వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
“సుధగారు ఎలా వున్నారండీ?” ఒకే వీధిలో సరిగ్గా నాలుగు ఇళ్ళ అవతల వున్న సుధను ఫోన్ చేసి పలకరించింది పది రోజుల క్రితమే వేరే ప్రాంతం నుండి బదీలీపై కొత్తగా వచ్చి దిగిన కాత్యాయని.
“నేను బాగున్నానండీ, మీరెలా వున్నారు? అన్నట్టు పాలవాడు, చాకలి, పేపర్ బాయ్ కుదిరారా?” అడిగింది సుధ.
“ఇంకాలేదండీ. మేము ఇక్కడ దిగినప్పటినుండీనే మొదలైన ఈ కరోనా మహమ్మారి వలన ఆయనగారికి బయటకు వెళ్ళే అవకాశమే లేకుండా పోయింది” నిరాశగా అంది కాత్యాయని.
“కూరగాయలు, పచారీ సామాన్లకు ఇబందిపడుతున్నారేమో, ఉదయం ఆరు నుండి తొమ్మిది దాకా లాక్డౌన్ బ్రేక్ వుంటుందిగా. ఆ సమయంలో అన్నయ్యను మార్కెట్ కి పంపి ఏవైనా తెప్పించుకోరాదూ?” సలహా ఇస్తున్నట్లుగా అంది సుధ.
“మామూలుగా మార్కెట్కు, రైతుబజారుకు నేనే వెళ్ళడం అలవాటండీ, మీ వరకూ ఎలా వుంటుందో గానీ నాకు మాత్రం ఈ మాయదారి కరోనా వలన కాలు బయట పెట్టలేక జైలులో బందీగా వున్నట్లు వుందండీ, భరించలేక పోతున్నాం” అసహనంగా అంది కాత్యాయని.
“ఇప్పుడంటే కరోనా వుందిగానీ ఈ స్వీయ గృహనిర్భంధం నాకు బాగా అలవాటేనండీ, పెద్దగా తేడా ఏం అనిపించడం లేదు” అంది సుధ నిర్లిప్తంగా.
“ఎలా?” అర్థం కానట్లుగా ప్రశ్నించింది కాత్యాయని.
“పెళ్ళయిన పన్నెండేళ్ళుగా పిల్లాడిని కడుపులో మోసిన కాలాన్ని మినహా ఇస్తే మిగతా సమయంలో ప్రతీ నెలా ‘ఆ ఐదురోజులు’ స్వీయ గృహ నిర్బంధంలో వుండటం నాకు అలవాటే కదా” విసుగ్గా సమాధానం ఇచ్చింది సుధ, నేటి ఆధునిక కాలంలోనూ తనతో బలవంతంగా అనాగరిక ఆచారాలు పాటింపజేస్తున్న అత్త మామలు, భర్తకు తన మాటలు వినపడకుండా…
“ఏమండీ, కూరగాయలు బొత్తిగా లేవు, మార్కెట్కు వెళ్లి రాగలరా?” ఉదయం ఆరు గంటల సమయంలో నిద్ర లేచిన భర్తకు కాఫీ కప్పు అందిస్తూ అడిగింది నళిని.
“ఇప్పుడు కుదరదుగానీ, సాయంత్రం ఆఫీసు నుంచి అటే వెళ్ళి తీసుకొస్తాలే” భార్యకు జవాబిచ్చాడు సుందరరావు.
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో….
“ఏమిటండీ ఇవన్నీ?”ఇంటి ముందు ఆటో దిగి కొన్ని చిన్న చిన్న బస్తాలను అందులో నుండి దింపి ఇంట్లోకి చేరవేస్తున్న భర్తను అడిగింది నళిని.
“కూరగాయలు లేవన్నావుగా, రైతు బజారు కెళ్ళి వస్తున్నా” చెప్పాడు సుందరరావు.
“పిల్లలతో కలిపి మన మొత్తం ఇంట్లో వున్నది కేవలం నలుగురమే కదా, టమోటాలే ఎందుకు ఇన్ని ఎక్కువ తీసుకొచ్చారు?” అడిగింది నళిని భర్తను అర్థంకానట్లుగా చూస్తూ.
“పాతిక కిలోలేలే, మన ఇంటికి చుట్టుపక్కన ఉన్న వాళ్లందరికీ తలో రెండు కిలోల చొప్పున పంచు, మరీ మిగిలితే ఊరగాయ తయారుచెయ్”చెప్పాడు సుందరరావు.
“మనం డబ్బులు పోసి కొని ఎవరికో ఎందుకు పంచడం? అసలు ఎందుకు ఇంత ఎక్కువగా తెచ్చారు?” చిరాగ్గా అడిగింది నళిని.
“ధరలు పూర్తిగా పడిపోయి టమోటా రైతుకు పొలం నుండి రైతు బజారుకు తరలించేందుకు రవాణా ఛార్జీలు కూడా గిట్టుకోవడం లేదు నళినీ, కేవలం ఓ వంద రూపాయలతో ఏమవుతుందిగానీ, ఇలాంటి సమయంలో మనలాంటివాళ్ళు ఆ మాత్రం ‘చేయూత’ ఇవ్వకుంటే ఎలా?” తాను చిన్నప్పుడు టమోటా పంటకు ధర రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి చనిపోయిన తండ్రి కళ్లముందు మెదులుతుండగా చెప్పాడు సుందరరావు.
