[‘డెవిల్స్ మైండ్’ అనే నవల వెలువరించిన శ్రీ సత్యవోలు కిరణ్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]


సంచిక టీమ్: నమస్కారం సత్యవోలు కిరణ్ కుమార్ గారూ.
సత్యవోలు కిరణ్ కుమార్: నమస్కారం.
~
ప్రశ్న 1. ‘డెవిల్స్ మైండ్’ అనే నవల వెలువరించినందుకు అభినందనలు. క్రైమ్ థ్రిల్లర్ రాయాలన్న ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చింది?
జ: క్రైం థ్రిల్లర్ జోనర్లో నేను రాసిన రెండో నవల ఇది. నేను మొట్టమొదట ఒక ప్రేమ కథ వృత్తాంతంతో ‘మనసు పలికింది ఈ మాట’ అని నవల రాసాను. నేను రాసిన మొదటి రచనే ఇది. దానిని స్వాతి పత్రికకు పంపించాను. సెలెక్ట్ అయింది. మొదటి నవలకు నాకు చాలా మంచి పేరు వచ్చింది. నేను కేవలం ప్రేమ కథలే కాదు క్రైం కూడా రాయగలను అని పాఠకులకు తెలియాలని వైకుంఠపాళి నవలను రాసాను. అలా నేను రాసిన మొదటి క్రైం థ్రిల్లర్ నవల ‘వైకుంఠపాళి’ స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన పోటీలలో లక్ష రూపాయిలు బహుమతి పొందింది. దానితో నాకు ఏ జోనర్ అయినా అనుకుంటే రాయగలనన్న కాన్ఫిడెన్స్ కలిగింది.


ప్రశ్న 2: ‘డెవిల్స్ మైండ్’ మీరు రాసిన ఎన్నో నవల? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: ఇది నాకు ఏడో నవల. మొదటి నవల మనసు పలికింది ఈమాట, తర్వాత నవల వైకుంఠపాళి స్వాతి వంటి ప్రముఖ పత్రికలో వీక్లీ సీరియల్‌గా ప్రచురితమై నన్ను పాఠకులకు దగ్గర చేశాయి. తర్వాత సుకథ అనే వెబ్ పత్రిక (ఇప్పుడు లేదు) యాజమాన్యం నాకు కాల్ చేసి వారి మొదలు పెట్టబోయే ఆన్లైన్ పత్రికకు నవల రాయమని కోరారు. అప్పటికే నేను ఒక నవలను సగం రాసి ఉన్నాను. దాన్ని వారికి పంపాను. వారికి నచ్చి ప్రచురించారు. వెబ్ పత్రిక కావడంతో ఆ రచన చాలా మందికి చేరువైంది. ఆ నవల పేరు ‘పిపాసి’. నా రచనాయణంలో పిపాసికి ముందు, పిపాసికి తర్వాత అని నేను చెప్పుకోతగ్గ సంఘటనలు, అనుభవాలు చాలా జరిగాయి. ఇప్పుడున్న లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, దర్శకులు అప్పుడు నా పిపాసి నవలను చదివి, నన్ను కలిసి వారి అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. ఇప్పటికీ వారందరూ నా రచనలను చదువుతూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
