[‘గలివర్.. సాహస సాగర ప్రయాణాలు’ అనే పుస్తకాన్ని వెలువరించిన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం కాళ్ళకూరి శేషమ్మ గారూ.
కాళ్ళకూరి శేషమ్మ: నమస్కారం.
~
ప్రశ్న 1. గలివర్స్ ట్రావెల్స్ పుస్తకాన్ని అనువదించాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది?
జ: గలివర్స్ ట్రావెల్స్ – ను నా మనుమడు C.B.S.E 12వ తరగతిలో పాఠ్యాంశంగా ఉండగా బోధించేను. మేమిద్దరమూ ఎన్నో అనుభూతులకు లోనయ్యేము. ఆనందం, ఆశ్చర్యం, కోపం, భయం, ఉద్వేగం లకు అతడు లోనయ్యేడు. ఈ ఆలోచన అప్పుడు కలిగింది.
ఇదివరలో నేను రెండు పుస్తకాలు రాసేను. చదువు తీర్చిన జీవితం – నా ఆత్మకథ, Shakespeare ను తెలుసుకుందాం. చదువరుల నుండి మంచి స్పందన లభించింది.
2020లో మూడవ ప్రపంచ యుద్ధంతో సమానమైన కరోనా వ్యాధి, ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దైనందిన జీవన స్రవంతి స్తంభించింది. కర్ఫ్యూలు, మాస్కులు, గ్లవ్స్, శానిటైసర్లు ఇలా ప్రజలు వణికేరు. ఎందరో మరణించేరు. ప్రతి కుటుంబమూ కొందరిని కోల్పోయింది. ఒక దేశం ఈ వైరస్‌ను సృష్టించి ఇతర దేశాలలో విడిచి పెట్టిందని వార్తా వ్యాపించింది. విజ్ఞానశాస్త్రంలో పరిశోధనలు, వెర్రితలలు వేయడం గురించి జోనాథన్ స్విఫ్ట్ ఈ పుస్తకం మూడవ భాగంలో చెప్పిన కీలక అంశం ఇదే.
మరో ప్రక్క ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు గతి తప్పేయి. నియంతలు ప్రజలని కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో ప్రతీసారి తామే గెలవాలని చేసే దురాగతాలెన్నో. ఉచితాలు. సబ్సిడీలు ఇచ్చి పేదలను శాశ్వతంగా పేదలుగానే ఉంచి, vote bank గా మార్చి ఎన్నికలలో విజయం పొందుతున్నారు.
మూడు వందల సంవత్సరాలకు ముందే వీనిని జోనాథన్ కళ్లకు కట్టినట్లు చెప్పేడు. అనువాదానికి ఇవి నాకు ప్రేరణలు.
ప్రశ్న 2. మీరీ పుస్తకాన్ని తొలిసారి ఎప్పుడు చదివారు? అప్పుడెలా అనిపిచింది? ఇప్పుడు అనువదించటంకోసం చదువుతూంటే ఎలా అనిపించింది?
జ: మొదట గలివర్స్ ట్రావెల్స్‌ను విద్యార్థి దశలో చదివేను. ఇందులో ఒకటి, రెండు భాగాలు పిల్లల కథలుగా ప్రాచుర్యం పొందేయి. ఒకటవ భాగంలో లిల్లీపుట్ల రాజుకు Blefescue రాజ్యంతో జరిగిన యుద్ధం గాని, గలివర్‌ను చంపడానికి లిల్లీపుట్ల రాజు వేసిన పథకం గురించి గాని చదివిన గుర్తు లేదు.
రెండవ భాగంలో Brobding Nag రాజుకు, గలివర్కు జరిగిన సంభాషణలూ, రాజకీయాలపై జరిగిన చర్చా – చదివిన గుర్తు లేదు.
మూడు, నాలుగు భాగాల ప్రసక్తి ఎక్కడా రాలేదు. అందువల్ల Complete and Unabridged edition – చదివినపుడు నిధి లభించినట్లు భావించేను. ఈ పుస్తకం నేటికీ ఆంగ్ల సాహిత్యంలో మొదటి వంద క్లాసిక్స్‌లో నిలుచుట గొప్ప విషయం. అనువదించాలనే ఆలోచనతో మళ్లీ మళ్లీ చదివేను.
