[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]


చతుర్థ సర్గ
రజ్జుబద్ధాగమద్ దూరం జ్వలన్త్యౌషధనాలికా।
ఆహూతయే తయా నీతాస్తాదృశ్యో బహవో గతాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 23)
గతాగతాని కుర్వన్త్యో దీప్తా ఉల్కా ఇవోల్విణాః।
ప్రేక్షకాణాం ప్రియా దృష్టీరహరన్నాద్భుతావహః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 24)
అత్ర పాత్రీకరస్థాపి జ్వలన్త్యౌషధనాలికా।
ద్యులోకోన్ముక్త సద్వర్ణ స్వర్ణ పుష్ప శ్రియం వ్యధత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 25)
దారంతో కట్టిన , సూరేకారంతో నిండిన ఔషధ నాళిక జ్వలిస్తూ, నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి ఎగసింది. దాన్ని వెనక్కి పిలిచేందుకన్నట్టు బోలెడన్ని నాళికలు వెంటనే వెళ్ళాయి. ఆకాశంలోని ఉల్కల్లా ప్రజ్వలిస్తున్న ఆ అద్భుత కాంతిని ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. జ్వలిస్తున్న నాళికలను పాత్రధారులు తమ చేతుల్లో పట్టుకోవటం వల్ల వారు అందమైన రంగులలో కనిపిస్తూ వారి చేత పట్టిన నాళికలు స్వర్గలోకం నుండి వచ్చిన పుష్పాల్లా తోచాయి.
శ్రీవరుడి ఈ వర్ణనలు, అత్యంత సుందరంగా, వినూత్నంగా ఉండి, దివ్య సుందరమైన ఆ కాలం నాటి దీపోత్సవ సంబరాలను కళ్ళ ముందు నిలుపుతున్నాయి. వితస్త ఒడ్డున, రాత్రి పూట అటు ఆకాశంలోని మెరుపులు, ఇటు నీటిలో ప్రతిఫలించే అగ్నికణాలు, అందమైన ఆ దృశ్యాలు, ఆనాటి ప్రజల ఆనందసందోహాలు ఊహిస్తేనే అద్భుతం అనిపిస్తుంది. ఇవి ఏ భారతీయ రాజు పాలనలోనో కాదు, సుల్తాన్ పాలన కాలంలో జరిగిన సంబరాలు అన్నది తలచుకుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది.
భారతదేశ చరిత్రను గమనిస్తే, ఈ దేశంలో అడుగుపెట్టిన పరాయి వారంతా తమ అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశ జీవనస్రవంతిలో భాగమయిపోయారు. భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత ఇస్లామీయులు, బ్రిటీష్ వారు కూడా ఇక్కడి జన జీవన స్రవంతిలో మిళితమై తమ అస్తిత్వం కోల్పోయేవారే. ఆరంభంలో వారు కూడా భారతదేశపు జీవన విధాన సమ్మోహాస్త్రబద్ధులైపోయారు. కానీ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో వ్యవహరించారు. గమనిస్తే, పలువురు పర్షియన్ రచయితలు, కవులు, సూఫీలు భారతీయ భక్తి తత్త్వ ప్రభావంతో రాముడి గురించి, కృష్ణుడి గురించి గానం చేశారు. అమీర్ ఖుస్రో రచనల్లో పలు భారతీయ పౌరాణిక ఘట్టాలు కనిపిస్తాయి. కానీ వెల్లువలా దేశంలోకి వచ్చి పడుతున్న కొత్త ఇస్లామీయులు, ఇక్కడి వారు అస్తిత్వం కోల్పోకుండా అడ్డుపడ్డారు. తమ సంకుచితత్వాన్ని, ఇక్కడి వారిపై రుద్దారు. కశ్మీరులో కూడా హమదాని అడుగుపెట్టటం నిర్ణయాత్మకంగా పరిణమించింది. ఆయన కశ్మీరు చేరి ఇక్కడివారు అనుసరిస్తున్న ఇస్లామ్ సరయినది కాదని సుల్తాన్ సికందర్ ను నమ్మించి అతడిని సికందర్ ‘బుత్ షికన్’ గా మార్చటంతో కశ్మీరులో సహనం అదృశ్యమయింది. చివరికి అక్బరు లాంటి వాడు కూడా ‘ఇస్లామీ పురుషులు ఇతర మతాల యువతులను వివాహం చేసుకోవచ్చు, కానీ స్త్రీలు ఇతర మతాల వారిని వివాహమాడకూడ’ దన్న నియమాన్ని విధించాడు. అందుకే ఇస్లామీయుల పాలన కాలంలోని ప్రేమ కథలన్నీ ఇస్లామ్ పురుషులు, ఇతర మతాల స్త్రీల ప్రేమ కథలే. దీనికి పోటీగా పండిత జగన్నాథరాయలు, లవంగిల ప్రేమ కథ చలామణీలోకి వచ్చినా, అది కట్టుకథ అన్నది పలువురు నిరూపించారు.
