సాయం సమయం. ఆహ్లాదకరంగా ఉన్న ఆకాశాన్ని వీక్షిస్తూ మధ్య మధ్యలో తోటపని చేస్తున్నాను. పక్కింట్లో నుండి ‘హే నీలె గగన్ కె తలే.. ధర్తీకా ప్యార్ పలె.. అయిసీ హి జగమె, ఆతీ హై సుబ్హె, అయిసీ హి షామ్ ధలి…’ మహేంద్ర కపూర్ పాట వీనులవిందు చేస్తుంటే నేనూ కూనిరాగం తీస్తున్నాను. ‘ఏనాటి పాట!’ అనుకోవటంతో పాటే నా మనసు అల నీలి గగనంలో పచార్లు మొదలు పెట్టింది.
ఒక్కసారి తలెత్తి చూశాను. అదొక అద్బుత చిత్రపటంలా తోచింది. సాధారణ చిత్రకారుడు గీసే చిత్రపటం ఒకసారి గీయటం పూర్తిచేశాక అలాగే ఉండిపోతుంది. కానీ ఆకాశ చిత్రపటమో. నిరంతరం చిత్రాతిచిత్రంగా మారిపోతూ అలరిస్తుంది. ఇలాంటి క్షణాల్లోనే ‘ఏ కౌన్ చిత్రకార్ హై‘ అనుకుంటాం. ఆకాశం గొడుగు కింద ఉండే ఎవరైనా సరే ఎక్కడైనా, ఎన్నడైనా, ఎప్పుడైనా ఆకాశం అందాలను వీక్షిస్తూ పైసా ఖర్చులేకుండా ఎంత సేపైనా గడిపేయవచ్చు. ఆకాశం నీలి, తెలుపు రంగుల్లో సమ్మోహపరుస్తూ, అంతలోనే సూర్యకాంతిని పంచుకొని కాషాయ వర్ణంలో… కారుమబ్బులు కమ్ముకున్న వేళ ముదురు నీలి, నలుపు రంగుల్లో దర్శనమిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఆకాశం ముప్పొద్దులా అలంకారం మారుస్తుంటుంది.
ఉదయానే నుదుటి కుంకుమలా సూరీడుని సింగారించుకొని సాక్షాత్కరించే ఆకాశం అందం ఓ ఎత్తయితే, పొద్దు గడిచేకొద్దీ నిలువెల్లా సూర్యకాంతిని పరచుకొని ధగధగ్గాయమానంగా ప్రకాశిస్తూ, ‘ఓ మనిషీ! సూటిగా నన్ను చూడలేవం’టూ మిడిసిపడుతుంది. సూర్యాస్తమయ వేళ ఆకాశం అందాలే వేరు. ఆ వర్ణ సౌందర్యం వర్ణనకందనిది. సూర్యోదయ, సూర్యాస్తమయ సౌందర్యాల వీక్షణకు సిసలైన చిరునామా ‘కన్యాకుమారి’ అంటారు. అది కూడా నా బకెట్ లిస్ట్‌లో ఉంది. ఆకాశం సాయం సమయాన సూర్యుడిని సాగనంపి, జాబిల్లిని రారమ్మంటుంది.
అన్నట్లు బాల్యంలో మేడమీద పడుకుంటే ఎంత హాయిగా అనిపించేదో… ఆకాశమంతా ఆహ్లాదకరమైన వెన్నెల, చల్లగా, ప్రశాంతంగా… దోబూచులాడే చందమామ, మిణుకుమిణుకు నక్షత్రాలు… ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్, అప్ ఎబౌ ది వరల్డ్ సో…’ అని పాడుకోవటం… ఆ రోజులే వేరు… ఇప్పుడు అన్నీ ఆకాశహార్మ్యాలు… మేడలమీద పడుకోవటం ఎక్కడా… అనుకుంటూ అప్రయత్నంగా ఆకాశంకేసి చూశాను. మబ్బులు వడివడిగా కదులుతున్నాయి. ‘ఇలా కాదు, కాసేపు కూర్చోవలసిందే’ అనుకుంటూ పైపు నీళ్లతో చేతులు కడుక్కుని సిమెంట్ బెంచీపై బైఠాయించి మళ్లీ నింగికేసి చూపు సారించాను.
