[ఇటీవల ‘చిరుదివ్వె’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి దాసరి శివకుమారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]


సంచిక టీమ్: నమస్కారం దాసరి శివకుమారి గారూ.
దాసరి శివకుమారి: సంచిక అంతర్జాల పత్రిక సంపాదకులైన కస్తూరి మురళీకృష్ణ గారికి, అలాగే కొల్లూరి సోమ శంకర్ గారికీ నా హృదయ పూర్వక నమస్కారములు. సంచిక పాఠకులకు కూడా నా అభివందనములు.


~
ప్రశ్న 1. తాజాగా ‘చిరుదివ్వె’ అనే కథల సంపుటి వెలువరించినందుకు అభినందనలు. 14 కథల ఈ సంపుటికి శీర్షికగా పదవ కథ ‘చిరుదివ్వె’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ‘సంచిక’ పాఠకుల కోసం వివరంగా చెప్తారా?
జ: ఎంత చిన్న దీపమైనా మరి కొన్ని దీపాలను వెలిగించగలదు అనే ఉద్దేశంతో ఈ కథ వ్రాశాను. ఈ కథలోని ‘యశోధరా’ టీచర్ అదే పని చేసి తను వెలిగించిన దివ్వె విరజిమ్మిన కాంతులను కళ్లారా చూడగలిగింది. మా ఉపాధ్యాయులలో కూడా అలా చిరుదివ్వెలు వెలిగించిన వారున్నారు. అది నేను ప్రత్యేక్షంగా చూశాను. జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ కథను వ్రాస్తే అది ‘ప్రసన్న భారతి’ వాట్సప్ పత్రిక నుంచి వెలువడింది. ఆ కథను చేర్చి నా కథల సంపుటికి ‘చిరుదివ్వె’ అని పేరు పెట్టాను.
“వస్తు వైవిధ్యం కలిగి వుండి నేల విడిచి సాము చేయకుండా, సమాజానికి హితవు చేసేవిగా ఉండాలన్నా తపనలో రచించినవి ఈ సంపుటి లోని కథలు” అంటూ ప్రశంసిస్తూ ఈ పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ గారు ‘హృదయాలలో వెలుగులు నింపే చిరుదివ్వె’ అంటూ తమ తొలి పలుకులను అందించారు. వారికి మరోసారి ధన్యవాదములు.
ఈ కథల సంపుటిని వి.జి.కె. అండ్ వి.వి.ఎల్. ఫౌండేషన్‌కు చెందిన డా. బాబు ఆర్. వడ్లమూడి గారు ప్రవాసాంద్రులై వుండి కూడా ముద్రించి తమ మాతృభాషాభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సంపుటిలో, ‘పుష్కర స్నానం’, ‘వేసవి శెలవులు’, ‘చిరుదివ్వె’, ‘యస్.వి. కాలనీ’ అనే నాలుగు కథలు తప్పితే మిగతావన్నీ మొదటగా ‘సంచిక’లో వెలువరించబడటం, వారు నాకిచ్చిన ప్రోత్సాహంగానే భావిస్తాను.


ప్రశ్న 2. వృత్తి రీత్యా మీరు హిందీ అధ్యాపకులు. మరి తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఎలా కలిగింది? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: వృత్తి రీత్యా నేను ‘హిందీ’ ఉపాధ్యాయిని గానే పనిచేశాను. అలా పనిచేసేటప్పుడు కూడా పాఠ్యపుస్తకం లోని హిందీ ఆధునిక కవితలను, ప్రాచీన పద్యాలను తెలుగులో కవితలుగా మార్చేదాన్ని. విద్యార్థులకు అటు హిందీ, ఇటు తెలుగు కవితలకు రెండింటినీ బోధించేదాన్ని. అలా చేస్తే పాఠ్యాంశం పిల్లల మనస్సులకు బాగా హత్తుకునేది. దానిక్కారణం వారికీ, నాకూ మాతృభాష మీద వున్న మమకారమే. హిందీ భాష నుండి ఒక నవలను, 40 కథలను, 10 బాల సాహిత్యపు కథలను తెలుగులోకి అనువదించాను. జాతీయభాష అయిన హిందీలోని పదాలకు, ఆ పదాలకున్న లాలిత్యానికి, సొగసుకూ చాలా ముగ్ధురాలనవుతాను. కాని హిందీలో చిన్న చిన్న కవితలు తప్పితే మరేం వ్రాయలేదు. నా విద్యార్థుల చేత కూడా తెలుగులోనే చిన్నా చిన్న కవితలు, కథలు వ్రాయించి వ్రాత పత్రిక నిర్వహించాను.


