[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]


చతుర్థ సర్గ
ఉత్సవా నామ కామాస్త్రం గయనా నయనోత్సవా।
లాస్య తాండవ నృత్యజ్ఞా న కేషాం రంజవా భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 10)
లాస్యం, తాండవ నృత్యం తెలిసిన వారు, ఉత్సవ అనే గాయని కామదేవుడి అస్త్రం లాంటిది. ఆమె గానం విని, మనోరంజితుడు కాని వాడెవడు? అంటే, ప్రతి ఒక్కరినీ తన గానంతో, నృత్యంతో ‘ఉత్సవ’ మంత్రముగ్ధుల్ని చేసిందన్నమాట.
‘ఉత్సవ’ అన్న గాయని శ్రీవరుడు ప్రస్తావించటం వల్ల , ఆమె ఆ కాలంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన గాయని అనీ, ఆమె ఎంతో సుందరమైనదనీ తెలుస్తోంది. జైనులాబిదీన్ పాలన కాలంలో దేశ, విదేశాల నుంచి పేరు ప్రఖ్యాతులు పొందిన కళాకారులు కశ్మీరు వచ్చి చేరారు. జైనులాదిబీన్ వారిని సముచితంగా సత్కరించి, వారికి తన రాజ్యంలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. తగిన రీతిలో భుక్తికి ఏర్పాట్లు చేశాడు. ‘ఉత్సవ’ అన్న పేరు బట్టి సులభంగా గాయని ‘హిందువు’ అని గ్రహించవచ్చు. ‘ఇస్లాం’ ప్రకారం గానం, నాట్యం వంటివి కొన్ని సందర్భాలలో తప్ప నిషిద్ధం. ముఖ్యంగా మహిళలకు, పెళ్ళి సందర్భాలలో తప్ప నిషిద్ధం.
వివాహ సందర్భాలలో ‘ఢఫ్’ వాయిద్యం మాత్రమే ఉపయోగిస్తూ, వివాహ సంబంధిత పాటలు మాత్రం మహిళలు పాడవచ్చు. ఈ పాటలలో కూడా మహిళలకు సంబంధించిన వర్ణనలుండకూడదు (అదాబ్ అల్-జసాఫ్, పేజీ 93).
నాట్యం కూడా మహిళలకు నిషిద్ధం.
“Dancing is makrooh in principle, but if it is done in the western manner or in imitation of the kaafir women, then it becomes haraam, because the Prophet (peace and blessings of Allaah be upon him) said: “Whoever imitates a people is one of them.”
(Liqa’ al-Baab al-Maftooh, q. 1085.)
‘మక్రాహ్’ అంటే అసహ్యించుకోదగినది. ప్రధానంగా మహిళలు నృత్యం చేయటం అన్నది అసహ్యించుకోదగినది. అదీ ఇస్లామేతర మహిళలను అనుకరిస్తూ నృత్యం చేయటం ఇంకా అసహ్యిచుగోదగ్గది. ఎందుకంటే, ఎవరినీ అయితే అనుసరిస్తున్నామో, పరోక్షంగా మనం వారు అయిపోయినట్టు. ఇస్లామేతరుడవటం అన్న అలోచనకే కుదరదు. కాబట్టి ఎవరినీ అనుకరించవద్దు.
అలాగే, మహిళలు పురుషుల ముందు నృత్యం చేయటం కూడదు. మహరామ్, మహరామేతరులు, మహిళల ముందు కూడా నృత్యం చేయగూడదు.
‘మహరామ్’ అంటే రక్త సంబంధీకులు, బంధువులు. ఎవరినయితే తలపై అచ్ఛాదన లేకుండా కలవవచ్చో, ఎవరితో కరచాలనం చేయవచ్చో, ఎవరిని కౌగిలించుకోవచ్చో వారంతా ‘మహరామ్’లు. వీరి ముందు కూడా నృత్యం చేయకూడదు. పాడటం కూడా నిషిద్ధం. పాడినా నషీద్ గీతాలు మాత్రమే పాడాలి. ఇవి భక్తితో పాటు మంచి మాటలు చెప్తాయి.
