యద్దనపూడి సులోచనారాణి గారి ‘సెక్రెటరీ’ వచ్చి 55 ఏళ్ళయిన సందర్భంగా ఆ నవల గురించి చిన్న వ్యాసాన్ని అందిస్తున్నారు డా.సిహెచ్. సుశీల.
***
జ్యోతి మాసపత్రిక మొదలుపెట్టిన బాపు, రమణలు ఏ సుముహూర్తాన యద్దనపూడి సులోచనారాణి ఇంటికెళ్ళి ఓ నవల రాయమని అడిగారో గానీ తెలుగు నవ్య నవలా చరిత్రకి అదో మధురమైన సన్నివేశం. అప్పటికి కథలు మాత్రమే రాస్తున్న ఆమె, గర్భవతిగా వుండి, నవల రాయడం సాధ్యమౌతుందా అని సంశయిస్తూనే వారిద్దరి ప్రోత్సాహంతో, తనకెంతో ఇష్టమైన సరస్వతీదేవి ప్రతిమ ముందు నిలబడి, నమస్కరించుకొని, ఒక తెల్ల కాగితం మీద ‘సెక్రటరీ’ అని రాసి, తన పేరు రాసి వారికిచ్చేసారు. వారు ‘త్వరలో’ అని ప్రకటన ఇచ్చేసారు. అప్పటివరకు పంతులమ్మ వంటి సాంప్రదాయ ఉద్యోగాలు చేసుకొనే తెలుగు నవలా నాయిక ఒక్కసారి ఇంగ్లీషు లోని ‘సెక్రటరీ’ అయిపోయింది, ఆ రచయిత్రి ఇచ్చిన అందమైన మలుపుతో. ఇప్పటికి యాభై ఐదేళ్ళలో ఎన్నిసార్లు పునర్ముద్రింపబడింది! ఎందరు అభిమాన పాఠకుల్ని సొంతం చేసుకుంది!!
సెక్రటరీ! ఎవరి దగ్గర! ఆషామాషీ వ్యక్తి కాదు. ఆరడుగుల అందగాడు, నల్లటి ఒత్తయిన క్రాప్‌తో, పొడవాటి కారులో తిరిగే రాజశేఖరం దగ్గర! ‘మై గాడ్’ అని జయంతి గుండె మీద చెయ్యి వేసుకొని హాశ్చర్యపోయేంత బిగ్ బిజినెస్‌మేన్. అయితేనేం! తన ఆత్మాభిమానాన్ని ఏనాడూ వదులుకోలేదు. వనితా విహార్ వాళ్ళు ఉద్యోగం ఊడగొడితే, ఎర్రటి ఎండలో బస్ కోసం ఎదురు చూస్తూ, చేతిలోని పర్స్‌లో ఉన్న చిల్లర డబ్బుల్ని తలుచుకునే జయంతి ఓ మామూలు మధ్యతరగతి అమ్మాయి.
తన పుట్టినరోజుకి రాజశేఖరం పంపిన గులాబీరంగు చీర తనకెంతో నచ్చినా, రెండు మూడు సార్లు కట్టుకునే సరికి “ఈ చీర తప్ప నీకింకొకటి లేదా” అన్నాడని, చీరతో పాటు రిజిగ్నేషన్ లెటర్ విసిరికొట్టగల ఆత్మగౌరవం ఆమె సొంతం. అపెండిక్స్ ఆపరేషన్ జరిగి, స్పృహ లేని స్థితిలో, గత్యంతరం లేక అతని ఇంటికి వచ్చినా, “అతను పరాయివాడు కాడు” అని బామ్మ పదేపదే అంటుంటే విసుక్కుంది. అతనింట్లో ఊరికే తిని కూర్చోడం ఇష్టం లేక “నాకేదైనా పని చెప్పండి” అని మొండిగా అడిగితే, తన సొంత పనులు చెయ్యమని చెప్తాడా! ఎంత ధైర్యం! పూలు గుచ్చుతూ వచ్చిందేమో, చేతిలో ఉన్న సూదితో అతని భుజం మీద గుచ్చాలన్నంత రోషం రాలేదూ!
ప్రభాకరం తెచ్చి ఇచ్చిన పూలగుత్తి పట్టుకొని అలా నిద్ర లోకి జారిపోయి, మధ్య రాత్రిలో ఏదో కల వచ్చి కెవ్వుమంటే, పక్కగదిలోంచి రాజశేఖరం వచ్చి, మంచినీళ్ళిచ్చి “నీకు కావాలంటే ఈ గదంతా పూలతో నింపేస్తాను. ఆ వెధవ పూలు తియ్” అంటూ పూలగుత్తిని గది మూలకు విసిరేస్తే, ఆ అధికారానికి – చిత్రం, ఎందుకో కోపం రాలేదు. అతను చెప్పకపోయినా అతని మనసేమిటో తెలుస్తూనే వుంది. దానికి ఆనకట్ట వేయాలని బాగా ఆలోచించి, అతి తెలివి తేటలతో రాఖీ కట్టాలని వెళ్ళింది. “రాఖీ ఎవరికి కడతారో తెలుసా” చురుగ్గా అడిగిన అతని ప్రశ్నకి తెలుసన్నట్టు తలూపింది. “అయితే కట్టు. నీకు సోదరున్ని, స్నేహితున్ని, అన్నీ కలిసిన…” అని ఆపేస్తే, ‘పూర్తి చేయవచ్చుగా’ అనిపించింది. కానీ, రేఖారాణి వచ్చి ఏవేవో చెప్పింది. అతని పట్ల కృతజ్ఞతో, భయమో, ప్రేమో… అతన్ని వదిలి పారిపోయింది.
ఎన్నెన్ని సంఘటనలు! ఎన్నెన్ని బాధలు! ఎన్నోసార్లు అనుకున్నది ‘రాజశేఖరం వచ్చి ఈ సమస్యల నుండి బయటపడేస్తే బాగుండు’ అని. డాక్టర్ విజయలక్ష్మికి రాజశేఖరం తెలుసు. తననడిగి అన్నీ తెలుసుకొంది. బలవంతాన తనని అతని దగ్గరకు పంపిస్తే సంతోషంగా వచ్చేసింది, అన్ని సంకోచాలూ వదిలేసి. అయినా మనసులో ఎక్కడో భయంగానే వుంది. అనుకున్నట్టే “ఎందు కొచ్చావ్” అన్నాడు. ఏదో చెప్పబోతుంటే “నా ఉత్తరం అందిందా” అన్నాడు విసురుగా. “లేదు” అంటే, ఉత్తరం అందకపోతే ఎందుకొచ్చినట్టు అంటాడేమిటి? “బుద్ధి లేక” అంది తను నిజంగానే విసుగొచ్చి. కానీ, తర్వాత ఉత్తరం రావడం, అతను తనకు బంధువనీ, బామ్మ అందుకే అతన్ని అభిమానించిందనీ తెలుసుకొంది. అయితే బంధువని తెలియక ముందే ‘అతని కోసం’ వచ్ఛేసిందిగా తను. దటీజ్ జయంతి. అప్పటినుండి ఇప్పటివరకు, ఎన్ని రకాలుగా విమర్శించినా ‘సెక్రటరీ’ ఒక అందమైన జ్ఞాపకం.


