[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]


తికమక మకతిక పరుగులు ఎటుకేసి (శ్రీరామనవమి ప్రత్యేకం)
~
చిత్రం : శ్రీ ఆంజనేయం
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


~
పాట సాహిత్యం
పల్లవి:
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచందురుణ్ణి, కోవెల్లో ఖైదుచేసి
రాకాసి రావణున్ని, గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
చరణం: 1
వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ..
తై దిదితై దిదితై దిదితై
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
చరణం: 2
అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా..
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ..
తై దిది తరికిటతోం- తరికిటతోం తరికిటతోం తత్తోం
తికామక తిక తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
♠
రామనామం భారతీయుల హృదయనాదం. రామనామ స్మరణమే తారక మంత్రం. ‘తారకం’ అనబడే రెండు మహా మంత్రాల్లో ఒకటి ప్రణవం, రెండవది రామనామం. ‘తారకం’ అంటే ‘దాటించునది’ అని అర్థం. జనన-మరణ చక్రమైన సంసార సాగరాన్ని దాటించగల నావ రామనామం. రామాయణం భారతీయ ఆత్మ. రామనామాన్ని స్మరించినంత కాలం, రామాయణాన్ని పఠించినంత కాలం, ధర్మ స్వరూపుడైన శ్రీరాముని పూజించినంత కాలం, ఆ జానకిరాముడిని ఆదర్శమూర్తిగా అనుసరించినంత కాలం.. రామ కృపారసధారలు ఈ భూమిపైన నిరంతరంగా కురుస్తూనే ఉంటాయి.
త్యాగరాజు, రామదాసు, కబీరు వంటి వారెందరో రామనామాన్ని జపించి, తరించి మోక్షం పొందారు. అందుకే ‘రామనామము.. రామనామము.. రమ్యమైనది రామనామము’ అని పాడుతూ, భజన చేస్తారు. ‘రా’ శబ్దాచ్చారణేనైవ ముఖాన్ నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాత్ర ‘మ’ కార దుఃఖ వాటవతు అంటే ‘రా’ అని అనగానే నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలలో పడి దహించుకు పోతాయి. ‘మ’ అనే అక్షరం పలికేసరికి నోరు మూసుకుని బయటి పాపాలు మన లోనికి ప్రవేశించవు. అంతటి మహిమ కలది రామనామం. అందుకే త్రేతాయుగం నుండి నేటి వరకు రామ నామ మహిమ జీవనదిలాగా, యుగయుగాలుగా భక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ, భక్తులను తరింపజేస్తూ ఉంది.
శ్రీరామ చరితము రసభరితము. ఎంత స్మరణం చేసినా తనివితీరని ఒక మాధుర్య సాగరం, రామనామం. విశ్వసాహిత్యంలోనే రామాయణం ఒక అజరామర కావ్యం. తరతరాల తపఃఫలం ఈ రామాయణం. రామాయణంలోలాగా లోక వ్యవహారాలన్నింటిని ఇంత లోతుగా బోధించే కావ్యం మరొకటి లేదు. రామకథ, రామ నామం రెండు రమణీయమే.. ఎందుకంటే ‘రామం సర్వజన ప్రియం’.
దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మం గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు. ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు.
ఆయన, 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9.విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12 ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఇన్ని సద్గుణాలు కలబోసిన సుగుణాభిరాముడు.
లోకోత్తర నాయకుడైన శ్రీరాముడు విశ్వానికే ఆదర్శ పురుషుడు. ఆదికవి వాల్మీకి కాలం నుండి నేటి వరకు పలు భాషలలో, పలురీతులలో, పలు రకాల కళా రూపాలు ధరించి ముందుకు సాగుతూనే ఉంది ఈ కావ్యం. ఈరోజు మనం సినీ సాహిత్యంలో రామాయణ ప్రాశస్త్యాన్ని, రాముడి ఘనతను వర్ణించిన కొన్ని పాటలను పరిశీలించి, సీతారామశాస్త్రిగారు శ్రీరామునిపై వ్రాసిన సినీ గీతాల గురించి చర్చిద్దాం.
