కులం కంపును
కడుపునిండా నింపేసుకున్న ఆ కలం
మతం కుళ్ళుకు మానవత్వపు ముసుగేసి మూతకింద మూసేసిన ఆ కలం
విద్వేషపు విషాన్ని పాళీ పెదవుల గుండా
పలుకులను పదాలుగా పేర్చి
మాటల మాధ్యమంలోకి మార్చి
వాక్యాలుగా వ్యాసాలుగా కథలుగా కథనాలుగా
అందంగా అచ్చువేస్తూనే ఉంటుంది
అంతర్జాల పుస్తకం పుటలపై
అందరూ అనుసరించే తన ముఖపుస్తకం గోడపై
ఓ జీవితం కీర్తి గడించినపుడో
మరేదైనా జీవితం కీర్తిశేషమైనపుడో
వెలుగుతున్న ఆ బతుకుదివ్వెలపై
వెళ్ళిపోయిన ఆ యశోవంతులకై
ప్రకాశంగా మెరుస్తోన్న దీపపు సెమ్మెలపై
అంతులేని చీకటిని కుమ్మరించేందుకు
ఆయా జీవితాల గతాన్ని
క్షణంక్షణంగా క్షుణ్ణంగా శోధిస్తూంటుంది
నడకలో తడబడినదేమైనా ఉందేమోనని…
ఆ బతుకులు చెప్పుకున్న స్వగతాన్ని
పదంపదంగా పరిశీలించి రంధ్రాన్వేషణ చేస్తుంటుంది
మాటల్లో పొరబడిందేమైనా ఉంటుందేమోనని…
ఆ కీర్తి తనకు లేదన్న కసి కుట్రల దివిటీని
ఆ గుర్తింపు తనకు రాలేదన్న
అసూయ ఉక్రోషాల లాంతరును
చేతపట్టుకునీ మరీ వెతుకుతుంటుంది
చీకటిని నిండుగా నింపేసుకున్న మనసుతో
గోరంత విషయాన్ని కొండంత విషంగా మార్చి
పాలలాంటి పాఠకుల మెదళ్ళపై చిలుకరించి
తెల్లని ఆ గతించిన, కీర్తి గడించిన జీవితాలపై
అసహ్యపు అబద్దపు నలుపు రంగు పులిమే ప్రయత్నం
నిన్నా నేడూనే కాదు, నిరంతరం చేస్తూనే ఉంటుంది
ఎందుకో ఆ కడుపుమంట
ఏం ఆశించో సూర్యునిపై ఊసే ఆ ప్రయత్నం

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
4 Comments
Andela Mahender
Bagundi sir
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు మహేందర్ నా కవిత నీకు నచ్చినందుకు
పప్పు రామకృష్ణ రావు
ఇది సమకాలీన సమస్యే కాదు. సార్వకాలిక సమస్య. విభిన్నమైన విషయాన్ని ఎంచుకుని కవికులంలో “కాకులని” ఎండగట్టే ప్రయత్నం చేసేరు. బాగుంది.
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు రామకృష్ణగారూ… మీ స్పందన లోతుగా ఉంది.