మబ్బుల్లో రకరకాల ఆకృతులు గోచరిస్తున్నాయి. ఓ క్షణం గుర్రమల్లే, మరో క్షణం సింహమల్లే… ఇంకో క్షణం రథమల్లే ఇదంతా నా ఊహను బట్టే. ఆమధ్య తిరుమలలో మహాసంప్రోక్షణ అనంతరం వినువీధిలో మబ్బులు శ్రీనివాసుడి రూపంలో అవతరించాయని వాట్సాప్‌లో ఆ ఫొటోలు షేర్ చేశారు కూడా. అంతలో ఆకాశంలో పక్షుల గుంపు కనువిందుచేసింది. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు… తెల్లని కొంగలు బారులు బారులు‘ మల్లీశ్వరి పాట గుర్తొచ్చింది. బావ జాడ తెలియక మళ్లీ ఆకాశంకేసే చూస్తూ ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు, దేశదేశాలన్నీ తిరిగి చూసేవు.. ఏడ తానున్నాడో బావా, జాడ తెలిసిన పోయి రావా. నీలాల ఓ మేఘమాల‘ అని వేడుకుంటుంది. అదే మరో సినీ కవి ‘ఆకాశం నీ హద్దురా… అవకాశం వదలొద్దురా..’ అంటూ స్ఫూర్తినందించారు. మరో హీరోగారు ‘ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా?’ అని నాయికను అడుగుతాడు. ఆమె తక్కువ తిన్నదా, ‘ఆకాశం నా నడుము (ఆకాశం శూన్యమనే అర్థంలో), నెలవంక నా నుదురు.. సిగలో నువ్వేరా’ అంటుంది. మరో నాయిక.. ‘ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్లంట అప్సరలే పేరంటాళ్లు… దేవతలే పురోహితులంట దీవెనలు ఇస్తారంట…’ అని మురిసిపోతుంది.
సంబరమైనా, సంతాపమైనా, అంబరంతో పంచుకోవటం మామూలే. ఓ ప్రేమికుడు ‘నింగి, నేల కడుదూరం… మన ఇద్దరి కలయిక విడ్డూరం‘ అంటాడు తన అదృష్టాన్ని తానే నమ్మలేక. అవని, ఆకాశాల మధ్య అనంతదూరాన్ని అలనాడు త్యాగరాజు కూడా గుర్తించాడు. అందుకే ‘నగుమోము గనలేని…’ కీర్తనలో ‘ఖగరాజు నీ ఆనతి విని వేగ జనలేదో, గగనానికి ఇలకూ బహుదూరంబనినాడో‘ అంటాడు జనాంతికంగా. అయితే ఏ బీచ్లోనో కూర్చుని సుదీర్ఘంగా వీక్షిస్తున్నప్పుడు అల్లంత దూరాన ఆకాశం, అవనిని చుంబిస్తున్నట్లే ఉంటుంది. మరో విషయం గుర్తిస్తోంది. తిరుమలేశుడి మామగారి పేరు ఆకాశరాజు. ఆయన భార్య పేరు ధరణి. చిత్రం కదూ. అంతలో చినుకులు మొదలయ్యాయి. చెట్లన్నీ తలలూపుతూ వానను స్వాగతిస్తున్నాయి. చినుకులు ఇంకొంచెం ఎక్కువ కావటంతో లోపలికి నడవక తప్పలేదు. హాల్లో తలుపు దగ్గరే కుర్చీ వేసుకున్నాను. మనిషి మూడ్స్‌ని బట్టి ముఖం మారినట్టు, ఆకాశం కూడా మూడ్స్‌ను, స్వరూపాన్ని మార్చేస్తుంటుంది. ఏదైనా చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ మరిచిపోగలమా… ‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలం‘టూ.. ‘సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు.. ఆకాశంలో మర్డరు జరిగినట్లు’. అటువంటి ఊహలు వద్దు గాక వద్దు.