సినీ సాహిత్య విషయానికి వస్తే, రామాయణం కథాంశంగా నిర్మించిన గొప్ప చిత్రాలన్నిటిలో అత్యద్భుతమైన రాముని పాటలు తెలుగు వాళ్ళ గుండెల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. లవకుశ, సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం, శ్రీరామరాజ్యం, రామదాసు, వంటి చిత్రాలలో ప్రతి పాట మనోహరంగా రచింపబడి, స్వరబద్ధం చేయబడింది. సముద్రాల సీనియర్, వెంపటి సదాశివబ్రహ్మం, కొసరాజు, ఆరుద్ర, దేవులపల్లి, గబ్బిట వెంకట్రావు, దాశరథి, సినారే గార్లు, ఈ చిత్రాలకు నేపథ్య గీతాలను, పద్యాలను అందించారు.
ఇటీవల రామకథా నేపథ్యంగా చిత్రీకరింపబడిన ‘ఆది పురుష్’ చిత్రంలోని “రామ్ సియా రామ్.. జై జై రామ్ సీతా రామ్”, అసంఖ్యాకమైన యువతకు కూడా రింగ్ టోన్ గా చలామణి అవుతోందంటే, దాని ప్రభావాన్ని మీరు ఊహించగలరు. ఆపాత మధురమైన గోల్డెన్ హిట్ సినిమా పాటల తరం తరువాతి కాలంలో.. శ్రీరామునిపై చెప్పుకోదగ్గ సినిమా పాటల్ని మచ్చుకు కొన్నిటిని చూద్దాం!
శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఆరుద్ర గారు రచించిన, ‘శ్రీకరమౌ శ్రీరామ నామం భవతారక మంత్రం..’
మీనా చిత్రం కోసం ఆరుద్ర గారు రచించిన, శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి..’
మా ఊరి దేవుడు చిత్రం కోసం వేటూరిగారు రచించిన.. మనసెరిగిన వాడు మా దేవుడు.. శ్రీరాముడు..
ఆదియు అంతము రాముని లోనే
మా అనుబంధము రాముని తోనే
ఆప్తుడు, బంధము అన్నియు తానే
అలకలు పలుకులు ఆతనితోనే.. (ఆదిపురుష్)
శ్రీరామరాజ్యం చిత్రంలో జొన్నవిత్తుల గారు రచించిన ‘జగదానందకారకా, జయ జానకి ప్రాణ నాయక..’
స్వాతిముత్యం చిత్రంలో, డాక్టర్ సి నారాయణ రెడ్డిగారు రచించిన’ రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా..’
శ్రీ ఆంజనేయంలో, సిరివెన్నెల రచించిన ..’తికమక మక తిక’
శ్రీమంతుడు చిత్రంలో రామజోగయ్య శాస్త్రి రచించిన రామ రామ రామ రామ రామ రామ రామ రామ.. రామదండు లాగా అందరొక్కటవుదామా..’
మా ఆవిడ కలెక్టర్ చిత్రంలో సిరివెన్నెల రచించిన ‘రామనామమెంతో తీయన..’
ఎవరే అతగాడు చిత్రం కోసం వేటూరి రచించిన ‘సీతారామ కళ్యాణం..’
శ్రీరామచంద్రునిపై రచించబడిన పాటల సాహిత్యం గురించి చర్చించడానికి విశేషమైన కారణం ఈరోజు శ్రీరామనవమి కావడమే! ఆ సకల గుణాభిరాముని పుట్టినరోజు వేడుకలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. నిండు వేసవిలో, పండు వెన్నెలలాగా, చల్లని ఆ రామచంద్రుడు తన జన్మాష్టమి వేడుకలు చేసుకోవడానికి మళ్లీ మన లోగిళ్ళలో, మన హృదయాల్లో అడుగుపెట్టాడు. అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణంతో, రాముని ఘనత మరింత విశ్వవ్యాప్తమైంది. ఈ సందర్భంగా, శ్రీరామచంద్రుని విశిష్టత, ఘనత, రామ తత్వాలపై, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రచించిన కొన్ని సినీ గీతాలను ఇక్కడ పరిశీలిద్దాం.
సిరివెన్నెల గారికి భారతీయ భక్తి తత్వంపై, సనాతన ధర్మంపై పరిపూర్ణమైన అవగాహన ఉంది. సనాతన ధర్మం పట్ల ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉంది. వారి తండ్రిగారి శిష్యరికంలో, ఆయన బోధనలతో, ఈ అవగాహనా పరిధి మరింత విస్తృతమైంది. విశ్వ గురువుగా నిలవగలిగే భారతీయ సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని ఆకళింపు చేసుకున్న సిరివెన్నెలగారు, తాను గ్రహించిన దాన్ని ఇతరులకు మనసుకు హత్తుకునేలా వ్యక్తికరించే కవితా శక్తిని వరంగా పొందారు. ముందుగా ఈనాడు నేను ఎంచుకున్న పాటకి కాస్త వివరణ ఇచ్చి, మిగిలిన పాటలను తరువాత చర్చిస్తాను.
