[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]


నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
281.
వచనము:
అని హిరణ్యకశిపుడు వివిధ రీతుల నా నలువ వినుతింప ప్రసన్నుండై హిరణ్యగర్భుండిటుల పలికె
282.
తే.గీ.:
అడవి ఈగలు దేహము నారగింప
ఎముకలను జీవశక్తిని ఇట్లు నిలిపి
నిశ్చలంబైన యోగంబు, నిష్ఠ జూపు
నీదు స్థైర్యంబు మెచ్చితి నేను దైత్య!
283.
కం.:
నీ యట్లు తపమొనర్చిన
సంయములును సురలు లేరు సరియగు వారల్
తోయమె ఆహారంబుగ
కాయము నిలుపుచును తపము కావించితివే!
284.
కం.:
దితిసుత! యాత్మధృతితో
జితమన్మథుడవయి నీవు చిత్తము లోనన్
హృత కిల్బిష మోహంబుల
నతిలోకం బైన కీర్తి నందితి, వత్సా!
285.
ఉ.:
నన్ను ప్రసన్ను జేసికొనినావు త్వదీయ తపో నిరూఢి చే
మున్నిటు ఎవ్వరేనియును మోదము గూర్చగ లేరు తాపసీ!
నిన్ను యనుగ్రహింతును యనేక వరంబుల నిచ్చి బ్రోచుదున్
మన్నన కోరుకొమ్ము నిజమానస సంస్థితమౌ యభీష్టముల్
286.
వచనము:
అని, కృపాతరంగితాంతరంగుడగు పరబ్రహ్మ, తన కమండలము లోని మహిమాన్విత జలంబును దానవేశ్వరు దేహంబుపై చల్లెను. అంత..
287.
తే.గీ.:
శిథిలమైనట్టి దేహము చిత్రముగను
పూర్ణమై తోచె పుష్టిగ, పుట్ట నుండి
పుటము దీసిన పసిడిని బోలి లేచె
అసురనాథుండు తేజముల్ అతిశయింప
288.
వచనము:
లేచి, పరమేష్ఠి పాదములపై బడి వ్రాలి, ఇట్లు ప్రార్థించె.
289.
ఉ.:
జోత జగద్విధాత! నిను జూడగ జన్మము ధన్యమయ్యెగా
వీతము నయ్యె మోహమును, విశ్వము నీదగు చిత్త శక్తి నా
చేతమునందు నీవు నివసించుచు, నన్ను సముద్ధరించుమా
ఏతరి నిన్ను వీడని విశేష మనంబును నిచ్చి బ్రోవవే!
290.
మ.:
వరదా! నాదు యభీష్టమియ్యది, ననున్ పాలింపు, చావన్నదే
మరి లేనట్టి యఖండ దివ్య వరమున్ నాకిచ్చి రక్షింపుమా
సురలోకంబును గెల్చు శక్తియును, నన్ శూరత్వమున్ గెల్వగన్
అరయన్ సాధ్యము గాని సంస్థితియు, లోకాధిశ! ఇప్పింపవే!!!
291.
వచనము:
అనిన దైత్యేశ్వరు పలుకులను విని ఆ బ్రహ్మదేవుండు మందస్మిత వదనుండగుచు ఇట్లు పలికెను.
292.
కం.:
పుట్టిన ప్రతి జీవి యునటు
గిట్టక తప్పదుర యసుర! కించిత్తయినన్
ఇట్టిది సాధ్యము కాదని
గట్టిగ తెలిసియను నడుగ గా తగునె నిటుల్
293.
వచనము:
కావున వేరు వరము లేవైన కోరుకొనుము, ఇచ్చెద. ‘నిర్మృత్యుపదము జీవులకు దుర్లభము’ అని సృష్టికర్త పలికెను. అంత నసుర విభుండు కొంత సేపు మనములో వితర్కించి, ఇట్లు వేడెను.
294.
ఉ.:
లోపల, బైటయున్, పగటిలో, నిశి, నాయుధ సంచయంబునన్
ఆపయి భూమి పైన మరి యంబరమందున మానవాళి చేన్
ఏపుగ జంతువుల్ సురలు ఎట్టి భుజంగులు రాక్షసాళి చేన్
రూపఱనట్టిదౌ వరమునో కరుణానిధి! ఇచ్చి బ్రోవవే!