ఇలా మతపరమైన నిబంధనలుండటంతో, ఆ కాలంలో పేరు పొందిన గాయనీగాయకులు, నృత్య కళాకారులు అధికంగా ఇస్లామేతరులు అయి ఉండేవారు. లేదా, ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఇస్లామేతర మతాల కళాకారులు ఉండేవారు. అందుకే సుల్తానుల కాలంలో అధిక శాతం నృత్యగత్తెలు ఇస్లామేతరులు. సంగీత విద్వాంసులు ఇస్లామేతరులు. నిర్వాణ సోపాన అధిరోహణం కోసం సృజించిన సంగీతం నుంచి భగవద్భావనను తొలగించి, ప్రేమ గీతాలు, విరహగీతాలతో లలితంచేసి సుల్తానులను మెప్పించటంకోసం ఈ సంగీత కళాకారులు శాస్త్రీయ సంగీతాన్ని రూపాంతరమోందించారు. ఇది ఈనాడు హిందుస్తానీసంగీతంగా చలామణీ అవుతోంది.
అయితే, యుద్ధ గీతాలు, తీర్థయాత్రల గీతాలు, పండుగల గీతాలు ఇస్లాం అరంభం అయిన సంవత్సరాల నుంచీ అమలులో ఉన్నాయి. ప్రార్థనా పిలుపు ‘ము అద్ధీన్’ను పాడేందుకు అబిస్సీనియన్ గాయకుడు ‘బిలాల్’ను మహమ్మద్ ప్రవక్త స్వయంగా నియమించారు. తాను గెలుచుకున్న వారితో సంపర్కం వల్ల, వారిలోని సంగీతజ్ఞుల వల్ల సంగీతం కొత్త పుంతలు తొక్కింది. ఆ కాలంలో ‘అజ్ఞ అల్-మల్యా’, జమీలా వంటి పేరు పొందిన గాయనిలు ఉండేవారు. పదవ శతాబ్దంలో అబు-అల్ ఫరాజ్ అల్ హోత్తు ‘కితాబ్-అల్-అఘని’ సంగీత పుస్తకం రచించాడు. కానీ పలు కారణాల వల్ల మహిళల నృత్యం, గానం వంటి అంశాలపై ఆంక్షలు రాను రాను పెరిగాయి. భారత్లో మఖ్యంగా కశ్మీర్లో ఇస్లాం వేళ్ళూనుకుంటున్న కాలంలో మతమౌఢ్యం తీవ్రంగా ఉండటంతో పలువురు పర్షియన్ రచయతలు జైనులాబిదీన్ను ఈ అంశం ఆధారంగా విమర్శించారు.
భావానేకోన పంచశతసంఖ్యాంస్తానాంశ్చ తావతః।
దర్శయంత్యో బభుః పాన్యస్తా ముర్తా ఇవ మూర్ఛనాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 11)
49 విభిన్న భావాలను నటీమణులు ప్రదర్శించారు. ఇన్ని రాగాల ప్రదర్శనతో వారు మూర్తిభవించిన మూర్ఛనల్లా శోభించారు.
ఈ శ్లోకంలో శ్రీవరుడు సంగీతం, సాహిత్యం, నృత్యాలకు సంబంధించిన అంశాలతో అంత సుందరమైన పోలికలను సృష్టించాడు.
49 విభిన్నమైన భావాలను ప్రదర్శించిన నర్తకి మూర్తీభవించిన మూర్ఛనలా శోభించిందిట.
‘మూర్ఛన’ అంటే ‘స్వరాణామ్ క్రమేణ ఆరోహవరోహణామ్’.