ప్రశ్న 3. మీ సందేహాలకు ఈ పుస్తకంలో సమాధానాలు దొరికేయని ముందుమాటలో రాశారు. మీకు లభించిన సమాధానాలు పాఠకులతో పంచుకుంటారా?
జ: ప్రస్తుతం సమాజంలో మానవులు వేగం, అతివేగం అనే యుగంలో ఉన్నారు. కానీ కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకొనుట, అనుబంధం తగ్గేయి. స్నేహితులు పరిమితమయ్యేరు. వంటగది సుమారు మూయబడింది. నచ్చిన భోజనం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్న రోజులివి. ఫలితాలు దారుణంగా వున్నాయి. పిల్లలలో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్యాకింగ్ చెత్త కాలుష్యానికి దారి తీస్తోంది.
పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ తగ్గింది. కరోనా కాలంలో ఆన్లైన్ పాఠాలకు సెల్ ఫోన్, కంప్యూటర్ ఉపయోగించేరు కదా. వాటిని ఇప్పుడు ఇతర విషయాలకు వాడుతున్నారు.
యువతీ యువకులు డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ నిపుణత్వం (skills) లోపిస్తోంది. నిరుద్యోగం ప్రబలింది.
యువతలో అట్టహాసం – ఆశ్చర్యం కలిగిస్తోంది. వస్త్రధారణ, మాట తీరు, మారేయి. సెల్ఫీల కోసం ఎగబడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
భూమి, మన్ను, వాతావరణం, కలుషితమయ్యేయి. అడవులు తగ్గేయి. ఋతువులు (seasons) క్రమం తప్పుతున్నాయి. గ్లోబల్ బోయిలింగ్ అనే పదం వచ్చింది. దేశాలన్నీ వేడెక్కి ప్రజల జీవితం దుర్భరమయ్యింది. ఇవన్నీ రచయిత ఆనాడే చూసేడు.
ప్రశ్న 4. గలివర్స్ ట్రావెల్స్ అన్నది ఆ కాలంలో యూరోపియన్లు కొత్త ప్రదేశాలు వెతుకుతూ చేసిన సాహస యాత్రలను ప్రతిబింబిస్తుందనీ, ఒక కోణంలోంచి చూస్తే, ఇతరులకన్నా తాము అధికులమన్న యూరోపియన్ల అహంకారానికీ పుస్తకం నిదర్శనం అంటారు. మీ అభిప్రాయం ఏమిటి?
జ: ఆ కాలంలో యూరోపియన్లు కొత్త ప్రదేశాలు వెదుకుతూ చేసిన సాహస యాత్రలను ప్రతిబింబిస్తుంది – అనే కోణంతో నేను ఏకీభవించను. జోనాథన్ ఒక కల్పిత కథ మాత్రమే వ్రాసేడు. చిత్రమైన పాత్రలు సృష్టించి పరోక్షంగానూ, వ్యంగ్యం గానూ పాలకుల పోకడలు వివరించేడు. ఈ కోణం వాస్తవానికి దగ్గరగా ఉన్నది.
యూరప్ చిన్న ఖండము. మొదట ఇంగ్లండ్ ఒరవడి పెట్టింది. ద్వీపం కనుక నౌకలు తయారు చేసి ఆసియా ఆఫ్రికా ఖండాలకు వెళ్లి వలసలు ఏర్పాటు చేసికొంది. తమకు కావలసిన ముడి పదార్థములు తరలించింది. నెమ్మదిగా సామ్రాజ్యాలు సృష్టించుకుంది. ఇతర యూరప్ దేశాలు కూడా ఈ మార్గాన్ని అనుకరించేయి. ఇది తప్పక వారి అహంకారానికి నిదర్శనం.
ప్రశ్న 5. ముందుమాటలో మీరు మొదటి రెండుభాగాలకు లభించిన ఆదరణ/ప్రాచుర్యం తరువాత భాగాలకు లభించలేదన్నారు. ఎందుకని? ఈ భాగాలలో తేడాలేమిటి?
