[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]


నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
పరమేష్ఠి హిరణ్యకశిపునకు ప్రత్యక్షమగుట
266.
ఉ.:
అంతట దైత్యు భక్తికి నఖండ తపః ఫల వ్యగ్ర స్ఫూర్తికిన్
ఎంతయు సంతసించి, పరమేష్ఠి యనుగ్రహపూరితుండునై
చింతను దీర్చి కామ్యముల నివ్వగ తాజను దెంచె, సిద్ధులున్
చెంతను మౌనివర్యులును చేరగ, సొంపగు హంస నెక్కుచున్
267.
సీ.:
సకల చరాచర సృష్టిని యొనరించు
సర్వజీవ విధాత శాశ్వతుండు
పరమాత్ముడైన నారాయణసుతుడు
వాణీ ముఖాంబుజ దినకరుండు
నుదుటి రాతల రాసి ముల్లోక వాసుల
భావిని విధియించు పరమబ్రహ్మ
నాలుగు వదనముల్ మహితంబులయి వెల్గ
నఖిల జీవుల గాచు నలువ యతడు
తే.గీ.:
సర్వధర్మములకు తానె శరణమగుచు
సర్వశాస్త్రములకు తానె గురువు యగుచు
సర్వవేదాల ఉపనిషత్ సారమగుచు
తనరు దేవుండు నారదు కన్నతండ్రి
268.
వచనము:
వచ్చి, హిరణ్య కశిపునితో యిట్లు పలికె:
269.
ఉ.:
మెచ్చితి నీ తపంబునకు మించిన నీ అతిలోక భక్తికిన్
వచ్చితి నిన్ను బ్రోవగ నవారిత ధీరమనస్క! ఇంక నీ
నచ్చిన కామితార్థమును నందగ జేసెద, చాలు లెమ్మికన్
అచ్చెరువయ్యె నీ ఘనత, అంకిత భావము, దైత్యశేఖరా!
270.
తే.గీ.:
అనిన నళిన గర్భు నాదర వచనంబు
సుధను చెవులను వేసిన విధము కాగ
బ్రహ్మ దర్శనమున మేను పరవశింప
లౌకికాతీత గతి నందె రాక్షసపతి
271.
కం.:
స్వరమది గద్గదమవ్వగ
సుర రిపు తనువెల్ల పులక సూనము లెసగన్
కరములు దోయిలి పట్టుచు
పరమేష్ఠిని జాచి నిటుల పలికెను భక్తిన్
272.
ఉ.:
ఎవ్వడు ఈ జగంబులను ఇట్లు సృజించుచు రక్షసేయునో
ఎవ్వడు నిత్యమౌ త్రిగుణవేదిగ నాశ్రయభూతుడౌనొ, తా
నెవ్వడు మూల కారణము నిశ్చల జ్ఞాన పద ప్రభూతికిన్
అవ్వన జాత గర్భునకు నంచిత భక్తి నమస్కరించెదన్
273.
కం.:
ప్రాణేంద్రియ దశకములకు
మనసుకు బుద్ధికిని తాయు పాదానముకున్
ఘనకార్య రూపవహునకు
అనితర వరతేజ మహిత హరిసుతునకునున్
274.
వచనము.
తండ్రీ! పరమాత్మా! పరమేష్ఠీ! బ్రహ్మదేవా! నీ తత్త్వంబు గ్రహింప నాబోంట్లకు శక్యంబె?
275.
శా.:
నీవే సూత్రము, అంతరాత్మవు కదా, నీ రీతి గుహ్యంబునౌ
నీ వాల్లభ్యము చేత నెల్ల జగముల్ నిద్రించు నిశ్చింతగాన్
నీవే ప్రాణుల బుద్ధి జ్ఞానములకున్ నేర్పున్ నేర్పు సంధాతవై
నీవే కర్తవు, భర్తవున్, సకలమౌ మీమాంసకున్ పాహిమాం!
276.
శా.:
అగ్నిష్టోమము నుక్థ్యమున్ మరి యటుల్ ఆప్తోర్యామమున్ నీవ, య
త్యగ్నిష్టోమము, షోడశిన్, సకల సంధాన స్ఫూర్తి కల్పించుచున్
మగ్నం బైచన వాజపేయమది సన్మమంత్రోప యుక్తంబుగాన్
భగ్నాతీత సుసప్త తంతు తతి శోభంగూర్చవే నీ కృపన్
277.
తే.గీ.:
ఆది యంతము లేనట్టి ఆత్మ నీవు
అచల బ్రహ్మాండ సర్వజ్ఞమౌచు దనరు
ఆత్మభూతుడవైనట్టి అజుడ నీవు
నిఖిల ప్రాణులకును నీవ నిలుపు శక్తి
278.
వచనము:
ఓ జగత్కారణా! విధాతా!
279.
ఉ.:
నీకు విరుద్ధమైనదియు నీవు వహించని కార్యశాస్త్రముల్
లోకములోన లేవు గద! లుప్తము కానిది నీదు తత్త్వమున్
రాకయు పోకయున్ త్రిగుణ రక్తుల కీవె విధింతు నిత్యమున్
నీ కనుదోయి విశ్వమది నిశ్చితమైమను, సృష్టికారణా!
280.
కం.:
స్థూలశరీరము లోకము
పాలింతువు నింద్రియముల, మనమును, గుణముల్
ఆలోచనల రచింతువు
లీలను పరమేష్ఠి, బ్రహ్మ లిఖితమనంగన్
~
లఘువ్యాఖ్య:
ఈ భాగంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతాడు. పద్యాలు 266-267 లలో బ్రహ్మదేవుని వర్ణన, బ్రహ్మతత్త్వమును వర్ణించడం జరిగింది. పద్యం 269లో ధాత హిరణ్యుని అనుగ్రహిస్తాడు. పద్యాలు 270, 271 లలో బ్రహ్మదర్శనంబున రాక్షసపతి పొందిన అలౌకిక అనుభూతి ఉంది. పద్యాలు 272, 273 లలో హిరణ్యుడు బ్రహ్మను స్తుతిస్తాడు. పద్యం 275లో సృష్టికర్త లీలా విభూతి వర్ణించారు కవి. పద్యం 276 ఆధ్యాత్మిక లోతులు గల పద్యం. యజ్ఞ యాగాదులకు పరమార్థము పరమేష్ఠి. ఆయా యజ్ఞ యాగాదుల పేర్లు చక్కగా ఈ పద్యంలో ఛందస్సులో అమరినాయి. పద్యం 279లో బ్రహ్మ అసమాన కార్య శూరతను రాక్షసరాజు స్తుతించాడు. స్థూలశరీరమైన ఈ లోకాన్ని ఆయన పాలిస్తాడు (పద్యం 280). మానవుల మనస్సును, గుణాలను, ఆలోచనలను రచిస్తాడు. దాన్నే బ్రహ్మలిఖితం అంటారు.
(సశేషం)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.