“మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా? ” అన్న యాడ్ వినగానే చిన్నప్పుడు ఆదివారం నాడు పిల్లలందర్నీ దంచిన ఉప్పుతో పళ్ళు తోముకోమనే పెద్దవాళ్లెవరో గుర్తొచ్చి ఆ పేస్ట్ వైపు ఆకర్షితులమవుతాం.
అందమైన పదాల పొందిక ఒక ప్రకటన. ఆ ప్రకటన జీవమంతా ఒకే ఒక్క మాటలో ఉంటుంది. అలాగే వస్తువుల్లో ఒక చక్కని గుణం ఆ వస్తువును కొనేట్టు చేస్తుంది. దాన్నే సెల్లింగ్ పాయింట్ అంటాం. ఒక ప్రత్యేక సుగుణం కోసం ఆ వస్తువు కొంటాం. ఒక సబ్బు యొక్క అరుగుదల ఎక్కువైనా, ఓ రూపాయి ఎక్కువైనా సువాసన కోసం దాన్నే జనం కొనుక్కుంటారు. అలాగే కొందరు పరిమళం తక్కువైనా ఎక్కువకాలం మన్నిక కోసం మరొక రకం సబ్బు నిష్టపడతారు.
అలాగే మనుషులు కూడా. ప్రతివారిలో కొన్ని సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ మంచి లక్షణం వాళ్ళని సేల్ చేస్తుంది అంటే చలామణీ చేస్తుంది. దాని వల్ల వారికి నలుగురిలో గుర్తింపు దొరకటమే కాక, పది మంది వారితో స్నేహం చేస్తారు.
కొంతమందికి చక్కని సలహాలిచ్చే సామర్థ్యం ఉంటుంది. ఒకోసారి అనుకోని పరిస్థితుల్లో మనకి బుర్ర పనిచెయ్యనప్పుడు వాళ్ళు ఒక చిట్కా చెప్తారు. దాన్ని పాటించి మనం ఒడ్డున పడుతుంటాం .
కొందరికి ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. అందువల్ల అటువంటివారిలో అనేక లోపాలున్నా మనం క్షమించి వదిలేస్తాం. మంచి సబ్జెక్టు ఉన్న మాస్టారికి ముక్కు మీద కోపం ఉంటుంది. అయినా ఆయనంటేనే మనకి గురుభావం. విషయం లేని మాష్టారు మనతో ఎంత స్నేహంగా ఉన్నా ఆయనని మనం గౌరవించలేం.
బంధువుల్లో కొందరు జిడ్డుగాళ్ళుంటారు. విసిగిస్తారు. అయినా వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే వచ్చి చెప్పిన పని చేసిపెడతారు. అంచేత వాళ్ళని వదల్లేము.
ఒక అతి వాగుడు ఆంటీ ఉంటుంది. గోల గోలగా ఉంటుంది. ఆ అధిక ప్రసంగితనం ఎవరికీ నచ్చదు. అయితే ఆవిడ నలుగురికి సాయం చేస్తుంది. ఎక్కడికి రమ్మన్నా షాపింగ్ కోసమైనా, హాస్పిటల్ కోసమైనా తోడుగా వస్తుంది. అంటే ఆవిడ తన సొంత సమయాన్ని ఇతరులకి దానం చేస్తుంది. అదావిడ సెల్లింగ్ పాయింట్. అందరూ ఆమెను అయిష్టంగానైనా భరించడానికి ఇదే కారణం
మరొక పెద్దావిడ అసలు మాట్లాడదు. తలుపేసుకుని కూర్చుంటుంది. అయితే ఎవరన్నా వెళ్లి తలుపు తట్టి అడిగితే చిన్నా చితకా అప్పులిస్తుంది. ఓపిగ్గా ఎదురు చూస్తుంది కానీ తీర్చమని వెంటపడదు. అదావిడ సెల్లింగ్ పాయింట్. అందుకే అంతా ఆమెను అభిమానంగా పలకరించి పోతుంటారు. అందరికీ అప్పు అవసరం లేకపోయినా ఆవిడ మంచితనం ఇతరులకు ఆవిడపై అభిమానాన్ని కలిగిస్తుంది.
కొంతమందికి బంగారం, వెండీ కొనే అనుభవం ఉంటుంది. ఇంకొందరికి చీరల సెలక్షన్లో నైపుణ్యం ఉంటుంది. ఇటువంటి వారిని ఇంట్లో పెళ్లి తలపెట్టినవారు ఉన్నవారు పల్లకీ ఎక్కించి తీసుకువెళుతుంటారు. కొందరికి సమాజ సేవ చేసే సద్గుణం ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనుల కోసం ముందుకు వచ్చి ఆర్థికంగానో మరో రకంగానో సేవ చేస్తుంటారు. ఇటువంటి వారు నిజంగా గొప్పవారు. వీరు అందరి చేతా కీర్తింపబడతారు.
ఎవరన్నా చనిపోతే కొందరు “నేనున్నాను కదా” అంటూ ధైర్యం చెప్పి పరుగున వచ్చి తక్షణ కార్యాలు నిర్వహిస్తుంటారు. అటువంటి వారిని గౌరవించకుండా ఉండలేరెవరూ.
కొందరు రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉండి పైరవీలు చేస్తూ తెలిసిన వారికి ప్రభుత్వంలో అవ్వవలసిన పనులు లేదా సమస్యల పరిష్కారంలో సహాయం చేస్తూ ఉంటారు. వారికున్న రాజకీయ పరపతి వల్ల వారికి కొందరు శిష్యులు ఉంటూ ఉంటారు. అది కూడా గొప్ప సంగతే.
ఏ విధమైన సెల్లింగ్ సామర్ధ్యం లేని వారు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. తమలో ఒక చక్కని సెల్లింగ్ పాయింట్ ఉంచుకోవాలన్న తపన ప్రతివారిలోనూ ఉంటుంది. అది సహజంగా రావాలి తప్ప తెచ్చిపెట్టుకున్నా రాదు. నటించినా అందరికీ తెలిసిపోతుంది. ఊరికే మన తిండి మనం తిని మన టీవీ ముందు మనం కూర్చుంటే నలుగురు మనకోసం రారు. ప్రేమ అందిస్తేనే ప్రేమ దొరుకుతుంది. అంతేగా మరి !

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
1 Comments
Dr Trinadha Rudraraju
Mee “rangula hela” ni ela polchalante…Maa ammamma garintlo oka pedda rangampetti undedi. Daaniki streelu pettukunee vaddanam mari aravankeelu laa Ittadi.patteelundevi.
Appudappudu pette open chesinappudu dantlo viluvina mariyu aakarshamantamina vastuvulu (bangaram, vendi, inkaa vagaira), choosinavaina…pratisaari krottaga undevi.
Every month your column replenishes memory towards one’s own.. good n great job.