[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]


చిటికేస్తే అలలైనా
~
చిత్రం: యువకుడు
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గానం: దేవిశ్రీప్రసాద్


~
పాట సాహిత్యం
పల్లవి:
చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్లా ఆడాలి
ఏదైనా సాధించే వయసు ఇవ్వాళుంటుంది చేజారిపోయిందో నిన్న అయిపోతుంది
లవ్వైనా, నవ్వైనా ఇపుడే మహ బాగుంటుంది పళ్ళూడి పోతే ఇక చేసేదేముంది ॥ చిటికేస్తే ॥
చరణం:
ప్రేమ సీమలో ప్రవేశం యవ్వనానికే లభిస్తుంది
టైము దాటితే గుడైనా రెండు తలుపులూ బిగిస్తుంది ఏ ఈడుకి ఆ ముచ్చట అన్నారుగా పెద్దాళ్ళంతా
ఆ మాటకి ఔనన్నది కుర్రాళ్ళ సంత
ఈ వయసులో నీ నిద్దుర స్వప్నాలకి తొలిపొద్దంట అంచేత నువు ఆ కలలని వెంటాడమంట॥ చిటికేస్తే ॥
చరణం:
ఒక్క స్వప్నమూ కనుల్లో లేనివాళ్ళని వెలేయండి
కళ్ళు కావవి నిజంగా గాజుగుళ్ళని అనేయండి
ఆవేశమో- ఆరాటమో ఏ భావమో తరుముతువుంటే ఈ జీవితం కాదా మరి గోదారిలో నావ
ఆయాసమే సావాసమై ఆగాలి అనిపించిందంటే
ఆ రోజుతో నీకే సువు భారంగా అయిపోవా ॥చిటికేస్తే ॥
♠
“My faith is in the younger generation, the modern generation, and out of them will come my workers. Give me 100 youth (like that of Nachiketa), with iron will and steel muscles, and I can rebuild the Nation.” – Swamy Vivekananda. ఇది స్వామి వివేకానందకు భారతీయ యువతపై వున్న విశ్వాసం. Practical perspective లో చూస్తే, యువతపై నాయకులంతా కలిగివున్న భరోసాకు, ఎంతవరకు నేటి యువతరం న్యాయం చేయగలిగేలా వుంది? ‘లేవండి మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి’, అన్న వివేకానందుని మేలుకొలుపు ఎవరి మనసులో ప్రతిధ్వనిస్తోంది? నిషాలో, మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్న యువతను చూస్తే, జీవితంలో.. గమ్యం వైపుగా.. మేల్కొనే మాట అటుంచి, నిద్ర మంచం నుండి మేలుకోవడానికే మధ్యాహ్నం అవుతోంది. పగటిని రాత్రిగా మార్చి, రాత్రిని పగలుగా మార్చి, తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు నేటి యువత (తప్పనిసరిగా ఐటీ ఉద్యోగాలలో ఇలాంటి జీవన విధానానికి అలవాటుపడిన వారి గురించి నేను మాట్లాడటం లేదు). జీవితమంటే కేవలం enjoyment మాత్రమే అనే భావనలో యువత కాలాన్ని గడిపేయడం అందరినీ కలవరపరుస్తోంది. భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ, వాటిని సాకారం చేసుకోవడం కోసం పోరాడవలసిన సమయంలో, నిరర్థకమైన పనులలో మునిగిపోయి, సంఘవిద్రోహశక్తులుగా తయారై, మీకు తోడుగా మేమున్నామనే విశ్వాసం కలిగించకుండా, మిమ్మల్ని మీరు భరించి తీరాల్సిందే అంటూ, కుటుంబాలకే భారమై, నిర్వీర్యమైపోతున్న యువత గురించే మనందరి ఆవేదన. సిరివెన్నెల గారు ఈ ‘చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి’ అనే పాటలో యువతను నిర్వచించిన తీరు చూస్తే, ఆ Sun-Kissed Years లో ఏమేమి సాధించవచ్చో, ఎంత సాధించవచ్చో అర్థమవుతుంది. శక్తి విస్పోటనాల్లాంటి యువత, తమ శక్తియుక్తులను, energy దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఏ దిశగా సాగుతున్నారు? శక్తి ఉడిగిపోయాక, ఆలోచన కూడా బలంగా రాదు కదా! అయితే దృఢ సంకల్పంతో, passionతో, ఆశయ సిద్ధి కోసం పోరాడేవారికి వయసు కూడా అడ్డంకి కాదనేది జగమెరిగిన సత్యం.కానీ సహజ సిద్ధంగా అన్ని శక్తులు మన అదుపులో ఉండే కాలం నిండు యవ్వనం. అందుకే youthful daysను, జీవితకాలానికి సరిపడే కలల పంటను పండించుకోవడానికి వినియోగించాలి.