పల్లవి:
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి
రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కలా మనిషీ
తై దిదితై దిదితై దిదితై – దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై – దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
పల్లవిలో సిరివెన్నెల మనకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను అందిస్తున్నారు. కళ్ళకు కనిపించే సత్యాలను చూస్తూ, రామాయణ, భారతాల వంటి మహా గ్రంథాలను చదువుతూ, వాటి మూల ఉద్దేశం కానీ, అంతరార్థం కాని గ్రహించకుండా, మనిషి గందరగోళంలో పడి, కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దైవమంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, అసలైన గురువు ఎవరో, మనల్ని తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ, బురిడీ బాబాలు ఎవరో తెలియక (తెలుసుకోలేక/ అర్థంకాక) తికమక పడిపోతున్నారు. అందుకే, సరైన మార్గాన్ని ఎంపిక చేసుకొని, నలుగురితో పాటు సరైన దిశలో నడవరా ఓ మనిషీ! అంటున్నారు.


సర్వ సుగుణాలకు ఆలవాలమైన, ఉన్నతమైన మానవ జీవితానికి ఆదర్శమైన శ్రీరాముడిని గుడిలో దేవతా స్వరూపంగా నిలబెట్టి, ఆయనను పూజించడంలోనే జీవిత పరమార్ధం ఉందని భావించి, ఆయన గుణాలను, ఆయన మానవులకు ఇచ్చిన సందేశాలను ఆచరించే ఆలోచన కూడా రాకుండా మానవులు జీవిస్తున్నారు. అంతటి పరమ భక్తుడైనా, జ్ఞాని అయినా, కేవలం అహంకారం, పరస్త్రీ వ్యామోహం వంటి బలహీనతల వల్ల పతనమైపోయిన రావణాసురునికి, అతని అసుర లక్షణాలకు పెద్దపీట వేసి, ఎలా ఉండకూడదో తెలుసుకోండి అంటూ.. పదేపదే ఆ చిత్రాన్ని చూపించడం వల్ల.. ఆ లక్షణాలు మనలో ముద్ర వేసుకుంటున్నాయని.. మానవ జీవితం అందుకే అయోమయంలో పడిపోతోందనీ, సత్యాసత్య విచక్షణ మానవులు కోల్పోతున్నారని నిరసిస్తూ సీతారామశాస్త్రి ఇలా అంటున్నారు. /శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి/రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి../.. దేన్ని వదిలిపెట్టాలో, దేన్ని స్వీకరించాలో మొదట అర్థం చేసుకొని, దానిని అమలు చేస్తే, మనం ఉన్నతంగా జీవించవచ్చన్నది సిరివెన్నెల సందేశం.
చరణం:
వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ..
పల్లవిలో, ఎంతో ధృడమైన జీవన వికాస సూత్రాన్ని బోధిస్తున్నారు సిరివెన్నెల. ఒకసారి జీవితంలో ఒక ధ్యేయాన్ని నిర్ణయించుకుంటే, ఎన్ని కష్టనష్టాలు ఎదురొచ్చినా, మనం వెతికే ఆ గమ్యాన్ని చేరేదాకా, ఏ శక్తి మనల్ని ఆపలేదు. జీవితం పూర్తిగా దుఃఖమయమైనా.. నిరంతర అన్వేషణతో.. ఆ కన్నీటిపై వంతెన కట్టి.. నీ గమ్యాన్ని చేరుకో! అంటున్నారాయన. ఎటువంటి సందేహం లేకుండా, ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని, ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, సమాధానం లేని ప్రశ్నలు లేనే లేవని బలంగా, స్థిరంగా చెబుతున్నారు సిరివెన్నెల. బోయవాడిగా ఉన్న రత్నాకరుడిలో మనసు కరిగి పొంగిన శోకమే, శ్లోకంగా, రామాయణ మహాకావ్యంగా రూపొందిన విషయం మరిచిపోకండనీ, మీ జీవితం కూడా కన్నీటి మయమే అయినా.. దాన్ని రమణీయమైన కావ్యంలా, నలుగురికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవచ్చనే మహత్తరమైన సందేశాన్ని అందిస్తున్నారు.


చరణం: 2
అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా..
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ..