క్రమ పద్దతిలో ఆరోహణ అవరోహణలను ప్రదర్శించే స్వరాన్ని ‘మూర్ఛన’ అంటారు. స్వరారోహణ, స్వరవిన్యాసాలు, నియమిత ఆరోహణ అవరోహణలతో మధురమైన స్వర విన్యాసం, లయ పరివర్తనం, స్వర సామంజస్యం, స్వరమాధుర్యం వంటి వన్నిటినీ కలిపి ‘మూర్ఛన’ అంటారు.
నిజానికి ‘మూర్ఛన’ గురించి లోతుగా తెలుసుకుంటే సంగీత సృజనలో మన పూర్వీకుల లోతైన విశ్లేషణ, అధ్యయనాల గురించి అవగాహన కలుగుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాగంలో ఫలానా మూర్ఛనలుంటాయని ఒకప్పుడు రాగం వివరణ ఉండేది. ఇటీవలి కాలంలో శుద్ధ, కోమల, తీవ్ర స్వరాల ఆధారంగా రాగాలను గుర్తిస్తున్నారు. ఏదైనా ఒక స్వరాన్ని ‘పడ్జమం’లా గుర్తించి ఇతర స్వరాల ఏర్పాటు చేయటం ‘మూర్ఛన’ అని మరొక నిర్వచనం ఉంది. అంటే స్వరాల ఆరోహణ, అవరోహణలను క్రమబద్ధంగా పలుకుతూ ప్రదర్శించే పలు విభిన్నమైన అందమైన స్వర విన్యాసాలు ‘మూర్ఛనలు’ అన్నమాట. ఆమె ‘మూర్తీభవించిన మూర్ఛనలు’ అని ఎందుకని అన్నాడంటే ఆమె విభిన్న రకాల భావాలు ప్రదర్శించింది కాబట్టి. సంగీతానికి స్వరాలు ఎలాగో నాట్యానికి భావాలు అలాగ.
‘మనస్సులోని వికారాలను శరీరంలో, వదనంలో ప్రదర్శస్తే అది ‘భావం’ అవుతుంది. నటన అంటే, కనులలో, కనుబొమ్మలలో, అధరంలో, వదనంలో, గళసీమలో, కటిసీమలో, కర, పద, యుగళాలలో, తనువులలోని అణువణువులో అనంత విధాల అభినయించి భావాలు పలికించడం.
కావ్యంలో స్థాయి, గౌణ లేక వ్యభిచారి, స్వాత్వికం మూడు భావాలున్నాయి. నటనలో నటుడు ప్రదర్శించే భావాల వల్ల, ఎలాగయితే సంగీతంలో ఆరోహణ, అవరోహణ స్వరాల వల్ల శ్రోతల హృదయాల స్పందిస్తాయో, అలాగే ప్రేక్షకుల హృదయాలు స్పందిస్తాయి. భావం నుంచి రసం ఉత్పన్నమౌతుంది. కాబట్టి నాట్యం చేసేవారు భావం – రసాల నడుమ సంబంధాన్ని అర్థం చేసుకోక తప్పనిసరి. ఒక సాహిత్య సృజనకారుడికి కూడా అక్షరాల ద్వారా తాను సృష్టించే భావం, తన వల్ల ఉత్పన్నమయ్యే రస స్వభావం గురించి తెలిసి ఉండటం తప్పనిసరి.
భరతముని నాట్య శాస్త్రం ప్రకారం నాలుగు రకాల భావాలను గుర్తించారు. స్థాయీ భావం, విభావ భావం, అనుభావ భావం, సంచారి లేక వ్యభిచారీ భావం.