“మమ్మీ, మా స్కూల్ తరపున నాలుగవ తరగతి పిల్లలం మొత్తం రేపు ఉదయం ఆరు గంటలకు ‘పిక్నిక్’ వెళుతున్నాం, త్వరగా లేచి లంచ్ బాక్స్ తయారుచేసివ్వాలి” సాయంత్రం ఇంటికి వచ్చిన కిరణ్ చెప్పాడు తన తల్లికి.
“సరే బాబూ, అక్కడ జాగ్రత్తగా వుండి తిరిగిరా” చెప్పింది కొడుక్కు తులసి.
“ఖర్చులకోసం ఓ వంద రూపాయలు తెచ్చుకోమన్నారు మమ్మీ” చెప్పాడు కిరణ్.
“అలాగే ఇస్తాలే నాన్నా” చెప్పింది తులసి.
మరుసటి రోజు సాయంత్రం….
“ఎలా జరిగింది కిరణ్,నీ ‘పిక్నిక్’ ప్రోగ్రాం?” ఇంటికి తిరిగొచ్చిన కొడుకును అడిగింది తులసి.
“చాలా బాగా జరిగింది మమ్మీ, అయినా నాదొక సందేహం?” ప్రశ్నించాడు కిరణ్.
“ఏమిట్రా అది?”అడిగింది తులసి సందేహంగా చూస్తూ.
“చాలా ఏళ్ల క్రితం మన తాతయ్య ఇల్లు వదిలేసి దేశం మీద వెళ్ళిపోయాడు అని చెప్పావే, ఆయనకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉన్నారా?” అడిగాడు కిరణ్.
“లేరు నాన్నా, వాళ్ళ అమ్మకు ఆయన ఒక్కడే కొడుకు, అయినా ఎందుకు అడిగావు?” ప్రశ్నించింది తులసి, పెళ్ళయిన కొత్తల్లోనే తను వేరుకాపురం కోసం పట్టుబట్టి మామగారిమీద భర్తకు చాడీలు చెప్పి అతడిని ఇల్లు వదిలిపోయేలా చేసిన సంగతి గుర్తుకువచ్చి.
“మరేం లేదు, అచ్చు అలాంటి పెద్దాయనే ఒకరు అక్కడ అడుక్కునే వాళ్ళలో కనిపిస్తే” చెప్పాడు కిరణ్ గోడ మీద వేలాడుతున్న తన తాత గారి ఫోటో వంక తదేకంగా చూస్తూ.
“ఇంతకీ వందరూపాయలతో ఏం కొనుక్కున్నావు?”అడిగింది తులసి.
“ఏం కొనుక్కోలేదు మమ్మీ, ఆ వందరూపాయలు అడుక్కునే ఆ పెద్దాయనకి ఇచ్చేశా” జవాబు చెప్పాడు కిరణ్ ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నదానిలా వున్న తల్లి ముఖంలోకి గమనిస్తూ…
డిశంబర్ .24.2019…
“ధర్మప్రభువులు, దానం చెయ్యండయ్యా” తన పుట్టినరోజు నాడు గుడిలో అర్చన చేయించుకొని బయటకు వచ్చిన శంకరరావును ప్రాధేయపడ్డాడు అక్కడే ఉన్న ఓ యాభై ఏళ్ళు పైబడ్డ బిక్షగాడు.
“ఏదైనా పనిచేసుకుని బ్రతకరాదా”చీదరించుకున్నట్లుగా అన్నాడు శంకరరావు.
“ఒళ్ళు బాగా లేదు సామీ, ఏ పనీ చేయలేను”దీనంగా బదులిచ్చాడు బిక్షగాడు.
“సోమరితనానికి అలవాటుపడ్డ నీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పేమాటే ఇది” శంకరరావు మాటల్లోనూ, కళ్ళలోనూ అసహ్యం ధ్వనించింది.
“అబద్ధం చెప్పడం లేదయ్యా కరుణించండి” మరోసారి అభ్యర్థించాడు బిక్షగాడు దీనంగా.
“ప్రశాంతంగా గుడికి రావాలన్నా, నీలాంటి వాళ్ల వల్ల రాబుద్ధి పుట్టదు, మాలాంటివాళ్ళలో గున్న దానగుణం మీలాంటివాళ్ళను సోమరిపోతులుగా మారుస్తోంది” కసురుకుంటూ వెళ్ళిపోయాడు శంకరరావు.
మూడు నెలల తర్వాత…
ఏప్రిల్ 12 2020…
“అయ్యా ఒక్క నిమిషం అక్కడే ఆగండి” అని తనను ఎవరో పిలిచినట్లు వినిపిస్తే ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు ఓ స్వచ్ఛంద సంస్థ తరపున ‘కరోనా మహమ్మారి నిర్మూలన’ కోసం విరాళాలు సేకరిస్తున్న శంకరరావు.
“నేనేనయ్యా, తమరు జనాలనందర్నీ పీడిస్తాండే ఆ మాయ రోగం గురించి ‘దుడ్లు’ వసూలు చేస్తాండారు గదా, నా వంతు సాయంగా ఏమైనా చందా ఇద్దామని” రెండు చేతుల నిండా గుప్పెడు చిల్లర నాణేలతో, ఆయాసపడుతూ పరుగులాంటి నడకతో తన వైపే వస్తున్న గుడి దగ్గర వుండే ఒకప్పుడు తాను అసహ్యించుకున్న బిక్షగాడు కనిపించాడు శంకరరావుకు.
Super Nagaraju
Very nice
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™