పిపాసి తర్వాత ఒక పాఠకురాలు, సరదాగానే నన్నో ప్రశ్న అడిగారు.. “మీ రచనల్లో ఎందుకు ఎక్కువ పాత్రలు ఉంటాయి. తక్కువ పాత్రలు ఉంటే రాయలేరా?” అని. నేను దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. అతి తక్కువ పాత్రలతో ఒక మంచి నవల రాయాలని అనుకున్నాను. అందాన్ని ఇష్టపడే అబ్బాయికి – వ్యక్తిత్వమే అందంగా కలిగి ఉన్న అమ్మాయికి మధ్య ఉండే ప్రేమ కథ ఇతివృత్తంగా ఒక నవలను రాసాను. ముఖమైన పాత్రలు ఆరు మాత్రమే ఉండేలా మొత్తం నవలను ఫేస్బుక్లో ఎపిసోడిక్గా పోస్ట్ చేసాను. అది కూడా పాఠకులకు బాగా నచ్చింది. ఆ నవల పేరు ‘మనసే ఓ మరీచిక’. ఈ నవలకు కుప్పం రెడ్డమ్మ చిత్తూరు వారు నిర్వహించే నవలల పోటీల్లో తృతీయ బహుమతి పొందింది. ఆ తర్వాత ఎప్పుడో రాసుకున్న ఒక మరో ప్రేమ కథను టైం పీరియడ్ లవ్ స్టోరీలా రాయాలని ‘చినుకులు చేరని చోటు’ నవలను రాసాను. ఈ నవలలో ఒక తండ్రి తన ప్రేమ కథను ఒక డైరీలో రాసుకుంటాడు. ఆ డైరీని కూతురు చదువుతుంది. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేలో రెండు ప్రేమకథలను సమాంతరంగా నడిపిన కథ ఇది. ఇది కూడా సుకథలో ప్రచురితమైంది. నా లేటెస్ట్ నవల ‘డెవిల్స్ మైండ్’.. నేను అనుకున్నదాని కంటే నాకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. నవలే కాక నేను కథలు కూడా దాదాపు 20 పైనే రాసాను. అవి కూడా వివిధ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాయి.
ప్రశ్న 3: కథలు వ్రాయడం కన్నా, నవలలు రాయడమే నాకు సులువని మీరొక చోట అన్నారు. ఎందుకని? తక్కువ నిడివి ఉండే కథ కన్నా, నిడివి ఎక్కువ ఉండే నవల రాయడం ఎందుకు సులువని మీకనిపించింది?
జ: చాలా మంది రచయితలకు కథా రచన అంటే కొట్టిన పిండి. నాకు మాత్రం ఏ చిన్న కథా అంత సులువుగా కంచికి చేరదు. తక్కువ పాత్రలతో కథను నడిపించి పాఠకుడిని మెప్పించడం నావరకు కష్టం. నేను ఈ విషయంలో కొంత వెనకబడే ఉన్నాను. అందుకే కథల పోటీలకు నా కథలను అనుకున్నంత వేగంగా రాసి పంపించలేను. నవల అంటే పాత్రలు ఎక్కువ ఉంటాయి.. వాటికి పరిమితి, పరిధి అంటూ ఉండదు. కథా గమనంలో ఆ పాత్ర ఎంత పెద్దదో, ఎంత చిన్నదో నిర్ణయించే కమాండ్ రచయితగా నాకు ఉంటుంది. చిన్న కథలో విషయాన్ని ఎంత సూటిగా చెప్పామన్నది ముఖ్యం. సరిగ్గా చెప్పకపోతే మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువ. చెప్పాలనుకున్నది సరిగా చిన్న కథలో చెప్పలేనప్పుడు దాన్ని నవలగా మలిచో, లేక నవలలో ఉపకథగా మార్చో చెప్పచ్చు. సగం సగం రాసి వదిలిలేసిన చిన్న కథలు నా దగ్గర చాలా ఉన్నాయ్. ఏదైనా నవల రాస్తున్నప్పుడు ఎప్పుడైనా స్టక్ అయితే ఈ వదిలేసిన చిన్న కథలను మరోసారి చదువుతాను. అవి ఏమైనా రాస్తున్న నవలకు సెట్ అవుతాయనిపిస్తే అందులోని అంశాన్ని నవలలో కలిపేస్తాను. అందుకని నాకు కథలు తక్కువ రాసానన్న రిగ్రెట్ ఏమీ ఉండదు.
ప్రశ్న 4: మీ దృష్టిలో – క్రైమ్ థ్రిల్లర్, సాంఘిక నవల – రెండిటిలో ఏది రాయడం కష్టం? ఎందుకని?