ప్రశ్న 3. మీరు కథలు, నవలలు రాశారు. అనువాదాలు చేశారు. బాల సాహిత్యంలోనూ కృషి చేశారు. ఈ ప్రక్రియల్లో మీకు ఏదంటే మక్కువ? ఎందుకు?
జ: మీరన్నట్లుగా అన్ని ప్రక్రియల్లో రచనలు చేశాను. ఏది వ్రాసినా పాఠకులకు ఏదో ఒక కొత్త విషయం చెప్పాలని తపన పడతాను. నా రచనల్లో దేని కోసమైనా ఎంతో విషయ సేకరణ చేస్తాను. ఉపాధ్యాయినిగా పనిచేశాను కాబట్టి నా ఆలోచనలు ఎక్కువగా పిల్లల చుట్టూ తిరుగుతాయి. బోధన చేసేటప్పుడు కూడా కేవలం పాఠ్యాంశంతో సరిపెట్టకుండా దాని పూర్వాపరాలు, ఆ రచనతో సరిపోలిన రచనలు తెలుగులో ఏమున్నాయా – అని ఆలోచించి పోల్చి చెప్పేదాన్ని. మొదటి నుంచీ నాకు బాల సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. పిల్లలకు మనం సాహిత్యం ద్వారా ఏదైనా అందివ్వగలిగితే వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. ఉదాహరణకు నేను వ్రాసిన ‘చదరంగంతో చదువు’, ‘చెట్టు క్రింద సాదువు’ మొదలగు కథలున్నాయి. అలాగే ‘క్లాస్ రూమ్ కబుర్లు’ అంటూ విజ్ఞానాన్ని బోధించే కొన్ని కథలు వ్రాశాను. నేను వ్రాసిన ‘కోతి – జామచెట్టు’ అను కథల సంపుటికి పిల్లల చేతే బొమ్మలు వేయించి, ఆ పుస్తకాన్ని కూడా ముద్రించాను. అది చూచి వాళ్లు బాగా సంతోషించారు. వాళ్లు వినోదంతో పాటు విజ్ఞానాన్నీ ఇష్టపడుతారు. ఈనాటి మేథావులు కథల ద్వారా విజ్ఞానాన్ని అందించమంటున్నారు కదా. సరళమైన భాషలో, తేలిక పదాలతో వాళ్లకి అర్థమయేటట్లుగా వ్రాయాలి. అలాంటి ఉద్దేశంతోనే ఎక్కువగా బాల సాహిత్య రచనలు చేశాను. మా మనుమళ్లకు కూడా వాళ్ల చిన్ననాటి చిలిపి చేష్టలు వర్ణిస్తూ పుస్తకాలు వ్రాసి బహుమతిగా ఇచ్చాను. అందులో ఒక పుస్తకం ‘ఆదివారం సందడి’ అను పేరుతో ‘మంచి పుస్తకం’ వారు ప్రచురించారు.