జ: గలివర్స్ ట్రావెల్స్‌లో ఒకటి, రెండు భాగాలు పిల్లల కథలుగా జనాదరణ పొందేయి. కానీ కొంత మేరకే. మూడు, నాలుగు భాగాలు వెలుగు లోకి రాలేదు. మూడవ భాగంలో విజ్ఞానశాస్త్రంలో వెర్రితలలు, పరిశోధనల పేరున జరిగే మోసాలు, అకాడమీలలో ఆచార్యుల అహంకారాలు, జోనాథన్ వివరించేడు. నాల్గవ భాగంలో యాహూలు, హ్యూహ్నిమ్స్ అను రెండు తెగలను గురించి చెప్పి, మానవుడు యాహూనే అని తేల్చేడు. గుర్రాలకు ఉన్న విలువలు మనిషికి లేవన్నాడు. ఇవి పిల్లలకు అర్థం అగుట కష్టము. కనుక ఈ రెండు భాగాలూ నేటి చదువరులను ఆలోచింప చేస్తాయని నేను నమ్ముతున్నాను.
ప్రశ్న 6. పుస్తకాన్ని అనువదించటంలో మీ అనుభవాన్ని వివరిస్తారా? ఒక పుస్తకాన్ని మామూలుగా చదవటానికి అనువదించేందుకు చదవటానికి తేడా ఏమిటి? రచనను అర్థం చేసుకోవటంలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
జ: ఒక కథ లేక నవలను మామూలుగా చదవడం వేరు, అనువదించడానికి చదవడం వేరు. ప్రతి వాక్యం అనువదిస్తూ పోతే, పుస్తకం నిడివి పెరిగి, చదువరులను అలరించదు. మూల కథలో పట్టును సడలిపోకుండా అనువదించాలి. ఇది కత్తి మీద సాము వంటిది. ఒక్కో పేరా వ్రాసి చదివించే స్థాయిలో ఉందా అని ప్రశ్నించుకొని ముందుకు సాగేను. చిన్న వాక్యాలు, సరళ పదాలు, ఎంచుకున్నాను. ఒక అధ్యాయం వ్రాసి మూలం మళ్లీ చదివి, అవసరాన్ని బట్టి 2 లేక 3 సార్లు తిరిగి వ్రాసేను.
ప్రశ్న 7. పుస్తకాన్ని అనువదించటంలో సాధకబాధకాలు వివరిస్తారా? మూల రచన స్ఫూర్తిని సరిగ్గా తెలుగులోకి తర్జుమా చేసేందుకు మీరు తీసుకున్న జాగ్రత్తలేమిటి?
జ: కథలో రచయిత పేర్కొన్న కీలక భావనలు, అంశాలు, వ్యంగ్యం, నాటకీయత వంటివి అనువాదంలో వచ్చే లాగ జాగ్రత్త వహించేను. కృతకంగా (artificial గా) ఉండకుండా శ్రద్ధ పెట్టేను. జోనాథన్ కళా దృక్పథమూ, ఇతర అంశాలు ప్రతిబింబించడానికి శ్రమించేను.
సాహిత్య అభిలాష గల నా కుమార్తె కాళ్లకూరి శైలజకు అనువదించిన అధ్యాయాలు ఇచ్చేను. ఆమె చెప్పిన మార్పులు, చేర్పులు చేసి మరల fair చేసేను. ఇలాగ ఈ పుస్తకం రూపు దాల్చింది. మూడు నాలుగు భాగాలు తెలిగించినపుడు మనసు నిండా సంతృప్తి కలిగింది. మూడవ భాగంలో గలివర్ మంత్రదండం సహాయంతో మరణించిన మహామహులను చూసిన ఘట్టము నాకు చాలా నచ్చింది.
స్ట్రుల్డ్బర్గ్స్ గురించిన విశేషాలు బాగా ఆకట్టుకున్నవి. “వాళ్ళు అమర జీవులు” అన్న మాట వినగానే గలివర్ ఊహా లోకంలో విహరించేడు. తానే అమర జీవినైతే అనే విషయం ఏమి చేయగలను అనే విషయం అద్భుతంగా ఉన్నది.
నాలుగవ భాగంలో యాహూలు, హ్యూహ్నిమ్స్ జీవన శైలి చాలా వైవిధ్యంగా ఉంది. గుర్రాలు ఆదర్శవంతమైన జీవితాలు గడుపుతున్నాయి.