జ: రెండు ఈజీనే.. కానీ క్రైమ్ నవలను కాస్త జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే పాఠకుడు ఒక్క సారి క్రైమ్ కథకు కనెక్ట్ అయితే ఆ పాఠకుడిని చివరివరకు సస్టైన్ చేయడం కొంతవరకు కత్తి మీద సామే! ఎందుకంటే పాఠకుడు ప్రతీ పదాన్ని, వాక్యాన్ని, డైలాగ్‌ని పట్టి పట్టి చదువుతాడు. ఎక్కడైనా క్లూ దొరికితే హంతకుడు ఎవరనేది ముందే ఊహించేయాలని కోరుకుంటాడు. పాఠకుడి ఊహలను మించి అతనిలోని ‘పాఠకుడి అహాన్ని’ సంతృప్తి పరిచే విధంగా రచన చేయడం కాస్త కష్టం. పైగా సస్పెన్స్ నవలల్లో ఏ మాత్రం బోరింగ్ కంటెంట్ రాసినా పాఠకుడు పాదరసంలా జారిపోతాడు. పుస్తకం పక్కన పెట్టేసి చదవడం పోస్ట్‌పోన్ చేసేస్తాడు. ఈ విషయంలో నాకు యండమూరి వీరేంద్రనాథ్ గారు స్ఫూర్తి. ‘డెవిల్స్ మైండ్’ నవల కూడా అలాంటి అనుభూతిని పాఠకులకు అందించిందనే నమ్ముతున్నాను. సాంఘిక నవలల్లో మంచి కాన్ఫ్లిక్ట్ ఉండి దానికి తగ్గ పాత్రలను ఎంచుకుని వాటి మధ్య అద్భుతమైన డ్రామా రాయగలిగితే అది తెలిసిన కథలా అనిపించినా కూడా పాఠకుడు ఆ రచనను ఎంజాయ్ చేస్తాడని అనుకుంటున్నాను.
ప్రశ్న 5: ఈ నవల డైరక్ట్ నవలా లేక ఏదైనా పత్రిక/వెబ్ సైట్/బ్లాగులో ధారావాహికంగా వచ్చిందా?
జ: డైరెక్ట్ నవల. ఎక్కడా ప్రచురితం కాలేదు.


ప్రశ్న 6: క్రైమ్ థ్రిల్లర్స్‌కి అత్యంత కీలకం – బిగి సడలకుండా కథను నడపటం! ఈ నవలలో ఆ జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు?
జ: నవలకు ప్లాట్ పాయింట్ అనుకున్నాక దాని చుట్టూ పాత్రలు అల్లుకుంటాను. వాటికి క్యారక్టరైజేషన్స్ కూడా అనుకున్నాక వాటి క్యారక్టర్ ఆర్క్ రాసుకుంటాను. ఆ తర్వాత కథను సింగిల్ లైన్ ఆర్డర్ రాసుకుంటాను. ఇక్కడే మొత్తం కథలో సీన్స్ ముందుకు వెనక్కి మారుతూ ఉంటాయి. ఎప్పుడు రాయడం మొదలెట్టినా మొట్టమొదటి పేజీ నుంచి చదివి రాయడం అలవాటు. అప్పుడు కూడా మార్పులు చేర్పులు చేస్తాను. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలన్నది చాలా పకడ్బంధీగా రాసుకుంటాను. ఒకవేళ ఎక్కడైనా సస్పెన్స్ రివీల్ అయిపోతుందనిపిస్తే అక్కడ నేను పాఠకులకు దొరక్కుండా ఏమి చేయాలన్నది కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. నిజానికి ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ నవలల్లో రచయితే పాఠకుడికి హంతకుడు దొరక్కుండా చివరి పేజీవరకు దాచి ఉంచగలిగితే రచయిత విజయం సాధించినట్టే. ‘డెవిల్స్ మైండ్’ నవల పూర్తి స్క్రీన్ ప్లే బేస్డ్ నవల. చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో విజయం సాధించాను అనే అనుకుంటున్నాను.