అలాగే, బ్రిటీష్ వారు కూడా ఆరంభంలో భారతీయ ధర్మాన్ని, పద్ధతులను గౌరవంగా చూసినా, తరువాతి కాలంలో వచ్చిన మిషనరీలు తమ అధికార అహంకారాన్ని, మత సంకుచితత్వాన్ని ఇక్కడ స్థిరపరచడంతో బ్రిటీష్ వారు సైతం ఇక్కడి వారి పద్ధతులను అవలంబిస్తూ, ఇక్కడివారితో సన్నిహితంగా వ్యవహరించేవారితో, ఇక్కడి వారి ద్వారా సంతానాన్ని కన్నవారితో కఠినంగా వ్యవహరించారు. వారి భారతీయ భార్యల వారసత్వాన్ని గుర్తించలేదు. వారి సంతానాన్ని ‘తక్కువ’వారిగా చూశారు. ‘ఆంగ్లో ఇండియన్స్’గా వారిని గుర్తించి, వారికి ఉన్నత స్థాయి పదవులు నిషేధించారు. అందుకే పలువురు ఆంగ్లో ఇండియన్స్ దేశం వదిలి వెళ్ళిపోయారు. పుట్టగానే పిల్లలను ఇంగ్లండ్ పంపి చదివించేవారు. ఇక్కడ ఉన్నవారు రైలు ఇంజన్ డ్రైవర్లుగా, అలాంటి ఇతరతక్కువ స్థాయి ఉద్యోగాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఆ కాలంలో భారతీయ మహిళలను వివాహం చేసుకున్న ఒక్కో ఆంగ్లేయుడి చరిత్ర విషాదాంతమే. హైదరాబాద్ గాథల్లో రొమాంటిక్ గాథగా చెప్పే జేమ్స్ కిర్క్‌పాట్రిక్, ఖైర్-ఉన్-నీసాల ప్రేమ కథ కూడా విషాదాంతమే.
కశ్మీరు పూర్తిగా ఇస్లామీయుల పరమైనా, జైనులాబిదీన్, భారతీయ జీవన విధానం, తత్త్వం పట్ల కనబరిచిన అభిమానం, తరువాత తరాలలో సంకుచితంగా రూపాంతరం చెందడం గమనిస్తే, శ్రీవరుడు ఇంత విపులంగా దీపోత్సవాన్ని వర్ణించటం వెనుక ఉన్న ఆవేదన, ఆరాటాలు అర్థమవుతాయి. ‘దారా షుకో’ ఉదారవాదం వెంటనే తలెత్తిన ఔరంగజేబు ‘సంకుచితత్వం’ బోధపడుతుంది. జైనులాబిదీన్ లాంటి సుల్తానులు వెంటవెంటనే మరో ఇద్దరు ముగ్గురు కనుక వచ్చి వుంటే చరిత్ర గతి వేరే విధంగా ఉండేదనిపిస్తుంది.
నిర్గతం ననుదండాన్తర్జ్వాలాపిండం నభోన్తరే।
ఉద్ధండదండం సర్వేషాం చండరశ్మీభ్రమం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 26)
ఆకాశంలో దండ నుంచి వెలువడిన ఉద్ధండపిండం లాంటి జ్వాల ప్రేక్షకులలో సూర్యరశ్మి భ్రాంతిని కలిగించింది.
ఈ శ్లోకం అన్ని శ్రీవర రాజతరంగిణి ప్రతులలో లేదు. ఈ సందర్భంలోనే భారతీయ చరిత్ర విశ్లేషణలో, గ్రంథాల ప్రామాణికతను నిర్ధారించటంలోని ఇబ్బందిని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
అసలు ప్రతి ఏదో ఎవరికీ తెలియదు.