ప్రశ్న 4. మీ తొలి కథ నాటి నుంచి ఇటీవలి ‘కష్టార్జితం’ వరకు పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు?
జ: నా మొదటి కథ ‘కానుక’. అది ‘వనిత’ మాస పత్రికలో అచ్చయినది. చాలా చిన్న వయసు లోనే వ్రాశాను. ఆ తర్వాత కొన్ని రేడియో కార్యాక్రమాలు. మళ్ళీ అందులో కూడా బాలల కార్యక్రమాలు సమర్పించాను. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దగా రచనలు చేయలేదు. ఉద్యోగ విరమణ తర్వాత 2016 నుంచి మరలా రచనా వ్యాసంగం పట్ల దృష్టి పెట్టాను. సాహిత్యం కేవలం కాలక్షేపానికి కాకుండా ఏదో ఒక సామాజిక ప్రయోజనం వుండాలన్న ఉద్దేశంతో వ్రాస్తున్నాను. పాఠకులు కూడా ఒకే మూసలో చేసే రచనలు కాకుండా విభిన్నతను కోరుకుంటారు. సాహిత్యమనేది మనసుకు హత్తుకునేటట్లుగా వుండాలి. అలరింపజేసేదిగా వుండాలి. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునేటట్లుగానూ వుండాలి. ఒక మంచి మాట, ఒక మంచి కథ, ఒక స్పూర్తి వాళ్లకు దిశానిర్దేశం చేసేటట్లుగా వుండాలి. ఆ దిశ లోనే వ్రాసిన నా ‘అమ్మకు వందనం’ అనే నవలకు; ‘రక్షణ’, ‘సంఘర్షణ’, ‘అనుబంధాలు’, ‘రాతి గుండె’, ‘స్థితప్రజ్ఞుడు’ మొదలగు కథలకు బహుమతులు పొందాను.


ప్రశ్న 5. మీ అభిప్రాయంలో కథకి వస్తువు, శిల్పం, శైలి లో ఏది ప్రధానం? వివరించండి.
జ: కథకు మంచి వస్తువుని ఎన్నుకోవాలి. ఆ కథలో శిల్పం ఇమిడిపోవాలి. దారం వుంటేనే కదా పూలదండ అమర్చగలుగుతాం. అటు వస్తువు, ఇటు శిల్పాన్ని జొప్పించి చక్కని శైలితో కూడిన కథను అల్లుకుంటూ పోవాలి. ఆ శైలి మనం మన స్నేహితులతో మాట్లాడుకున్నట్లుగా ఆత్మీయంగా, సహజంగా వుండాలి. కృత్రిమంగా వుండగూడదు. కాబట్టి మంచి వస్తువుతో కూడుకున్న కథలో శైలీ శిల్పాలు అందంగా అమరాలి.


ప్రశ్న 6. ‘నా భారతదేశం’ కథలో మెటావర్స్ టెక్నాలజీ అనే సాంకేతికతని ప్రస్తావించారు. ఈ కథలో ప్రధానపాత్ర వర్చువల్ రియాలిటీ సాంకేతిక ద్వారా కృష్ణదేవరాయల కాలానికి వెళ్తాడు. నేతాజీనీ, హిట్లర్నీ కలుస్తాడు. చిన్న కథలో సంక్షిప్తంగానైనా సైన్స్ ఫిక్షన్ జోడించారు. ఈ సాంకేతిక అంశాలపై మీకు అవగాహన ఎలా కలిగింది?
జ: రచయితలు అన్ని విషయాలలో పరకాయ ప్రవేశం చేయగలగాలి. ఏదో ఒక విధానానికే పరిమితం కాకూడదు. నేను రోజూ పేపరు క్షుణ్ణంగా చదువుతాను, ఏదైనా కొత్త అంశం కనపడితే మనసులో నిక్షిప్తం చేసుకుంటాను. ఆ అంశాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలా ‘మెటవర్స్ టెక్నాలజీ’ గురించి కూడా ముందుగా పేపర్లో చదివే తెలుసుకున్నాను. మంచి అంశమనిపించి దాని మీద ‘నా భారతదేశం’ అనే కథను వ్రాశాను. ఎప్పటికప్పుడు నూతనంగా వెలువడే సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవటం మంచిది. ఈ సంపుటి లోనే ‘నువ్వూ అమ్మవే’ అను కథలో ‘ఇస్రో’లో పనిచేసే ఒక ‘సిస్టమ్ ఇంజనీయ’ పని గురించి ప్రస్తావించాను.