మనకు చిన్నప్పుడు కాళ్ళ మీద వేసుకుని నీళ్లు పోస్తూ, ‘శ్రీరామరక్ష.. నూరేళ్లు ఆయుష్షు..’ అని అమ్మ దీవించినప్పటి నుండి.. ‘ఏదో కృష్ణా రామా’ అనుకుంటూ, కాలం వెళ్లబుచ్చే పండు ముసలితనం దాకా, జీవితంలోని ప్రతి ఘట్టంలో.. రామాయణంలోని పాత్రలు అడుగడుగునా మన వెంట నడుస్తూ, అణువణువునా ఆ మహాకావ్యాన్ని మనకు గుర్తు చేస్తూ, మనకు కావలసిన సందేశాలను అందిస్తూ ఉంటాయి. తరతరాలుగా మన జీవన శైలిలో మమేకమైపోయిన రామాయణం, మనతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంది.


అటువంటి రామాయణం నుండి మనము ఏమి పాఠాలు నేర్చుకోవాలో, సిరివెన్నెల ఈ చరణంలో వివరిస్తున్నారు. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడికి, కారడవిలో అయినా, సముద్రం మీద అయినా, కొండలైనా.. శిరసు వంచి ఆయన మార్గాన్ని సుగమం చేశాయి. అంటే, ధర్మ మార్గంలో నడిచే వారికి ఏ అడ్డంకులు రావని ఆ ఘటనలన్నీ సూచిస్తున్నాయి.
అంతటి ఘనమైన వ్యక్తిత్వంగల రామ పాదాలను స్పృశించిన పాదుకలు సైతం, తాము చేసుకున్న పుణ్యం వల్ల, పాదుకా పట్టాభిషేకం జరుపుకున్నాయి. ఈ సమాజంలో కూడా మహనీయులు తమ జీవితకాలంలో ఉపయోగించిన వస్తువులను మనం పూజనీయంగానే చూస్తున్నాం. అంత ఘనమైన రామచరితను వ్రాసుకుంది మనమే కదా! మన వికాసం కోసమే కదా.. ఆ ఆదర్శ పురుషుడి జీవితం! ఆ మహా గ్రంథాన్ని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఆ సీతారాముల జీవనయానాన్ని.. సీతాయణాన్ని/రామాయణాన్ని నీవు మర్చిపోయావా? నీవు కోరుకుంటే ఈనాటికి కూడా నీ జీవితానికి అది మార్గదర్శనం చేయదా? అని ప్రశ్నిస్తూ.. ప్రశ్నలోనే సమాధానాన్ని నింపి, తప్పకుండా రామకావ్యం మన జీవితాలకు దిశా నిర్దేశం చేస్తుందని, మనకు భరోసా ఇస్తున్నారు. ఆ అడుగుజాడలను మరచిపోతే మానవజాతికి మనుగడే లేదనీ, ఆ ధర్మ మూలాలే భారతీయతకు పట్టుకొమ్మలనీ, వాటిని చెరపకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందనీ చెబుతూ../ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ../ అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
~
1.‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం కోసం సిరివెన్నెల రచించగా, సునీత ఆలపించిన గీతం-రామాయణసారం
కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా, బాధ్యతలెరిగిన పురుషుని చరితం
అగ్ని సైతము శిరసొంచే, సద్గుణతేజానికి సాక్ష్యం చూపిన సాధ్వి కథనం
భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం
బంటును సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం
జగమును శాసించే ఘనులైనా అహమును గెలువని వారైతే
పతనం తప్పదనే గుణపాఠం
ఇదే ఇదే రామాయణసారం
భారత సంస్కృతికిది ఆధారం..
శ్రీమద్రామాయణ సారాన్ని, రామరసాన్ని, ఇంత మధురంగా, accuracy, brevity, clarity కలగలిపి అందించడం సిరివెన్నెల వంటి అసామాన్య కవులకు తప్ప ఇతరులెవరికి సాధ్యమవుతుంది? రామావతారం ఒక పరిపూర్ణ అవతారం కనుకనే రామ నామం, రూపం, రామతత్వం ఎన్ని యుగాలైనా ఆదర్శ ప్రాయంగా ఈ భూమిపై నిలిచే ఉన్నాయి.