ఒక ప్రతి నుంచి మరో ప్రతిని చేతితో కాపీ చేసేవారు. ఆ కాపీ చేసేవారు ఏదైనా పొరపాటు చేస్తే, ఆ పొరపాటు ప్రతిని ప్రామాణికంగా భావించి నకళ్ళు తయారు చేసిన వారి ప్రతులలోనూ ఉండేది. వారింకెన్ని పొరపాట్లు చేసేవారో తెలియదు. అప్పుడప్పుడు నకళ్ళు తయారుచేసేవారు స్వీయ సృజనాత్మక ప్రతిభను కూడా ప్రదర్శించేవారు. దాంతో ఏది అసలో, ఏది ప్రక్షిప్తమో కాలం గడుస్తున్న కొద్దీ తెలుసుకోవటం కష్టమవుతుంది. ప్రస్తుతం మనం వాల్మీకి రామాయణంగా భావిస్తున్న రామాయణం, మూడు నాలుగు ఇతర రామాయణాలను పరిశీలించి, పరిశోధించి, విశ్లేషించి పోల్చి చూసి తయారు చేసి ప్రామాణికంగా భావిస్తున్న రామాయణం తప్ప అదే వాల్మీకి రాసిన అసలు రామాయణం అని ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితులలో ప్రాచీన గ్రంథాలలో ఉన్నదాన్ని ఆధారం చేసుకుని వాటిని దూషించటం, కొట్టిపారేయటం కన్నా విశ్లేషించి, అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం ఉచితం.
శ్రీవరుడి రాజతరంగిణి ఇతర ప్రతులలో ఈ శ్లోకం లేకున్నా ప్రస్తుతం శ్రీవరుడు వర్ణిస్తున్న దీపోత్సవ వర్ణన శ్లోకాలతో సరిపోతుంది కాబట్టి, ఇతర ప్రతులలో లేకపోయినా ఈ శ్లోకాన్ని శ్రీవరుడి రాజతరంగిణిలో భాగంగా భావించటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, అనేక ఇతర గ్రంథాలలో, చొప్పించినట్టుగానో, గ్రంథంలోని ఇతర భాగాలకు భిన్నంగానో, పాత్ర వ్యక్తిత్వానికి వ్యతిరేకంగానో ఉన్న అంశాలను ఆ మూల రచయితకు ఆపాదించకుండా విచక్షణను ప్రదర్శించాల్సి ఉంటుంది.
వహ్ని క్రీడన లీలాయా యుక్తిజ్ఞేన మహీభుజా।
శిక్షయిత్వా హభేభాఖ్యం తాస్తాః సర్వాః ప్రదర్శితాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 27)
ఈ అగ్ని క్రీడలను రాజు హబీబ్‌కు నేర్పించి, అతడితో ప్రదర్శన చేయించాడు.
ఈ శ్లోకంలోని ‘హబీబ్’ ఎవరో ఆచూకీ సరిగ్గా తెలియలేదు. ‘తవకత్ అక్బరీ’, ‘హల్వ’, ఫరిష్త రచనల్లో ‘జవ’ వంటి పేర్లు కనిపిస్తాయి. పీర్ హసన్ రచనల్లో కూడా ‘జీవ’ అన్న పేరు కనిపిస్తుంది. ‘జీవ్’ కు తెలిసినంత ‘అగ్నితో ఆట’, అంతకు ముందు, ఆ తరువాత కూడా ఎవరికీ తెలియదు అని రాశాడు పీర్ హసన్.
‘హబీబ్’ అనే వ్యక్తి జైనులాబిదీన్ సైన్యంలో అగ్ని గోళాల అధికారి అయి ఉంటాడని చరిత్ర రచయితలు ఊహిస్తున్నారు. కశ్మీరులో జైనులాబిదీన్ కన్నా ముందు అగ్ని ఆటల వారు లేరనీ, వారిని దేశం లోని ఇతర ప్రాంతాల నుంచి రప్పించేవారనీ భావిస్తున్నారు. బహుశా ‘హబీబ్’ను వారణాసి పంపి అక్కడ మందుగుండు, ప్రేలుడు పదార్థాల గురించి నేర్చుకునేట్టు చేసి ఉంటాడనుకుంటున్నారు. ఆ కాలంలో వారణాసి అగ్ని ఆటలకు ప్రసిద్ధి పొందింది. ఆ ఆటల వారంతా మహ్మదీయులే. అయితే కశ్మీరులో ఈ అగ్ని ఆటగాళ్ళలో హిందువులు కూడా ప్రసిద్ధి పొందారంటారు.
క్షారస్తదుపయోగ్యోత్ర దుర్లభో యోభవత్పురా।
తద్యుక్తి శిక్షయా రాజ్ఞ స్వదేశే సులభః కృతః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 28)
గతంలో క్షారాలు, వాటి ఉపయోగాలు గురించి కశ్మీరంలో అంత పరిజ్ఞానం లేదు. కానీ శిక్షణ ఇప్పించటం ద్వారా రాజు ఆ జ్ఞానాన్ని కశ్మీరంలో సులభతరం చేశాడు.