295.
వచనము:
“మరియును, సమరంబున నాకు అప్రతిద్వంద్వతను, సర్వజీవులపై ఏకాధిపత్యమును ఒసంగుము. ప్రాణము లేని వాని చేతగాని ప్రాణమున్న వాని చేతగాని, నాకు మృత్యువు కలుగకుండ జేయుము. తపస్సు, యోగము మొదలగు వానివల్ల, ఇంద్రాదులతో గలుగు, ఎన్నడూ నశించని, అణిమాది సిద్ధులను నాకు ప్రసాదింపుము” అని వేడ, నలువ ఇట్లనియె.
296.
కం.:
నీవడిగిన వరములనిటు
యెవరును ఆశించలేదు, ఇవి దుర్లభముల్
నీ వర తపమును మెచ్చుచు
కేవల మొక నీకె యిత్తు క్లిష్టపు వరముల్
297.
వచనము:
“వరగర్వమున అహంకార మదంబులతో చరియింపక, విశ్యకల్యాణముకై ఈ వరములను ఉపయోగించి తరించుము” అని హెచ్చరించి, ఆశీర్వదించి బ్రహ్మదేవుడంతర్హితుండయ్యె. అసురేశ్వరుండును, ఆనందమున డెందముప్పొంగ, నిజపురమునకుంజని, జననికి నమస్కరించి అంతయు నెఱింగించి, అత్తరి..
~
లఘువ్యాఖ్య:
పద్యం 282లో ఘోర తపము వలన రాక్షసుని శరీరం ఏ విధంగా శిథిలమైందో ‘స్వభావోక్తి’ అన్న అలంకారం ద్వారా కవి చెప్పారు. అడవి ఈగలు ఆయన దేహాన్ని తినివేశాయి. జీవశక్తి అంతా కేవలం ఎముకలలోనే నిలుపుకుని, నిశ్చల యోగంలో నిలిచాడు. పద్యం 283 లో కూడా బ్రహ్మ, అతని తపస్సును పొగుడుతున్నాడు. నీలాగా తపస్సు చేసిన దేవతలు గాని, మునులు గాని లేరంటున్నాడు. పద్యం 284లో రాక్షసుని, ‘యాత్మధృతి’ తో, మన్మథుని జయించావనడం గొప్ప మాట. ‘ఆత్మధృతి’ అన్నది వజ్ర సంకల్పం గల వారికే సాధ్యం. పద్యం 285లో నన్ను సంతోషపెట్టావు. నీకు వరాలు అనుగ్రహిస్తానని, కోరుకోమని అంటాడు. తన కమండల జలంతో రాక్షసుని దేహంపై ప్రోక్షించగానే, అతని తేజుస్సు, పూర్వరూపము తిరిగి లభించాయి. భగవంతుడు కరుణిస్తే ఎంతసేపు? అప్పుడు హిరణ్యుడు పుట్ట నుండి, ‘పుటము తీసిన పసిడి’ వలె లేచాడనడంలో (పద్యం 287) చక్కని ఉపమ ఉన్నది.
పద్యం 289 లో రాక్షసుడు – నన్ను ఉద్ధరింపుము దేవా! నిరంతరం నిన్ను వీడని మనస్సును ప్రసాదించమని ప్రార్థించాడు. పద్యం 290లో మెల్లగా అసలు విషయానికి వస్తాడు. ‘చావన్నది మరి లేనట్టి’ వరం కావాలంటాడు. పద్యం 292లో బ్రహ్మ నవ్వి, అది సాధ్యం కాదు, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదంటాడు. పద్యం 294 లో హిరణ్యకశిపుడు జాగ్రత్తగా ఆలోచించి, ఎన్ని రకాలుగా తనకు చావు రాకూడదో వివరిస్తాడు. సర్వ జీవులపై ఆధిపత్యాన్ని (295లో) కోరతాడు. పద్యం 296 లో బ్రహ్మ ఆ వరాన్ని కేవలం నీకు మాత్రమే ఇస్తున్నానని అనుగ్రహిస్తాడు. కాని (వచనము 297 లో), ఈ వరగర్వముతో మదమెక్కి చరించవద్దు, లోక శ్రేయస్సు కోసం దీనిని ఉపయోగించి తరించమని హెచ్చరిస్తాడు.
(సశేషం)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.