ప్రశ్న 7. ‘పరుగు’ చక్కని కథ. అతిగా సంపాదించాలనే వ్యామోహం మంచిది కాదని చెప్పే ఈ కథకి స్ఫూర్తి ఏదైనా ఉందా? ఈ నేపథ్యం వివరిస్తారా?
జ: ‘పరుగు’ కథలో పాత్రల లాంటి వారు మనకు సమాజంలో ఎక్కువగానే తారన పడుతున్నారు. కొన్ని కుటుంబాలలో ‘రమ్య’ లాంటి స్త్రీల మనస్తత్త్వాలను పరిశీలిస్తుంటే డబ్బు వ్యామోహంలో పడి భర్తతో విదేశాలలో కాపురముంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆలోచనలో పడుతున్నారు. పిల్లల్ని ఇండియా లోనే చదివించుకుంటూ తాము మాత్రం ఇక్కడే వుండి; భర్తని డాలర్లు సంపాదించుకు రమ్మని విదేశాలకు పంపుతున్నారు. భర్తల మానసిక వేదన వీళ్లకర్థం కావటం లేదు. అంతేకాక పిల్లల్ని ఒత్తిడి పెట్టి చదివించి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మా దగ్గరి బంధువుల్లో ఒక అమ్మాయికి నచ్చచెప్పటం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ కథ వ్రాయటం జరిగింది..
ప్రశ్న 8. కరోనా నేపథ్యంగా అల్లిన ‘మసకేసిన మనసు’ కథ గురించి, ఆ కథలో తల్లిదండ్రుల మనసు మార్చడానికి సురేష్ వేసిన ప్లాన్ బావుంది. ఆ ఆలోచన ఎలా తట్టింది?
జ: కొంతమంది భార్యాభర్తలకు తమ స్వార్థం తప్పితే ఏ అనుబంధాలూ, ఏ ఆత్మీయతలూ పట్టటం లేదు, ‘నన్ను ముట్టకు నామాలకాకి’ అన్నట్టుగా వుంటున్నారు. ఆ ప్రవర్తనను దగ్గర నుంచి చూచిన కొంతమంది పిల్లల మనసులు కలవరపడుతున్నాయి. వాళ్లకు తాము చిన్నప్పుడు పొందిన నానమ్మ ప్రేమ కావాలి పెదనాన్నా, పెద్దమ్మల అనురాగం కావాలి. వాళ్ల పిల్లల తోటి మంచి సంబంధాలు వుండాలి. అటువంటి కోవలో వాడే సురేష్. తన తల్లిదండ్రుల మనసు మార్చాలని తనకు రాని ‘కరోనా’ వచ్చినట్లుగా, పెదనాన్న కూతురితో కలిసి అమెరికా నుండి ఫోన్లు చేసి తల్లిదండ్రులకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు.


ప్రశ్న 9. కరోనా నేపథ్యంగా అల్లిన మరో కథ ‘ఆగంతకుడు’లో- సముద్రంలో ఆయిల్ పైపులు వేసే నౌకలో పనిచేసే సుధీర్ గురించి చెప్పారు. కథను అనుసరించి, సముద్రంలో ఆయిల్ పైపులు వేసే పద్ధతి, సముద్ర దొంగలు నౌకలపై దాడి చేసే విధానం వివరించారు. ఈ వివరాలకి సంబంధించిన సమాచారం ఎలా సేకరించారు? మీ పరిచయస్థులలో నౌకలలో పనిచేసే వారెవరయినా ఉన్నారా?
జ: మీరన్నట్లుగా మాకు బాగా తెలిసిన కుటుంబంలో నౌకలలో పనిచేసే వారొకరున్నారు. అతను సంవత్సరంలో ఆరునెలలు మాత్రం ఇంటి దగ్గర కుటుంబంతో వుండి మిగతా సమయమంతా ఏదో ఒక దేశపు నౌకలో తిరుగుతూ వెల్డింగ్ పనిచేస్తూ వుంటారు. కరోనా సమయంలో ఇండియా వచ్చేసి ఎక్కువ రోజులు ఇక్కడే గడిపారు. ఆ సమయంలో “మీ జాబ్ వివరాలు చెప్పండి” అనడిగాను. ‘కాస్టోరో-i’ నౌకలో తను పనిచేసేటప్పుడు తను చేసిన పనిని గూర్చి వివరంగా చెప్తే బాగా గుర్తుపెట్టుకున్నాను. అలాగే ‘మీకెదురైన భయంకర సంఘటన గురించి కూడా చెప్పమ’ని అడిగితే – ‘బెర్ముడా ట్రయాంగిల్’ గురించి, నైజేరియన్లు పెట్టే ఇబ్బందుల గురించీ చెప్పారు. ఆ సంఘటనలన్నీ కలిపి ‘ఆగంతకుడు’ అను కథ వ్రాశాను. ఆ కథ అతనికి పంపిస్తే ‘ఎక్స్లెంట్’ అంటూ తెగ సంతోష పడిపోయారు. తన బంధువులకూ, ‘ఫామిలీ గ్రూప్’ లలో కూడా షేర్ చేసుకున్నారు. వారంతా ‘నిజంగా నీకు డబ్బు సంచి దొరికిందా?’ అంటూ ఫోన్లు చేశారట. డబ్బు సంచీకీ, అతనికీ ఏ సంబంధమూ లేదు. కథ కోసం కథలోని సుధీర్ చేత ఒక మంచి పని చేయించటానికి నేను అల్లుకున్న విషయమది. ఇంకా బంధువులు “నువ్వింత కష్టపడి నౌకలో ఉద్యోగం చేస్తున్నావా?” అని బోలెడు బాధ కూడా పడ్డారని అతను సంతోషపడుతూ చెప్పారు.