ప్రశ్న 7: ఈ నవల పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? సాధారణంగా మీరు ఎంత వేగంగా రాస్తారు? రోజుకు ఇన్ని పేజీలు రాయాలని/టైప్ చేయాలని ప్రణాళిక ఉంటుందా? ఉంటే, ఈ నవల రచన మీ ప్రణాళికకి అనుగుణంగానే సాగిందా?
జ: ‘డెవిల్స్ మైండ్’ నవలకు నాకు మూడేళ్ళు పైనే పట్టింది. కొంత బద్ధకం కారణం అయితే మరికొంత ఎంచుకున్న అంశాన్ని నవలలో సరిగా చెప్తున్నానా లేదా అన్న సందిగ్ధం మరో కారణం. ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. ఒక్కోసారి ఒక్క పేజీ మాత్రమే రాస్తాను. ఒక్కోసారి రాత్రంతా కూర్చుని రాసిన సందర్భాలు ఉన్నాయ్. ఈ ‘డెవిల్స్ మైండ్’ నవల ప్రణాళిక అనుగుణంగా సాగలేదనే చెప్పాలి. నవలలో ఎంచుకున్న అంశం కోసం నేను చాలా రీసెర్చ్ చేసాను. దానికి రిలెవెంట్ సమాచారం కోసం ఎక్కువ సమయం వెచ్చించాను. దానికి తగ్గ ఫలితం అయితే నాకు వచ్చిందనే చెప్పాలి. ‘డెవిల్స్ మైండ్’ నవల ఇప్పటికీ 700 పైన కాపీలు అమ్ముడయ్యాయి. మరో రెండు నెలల్లో ద్వితీయ ముద్రణకు వెళ్ళబోతోందని మా పబ్లిషర్ సత్తిబాబు గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.
ప్రశ్న 8: ప్రధాన కథలో ఉపకథని, కేసు దర్యాప్తు చేసే అధికారి, కానిస్టేబుల్‌కి చెప్పడం అనేది కొత్త పాయింట్! ఈ ఆలోచన ఎలా తట్టింది?
జ: ఎస్.పి పరశురామ్, కానిస్టేబుల్ జేమ్స్‌లు ఇద్దరూ కలిసి అనుమానితుడి ఇంటికి వెళ్ళినపుడు వారికి అక్కడో డైరీ కనిపిస్తుంది. ఆ డైరీని ఎస్.పి పరశురామ్ చదివేస్తాడు. మర్నాడు జేమ్స్ ఆ డైరీ చదివారా అని అడిగినపుడు పరశురామ్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీని చెప్తాడు. ఈ నవలలో జేమ్స్ పాత్ర ఒకరకంగా పాఠకుడి అంతరంగం. ఈ నవల మొత్తం జేమ్స్ అడిగే ప్రశ్నలు, జేమ్స్ మాట్లాడే లాజిక్స్ అన్నీ పాఠకుడికి కలిగేవే! మరో సన్నివేశంలో గమనిస్తే ఆకాంక్ష అనే పాత్ర తన ఫ్లాష్‌బ్యాక్ చెప్తున్నప్పుడు మధ్యలో పరశురామ్ ఇంట్రప్ట్ చేస్తే జేమ్స్ కాస్త ఇబ్బంది పడతాడు. ఆ ఇబ్బంది ఇండైరెక్ట్‌గా పాఠకుడిదే! ఇంట్రస్టింగ్‌గా స్టోరీ నడుస్తున్నపుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారన్న వెర్షన్లో జేమ్స్ మాట్లాడతాడు. నవలలో జేమ్స్ పాత్ర పాఠకుడికి ఒక మిర్రర్ ఇమేజ్ అనుకునే రాసాను.
