[‘మా కథలు 2022’ అనే కథా సంకలనాన్ని వెలువరించిన శ్రీ సి.హెచ్. శివరామ ప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]


సంచిక టీమ్: నమస్కారం సి.హెచ్. శివరామ ప్రసాద్ గారూ.
సి.హెచ్. శివరామ ప్రసాద్: నమస్కారం.
~
ప్రశ్న 1. తెలుగు కథ రచయితల వేదిక తరఫున మీరు గత పదేళ్ళకు పైగా ప్రతీ ఏడాది ‘మా కథలు’ పేరుతో కథాసంకలనాలు వెలువరించడం వెనుక మీ ఆలోచన వివరిస్తారా?


ప్రశ్న 2. సహకార పద్ధతిలో రచయితల నుంచి కథలు స్వీకరించి, సంకలనం చేయడంలోని సాధకబాధకాలు ఎలాంటివి? ఎప్పుడైనా ఎందుకీ బాధ్యత తలకెత్తుకున్నాను అని అనిపించిందా?
జ: సహకార పద్ధతిలో రచయితల నుంచి కంట్రిబ్యూషన్ స్వీకరించి సంకలనం వెలువరించడంలో సాథక బాధకాలు వుంటాయి. రచయితలను భాగస్వాములు చేయడమే ఉద్దేశం. కథానిక జీవిగా జీవితాంతం కృషి చేసిన డాక్టర్ వేదగిరి రాంబాబు జయంతి రోజున, అక్టోబర్ 14న ‘మా కథలు’ సంకలనం వెలువరించడం ఒక బాధ్యతగా స్వీకరించాను. ఇష్టమైన పని కాబట్టి కష్టం లేదు.
ప్రశ్న 3. కథల ఎంపిక ఎలా జరుగుతుంది? ఏదైనా ఉమ్మడి ఇతివృత్తంపై రాసిన కథలను ఎంచుకుంటారా? లేక సంకలనం కోసం ఏ కథ ఇవ్వాలనేది రచయిత ఇష్టమా? లేక రచయితలు రెండు మూడు కథలిస్తే, వాటిల్లోంచి మీరు ఒకటి తీసుకుంటారా?
జ: కథల ఎంపిక అంటూ లేదు. రచయితలు తాము ఆ సంవత్సరంలో ప్రచురించిన కథలలో ఏదొకటి పంపుతారు. సెలక్షన్ వారిదే. రెండు, మూడు కథలు పంపిస్తే, అందులో ఏదొకటి ఎన్నిక చేసి ప్రచురిస్తాం.


కె. సభా గారి సంస్మరణ సభ సందర్భంగా మా కథలు -2022 పుస్తకం ఆవిష్కరణ దృశ్యం
ప్రశ్న 4. విభిన్న ఇతివృత్తాల కథలను సంకలనంలో చేరుస్తున్నప్పుడు ఏదైనా ఏకసూత్రత కోసం చూస్తారా? కథల ఎంపికకు మీరు పాటించే ప్రమాణాలేమిటి?
జ: ఇతివృత్తం, కథ ఎన్నిక రచయితదే. కథల ఎన్నికలో నా ప్రమేయం వుండదు. ఆ సంవత్సరంలో పబ్లిష్ అయిన కథ పంపాలనే నిబంధన ఒకటే.


ప్రశ్న 5. సంకలనం లోని కథలకు పేజీల నిడివి పరిమితి విధించారా? లేదా నిడివితో నిమిత్తం లేకుండా, ఎంపిక చేసుకున్న కథలను ప్రచురించారా?
జ: కథలకు నిడివి నిబంధన లేదు.
ప్రశ్న 6. మీ కృషికి రచయితల సహకారం ఎలా ఉంటుంది? ఇంతమంది రచయితలతో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు?
జ: ప్రతి సంవత్సరం 40 మంది వరకు రచయితలు సహకరిస్తారు. రచయితలు కథ, ఫోటో, బయోడేటా, కంట్రిబ్యూషన్ పంపితే చాలు. ఆవిష్కరణ తర్వాత హైదరాబాద్‌లో వున్న రచయితలు స్వయంగా వచ్చి తీసుకుంటారు. ఇతర ప్రాంతాలలో వున్నవారికి ట్రాన్స్‌పోర్టులో పంపుతాము.