పల్లవి:
చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్లా ఆడాలి
ఏదైనా సాధించే వయసు ఇవ్వాళుంటుంది చేజారిపోయిందో నిన్న అయిపోతుంది
లవ్వైనా నవ్వైనా ఇపుడే మహ బాగుంటుంది పళ్ళూడి పోతే ఇక చేసేదేముంది ॥ చిటికేస్తే ॥
/పరుగాపక పయనించవె తలపుల నావ/కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ /ఎదురించిన సుడిగాలిని జయించినావా/మదికోరిన మధుసీమలు వరించిరావా/
లాంటి ప్రేరణాత్మక గీతాలతో ఎన్నోమార్లు, ఆశయసిద్ధికి మార్గదర్శనం చేశారు. యువతకి ఈ ప్రపంచం ఎలా అనిపిస్తుందో ఒక anonymous writer ద్వారా..
The world unwound, a vibrant hue,
A canvas bright, forever new.
With laughter light, and hearts ablaze,
We danced through life’s enchanting maze.
The sun-kissed skin, a golden gleam,
Reflected in a hopeful dream.
With boundless hope, and spirits free,
We chased the dreams that set us free.
The youthful heart, a restless fire,
Ignited by a bold desire.
To touch the stars, to reach the sky,
With dreams that soared, we learned to fly.
~
బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, సిరివెన్నెల ఈ పాట ద్వారా మరో మారు నిరూపిస్తున్నారు. ఆయన మనోశక్తి, అనంతమైన సానుకూల దృక్పథం ఆయన సాహిత్యంలోని ప్రతి పదంలోను మనకు కనిపిస్తుంది. Time and Tide waits for none అని మనం విన్నాం. కానీ సిరివెన్నెల అంటున్నారు, మనం సంకల్పిస్తే, పైకి లేచిన అలా.. అలాగే.. గాలిలో ఆగిపోవాలట! దేనికి కరగని కఠినమైన శిలలైనా.. నీటి తరగలలాగా మన పాదాల కింద ఆడాలట! అలలు ఆగడమేంటి? శిలలు కరగడమేంటి? ఆ కల్పనా శక్తికి హద్దేంటి? సిరివెన్నెల ఊహాశక్తికి సాటేంటి? అయితే, ఏమి సాధించాలన్నా, యవ్వనప్రాయం అనే సమయం ఒకటి ఉంటుంది కదా! సాధించాలనుకున్నవన్నీ అప్పుడే సాధించాలి! Action- Timely action మధ్య ఉన్న తేడా అదే!
కానీలే.. చూద్దాంలే.. అంటూ.. వాయిదాలు వేసుకుంటూ వెళ్తే.. ఈరోజు ‘నిన్న’గా మారిపోతుంది.. ‘నిన్న’ చరిత్రలోకి జారిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు దిద్దుకోవాలన్నట్టు, తగిన సమయం, శక్తి యుక్తులు ఉన్నప్పుడే మన పనులు చక్కబెట్టుకోవాలి. /లవ్వైనా, నవ్వైనా ఇపుడే మహ బాగుంటుంది/ పళ్ళూడి పోతే ఇక చేసేదేముంది/ నోటి నిండా పళ్ళు ఉన్నప్పుడు నవ్వే నవ్వుకీ, ప్రాయంలో ఉన్నప్పుడు ప్రేమ విషయంలో మనం చేసే చిలిపి పనులకి అందం ఉంటుంది. ప్రాయముడిగిపోయాక నవ్వుకూ, లవ్వుకు తీరే మారిపోతుంది అంటున్నారు సిరివెన్నెల.. ఎంతో హాస్యమైన ఉపమానం తీసుకుని.
చరణం:
ప్రేమ సీమలో ప్రవేశం యవ్వనానికే లభిస్తుంది
టైము దాటితే గుడైనా రెండు తలుపులూ బిగిస్తుంది ఏ ఈడుకి ఆ ముచ్చట అన్నారుగా పెద్దాళ్ళంతా
ఆ మాటకి ఔనన్నది కుర్రాళ్ళ సంత
ఈ వయసులో నీ నిద్దుర స్వప్నాలకి తొలిపొద్దంట అంచేత నువు ఆ కలలని వెంటాడమంట॥ చిటికేస్తే ॥
మేలుకునే కలలు కనే వయసులో, నిద్రలో వచ్చే స్వప్నాలు కూడా ఊహల పొదరిళ్ళను కడుతూనే ఉంటాయి. ప్రేమలో పడాలంటే, ప్రేమ సీమలో అడుగు పెట్టాలంటే.. యువతకే ఎంట్రీ టికెట్ లభిస్తుందట. ఒక వయసు దాటిపోయాక మనతో జంట కట్టడానికి ప్రేమికులు దొరకరు.. అదెలా అంటే.. నిర్ణీత సమయం దాటిపోయిన తర్వాత గుడిలో దేవుడి దర్శనం కూడా లభించదు. ఏ పనైనా సరైన గడువులోనే జరగాలి. A stitch in time saves nine చందాన, యవ్వనంలో జరగాల్సిన పనులు అప్పుడు జరిగితేనే దానికి తగిన అర్హత, గుర్తింపు, లేకుంటే మనకు తెలియకుండానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సకాలంలో పడని వర్షం పంటకు చేటు చేస్తుంది కానీ మేలు చేయలేదు కదా! ఇక్కడ సిరివెన్నెల అందంగా ‘ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలన్న’ తెలుగు నానుడిని ఉపయోగించారు. యువత ఆ మాటకు ‘ఊ’- కొట్టక మరేమంటుంది?