ప్రశ్న9: అనుమానితుడికి ఒక మానసిక సమస్య ఉందని, అందువల్ల ఆ పాత్ర అలా ప్రవర్తిస్తుందని చెప్తారు. ఈ సిండ్రోమ్ గురించి సమాచారం ఎలా సేకరించారు? ఎలా పరిశోధించారు?
జ: ఒక డిఫరెంట్ నవలను రాయాలని అనుకున్నపుడు – మానసికమైన సమస్యలు ప్రపంచంలో ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేస్తే చాలా వచ్చాయి. వాటిల్లో ఈ వాకింగ్ డెడ్ సిండ్రోమ్/కోటార్డ్ సిండ్రోమ్ అనే సమస్య నన్ను ఆకర్షించింది. తాము బ్రతికున్నా చనిపోయామనుకునే భ్రమలో ఉంటారన్న విషయం చాలా అటెన్షన్ ఇచ్చింది. ఈ సిండ్రోమ్ గురించి సమాచారం సేకరించాను. ఆర్టికల్స్ చదివాను. యూట్యూబ్ వీడియోస్ చూసాను. వనమాలి అన్న పాత్ర అప్పుడు పుట్టింది. దాని చుట్టూ పాత్రలను ఎంచుకుని కథను అల్లాను. అలా ‘డెవిల్స్ మైండ్’ నవల పూర్తి చేశాను. అసలు ఈ నవల్లో ‘డెవిల్స్ మైండ్’ ఎవరిదనేది చదివి తెలుసుకుంటూనే కిక్ ఉంటుందని చెప్పగలను.
ప్రశ్న 10: ఏదైనా సన్నివేశం రాశాకా, బాగా లేదని అనిపించో, లేక అనుకున్నంత గ్రిప్పింగ్‌గా రాలేదనో – తిరగరాసిన సందర్భాలున్నాయా?
జ: ఎక్కువగా లేవు. కానీ అక్కడక్కడా వాక్య నిర్మాణాలలో, డైలాగుల్లో ఎక్కువ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి సన్నివేశం పేలవంగా అనిపించిన సందర్భాలు ఉన్నాయ్. వాటిని మొత్తానికి తీసేసాను కానీ తిరిగి రాయలేదు.


పబ్లిషర్ శ్రీ సత్తిబాబు గారితో
ప్రశ్న11: ఈ నవలలో ఏ పాత్ర మిమ్మల్ని ఎక్కువగా వెంటాడింది? ఎందుకు?
జ: వనమాలి పాత్ర. ఇందులో నేను ఎంచుకున్న ‘కోటార్డ్ సిండ్రోమ్’ ఈ పాత్రకు ఉంటుంది. ఈ క్యారక్టర్ని పాఠకుడు మంచి పాత్ర అనో, చెడ్డ పాత్ర అనో జడ్జ్ చేయకుండా రాయాలనిపించింది. ఆ పాత్ర చేసే పనులు తప్పైనా అతని మీద కోపం రాకూడదు. అతనికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలనుకున్నా అతనేమీ ప్రొఫెషనల్ కిల్లర్ కాడు. పరిస్థితులు అతన్ని ఆ విధంగా మార్చాయి. అతనికున్న సిండ్రోమ్ పాఠకులకు బలహీనతగా కనిపించినా అతనికి మాత్రం ఆ సిండ్రోమే అతని బలం.. కాని ఆ సిండ్రోమ్ ఉన్న విషయం అతనికి తెలియదు కనక కథా గమనంలో ఇంటరెస్ట్ క్రియేట్ చేయగలిగాను. అతనికా సమస్య ఉందని చెప్పినా వినే పరిస్థితుల్లో అతను లేకపోవడం అనేది ఒక హిడెన్ కాన్ఫ్లిక్ట్.