ప్రశ్న 7. తెలుగులో పుస్తకాలకు ఆదరణ తగ్గిందని కొందరు ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అంటున్నారు. ఎందుకనంటారు? పాఠకులు తగ్గారా? వారిని ఆకర్షించే రచనలు తగ్గాయా? లేక ఇంకా ఏదయినా కారణం వుందా?
జ: తెలుగులో ఇప్పుడు పబ్లిషర్స్ ఎవరూ లేరు. రచయితలు ఎవరి రచనలు వారే ముద్రించుకోవాలి. రచయితల పాపులార్టీ బట్టి అమ్మకాలు వుంటాయి. ఇప్పుడు పుస్తక విక్రేతలు ఆన్లైన్లో అమ్ముతున్నారు. షాపుకి వచ్చి కొనేవారు తగ్గారు. బుక్ ఫెయిర్‌లో కొన్ని అమ్ముడవుతున్నాయి.


ప్రశ్న 8. ఈ సంకలనాల ప్రచురణలో ఏదైనా మరపురాని సంఘటన లేక ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఏదైనా ఉంటే, తెలియజేస్తారా?
జ: ‘మా కథలు’ సంకలనంలో కథ ప్రచురించబడాలంటే, ఆ సంవత్సరం పబ్లిష్ అయి వుండాలనే నిబంధన వలన కొందరు ప్రముఖులు, ఎ.జి. కృష్ణమూర్తి, మానస, వేదగిరి రాంబాబు కథలు రాశారు. ఎ.జి. కృష్ణమూర్తి గారు 1962 కొన్ని కథలు రాసి, మళ్ళీ 2013 నుండి రాయడం మొదలు పెట్టారు.
ప్రశ్న 9. ఒక్కో ఏడాది ఒక్కో ప్రఖ్యాత రచయిత శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈ సంకలనాలను వారికి అంకితమీయాలన్న ఆలోచన వెనుక మీ ఉద్దేశం వారిని గౌరవించుకోడమనే కాకుండా మరేదైనా ఉందా?
జ: కథారచయితల శత జయంతి సందర్భంగా వారికి నివాళిగా ‘మా కథలు’ అంకితం ఇవ్వడం జరుగుతుంది. వారిని పాఠకులకు గుర్తు చేసి గౌరవించడం కోసమే అంకితమివ్వడం.


ప్రశ్న 10. గత కొన్నేళ్ళుగా మీ ఈ కథాసంకలనాల వెల కేవలం ₹ 99 లే ఉంచుతున్నారు. ముద్రణా వ్యయం బాగా పెరిగిన ఈ రోజుల్లో దాదాపు 250 పేజీల పైన ఉండే పుస్తకాన్ని ఇంత తక్కువ ధరకి అందించడం ఎలా సాధ్యమవుతోంది?
జ: 99 రూపాయలకే మా కథలు పాఠకులకు అందివ్వడంలో ఉద్దేశం, పుస్తకాలు కొనే అలవాటుకు దోహదం చేస్తున్నదనే. రచయితల కంట్రిబ్యూషన్, సహకారంతో ఇది సాధ్యమవుతుంది.