8 స్థాయీ భావాలు, రెండు రకాల విభావ భావాలు, 33 వ్యభిచారీ భావాలు, 8 సాత్విక భావాలు మొత్త కలిసి 49 భావాలుంటాయి. పండితరాయలు 34 కావ్యభావాలను విశదీకరించాడు (భావాల వర్గీకరణలో భరతముని వర్గీకరణను ప్రస్తావించినా, కశ్మీరంలో విభావ అనుభావల ప్రస్తావన కన్నా సాత్త్విక భావాల ప్రస్తావన అధికం). శ్రీవరుడు కూడా 8 స్థాయీ భావాలు, 8 సాత్త్విక భావాలు, 33 వ్యభిచారీ లేక సంచారీ భావలను కలిపి 49 భావాల ప్రదర్శన అన్నాడు (సంగీత దామోదరం ప్రకారం స్వరంలో ఉత్పన్నమైన రాగాభావాలు 49). అలల్లాగా భావాలు హృదయంలో భావాలు కలిగిస్తాయి కాబట్టి ఆరోహణ, అవరోహణలు వల్ల అలల్లాగా భావాలు రాగాల ద్వారా కలిగించే మూర్ఛనలను 49 భావాలతో పోల్చాడు. నాట్యం చేసే వారిని మూర్తీభవించిన ‘మూర్ఛనలు’ అన్నాడు. సంగీతం, సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడి రససృజన చేస్తుంటే దర్శించిన అనుభవించిన రసహృదయలైన ప్రేక్షకులు ధన్యులు. వారి ఆదృష్టమే అదృష్టం. అలాంటి ప్రేక్షకులు లభించటం కళాకారుల అదృష్టం.
యాసాం నృత్యే చ గీతే చ త్త్వత్తో మేస్త్య ధికం సఖమ్।
ఇతి వాదోభవ ఛోత్రనేతయోః ప్రేక్షణక్షణే॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 12)
వారు అద్భుతమైన నృత్యం, గీతాలు ప్రదర్శిస్తుంటే ప్రేక్షకుల చెవులు, కళ్ల నడుమ నేను అధిక సౌఖ్యం అనుభవిస్తున్నానంటే నేను అధిక సౌఖ్యం అనుభవిస్తున్నా నన్న విషయంపై వివాదం చెలరేగింది.
పాత్రీగానపికధ్వానే రంగోద్యానే తదార్యుతన్।
దీపచంపకమాలాస్తా మధుపైః పరితో వృతాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 13)
వేదికపై నున్న పాత్రలు కోకిలల్లా, వేదిక ఉద్యానవనంలా, వేదిక పైని దీపాలు చంపక పుష్పాల మాలలుగా, పుష్పాల చుట్టూ భ్రమరాల్లా రసపాన మత్తులో ప్రేక్షకులు ఉన్న అందమైన దృశ్యం అది.
రాజ్ఞో రాజ్యేక్షణాత్ తుష్టైనృత్యప్రేక్షాగత్ః సురైః।
దీపమాలాచ్ఛలాన్ముక్తా నూనం హేమాంబుజ ప్రజ॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 14)
నృత్యం చూసేందుకు వచ్చిన దేవతలు, రాజ్య పాలనతో సంతృప్తి చెంది రాజు చుట్టూ బంగారు పద్మాల మాలలు అమర్చినట్టు రాజు చుట్టూ దీపాల వరుసలున్నాయి.
జైనులాబిదీన్ పట్ల శ్రీవరుడి కృతజ్ఞతాభావం అడుగడుగునా తొణికిసలాడుతూ, ప్రతి అక్షరంలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.
దేవతలు రాజు పాలనను మెచ్చి బంగారు పుష్పమాలలతో ఆయనను అలంకరించినట్టు రాజు చుట్టూ ఉన్న దీపాలమాలలున్నాయి అని అనటం వెనుక శ్రీవరుడి మనస్సు నిండా ఉన్న కృతజ్ఞతలో అణుమాత్రమైనా అర్థం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న సమాజంలో సంభవిస్తున్న పరిణామాలను పైపైన పరిశీలిస్తే చాలు బోధపడుతుంది.