కలలరాణి కాదామె. మధ్యతరగతి ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని ప్రతి నవలలోనూ ప్రస్ఫుటంగా చెప్పే నవలా రాణి యద్దనపూడి సులోచనారాణి. ఎందరి గుండెల్లోనో గూడు కట్టుకున్న ధన్యజీవి. తిట్టుకుంటూనే చదివే చిత్రమైన పాఠకులు ఆమె కున్నట్లు ఇంకెవరికీ ఉండరేమో!

7 Comments
Jhansi koppisetty
సెక్రటరీ నిజంగానే అందమైన గొప్ప స్మృతి… మీరిలా మళ్ళీ గుర్తుచేసి నవలా రాణి యద్దనపూడి గారిని తలపించారు… నాకు మీ అంతగా మెమొరీ లేకపోయినా లీలగా జయంతి ఆత్మాభిమానం గుర్తు వస్తోంది…మళ్ళీ చదవాల్సిందే


సిహెచ్.సుశీల
ధన్యవాదాలండి.
శీలా సుభద్రా దేవి
మధ్యతరగతి మహిళల్ని వారి ఖాళీ సమయాన్ని పుస్తకంపఠనం వైపు మళ్ళించిన సులోచనారాణి అపూర్వ నవల సెక్రటరీ నీ మరోసారి గుర్తు చేశారు.సుశీలగారూ అభినందనలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చిన్నప్పుడు చదివిన, చదివించిన,నవల, ఎన్నటికీ
మరచి పోలేని నవల, మీ మాటల్లో గుర్తు చేసారు.
యవ్వనం లోనికి అడుగు పెట్టిన ఆడపిల్ల ,తనకు కబోయే సహచరుడు అక్షరాల రాజశేఖరం లా,వుండాలని
వూహాలోకంలో వూగిపోయేలా చేసిన నవల,చదవడం మొదలు పెడితే, పూర్తి చేసేవరకూ,వదలి పెట్టలేని నవల
యద్దనపూడి గారి నవలా రచనల్లో, మైలురాయి
సెక్రెటరీ నవల.
సుశీల గారు గుర్తు చేసిన విధానం బాగుంది. ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు. నవలారాణికి నివాళి.
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు డాక్టర్ గారు.
పుట్టి. నాగలక్ష్మి
యద్దనపూడి గారి ‘సెక్రటరీ’ ని ఈ తరానికి పరిచయం చేశారు.. అభినందనలు… మరియు ధన్యవాదాలు సుశీల గారికి, సంచికకు..
Annapurna
YSRANI rachana saili valana antaga chadivimpachesaie.
ika youvtee yuovakula premakathale vruttantamga rasina oke okka rachaietri. bahumukha prajna sali. kevalam phonelo parichayam chesukuni modatisari matadinappudu ”avida cheppina mata…..
nenu chala sannga vuntanu. lavuga bodduga vundalani vundedi”annappudu ascharyam anipinchindi.anta aatmeeyamga matadinanduku. appatinunchi ippativarakoo gurtuvundipoiena ranee avida okkarenemo.
rachanalekadu matade vidhanamkooda vannetestundani avidanu choosinavaru anukuntaru!