ప్రశ్న 11. తక్కువ వెలకే అందిస్తున్న మీ సంకలనాలకు పాఠకుల స్పందన ఎలా ఉంటుంది? అమ్మకాలు ఆశాజనకంగానే ఉంటున్నాయా? ఈ సంకలనాల గురించి పాఠకులకు తెలిసేలా ప్రచారమెలా చేస్తున్నారు?
జ: సంకలనంలో పాల్గొన్న రచయితలకు 20 కాపీల చొప్పున పంపడం వలన దాదాపు 800 కాపీలు వెళ్తాయి. మిగిలిన 200 కాపీలు పుస్తక విక్రేతలకు పంపుతాము. పుస్తక సమీక్షల తోనే ప్రచారం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అంటే ‘మా కథలు 2021’, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి అంకితం యిచ్చినది, విశాఖపట్నంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ‘మా కథలు 2022’, శ్రీ సభాగారికి అంకితం యిచ్చినది తిరుపతిలో జరిగింది. పత్రికలలో వార్తల వలన కొంత ప్రచారం జరుగుతుంది.
ప్రశ్న 12. సంకలనకర్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఈ సంకలనాలే కాకుండా మరేవైనా పుస్తకాలు వెలువరించే ఉద్దేశం ఉందా?
జ: మా కథల వార్షికలే కాకుండా, కంట్రిబ్యూషన్ తీసుకోకుండా కొన్ని సీనియర్ సిటిజన్ కథా సంకలనాలు వెలువరించాను. 1. మా సీనియర్ సిటిజన్ కథానికలు. 2. మా అమ్మానాన్న కథలు. 3. మా నాన్నకు ప్రేమతో. అలాగే మా కొత్తకథలు. నేను వుండగా ప్రతి సంవత్సరం డాక్టర్ వేదగిరి రాంబాబు జయంతికి ‘మా కథలు’ సంకలనం వెలువడుతుంది. నా వయసు ఇప్పుడు 82. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. నా తర్వాత బాధ్యత తీసుకుని కథావార్షికలు వెలువరిస్తారో తెలియదు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శివరామ ప్రసాద్ గారూ.
సి.హెచ్.శివరామ ప్రసాద్: ధన్యవాదాలు.
***


సంకలనం: సిహెచ్. శివరామ ప్రసాద్
ప్రచురణ: తెలుగు కథా రచయితల వేదిక
పేజీలు: 272
వెల: ₹ 99.00
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/te/products/ma-kathalu-2022
~
‘మా కథలు 2022’ సమీక్ష:
https://sanchika.com/maa-kathalu-2022-book-review-kss/
6 Comments
గోనుగుంట మురళీకృష్ణ
అడిగిన ప్రశ్నలకు శివరామ ప్రసాద్ గారు సూటిగా క్లుప్తంగా ఇచ్చిన సమాధానాలు బాగున్నాయి. సంకలనాలు ప్రచురించటం మంచి ప్రయత్నం. ప్రచురించిన పత్రికలు కొన్నాళ్ళకు కనుమరుగు అయిపోతాయి. వాటి ఆచూకీ తెలియదు. ఇలాంటి సంకలనాలలో కథలు శాశ్వితంగా ఉండిపోతాయి. శివరామ ప్రసాద్ గారి ప్రయత్నానికి సహకారం అందించటం మన బాధ్యత.
Kottapalli udayababu
దశాబ్దంగా మీ నిర్విరామ సాహితీ కృషి అభినించదగ్గది. మీ లక్ష్యం, నిబద్ధత మీ స్ఫూటమైన సమాధానాలలో స్పష్టంగా అర్ధం అయ్యాయి సర్. మీకు హృదయపూర్వకమైన అభినందనలు మరియు శుభాకాంక్షలు











Dr KJRao
మాకధలు సంకలన కర్త గురువు గారైన శ్రీ శివరాం ప్రసాద్ గారికి అభినందనలు. కొద్దిమంది ప్రముఖుల సరసన నా బోటి పేరూ ఊరూ తెలియని వారి కధలను చేర్చి ప్రోత్సాహస్తున్న వాణిశ్రీ గారికి కృతజ్ఞతలు
జగన్ మిత్ర / డా కె జె రావు
శ్రీహరికోట / హైదరాబాద్
Anil అట్లూరి
శివరామప్రసాద్ గారి కలం పేరు ‘వాణిశ్రీ’. వారు కొన్ని వందల కథలు అనేక పత్రికలలో రాసారు. రచయితగా వారి సాహితీ జీవనం గురించి కూడా సంచిక పాఠకులకు తెలియజేస్తే బాగుండేది.
కొల్లూరి సోమ శంకర్
ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ‘మా కథలు 2022’ సమీక్ష ప్రచురణ సందర్భంగా అందించినది కావున, ఇంటర్వ్యూ ఈ సంకలనాకి మాత్రమే పరిమితమయిందండీ. మీ సూచనని స్వీకరిస్తున్నాము. వీలు వెంబడి వారి సమగ్ర ముఖాముఖిని అందించడానికి ప్రయత్నిస్తాము.
వరిగొండ కాంతారావు
‘వాణిశ్రీ’ గారికి

హార్దిక శుభాకాంక్షలు.
తెలుగు కథాలోకం వారికి శాశ్వతంగా రుణ పడి వుంటుంది.
వరిగొండ కాంతారావు