21వ శతాబ్దంలో, సాంకేతికంగా అభివృద్ధి చెంది, మానసికంగా పరిణతి చెందిన ప్రజల పాలన పద్ధతి ప్రజాస్వామ్యంలో ఉన్న సమాజంలో కొద్దిగా సంఖ్యాబలంతోనే ఇస్లామీయుల మతఛాందస భావం సృష్టిస్తున్న అల్లకల్లోలాన్ని గమనిస్తూ, పూర్తిగా ఇస్లామీకరణకు గురయి, సుల్తాన్ పాలనలో ఉన్న ఆనాటి కశ్మీరులో, ముంచేందుకు సిద్ధంగా ఉన్న ఇస్లాం ఛాందసవాదుల సముద్రం నడుమ భారతీయ సాంప్రదాయ నృత్య సంగీతోత్సవాలు జరగటం ఒక అద్భుతం. అనూహ్యం. అద్వితీయమైన అద్భుతం. అలాంటి అద్భుతాన్ని సాధ్యం చేసిన జైనులాబిదీన్ పాలనకు దేవతలు ముగ్ధులయి బంగారు పుష్పాలు సమర్పించకపోతే వారు దేవతలే కాదు. రాజు చుట్టూ వెలుగుతున్న దీపాలను దేవతలు సమర్పించిన బంగారు పుష్పాలలా ఊహించకపోతే శ్రీవరుడి కృతజ్ఞతా భావానికి, సృజనాత్మకతకూ అర్థం లేదు.
ఈనాడు, స్వతంత్ర భారత లౌకిక దేశంలో ‘హోలీ’ పండుగ జరపుకోవటం పెద్ద వివాదం. దీపావళి సంబరాలు వివాదస్పదం. దసరా వేడుకలు అల్లర్లమయం. రామనవమి వేడుకలు రాళ్ళ విసుర్లకు, హింసకు ప్రేరణ. ఆ హింస సమర్థనకూ కారణం. గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావటం, రాళ్లు ఇటుకలు రువ్వటం, మారణాయుధాలతో దాడులు చేయటం, ఆపై తామే దెబ్బ తిన్నట్లు, తమకు వాళ్లు కోపం తెప్పించకపోతే తాము శాంతిగానే ఉండే వారమంటూ సమర్థనలు చూస్తుంటే. ఇలాంటి సంజాయిషీలు, సమర్థనలు ఇవ్వాల్సిన అవసరం లేని కాలంలో తమ మాటకు తిరుగులేని కాలంలో ఇస్లామేతరుల పరిస్థితులు ఎంతటి ఘోరంగా దయనీయంగా ఉండేవో ఊహకు కూడా అందదు.
అద్భుత వైజ్ఞానిక, సాంకేతిక యుగంలోనే ఇంత మతమౌడ్యం ప్రదర్శిస్తూంటే మధ్య యుగంలో విజేతలుగా ఉన్న కాలంలో మతమౌఢ్యం ఏ స్థాయిలో ఉండేదో ఊహకు కూడా అందదు. అలాంటి కాలంలో, నగరంలో సంబరాలు, నృత్యాలు, గీతాలు అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా వైభవంగా స్వేచ్ఛగా ఎలాంటి అభద్రతాభావం లేకుండా జరుపుకునే వీలును కల్పించాడంటే జైనులాదిబీన్ను ప్రజలే కాదు దేవతలు కూడా అభినందించి ఆనందిస్తున్నారనటంలో ఎలాంటి ఆతిశయోక్తి లేదు.
(ఇంకా ఉంది)

1 Comments
Dr Trinadharaju Rudraraju
ఆ కాలంలోని స్థితి మరియు సంఘటనల వర్ణన సమాజం యొక్క పరిపక్వతను మరియు ముఖ్యంగా నాయకత్వ నాణ్యతను స్పష్టంగా చూపిస్తుంది.
చివరి పేరాల్లో రచయిత విశ్లేషణ నేటిసామాజిక లోపాలను వివరిస్తుంది, ఎలా కొన్ని (నిరీక్షణ) శక్తులు అశాంతికి కారణాలను, అలజడి-ఉద్రిక్తతలు కల్గుచేస్తాయో చూస్తున్నాము. గతం (చరిత్ర) అనేది ప్రస్తుతానికి కీలకం మరియు ఏ దార్శనికుడైనా నిశితంగా పరిగణించాలి.