వసంత్ తన చుట్టూ చూసాడు. ఎదురుగా, పక్కన, ఎక్కడ చూసినా పచ్చదనమే! తను ఆకుపచ్చని పరుపు మీద నడుస్తున్నాడు. మంచుతో తడిసిన గడ్డి మీదున్న పాదాల నుండి చల్లదనం తన ఒంట్లోకి మెల్ల మెల్లగా చొరబడుతోంది. “ఎంత హాయిగా ఉంది” అనుకున్నాడు.
వసంత్ ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో, కేకలతో, కేరింతలతో నడుస్తున్నాడు. అలా ఓ పెద్ద పూలతోట లోకి వచ్చాడు. గులాబీలు, మందారాలు, కనకాంబరాలు, చేమంతులు ఎంతరంగుల ప్రపంచం! విచ్చుకున్న పువ్వులు తను పెద్దగా నవ్వేటప్పటి నోరులా, మొగ్గలు తనకు ఇష్టం లేని బ్రేక్‌ఫాస్ట్ ముందున్నప్పుడు తన బుంగమూతిలా ఉన్నాయి. వసంత్ ఆ పూలతోటలో ఓ లేగదూడ అయిపోయాడు.
ఇంకా ముందుకు వెళుతుంటే వసంత్‌కు ఒక జామతోట కనిపించింది. గుత్తులు,గుత్తులుగా పండిన కాయలు, చిలుకలు కొట్టినవి కొన్ని, పచ్చివి కొన్ని. కాయల్ని తెంచాలనిపించింది. అటూ, ఇటూ చూసాడు. ఎవరూ కాపలాకి లేరు. అంతే! ఇంక కోయడం, కొరకటం పారేయటంలో వసంత్ లీనమైపోయాడు.
అలా ఆనందపు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వసంత్‌కి ఓ పువ్వు మీద సీతాకోకచిలుక కనిపించింది. చాలా కాలం తర్వాత చూస్తున్నాడు. తల కొంచెం పక్కకి తిప్పాడు. అక్కడ మరికొన్ని, ఇంకో పక్క ఇంకో కొన్ని. ఒకటి, రెండు, మూడు,….. యాభై.. తను లెక్క పెట్టగలడా అనిపించింది.
అద్భుతమైన రంగులతో, రాగాలు ఒయ్యారాలు పోతున్న ఓ వన్నెలాడి ‘భలే’ అనిపించింది. పట్టుకుందామని, మెల్లగా మునికాళ్ళ మీద నడుస్తూ తన బొటనవేలు, చూపుడువేలుకు దగ్గరగా తెస్తూ దాని వెనక నించున్నాడు. అది కదలదనుకున్న క్షణాన పట్టుకోబోయాడు. అది తుర్రున ఎగిరి, ఇంకో పువ్వు మీద వాలింది. మళ్ళీ ప్రయత్నం! ఉహూ, మళ్ళీ మళ్ళీ, సాధ్యం కాలా! అటూ ఇటూ పరిగెత్తి, అలిసిపోయి ఓ చోట చతికిలబడ్డాడు.
“వసంత్, ఇంక పరిగెత్త లేవులే! పాపం,నీ డొక్కలెలా ఎగిసి పడుతున్నాయో! మా అకుపచ్చని ప్రపంచం ఎలావుందీ? నీకు నచ్చిందా?” అంది సీతాకోకచిలుక.
అలుపు వల్ల వచ్చిన ఆయాసంతో, మాట్లాడలేక నచ్చినట్లు తలుపాడు వసంత్.
“మీరు ప్రకృతి లోకి ఎప్పుడు వచ్చినా చూడకుండా వదలని అందాలలో మేము ఒకళ్ళం. మా రకరకాల అద్భుతమైన రంగులు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. అవునా” అంది సీతాకోకచిలుక.
“అవును” అన్నాడు వసంత్ కొంచెం అలుపు తగ్గడంతో.
“మాకే కాదు, మీకూ ఉన్నాయి మీ హంగులు” అంది సీతాకోక చిలుక.