2. రామ నామమెంతో తీయన- చిత్రం ‘మా ఆవిడ కలెక్టర్’
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ -గానం: ఎస్.పి. బాలు, చిత్ర, కోరస్
పల్లవి:
అతడు: రామనామమెంతో తియ్యన
రామచంద్రయ్య చూపెంతో చల్లన
కోదండరామయ్య దీవెన – కోరి సాగించాలి దివ్య కీర్తన
కోరస్ : ॥ రామనామమెంతో॥
అతడు : అసుర భంజన ఆశ్రిత రంజన అంటూ చేద్దాం రామయ్య భజన
ఆమె : కోటిసూర్యులంటి రామయ్య వెన్నంటి వుండే జాబిల్లి
కోరేటి వరమిచ్చి కరుణించుతుందట సీతా మాతల్లి ఆలుమగలంటే ఆ సీతారాములంట
అనురాగమంటే అర్థమంటా ఆ జంట
లోకాలన్ని కాసే ఆ జంటే కన్నులపంట
చరణం:
ఆమె: పరులకు వశమవున ఆ పరమేశ్వరుని ధనువు నరులకు వశమవున ఆ శ్రీలక్ష్మి వధువు
కోరస్: పరులకు
ఆమె: హరునివిల్లు విరిచిన ఆ శ్రీరాముడు శ్రీహరి తనువు జల్లుమని మురిసేను అదిచూసిన ఆ సిరి
అతడు: కాముని విల్లంటి కనుబొమ్మలెత్తి చూస్తున్న సీతమ్మ కళ్ళు రామునికి ఇచ్చిన శక్తివల్లనే విరిగింది అంతటి విల్లు
కోరస్: రాముని
అతడు: దేవతలే కురిపించగా దివి నుండి పువ్వుల జల్లు సీతారాముల గుండెలలో నిండె ఆనందపు పరవళ్ళు
చరణం:
అతడు: గట్టిదైన శుభముహూర్తము గ్రహరాజులే నిర్ణయించగా చక్కని శుభలేఖలు అష్టదిక్కుల దేవుళ్ళు పంచగా
ఆమె: తన కూతురే వధువని ఆ ధరణి పీటవేయగా ॥2॥
సూర్యచంద్రుల పుస్తెలుపంపి గగనమే పందిరివేయగా ॥2॥
అతడు : ముక్కోటి వేల్పులు పెద్దలైన పెళ్ళి వైకుంఠమే ఇలకు తరలివచ్చిందంటా
కోరస్: కళ్యాణ వైభోగమంట చూడ కోటి కళ్ళు చాలవంట ॥2॥
దశరథరాముడు సీతారాముడు అయ్యే శుభదినమంట ॥2॥
అతడు: ఏటేటా ఆ వేడుక భూమిని వైకుంఠముగా మార్చునంట
కోరస్: కళ్యాణ వైభోగం చూడ కోటికళ్ళు చాలవంట |॥2॥
ఈ పాటలో సీతారాముల కల్యాణ వైభవాన్ని సిరివెన్నెల వివరిస్తున్నారు. భూదేవి కుమార్తె అయిన సీతమ్మకు భూమంతా పీటగా వేసిందట, గగనమే పందిరి అయిందట, గ్రహరాజులే ముహూర్తాలు పెట్టారట, దశరథ రాముడు సీతారాముడయ్యాడట/ఈ పాటలో సిరివెన్నెల ఇంకో రహస్యాన్ని కూడా జోడిస్తున్నారు.. బాల్యంలోనే శివధనస్సును అలవోకగా పక్కకు జరిపిన జానకమ్మ, శ్రీరాముడు వెళ్ళు ఎక్కువ పెట్టే సమయంలో, తన కళ్ళు పైకెత్తి, ఆ కళ్ళ ద్వారా, రాముడికి శక్తినందించిందట! ఆదర్శప్రాయమైన ఆ జంటని వర్ణిస్తూ సిరివెన్నెల ఇలా అంటారు..
/ఆలుమగలంటే ఆ సీతారాములంట
అనురాగమంటే అర్థమంటా ఆ జంట/
3. మావిచిగురు చిత్రంలో సీతారామ కళ్యాణ సన్నివేశంతో ఒక పల్లవి వ్రాశారు.. దీని తర్వాత పాట చిత్రానికి తగినట్టుగా సాగిపోతుంది.
కోదండ రాముడంట కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాలా
ఆజానుబాహుడంట అమ్మలాలా వాడు అరవిందనేత్రుడంట అమ్మలాలా
రమణీలలామకు తగ్గ జోడువాడేనని రహదారులన్ని చెప్పుకోగా విని
కళ్యాణరామయ్యని కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా..
4. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం కోసం.. నాయక నాయకుల మధ్య విరహాన్ని వర్ణిస్తూ.. సీతారామ వనవాస ఘట్టాన్ని.. ఉదహరిస్తున్నారు సిరివెన్నెల. మిగిలిన పాట చిత్రపరంగా, మామూలుగా సాగిపోతుంది.
రామ నామమే ప్రాణముగా ఆ రావణవనమున సీతమ్మ
సీతాస్మరణమే శ్వాసగా సంద్రానికి ఈవల రామయ్య ఇరువురి దూరం కరిగించగ ఆ విరహమే వారధిగా మారెనుగా..
సీతారాములు ఎడబాటు పొందినప్పుడు ఎలా జీవించారనే అంశాన్ని కళ్లకు కట్టినట్టుగా ఆయన వర్ణిస్తూ, రామ నామాన్ని శ్వాసిస్తూ సీతమ్మ అశోకవనంలోనూ, రావణాసురుని ఉనికిని గుర్తించకుండా.. రామ ధ్యాసలో గడిపిందట. సముద్రానికి మరోవైపున సీతాస్మరణమే శ్వాసగా రామయ్య జీవించాడట. ఇరువురి మధ్య దూరాన్ని బాపేందుకు, వారి విరహమే వారధిగా మారి! రామసేతువుగా వెలసిందని, సిరివెన్నెల.. సీతారాముల మనోభావాలను ఆవిష్కరిస్తున్నారు.
5. గౌరీ చిత్రం కోసం, కోటి సంగీత దర్శకత్వంలో, మనో బృందం గానం చేసిన ‘ఏనాడో జరిగినా’.. గీతం
సాకీ:
వరమాలై నీ మెడలోన వాలిన జానకి ప్రేమ మెరుపల్లే నీ మేనంతా అల్లెను మేఘశ్యామా రామా రామా రామా రామా
పల్లవి:
ఏనాడో జరిగిన ఎన్నాళ్ళో గడిచినా ఏటేటా కొత్తగా కళ్యాణమా
విల్లును విరిచావనా పిల్లని గెలిచావనా ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా
కాపురమంతా కారడవిగా జీవితమంతా కష్టాలుగా చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది
ఏ పరమార్ధం పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారక మంత్రం
విన్న కొద్ది వింతలెన్నో తెలుపుతున్నది కళ్ళనిండా కాంతులెన్నో నింపుతున్నది
ఊరువాడనల్లుతున్న పందిరే ఇది మన్ను మిన్ను ఏకమైన సందడే ఇది ॥ ఏనాడో ॥
చరణం:
త్యాగం నిలిచిందయ్యా రఘురామా నీ మూర్తిగా న్యాయం గెలిచిందయ్యా శుభనామా నీ కీర్తిగా మమతకి లక్ష్మణ భరతులు తముళ్ళని,
మంచి మనసుకంతా బంధువులేనని
ఇలా విలువలెన్నో లోకానికి తెలియచెబుతుందా అందరి పెళ్ళి
కోరస్:
అందుకే నేటికీ తలచుకుంటాం మళ్ళీ మళ్ళీ పెళ్ళి ఈడు పడుచులంతా జానకమ్మలై జంటకోరు పురుషులంతా రామభద్రులై,
వీధి వీధి పచ్చనైన పెళ్ళి పందిరే ఆలుమగలు ఎవ్వరైనా పెళ్ళి పెద్దలే ॥ఏనాడో ॥
చరణం:
బంధం బిగువెంతని ఎడబాటే తెలిపిందయ్యా
నేస్తం బలమింతని కపి సైన్యం చూపిందయ్యా సముద్రాన్ని లంఘించే హనుమ భక్తిని
అధర్మాన్ని దండించే ధర్మశక్తిని నిరూపించింది
అడవికి వెళ్ళి జగత్కళ్యాణం జరిపిన పెళ్ళి
మనిషిలో మహిమని కొలుచుకుంటాం గుళ్ళోకెళ్ళి
॥ విన్న కొద్ది వింతలెన్నో॥
ఎన్నో యుగాల క్రితం జరిగిన సీతారాముల కల్యాణానికి, ప్రతి ఏటా ఇంత ఘనత ఏంటి? ఊరంతా పందిరిలేంటి? ఆ విల్లును విరిచినందుకేనా.. సీతమ్మను గెలిచినందుకేనా? నీ పెళ్లి ముహూర్తం, ఏం సుముహూర్తమయ్యా? జీవితమంతా కారడవిలో, కష్టాల్లో గడిపావుగా.. అని కొంటెగా ప్రశ్నిస్తున్నట్టే మొదలుపెట్టి.. ఈ పెళ్లిలో ఏదో పరమార్థం ఉంది, అంతరార్థం తెలుసుకునే కొద్దీ.. ఎన్నో గొప్ప గొప్ప సత్యాలు బయట పడుతున్నాయి అంటూ.. మనకు చేరవేయవలసిన.. ఆ నాలుగు మాటలు.. చక్కగా తెలియజేస్తున్నారు సిరివెన్నెల. రావణ సంహారం ద్వారా జరిగే లోకకల్యాణానికి సీతారాముల కళ్యాణం నాంది పలికిందనే మూల సత్యాన్ని ఈ పాట ద్వారా వివరిస్తున్నారు.