ప్రశ్నోత్తరమయీ స్వోక్తిర్హభేభం ప్రతి యా కృతా।
పారసీ భాషయా కావ్యం దృష్టాద్వ కురుతే న కః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 29)
హబీబ్‌కు రాజు ప్రశ్నోత్తరాల రూపంలో శిక్షణనిచ్చాడు. ఇది ఉదాహరణగా తీసుకుని అనేకులు ఈ విషయం గురించి పుస్తకాలు రాశారు.
సుల్తాన్, హబీబ్‌ల నడుమ ప్రేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రుల గురించి ప్రశ్నోత్తరాల రూపంలో సాగిన శిక్షణ, రచన రూపాన్ని శ్రీవరుడు ‘కావ్యం’ అంటున్నాడు. అంటే, అంత రసవత్తరంగా సాగిందన్న మాట ప్రశ్నోత్తరాల రచన.
తే శిల్పా మతికల్పితాః స చ సదా సంగీత వాద్యేరసః
సాలంకార విచారచారూధిషణా కావ్యే చ తత్ కౌశలమ్।
సచ్చాప్త్రశలణాదరః స చ నవసో తా దవాయోధ్యకం
శ్రీ మజ్జైన మహీపతిర్బహుమతే స్తస్యేవ కస్సాధునా॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 30)
బుద్ధిలో, సృజనాత్మకతలో, కళా ప్రతిభలో, సంగీత నృత్యాలపై అభిమానంలో, తర్కబద్ధమైన శాస్త్ర చర్చలలో, పుస్తక రచనలో, శాస్త్ర పఠనంలో, ఆధాత్మ శాస్త్రాలు చదవటంలో, శాస్త్ర రచనలు చేయటంలో జైనులాబిదీన్ లాంటి వారు ఈ కాలంలో ఎవరున్నారు?
ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా జైనులాబిదీన్ లాంటి వారు ఎవరూ లేరు. అతని పేరు ఉన్న అవ్వల్ ఫకీర్ జైనులాబిదీన్ అబ్దుల్ కలామ్, జైనులాబిదీన్ సుల్తాన్‌కు కాస్త దగ్గరలో వస్తాడు. ఆ కాలం జైనులాబిదీన్ సుల్తాన్. ఈ కాలం జైనులాబిదీన్ భారత మాజీ రాష్ట్రపతి.
(ఇంకా ఉంది)

3 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య *’శ్రీవర రాజతరంగిణి’ లో “పూర్వం ఒక ప్రతి నుంచీ మరో ప్రతిని చేత్తో రాసేవారు. ఆ కాపీ చేసేవారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఆ ప్రతిని ప్రామాణికంగా భావించి నకళ్ళు తయారు చేసినవారి ప్రతుల్లోనూ ఉండేది” అనేమాట సత్యదూరం కాదు.. మహాభారతం అరణ్యపర్వం మొత్తం నన్నయే పూర్తి చేశారని, అందులో కొంతభాగం క్రిమిద్రష్టం కావటం వలన ఆ భాగాలను తిరిగి ఎర్రన రచించాడనీ పరిశోధకులు చెబుతారు.. ఏది ఏమైనా ఈ వ్యాసం లో చెప్పినట్లు ఇవన్నీ విమర్శించకుండా, ఆయా కావ్యాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం ఉత్తమం.*
కొల్లూరి సోమ శంకర్
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్! ముగింపు వాక్యాలు ఈ ఎపిసోడ్ కి కిరీటాలు.. నిజానికి ఇతర మతాలను కలుపుకు పోయే తత్వం భారతీయ సంసృతి కున్న గొప్ప సుగుణం.. అందుకే వల్లనే పర మతాలు ఇక్కడ వర్ధిల్లాయి.. తమ ప్రభావాన్ని చూపాయి.. దీపోత్సవం ఇంత ఘనంగా జరగడం.. సుల్తానుగా జైనులాబీదీన్ విశాల దృక్పథానికి ఉదాహరణ అనుకోవచ్చు.. నాయకుడేప్పుడూ అలాంటి ధోరణిని కలిగి ఉండాలి.. ప్రజా నాయకులు వారే అవుతారు.. నిష్పక్ష పాత వివరణ లకు అభినందనలు తెలియ జేస్తూ..
*
కొల్లూరి సోమ శంకర్
ఇది తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి ఇప్పుడే చదివాను. చాలా అద్భుతమైన కాశ్మీర దీపాల గురించి చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు, దీపావళి వంటి అద్భుతమైన దృశ్యాలను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు. చదువుతుంటే ఆ దృశ్యాలు కళ్ళ ముందు కనిపించేలాగా ఆ దీపాల వెలుగులు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అభినందనలు. తాటికోల పద్మావతి, గుంటూరు. కథా రచయిత్రి.*