ప్రశ్న 10. సాధారణంగా రచయితలకి తాము రాసే అన్ని రచనలు నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: ‘చిరుదివ్వె’ కథల సంపుటిలో చాలా కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా వ్రాసినవే. ముఖ్యంగా ‘మాయ ముసుగు’ కథలోని ఇందిర కొన్నాళ్ళు మా హైస్కూల్లోనే చదివింది. వాళ్ల అమ్మ, నేను మాత్రం మొదటి నుంచే సహ ఉపాధ్యాయినులం. ఆ అమ్మాయి కాలేజీ చదువులు చదువుతూ అప్పుడప్పుడూ స్కూల్‌కి వచ్చి కనపడేది. తన గురించి కొన్ని విషయాలు తెలిసేవి, నేను వ్రాసిన సంఘటనలు చాలా వాకూ ఆ అమ్మాయి జీవితంలో జరిగినవే. వాటన్నింటినీ తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్నది. ఆ అమ్మాయి మాత్రం తెప్పరిల్లి ఆ తర్వాత అమెరికా వెళ్లి, పెళ్లి చేసుకుని స్థిరపడింది. నా సహ ఉపాధ్యాయినితో ఉన్న అనుబంధంతో నేను చాలా బాధపడ్డాను. ఆ బాధతోనే ఆ కథ వ్రాశాను. ఒక రకంగా ఇందిర తల్లి అంటే నాకున్న ఇష్టం తోనే ఆ కథ వ్రాయడం జరిగింది.


ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథైనా రాయడం కష్టమనిపించిందా? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఈ సంపుటిలో ఏ కథ కూడా వ్రాయడం కష్టమనిపించలేదు. అన్నీ ఇష్టపడే వ్రాశాను. కాని ‘నువ్వూ అమ్మవే’ అను కథలో తల్లి జగదీశ్వరి పాత్రను కొంచెం కించపరిచినట్లు వ్రాశానా అనిపించింది.. కాని ప్రస్తుత సమాజంలో జగదీశ్వరి లాంటి ఎంతో మంది తల్లల మితిమీరిన జోక్యం వలన ఎన్నో కాపురాలు ధ్వంసమవుతున్నాయి. అలాంటి తల్లే అయిన జగదీశ్వరి మాటల్ని, ఆమె మాటలకు వత్తాసునిచ్చే తండ్రి మాటల్ని కూడా కట్టించుకోకుండా కూతురు రమ్య తన కాపురాన్ని చక్కదిద్దుకునే దిశగా అడుగేసే విధానాన్ని వ్రాశానన్న సంతృప్తి కలిగింది.
ప్రశ్న12. ‘చిరుదివ్వె’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటిని పాఠకులకు ఎలా దగ్గర చేశారు?
జ. నా జీవితంలో తారసపడిన వ్యక్తుల సమలను గురించి బాగా తెలుసుకున్న విషయాలనే ఆకళింపు చేసుకుని వ్రాసిన కథలు ఇవి. ఈ సంపుటిలోని 10 కధలు మన ‘సంచిక’లో ముందుగా వెలువరించబడినవే. మిగతా నాలుగు కథల్లో ‘వేసవి శెలవులు’, ‘చిరుదివ్వె’ ప్రసన్న భారతి వాట్సప్ పత్రిక లోనూ, ‘యసి.వి.కాలనీ’ అను కథ ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం లోనూ ప్రచురింపబడెను. ‘యస్.వి. కాలనీ’ కథ చదివి చాలా మంది స్పందించి ఫోన్లు చేసి అభినందించారు. ఒకతను మాత్రం విపరీతంగా ఏడుస్తూ, “మా నాన్నగారు కూడా మీ కథలో శ్రీహరి రావు గారి లాగే చేసి ఇవ్వాళ అష్టకష్టాలు పడుతున్నారు. ఆయన కట్టిన కాలనీ మాత్రం బాగా డెవలప్ అయ్యింది” అన్నాడు. ఇక ‘చిరుదివ్వె’ కథ విషయానికొస్తే, ‘యశోధరా’ టీచర్ వెలిగించిన చిరుదివ్వే విద్యార్థి వాసు. “ఆనాడు మీరు వెలిగించిన చిరుదివ్వె ఈనాడు మరెన్నో దివ్వెలను వెలిగిస్తున్నది మేడమ్” అని ప్రయోజకుడైన వాసు యశోధరా టీచర్‌తో అంటాడు, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన కూడాను. ఈ సంపుటి లోని కథలను పాఠకులు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను.


ప్రశ్న13. మీ కథా సంకలనాలకీ, నవలలకి ధర నిర్ణయించక, అమూల్యం అని ప్రస్తావించి ఉచితంగా ఎందుకు అందిస్తారు? దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రచురణకర్తలకు ప్రయోజనం ఎలా సిద్ధిస్తుంది?


ప్రశ్న14. రచయిత్రిగా, అనువాదకురాలిగా, మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: భవిష్యత్తు ప్రణాళికలు అంటూ ఏం లేవు. మనసు స్పందించినపుడు రచనా వ్యాసంగం చేపట్టటమే అలవాటుగా మార్చుకున్నాను. ఇంకనూ అముద్రితాలు కొన్ని వున్నాయి. తాజాగా ‘ప్రసిద్ధ హిందీ అనువాద కథలు’ ప్రచురణలో వున్నది. ‘బాటసారి’ అను జానపద బాలల నవలిక, ‘క్లాస్ రూమ్ కబుర్లు’ అనే బాల సాహిత్య సంపుటులు ఉచిత పంపిణీకి సిద్ధంగా వున్నవి.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దాసరి శివకుమారి గారూ.
దాసరి శివకుమారి: ఎంతో ప్రాచుర్యం పొందిన తెలుగు డైనమిక్ అంతర్జాల పత్రిక అయిన ‘సంచిక’ వారు ఈ ‘చిరుదివ్వె’ పుస్తకాన్ని గురించిన ఇంటర్వ్యూకు చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు మరియు నమస్కారములు.
***


రచన: దాసరి శివకుమారి
ప్రచురణ: వి.జి.కె. అండ్ వి.వి.ఎల్. ఫౌండేషన్
పేజీలు: 147
వెల: అమూల్యం
ప్రతులకు:
శ్రీమతి దాసరి శివకుమారి
301, సాకృత స్పెక్ట్రమ్,
రణవీర్ మార్గ్, సరళానగర్,
జె.ఎం.జె. కాలేజ్ దగ్గర
తెనాలి 522202
ఫోన్: 9866067664
~
‘చిరుదివ్వె’ కథాసంపుటి పరిచయం:
https://sanchika.com/chirudivve-book-foreword-kss/