ఈ పెళ్లి వల్ల త్యాగం చిరస్థాయిగా నిలిచింది, ధర్మం గెలిచింది, అన్నదమ్ముల బంధం అందరికీ అర్థమైంది, మంచి మనసుకు, మానవతకు అందరూ చుట్టాలే అనీ, స్నేహబంధం ఎంతో బలమైనదనీ, హనుమలోని ఆత్మశక్తిని, రామభక్తి నిరూపించిందనీ, ఎడబాటులోను బలంగా నిలబడిన బంధం అసలైన దంపతుల ప్రేమకు చిహ్నంగా నిలిచిందనీ, అధర్మంపై ధర్మం విజయం సాధించిందనీ సిరివెన్నెల రామాయణంలోని మానవీయ విలువలను, ధర్మాలను మనకు చక్కగా వివరిస్తున్నారు. రామ కథలోని పరమార్ధాన్ని అర్థం చేసుకున్న తర్వాత / మనిషిలో మహిమని కొలుచుకుంటాం గుళ్ళోకెళ్ళి/, అనే పరివర్తనతో ఈ సారవంతమైన గీతానికి ముగింపు ఇస్తున్నారు.
6. కృష్ణం వందే జగద్గురుం చిత్రం నుంచి జరుగుతున్నది జగన్నాటకం గీతం..
పల్లవి:
జరుగుతున్నది జగన్నాటకం ॥ 2 ॥
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవనసత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం॥ 2 ॥
సిరివెన్నెల సాహిత్యంలోని భక్తి గీతాలను, భక్తి కోణంలోనే కాకుండా అనేక practical కోణాల్లో ఆవిష్కరించుకున్నాం. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలోని ‘జరుగుతున్నది జగన్నాటకం’ పాటని సిరివెన్నెలగారి practical relevance dimension లో మనం పరిశీలించాలి. ఆయన భాగవత లీలలను నిత్య జీవన సత్యాలుగా ప్రతిపాదించారు. ఈ పాటను అనేకమంది కథా పరంగా, భాగవత తత్త్వం పరంగా, ఆధ్యాత్మికపరంగా.. ఇలా పలు కోణాల్లో ఇప్పటికే విశ్లేషించడం జరిగింది. అయితే సిరివెన్నెల గారు మనిషిలోని అనంత శక్తులను సోదాహరణలుగా తీసుకుని, తాము ఎవరో తెలుసుకోమని, సత్యాన్వేషణ దిశగా, మనకు దిశా నిర్దేశం చేసినట్టు నాకు అనిపిస్తుంది. యుగయుగాలుగా ఎంతోమంది ఋషులు, మునులు, యోగులు, తత్వవేత్తలు తరచి, తరచి జీవితకాలం సాధనలు చేసి తెలుసుకొని మనకు తెలియజేసిన సత్యం.. We are not the Human beings in spiritual bodies but we are the Spiritual beings in human bodies. దానికై లోతైన స్వీయాన్వేషణ జరగాలి. అప్పుడే మన మూలాలు, మన అనంత శక్తిమత్వం, ఆత్మ పరమాత్మల అద్వైత తత్వం తెలుసుకోగలుగుతాం. అదే జీవిత పరమార్ధం.
ఇది వ్యక్తిగత నమ్మకాలు, విలువలు, అనుభవ జ్ఞానంతో అర్థాన్ని విశ్లేషించడం. భాగవత తత్త్వాన్ని సిరివెన్నెల తన అనుభవంతో క్రోడీకరించి, తన జ్ఞానంతో సూత్రీకరించి (formulise) ఈ పాటలో పొందుపరిచారనడంలో సందేహం లేదు!