అన్నట్లు ‘గగనం’ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేయడం, ఎన్ఎస్జి కమాండర్ రెస్క్యూ ఆపరేషన్స్ కథాంశంతో, కొత్తదనం ఉన్న చిత్రంగా ఎంతోమందిని ఆకట్టుకుంది… మన పెద్దలు ఆకాశాన్ని ఎంతో ఘనంగా ఊహించారు. అందుకే కష్టమ్మీద ఓ పనిని సాధిస్తే, ‘అది సాధించేటప్పటికి గగనమైంది’ అంటుంటారు. అలాగే అందుకోలేనివి, అసాధ్యాలు అయిన వాటిని ‘గగన కుసుమాలు’గా అభివర్ణిస్తుంటారు. అసాధ్యమైన దాన్ని అందుకునే ప్రయత్నం చేయడాన్ని నింగికి నిచ్చెనలు వేయడంగా పోలుస్తుంటారు. ఏదైనా తట్టుకోలేని ఉపద్రవం ఎదురైతే, ‘మిన్ను విరిగి మీద పడ్డట్లయింది…’ అంటారు. అసలు మిన్ను విరగడం… అది మీద పడటం… మనిషి ఊహకు ఎదురేదీ! అనంతాకాశం అంటుంటాం మామూలుగా. అయితే కవులు మాత్రం సమయానుకూలంగా దాన్ని మార్చేస్తుంటారు. ఓ కవి ‘ఆకాశానికి అంతుంది, నా ఆవేదనకు అంతేది?’ అంటాడు. ఆత్రేయగారైతే ‘ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది’ అన్నారు. వాన కురిస్తే ఆకాశం భోరుమంటోందని కొందరు, ఆకాశానికి చిల్లు పడిందని మరికొందరు… ఇలా యథాశక్తి వర్ణిస్తుంటారు.
మనుషులే కాదు, దేవుళ్లు సైతం ఆకాశం ఆకర్షణలో పడ్డారు. బాల హనుమంతుడు ఆకాశంలోని సూర్యుణ్ణి చూసి ఆకర్షితుడై, ఫలమనుకొని భ్రమించి సమీపించాడట… ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. ఆకాశంలో ఎంచక్కా ప్రయాణించి, జలధిని దాటి తన ఘన శక్తిని చాటిన ఖ్యాతి కూడా హనుమంతుడిదే. బాలరాముడు సైతం ఆకాశంలో చందమామ కావాలని మారాం చేశాడట. కౌసల్య తెలివిగా అద్దంలో చంద్రుడి ప్రతిబింబం చూపి మరిపించిందట. పోతనగారు విష్ణువు, వామనుడిగా బలివద్దకు వచ్చి, మూడడుగుల నేల కోరటం వగైరాలు చెబుతూ, వామనుడు, త్రివిక్రముడిగా ఎదిగిన క్రమాన్నివర్ణిస్తూ ‘ఇంతింతై వటుడింతయై మరియు తానింతై… నభోవీధి పైనంతై‘… అంటూ ఒకస్థాయిని ఆకాశంతో పోల్చారు. అలాగే విష్ణువును… ‘శాంతాకారం, భుజగశయనం..’ అంటూ ‘గగనసదృశం, మేఘవర్ణం..!’ అంటూ ప్రస్తుతిస్తుంటాం. ఇక పురాణ కథల్లో అయితే ‘ఆకాశవాణి’ మాట్లాడటం ఉండనే ఉంది. అదేమోకానీ ఆల్ ఇండియా రేడియోని నిన్న మొన్నటివరకు మనం ‘ఆకాశవాణి’ అనే పిలుచుకున్నాం. అది అలా ఉంచితే, పేరు లేకుండా వచ్చే బెదిరింపు లేఖలను ‘ఆకాశ రామన్న’ ఉత్తరాలు అంటుంటారు. నారదుడు గగన విహారిగా పురాణాల్లో మనకు సుపరిచితుడు. ఈయన గాక తథాస్తు దేవతలనేవారు కూడా ఆకాశంలో తిరుగుతుంటారట. పొరపాటుగా తప్పుడు ఆలోచనలు చేస్తే, ఆ తథాస్తు దేవతలు వెంటనే ‘తథాస్తు’ అంటారుట. అంతే ఇక వారి పని ఖాళీ. అందుకే తథాస్తు దేవతలతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటారు.