Now is the time for action,
It’s never tomorrow;
Employ your force immediately,
Let your mind and heart know.
Learn to have time for action, don’t waste the passing hour;
Every minute truly counts
Use your strength and power-
అంటారు Bernard F. Asunction.
సరైన సమయాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, వర్తమానంలోకి కళ్ళు తెరవగలిగినప్పుడే, మనం కోరుకున్న భవిష్యత్తులోకి మనం ప్రయాణించగలము.
/ఈ వయసులో నీ నిద్దుర స్వప్నాలకి తొలిపొద్దంట/ అంచేత నువు ఆ కలలని వెంటాడమంట/ జీవితమంటే dreaming and chasing the dreams.. కదా! కాబట్టి ఊహలకు రెక్కలు తొడిగి, భావన తీరాలకు చేరుకోవడానికి, శక్తి మేరకు కృషి చేయాలి.
చరణం:
ఒక్క స్వప్నమూ కనుల్లో లేనివాళ్ళని వెలేయండి
కళ్ళు కావవి నిజంగా గాజుగుళ్ళని అనేయండి
ఆవేశమో- ఆరాటమో ఏ భావమో తరుముతువుంటే ఈ జీవితం కాదా మరి గోదారిలో నావ
ఆయాసమే సావాసమై ఆగాలి అనిపించిందంటే
ఆ రోజుతో నీకే నువు భారంగా అయిపోవా ॥చిటికేస్తే॥
భవిష్యత్తుపై ఆశలే లేకుండా, అందమైన జీవితం గురించి కలలు కనకుండా, నిస్సారంగా.. జీవితం ఎలా సాగితే.. అలాగే సాగిపోని అనే సర్దుబాటు మనస్తత్వాలు – ఎదుగూ బొదుగూలేని బ్రతుకులకు ప్రతీకలు. అటువంటివారందరూ సామాన్యమైన పుట్టుక, సామాన్యమైన గిట్టుకతో అంతమౌతారు.
/ఒక్క స్వప్నమూ కనుల్లో లేనివాళ్ళని వెలేయండి/
కళ్ళు కావవి నిజంగా గాజుగుళ్ళని అనేయండి/
అని, అటువంటివారిని నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా విమర్శిస్తున్నారు సిరివెన్నెల.
శక్తికి మించిన లక్ష్యాలను నిర్దేశించుకుని, సాధించగలిగినప్పుడే ఘనవిజయం మనల్ని వరిస్తుంది. అలాంటి విజయ లక్ష్యాలు మనం ఏర్పరచుకోవాలంటే, జీవితంలో మనకు ఒక ప్రేరణ కావాలి.
/ఆవేశమో- ఆరాటమో ఏ భావమో తరుముతువుంటే/ ఈ జీవితం కాదా మరి గోదారిలో నావ?/
నీవు అనుకున్న దాన్ని సాధించడానికి ఆవేశమో, ఆరాటమో ఏదో ఒకటి కావాలి. ఒక లక్ష్యం సాకారం కావాలంటే నిరంతరమైన తపన ఉండాలి. అది సాధించాలంటే ఆగకుండా చేసే ప్రయత్నం కావాలి. సాధనలో ఒక వ్యక్తి బరువు పడితే, ప్రయాస ఆపేస్తే, అంతటితో అతని ప్రాణం పోవడంతో సమానమని అర్థం చేసుకోవాలి అని సిరివెన్నెల నిర్వచిస్తున్నారు. ఓటమిని ఒప్పుకోవడమే, నిజమైన ఓటమి.. అది మరణంతో సమానం.
Time అనేది never resting, non- compromising entity కాబట్టి ఏ సమయంలో చేయవలసిన పనులు ఆ సమయంలోనే చేయడం ముఖ్యమనే విషయం, యువత ఎలా వుండాలి, ఎలా వుండకూడదు అన్న స్పష్టమైన సందేశాన్ని, సంకేతాలను సిరివెన్నెల ఈ పాట ద్వారా మనకు అందించారు. భగవంతుడు మనకు అందించిన అద్భుతమైన శక్తియుక్తులను, సృజనాత్మకతను సంపూర్ణంగా వినియోగించుకొని జీవితంలో వికాసాన్ని సాధించాలి తప్ప, సహజమైన శక్తులను నిర్వీర్యం చేసి, జీవితాన్ని నిస్సారంగా మార్చుకోకూడదన్నది గీత సారాంశం.
Images Source: Internet

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.