ప్రశ్న12. ఈ నవలలో ఏ పాత్రని సృష్టించడం, జవసత్వాలు నింపడం మిమ్మల్ని బాగా ఇబ్బందిపెట్టింది?
జ: నిజానికి పాత్రలను సృష్టించడానికి నేను ఏమీ ఇబ్బంది పడలేదు. చివరి వరకు సస్పెన్స్ నిలపగలిగితే చాలనుకున్నాను. ఆ విషయాంలోనే ఎక్కువ జాగ్రత్త పడి ఒకటికి పది సార్లు అవసరమైన మార్పులు చేసాను. నవలలో ఉన్న క్లైమాక్స్ కంటే ముందు ఇంకో క్లైమాక్స్ రాసుకున్నాను. ఎవరైనా పాఠకుడు ఈ నవలను చదివి నాకు కాల్ చేస్తే ఆ రెండో క్లైమాక్స్ గురించి వారికి మాత్రమే చెప్తాను.
ప్రశ్న13. ఈ నవలకి పాఠకుల ఆదరణ ఎలా ఉంది? విమర్శకుల స్పందన ఎలా ఉంది? నవలని పాఠకులకు ఎలా చేరువ చేయాలనుకుంటున్నారు?
జ: నవలను నా అభిమాన వర్ధమాన దర్శకుడు యదు వంశీ అన్నతో రిలీజ్ చేశాను. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ నవల ఇప్పటి వరకు 700+ కాపీలు అమ్ముడైంది. మరో రెండు నెలల్లో రెండో ముద్రణకు వెళ్తుందని గోదావరి ప్రచురణల పబ్లిషర్ శ్రీ సత్తిబాబు గారు చెప్పినపుడు చాలా సంతోషించాను. చదివిన అందరూ ఇది సినిమా సబ్జెక్టు అని, సినిమాగా తీస్తే బాగుంటుందని అన్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి అసిస్టెంట్ రైటర్‌గా పని చేసాను కనక, అందులో నటించిన వారికి నా పుస్తకం ఇచ్చి చదవమని అడిగాను. చదివిన వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. పుస్తకం ఎంత బాగున్నా పాఠకులకు చేరువ చేయడం అనేది చాలా ముఖ్యం. సోషల్ మీడియా ద్వారా పుస్తకాన్ని చేరువ చేయడంలో నాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. సతీష్ కామాద్రి, ఆరుద్ర ఈశ్వర్ వంటి సోదరులు ఇన్‌స్టా రీల్స్ ద్వారా పుస్తకాన్ని పాఠకులకు మరింత చేరువ చేసారనడంలో ఎటువంటి సందేహం లేదు.


దర్శకుడు యదు వంశీతో
ప్రశ్న14. భవిష్యత్తులో ఏయే అంశాలను, ఏ ఇతివృత్తాలను నవలలుగా రాయాలనుకుంటున్నారు? వివరించండి.
జ: మరొక క్రైమ్ నవల, ఒక సాంఘిక నవల పైప్‌లైన్‌లో ఉన్నాయ్. అలానే ఒక కామెడీ నవల రాస్తున్నాను. వచ్చే ఏడాది అయినా చిన్న కథలను విరివిగా రాయాలని కోరుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సత్యవోలు కిరణ్ కుమార్ గారు.
సత్యవోలు కిరణ్ కుమార్: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***


రచన: సత్యవోలు కిరణ్ కుమార్
ప్రచురణ: గోదావరి ప్రచురణలు
పేజీలు: 176
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
గోదావరి ప్రచురణలు: ఫోన్: 9553084268
సత్యవోలు కిరణ్ కుమార్ ఫోన్: 9703222329
ఆన్లైన్లో:
https://www.amazon.in/Devils-Mind-Kiran-Satyavolu/dp/B0DG62Z1XG/
~
‘డెవిల్స్ మైండ్’ నవల సమీక్ష:
https://sanchika.com/devils-mind-book-review-kss/