వివాహము, కుటుంబ వ్యవస్థ, సంతానం విషయంలో ఒక కుటుంబంలో ఇద్దరూ మగ బిడ్డలూ, వేరొకరికి ఇద్దరూ ఆడ బిడ్డలూ, ఒకరిని ఇచ్చి పుచ్చుకోవడం చాలా నచ్చింది.
పెద్దలను గౌరవించుట, నియమిత ఆహారం భుజించుట, ఆ విధంగా రోగాలకు దూరంగా ఉండుట, జనాభా నియంత్రణా – ఆదర్శవంతమైన విశేషాలు.
మరణాన్ని జీవితంలో తుది దశగా భావించి శోకం వదిలి అంత్య క్రియలు పూర్తి చేయుట గొప్ప విషయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు “జీవుడు జీర్ణ వస్త్రాన్ని వదిలి మరో వస్త్రాన్ని ధరించడమే మరణము” అన్నాడు.
రెండవ భాగంలో గలివర్ కు BrobdingNag రాజుకు జరిగిన సంభాషణలు ఆశ్చర్యం కలిగించేయి.
ప్రశ్న 8. ఏ భాగాన్ని అనువదిస్తూ మీరు అత్యంత ఆనందాన్ని అనుభవించారు?
జ: మూడు, నాలుగు భాగాలను తెలిగించినపుడు మనస్సు నిండా సంతృప్తి కలిగింది. గలివర్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన మహామహులను చూసిన ఘట్టం చిరస్మరణీయం.
Struldbrugs గురించి వాళ్లు అమర జీవులు అన్న మాట వినగానే గలివర్ తానే అమరజీవినైతే ఏం చేయగలను అనే విషయాన్ని జొనాథన్ అద్భుతంగా వర్ణించేడు.
నాలుగో భాగంలో గుర్రాలు ఆదర్శవంతమైన జీవితాలు గడుపుతున్నాయి అని చెప్పి “మానవుడు ఇంకా యాహూయే” అంటాడు.
ప్రశ్న 9. ఏ భాగాన్ని అనువదించటం కష్టం అనిపించింది?
జ: ఒకటవ భాగంలో లిల్లీపుట్ రాజు గలివర్కు ఇచ్చిన అభిశంసన పత్రం (impeachment proceedings) చాల జాగ్రత్తగా తెలిగించవలసి వచ్చింది.
రెండవ భాగంలో రాజు గలివర్‌ను తన దేశం గురించి చాలా ప్రశ్నలు సంధించేడు. చివరికి గలివర్‌ను మందలించేడు. ఇది బాగుంది.
మూడవ భాగంలో విజ్ఞానశాస్త్ర పోకడలు, రాజు ఏర్పరిచిన ఎకాడమీల పరిశీలన తెలిగించినపుడు పదునైన పదాల ఎంపిక అవసమైనది.
ప్రశ్న 10. మీకు వ్యక్తిగతంగా ఏ భాగం బాగా నచ్చింది? ఎందుకు?
జ: ప్రత్యేకంగా ఒక భాగమే అని నేను పేర్కొనను. లిల్లీపుట్ రాజు కృతజ్ఞత గురించి గొప్పలు చెప్పి, చివరకు గలివర్‌ను చంపించే ప్రయత్నమే చేసేడు.
BrobdingNag రాజు కు గలివర్ కు జరిగిన సంభాషణలు చాల నచ్చేయి. అవి నేడు మనం చూస్తున్నాం కదా!
విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనల వెర్రితలలు, వ్యవసాయాన్ని నాశనం చెయ్యడం, వాతావరణ కాలుష్యం, ఇవి మనకు హెచ్చరికలు (warnings).
“మానవుడు ఇంకా యాహూయే” అన్నది అక్షర సత్యం.
ప్రశ్న11. ఈ పుస్తకాన్ని కొందరు ఫాంటసీ అంటారు. కొందరు తొలి కాల్పనిక ట్రావెలాగ్ అంటారు. కొందరు ఆనాటి సామాజిక పరిస్థితులు, మనస్తత్వాలను ప్రదర్శించే రచన అంటారు. మీరేమంటారు?
జ: కథ, నవల, నాటకం. ఏ ప్రక్రియ ఐనా పాత్రలూ, సన్నివేశాలూ తప్పనిసరి. నాయకులు, సామాన్యులు కూడ సహజం. కథనం బాగా పండాలంటే ఇవి కావాలి కదా. ట్రావెలాగ్‌లా ఉంటే ప్రయాణం చేసేవారే చదువుతారు.