గగనవిహారం మనిషికి అసాధ్యం అనేది ప్రాచీనపు మాట. అందుకే విహంగంలా రెక్కలుంటే ఎంత బాగుండు అని ఆశపడటమే కాదు, లోహ విహంగాలు (విమానాలు) సృష్టించుకొని మనిషి ఆ కలనూ సాకారం చేసుకున్నాడు. ప్యారాచూట్లలో నింగిలో చక్కర్లు కొట్టడం తెలిసిందే. విమానంలో కిటికీ పక్కనే కూర్చుని చూస్తుంటే వెండి మబ్బుల మధ్య మనిషి పయనం గమ్మతైన అనుభూతినిస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటివరకు కిందికి చూస్తుంటే భూమి అంతా మీనియేచర్ చిత్రాలతో నిండినట్లుగా దర్శనమిస్తుంది. చక్కని తారలతో సరాగాలాడే చందమామ… ఫ్రేమ్‌ని బంధించి ఉంచే ఆకాశం స్క్రీన్‌లో ఆ తారలే కాదు, కొంతమంది మహనీయులు కూడా తారలుగా ప్రకాశిస్తుంటారట. భక్తుడైన ధ్రువుడు కూడా నక్షత్రంగా నింగిలో ఉన్నాడని చెబుతారు. అదే ధ్రువ నక్షత్రం. అన్నట్లు పెళ్లయిన వెంటనే వధూవరులకు అది పగలైనా, రేయి అయినా బయటకు తీసుకువచ్చి మరీ ‘అరుంధతీ నక్షత్రం అదుగో చూడండి’ అంటూ చూపిస్తుంటారు. ‘అరుంధతి నక్షత్రం ఏమో గానీ ఆరువేల అప్పు కనిపిస్తోంది’ అన్నది ఒకప్పటి జోక్. ఇప్పుడయితే ఆరువేలను, ఆరులక్షలు… అరవై లక్షలుగా చెప్పాలేమో…
ప్రస్తుతం సైన్స్ ప్రగతి అంతా ఆకాశ అధ్యయనం పైనే ఆధారపడి ఉందికదా. అంతరిక్ష పరిశోధనల్లో అడుగులు ముందుకు వేయడానికి నిరంతర శోధన, సాధన జరుగుతున్నాయి. వాన వెలిసింది. ఆకాశంలో హరివిల్లు హసించింది. అద్భుతః అలాగే చూస్తుండిపోయాను. అనంత సౌందర్యం! మెల్లగా కనుదోయి ముందునుంచి ఆ చిత్రం మాయమైంది. ఏమైనా పంచభూతాల్లో ఒకటైన, మనిషికి సవాలుగా నిలిచిన గగనం కాదా మరి ఘనం! యువతకు ఉత్తేజాన్నిచ్చి, ఉత్సాహపరిచి, ఉరకలు వేయించే ఆకాశం…
జగడజగడజగడం…
చేసేస్తాం రగడరగడరగడం…
దున్నేస్తాం
ఎగుడుదిగుడు గగనం.. మేమేరా పిడుగులం! అని పాడిస్తుంది.
అబ్బో! టైమ్ చాలా అయింది. అర్జంటుగా ఓ కప్పు టీ తాగాలి. ‘ఆకాశవీధిలో అందాల జాబిలీ… వయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనే, సయ్యాటలాడెనే…’ ఎఫ్.ఎమ్.రేడియో కాబోలు సమయోచిత సినీగీతాలు వినిపిస్తోంది. ఆకాశం ఎలా అనంతమో ఆలోచనా అనంతమే అనుకుంటూ, ఇంత సేపూ ఎన్నెన్నో అనుభూతులనందించిన ఆకాశంకేసి ఆత్మీయంగా ఓ మారు చూసి లోపలికి నడిచాను.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
Amma. Yad bhaavamthath bhavathi..Kavitaatmakatha aa aakasham kantaE mee manassulo undi.
ఆకాశవిహారం అద్భుతః….👌..కంటికి కనిపిస్తూనే చేరుకోలేనంత దూరంలో ఉంటూ ఎంతోమంది కవులకు, రచయితలకు కవితావస్తువుగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ తనలో ఉవ్వెత్తున ఎగసిపడే ఆలోచనాతరంగాల్ని శ్యామల గారు పాఠకులతో పంచుకున్న తీరు అభినందనీయం. ఆగకుండా చదివించే అందమైన శైలి, చక్కటి వర్ణనలు, అంతకు మించిన భావుకత్వం….ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఉషోదయ సమయాన సూర్యుడిని నుదుటి కుంకుమతో పోల్చడం, ఆకాశాన్ని అద్భుతమైన చిత్రపటంతో పోల్చడం చాలా బాగుంది. కానీ నాకైతే ఈ ఆర్టికలే ఓ అందమైన పెయింటింగ్ లా అనిపించింది… మధ్యమధ్యలో పాటలు సైతం సందర్భానుసారంగా హాయిగా ఉన్నాయి. ఇంకా గగన కుసుమం, ఆకాశరామన్న, నింగికి నిచ్చెన వేయడం, మిన్ను విరిగి మీద పడటం, ఆకాశానికి చిల్లు పడటం మొదలైనవాటిని ప్రస్తావించడం కూడా చాలా బావుంది. ఇంత చక్కటి ఆర్టికల్ రాసిన శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. ఆమె కలం నుంచి మరిన్ని ఆణిముత్యాలను ఆశిస్తూ …💐💐💐
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™