“మాకా” ఆశ్చర్య పోయాడు.
“మీ చదువు, సంస్కారం, నాగరికత, మేధ ఇవే మీ హంగులు. వీటి వల్లనే మీ కన్నా ముందుగా వచ్చిన జంతు ప్రపంచాన్ని లొంగదీసుకున్నారు. పనులు చేయించు కుంటున్నారు” అంది సీతాకోకచిలుక.
“అవునవును, మా సైన్సు మాస్టారు చెప్పారు” అన్నాడు వసంత్.
“మాకు వచ్చిన వర్ణాలు మధ్యలో పోవు. మేం చనిపోయినప్పుడే పోతాయి. మా ఈ అందమైన రూపానికి ముందు రూపం తెలుసా నీకు వసంత్” అడిగింది సీతాకోకచిలుక.
“ఓ, గొంగళి పురుగులు” అన్నాడు వసంత్ సైన్సు పాఠం గుర్తు తెచ్చుకుంటూ. “కానీ,… నాకు అదంటే అసహ్యం. దాని రూపం, దానిమీద నూగు. మరీ మరీ! ఒంటి మీద పాకితే ఒకటే దురద.” అన్నాడు వసంత్.
“ఆగాగు, మీ అందమైన ఈ నాగరిక రూపానికి ముందున్న రూపం కూడా ఇలాంటిదే. తెలుసా నీకు! దుస్తులు ధరించలేదు. పచ్చి మాంసాన్ని తినేవారు.” అంది సీతాకోక చిలుక.
“వూ”
“ఆ దశ నుండి నాగరికత నేర్చుకుని, సంస్కరించుకుని, భాష నేర్చుకుని చక్కగా మాట్లాడటం నేర్చారు. మీ మేధతో గగనం మీద విజయం సాధించారు. సృజన రంగంలోనూ వైద్య రంగంలోనూ నిష్ణాతులయ్యారు. కానీ, ఇదంతా మరిచి మత, కుల వర్ణ వైషమ్యాలతో కొట్టుకుంటున్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారు. మానవత్వం మరిచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వావి, వరుసలు మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవునా” అంది సీతాకోకచిలుక.
“అవును” అన్నాడు వసంత్ బాధగా.
“ప్రస్తుతం మీ రూపం మా గొంగళి పురుగు దశ. మీ అందమైన, ఉన్నతమైన రూపాన్ని విడిచి, వికృత రూపాన్ని పొందుతున్నారు. దీన్ని సరిదిద్దగలిగేది మీరే” అంది సీతాకోక చిలుక.
“మేమా, కానీ ఎలా?” కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం కుతూహలంగా అడిగాడు వసంత్.
“నువ్వు, నీలాంటి పిల్లలే దేశ భవిష్యత్తును చక్కగా ఉంచగలిగేది. ఆ శక్తి మీకే ఉంది. మీరందరూ కుల, మత వివక్షను విడిచి పెట్టాలి. మానవతే మతం చేసుకోవాలి. అప్పుడు మానవులందరూ ఒక్కటే అనిపిస్తుంది. నీ స్నేహితులతో చెప్పు. వాళ్ళని వాళ్ళ స్నేహితులతో చెప్పమను. అందరి ఆలోచనా ప్రవాహం ఒక్కటిగా సాగితే ముందు భారతీయ కుటుంబం, ఆ పై వసుధైక కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు మానవులందరూ అందమైన రంగురంగుల సీతాకోకచిలుకలే! అర్థమైందా?” అంది సీతాకోకచిలుక.
“ఆ… ఆ.. ఆ… బాగా అర్థమైంది” అంటుండగానే ఒక్కసారిగా మెలకువ వచ్చి, తుళ్ళిపడి లేచి కూర్చున్నాడు వసంత్. ‘ఎంత అందమైన కల’ అనుకుంటూ, తలచుకుంటూ, తలచుకుంటూ నిద్రలోకి జారిపోయాడు వసంత్.
Seethakokachiluka kadha chaalaa baavundi. Manchi sandesaathmaka polika 👌👌
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™