భగవంతుని కల్పన నుంచి జనించిన ఈ సృష్టిలో ఎటువంటి ఒడిదుడుకులు, అసమతుల్యత వచ్చినా, దాన్ని సరిదిద్దడం కోసం భగవంతుడే భూమి మీద ఒక అవతారాన్ని దాల్చి, వాటిని సరిదిద్దడం జరిగింది. ఆ విధంగా పరమాత్ముడు తీసుకున్న అవతారాలు, అ లీలలు భాగవతంలో అభివర్ణించబడ్డాయి.
“మహిమలు చూపేవాడు కాదు సాయం చేసేవాడు దేవుడు. ఇతరులకు సాయం చేస్తే మనిషి కూడా దేవుడు కాగలడు” అన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా బీటెక్ బాబు (రానా) అనే వ్యక్తి జీవిత ప్రయాణంగా సాగుతుంది.
ఈ పాటలో రామ తత్త్వాన్ని సిరివెన్నెల ఈ విధంగా ఆవిష్కరించారు.
ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచె..
ఒక సాధారణ మానవుడిగా జన్మించిన రాముడు, తన ధర్మనిరతితో, విశిష్ట విలువలు, ప్రమాణాలు ఏర్పరచి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి, తన చరిత్రనే రామాయణంగా మార్చుకుని దేవుడయ్యాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన అన్ని కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. రాముడిని దేవుడిగా కొలవడం మాత్రమే కాకుండా, రాముడిలాగా పరిపూర్ణమైన మానవుడిగా ఎదగడం కూడా నేర్చుకోమని సిరివెన్నెల ఎంతో ప్రేరణత్మకమైన, హృద్యమైన సందేశాన్ని మనందరికీ అందిస్తున్నారు.
ఈ మానవజన్మ యొక్క ప్రాధాన్యత, దాని విలువ అందరూ తెలుసుకోవాలని, ఉన్నతమైన స్థితిలో జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటారు. ప్రతి పాటలోనూ ఆయన జీవితాన్ని వ్యాఖ్యానించి విశదీకరించారు. / 7. అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది/ అంటారు సిరివెన్నెల..’రంగేళి హోలీ’..అనే చక్రం చిత్రంలోని పాటలో. ఒక ఆదర్శ పురుషుడు నుంచి మనుషులు ఏమి నేర్చుకోవాలో, మనిషిగా తనను తాను ఎలా మలుచుకోవాలో, నలుగురు నా వాళ్లే అనుకుని ఎంత ఆనందంగా జీవించాలో, సిరివెన్నెల ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు.
తన కవితా దర్పణంలో జీవిత సత్యాలను, అసలైన భగవంతుని తత్త్వ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. మనము నేర్చుకుని, అలవర్చుకొని, సాధించవలసిన శ్రీరామచంద్రుని గుణగణాలను, ఇన్ని విధాలుగా, ఇంత హృద్యంగా, ఇన్ని పాటల ద్వారా తెలుపుతూ, ఆ సీతారాముడికి, అక్షరార్చన చేస్తున్న ధన్యజీవి ఈ సిరివెన్నెల సీతారాముడు.
Images Source: Internet

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.
2 Comments
Avamanam Sreenivas
శ్రీ వాణి శర్మ గారు మీరు రాసిన సిరివెన్నెల గారి పాటకు మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది
కొల్లూరి సోమ శంకర్
ఇది అవధానం శ్రీనివాస్ గారి వ్యాఖ్య: *మీరు సిరివెన్నెల గారి పాటకు అర్థాన్ని చాలా చక్కగా వివరించారు. నిజంగా రామున్ని – రామ తత్వాన్ని సిరివెన్నెల గారు చక్కగా అర్థం చేసుకొని మనసులో బంధించి తన ఆలోచనలనే సిరాతో ఈ పాట అనే రాతలు రాశాలేమో అని నాకు అనిపించింది.
శ్రీనివాస్ అవధానం.*
దానికి ఆ పాటలోని తత్వాన్ని, భావాన్ని చక్కని విశ్లేషణాత్మకమైన భావముతో మీరు రాసిన వ్యాఖ్యనం మరింత లోతుగా ఆ పాటను అధ్యయనం చేసే విధంగా ఉంది అని నేను చెప్పడానికి నేనేమాత్రం సంకోచించను. మీరు మరొకసారి మీ అద్భుతమైన వ్యాఖ్యానంతో సిరివెన్నెల గారి మనసు మనసు చదివి ఈ వ్యాఖ్యానం రాశారేమో అని నాకు అనిపించింది మీకు శతకోటి ధన్యవాదాలు