రెష్ అయి వచ్చి గుడిలో కూర్చొని గురు చరిత్ర పారాయణ చేసేదాన్ని. మధ్యాహ్నము భోజనానికి పిలిచినప్పుడు ప్లేట్లు పట్టుకు వెళ్ళటమూ, ఒకసారి వడ్డించుకు తిని, ఆ ప్లేటు కడిగి దాని స్థానములో వుంచి వెనకకు వచ్చెయ్యటము. రుషీకేష్‌లో నేనున్న ఆ సమయము ఎంతో ప్రశాంతముగా సాగింది. నాకు వుంటే రుషికేష్‌లో తప్ప మరో చోట వుండకూడదని బలంగా అనిపించింది కూడా.
ఆశ్రమములో భోజనము పూర్తిగా ఉచితము. ఎంతో ఖర్చు అవుతుందనుకున్న రుషీకేష్ చాలా తక్కువ ఖర్చులో జరిగింది. నేను ఆశ్రమము వదిలి వచ్చేసేటప్పుడు నేను అక్కడ ఖర్చు అవుతుందని అనుకున్నది మొత్తము అన్నదానానికి కట్టి వచ్చేశాను. మనము స్వామికి సమర్పించాలి. స్వామి మనలను దీవించాలి అని నా భావన.
***
‘క్రియా యోగా’ అన్నది నేను కొన్ని సంవత్సరముల క్రిందట అట్లాంటాలో YSS వారు ఇచ్చినది (initiate) తీసుకున్నాను. YSS అంటే యోగదా సత్సంగు సొసైటీ. శ్రీ పరమహంస యోగానంద మొదలుపెట్టారు ఈ సొసైటీని. క్రియను ప్రపంచ వ్యాప్తంగా చేసినది కూడా వారే. కాని ఈ క్రియ గురించి మనకు పూర్వము నుంచే వుండేది. భగవద్గీతలో మొదట దాని ప్రస్థావన వుంటుంది.
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యంవివస్వాన్ మనసే ప్రాహ మను రిక్ష్వా కవే బ్రవీత్ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుఃస కాలేనేహ మహతా యోగ నష్టఃపరంతప” భగవద్గీత 4:1:2.
కృష్ణుడు ఈ యోగమును తానే ఉపదేశించానని చెప్పాడు. అది ఋషులకూ తదనంతరము తరతరాలుగా పరంపరగా అందచెయ్యబడుతున్నది. ఆ యోగాపద్ధతినే మహావతార్ బాబాజీ సులువుగా వుండటానికి ‘క్రియాయోగ’మని పేరుపెట్టారు. ఈ యోగా ద్వారా ఆక్సిజన్ ఎక్కువ ప్రవహించి శరీర తరుగుదల తగ్గుతుంది. శరీర వ్యాయామం, మనో నిగ్రహం, ఓంకారము మీద ధ్యానము కలిపి క్రియాయోగా అవుతుంది.
మహావతార బాబాజీగా భక్తులు నమ్మతున్న బాబాజీని ఎవ్వరూ దర్శించలేదు. వారు సశరీరులుగా 2500 సంవత్సరాలనుంచీ వున్నారని, అర్హత కలిగిన భక్తులకు మాత్రమే దర్శనమిస్తారని అంటారు. వారి గురించి ప్రపంచానికి మొదట శ్రీ పరమహంస యోగానందా వారి ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగీ’ ద్వారా తెలిసింది. మహావతార్ బాబాజీనే శ్రీ లహరి మహాశయకు క్రియా నేర్పి గృహస్థు భక్తులకు బోధించమని చెబుతారు. అలా మనకు క్రియా లభ్యమైనది. ఈ క్రియా యోగా మూలముగా ఇహ లోక లాభాలతో పాటూ పరలోక లాభాలు కూడా వుంటాయి. మేము నేర్చిన కొన్ని రోజులు నేను పరమ శ్రద్ధ చేసేదాన్ని. కొంత కాలానికి నాకు ఎంతో కాలముగా బాధపెట్టే నడుము నొప్పి మాయమయ్యింది. కొంత కాలము తరువాత అట్లాంటాలోని మా క్రియా ఇన్చార్జు చెప్పారు “ఆ గురుజీతో ఏదో సమస్య వుంది, చేస్తున్నది తప్పు” అని. మాకు నిరుత్సాహము కలిగి మానేశాము. మానేసినా నేను ప్రాణాయమము చేస్తూ వుండేదానిని. పైనుంచి జపమంటూ కుదిరినంతగా కళ్ళు మూసుకు కూర్చోవటము కూడా మానలేదు.
నాకు తరువాతి కాలములో జగదంబ కృపన సరి అయిన క్రియా గురువు దొరికి మళ్ళీ క్రియా యోగములోకి ప్రవేశించాను. శారీరిక రుగ్మతలకు మాత్రము నిత్యము క్రియా చక్కటి ఉపాయము. నేటి కాలములో వున్న జీవన వత్తిడికి కూడా క్రియా యోగా సమాధానము. భారతదేశములోనే కాదు ప్రపంచమంతటా ఈ క్రియాయోగా చాలా ప్రసిద్ధి పొందింది. హైద్రాబాదు వాసులు అదృష్టవంతులు. లహరి మహాశయ మనుమల ద్వారా పరంపరగా వస్తున్న క్రియా గురువు ఒకరు హైద్రాబాదుకు చెందినవారే. అలా భారతదేశములో ఐదు మందే వున్నారు.
నేను రుషికేష్ ఆశ్రమము వచ్చిన మరునాడు గమనించా, నాకు అవపోశనకు పంచపాత్ర ఇత్యాదివి తెచ్చుకొవటము మరిచిపోయాను. నేను మంత్రము అంగన్యాసాలతో చెసేదాన్ని కాదు కాని మాములు సంకల్పానికైనా నా వద్ద ప్రాత లేదు. పైపెచ్చు నేను ఒక స్వెట్టరు మాత్రమే తెచ్చుకున్నాను. చలి నేననుకున్నదానికన్నా ఎక్కువగానే వున్నది అక్కడ. ఆశ్రమములో వున్న బదరి అర్చకులు దగ్గరలోని బజారు వివరాలు చెప్పాడు. త్రివేణి సంగమము మంచి మార్కెటు. అక్కడ సమస్తము దొరుకుతాయి. సాయంత్రాలు అక్కడ హారతి కూడా జరుగుతుంది. నేను వెళ్ళి రాగి పాత్ర ఇత్యాది పూజా సామాగ్రితో పాటూ ఒక ముడి వూలు శాలువా, ముడివూలు పైజామా తెచ్చుకున్నాను.
(సశేషం)
సంధ్య గారు చాలా చక్కగా రాస్తారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™