ఫాంటసీ లేనిదే రచనలో పస ఉండదు. వాస్తవము, ఊహ మేళవించాలి. రచయిత ఇవన్నీ స్పష్టంగా చెప్పేడు. పాలకులను ప్రత్యక్షంగా విమర్శిస్తే ప్రమాదం కనుక కథ, కల్పన, వ్యంగ్యం ద్వారా పరోక్షమైన సందేశాలు ఇచ్చేడు. ఈ పుస్తకం ఖచ్చితంగా ఆనాటి సామాజిక పరిస్థితులను అద్దంలో చూపిస్తున్నది.
ప్రశ్న12. భవిష్యత్తులో ఇంకా అనువాదాలు చేసే ఉద్దేశం ఉందా? ఏ రచనలను అనువదించాలని ఉంది?
జ: ప్రస్తుతం నేను 80+. ఆరోగ్యం సహకరించాలి, దైవ కృప ఉండాలి. అనువాదాలు అనాదిగా ఉన్నవే. రామాయణ, భారత, భాగవతాలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. అలాగే ఇతర దేశాల క్లాసిక్స్ కూడాను. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. జనాదరణ పొందిన పుస్తకాలన్నీ ఇతర భాషల్లోకి అనువాదాలు జరుగుతూనే ఉన్నాయి.
సోమర్సెట్ మామ్, Guy de Maupassant, Leo Tolstoy, Pearl S Buck, O. Henry వంటి మహనీయుల కథలు తరగని విలువలు కల గనులు. అట్టి వానిని తెలిగించాలని ఉంది.
సమాజంలోని అంశాలను పరిశీలించి సృజనాత్మకతను జోడించి కథాంశాలుగా మలచి మంచి కథలు వ్రాయాలని ఉంది.
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శేషమ్మ గారూ.
కాళ్ళకూరి శేషమ్మ: ధన్యవాదాలు.
***
గలివర్.. సాహస సాగర ప్రయాణాలు మూలం: జొనాథన్ స్విఫ్ట్ స్వేచ్ఛానువాదం: కాళ్లకూరి శేషమ్మ స్మృతి పబ్లికేషన్స్, కాకినాడ. మార్చి 2024 పేజీలు: 152 ధర: ₹ 150/- ప్రతులకు: స్మృతి పబ్లికేషన్స్, 1-9-23, శ్రీరామ్‌నగర్ కాకినాడ. ఫోన్: 9885401882 ~ నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413 ఆన్లైన్లో: https://www.telugubooks.in/te/products/gulliver-sahasa-sagara-prayanalu
‘గలివర్.. సాహస సాగర ప్రయాణాలు’ అనే పుస్తక సమీక్ష: https://sanchika.com/gulliver-sahasa-sagara-prayanalu-book-review-kss/
నిరంతర అధ్యయనశీలి,పరిణత మనస్కురాలు,ఉపాధ్యాయురాలు,స్నేహమయి అయిన శేషు Madam ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా అనువదించేరు.దాన్ని చదవడం నా అదృష్టం అనిపించింది.Madam ఇంటర్వ్యూలో నేటి కాలం గురించి మాటలు 💯 percent సత్యాలు.ఈమె మరిన్ని popular English writers రచనలు అనువదించాలని నా విన్నపము.అభినందనలు Madam.చక్కని సంభాషణ జరిపిన సోమశంకర్ గారికి కూడా కృతజ్నతలు.
I read the book Gulliver’s travels Telugu translation by Mrs Seshamma garu. The interview gave more details of how she strived to translate the book! Tenneti Shyama Krishna, Hyderabad
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
చిగురించిన ఆశ
ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 10
నూతన పదసంచిక-105
కీ.శే. ఆచార్య వెలమకన్ని భరద్వాజ గారి స్మృత్యర్థం నిర్వహించే కథల పోటీకి ఆహ్వానం – ప్రకటన
రామం భజే శ్యామలం-46
ఆచార్యదేవోభవ-50
ఇదే బతుకు
మేనల్లుడు-9
భలే ఆలోచన
పాకానపడిన ప్రేమకథ
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®