అదొక విశాలమైన గుహ. లోపల నేలంతా శుభ్రంగా ఉంది. ద్వారానికి దగ్గరగా దివిటీ వెలుగుతోంది. నిశితంగా ఆణువణువూ పరిశీలిస్తూ తను ప్రవేశించిన ద్వారానికి ఎడమ పక్కగా చూసి చంద్రహాసిని నోటమాట రాని దానిలా నిలబడిపోయింది.
ఆ క్షణంలో ఆమె జాగరూకత, శౌర్యం, తన ధైర్యం అన్నీ మరచిపోయి నిలువెల్లా కరిగిపోతున్న మంచు పర్వతంలా పెరిగిన ఉచ్ఛ్వాశ నిశ్వాసల మధ్య ఊగిసలాడుతూ కలలో నడుస్తున్నదానిలా ఆ ఎడమ పక్కన గోడవైపుకి వెళ్ళింది.
ఆ గోడ మీద అత్యద్భుతమైన ఓ చిత్రం ఉంది. రాధ సఖి, దీనవదనంతో ఉన్న కృష్ణుడి వద్ద నిలబడి ఏదో చెబుతోంది. ఆమెకు ఎడమ పక్కగా కృష్ణుడు యమునా తీరాన ఓ తిన్నె మీద విచార వదనుడై కూర్చుని ఉన్నాడు. ఆమెకు కుడి వైపు పైన ఒక భిన్నమైన రంగులో ఓ పూల పొదరిల్లు, పైన పున్నమి చంద్రుడు, పొదరింటి ముంగిట్లో అరిటాకు మీద రచించబడిన మన్మధుడి చిత్తరువు, పూజ చేసినట్టుగా అక్కడ రాలిన పుష్పాలు. తామరాకులూ.. ఆ పొందరింట్లో ఓ పక్కన మాత్రం యువతి రూపంలో ఉన్న స్థలం తెల్లగా ఏ రంగూ గియ్యక వదిలివేయబడి ఉంది.
ఆ చిత్రంలోని సౌందర్యాన్ని అణువణువూ అనుభూతిస్తూ, ఆశ్వాదిస్తూ అనుభవించే కొద్దీ చంద్రహాసిని శ్వాస మరింత దీర్ఘమూ, వేగమూ అయింది.
“హరి వల్లభ శోక పల్లవం” మెల్లగా గొణిగాయామె పెదవులు. ఆమె పరిసరాలని గమనించే స్థితిలో లేదు. లోపల ప్రవేశించినప్పుడు మాత్రం ఆ గుహలో ఎవరూ లేరు. తన అడుగుల సవ్వడి గమనించే మరింత లోపలగా, చీకటిలో దాక్కుని ఉంటారన్న తలంపు ఆమెకు అప్పుడు కలిగింది కానీ, ఇప్పుడు ఈ క్షణాన ఆమె అవేవీ ఆలోచించే స్థితిలో లేదు.
“నిందతి చందన మిందుకిరణామనువిందతి హేదమధీరం వ్యాళనిలయ మిళనేనరగళమిన కలయతి మిలయ సమీరం మాధవ మనసిజ విశిఖ భయాదివభావన యాత్వయిలీనా సావిరహే తవ దీనా!!”
అత్యంత మధురమైన తన గాత్రంతో కర్ణ మనోహరంగా మైమరచి పాడుతోంది చంద్రహాసిని ఆ చిత్రాన్ని చూస్తూ.
తన ఎదురుగా ఉన్నది కేవలం ఒక చిత్రంలా అనిపించలేదామెకు. ఆ కృష్ణుడూ, రాధ యొక్క ప్రియ సఖీ సశరీరులై తన ఎదురుగా నిలబడినట్టు ఉన్నారు ఆ చిత్రంలో. అంత అద్భుతమైన కళ.. చాలా చాలా అరుదు.
విలిఖతి రహసికురంగమదేన భవంత మసమశరభూతం ప్రాణమతి మకర మధోవిని ధాయకరేచశరం నవచూతం!!
పరిసరాలు పరవశించేలా ఆమె తన్మయత్వంతో మైమరచిపోయి అరమోడ్పు కన్నులతో తను గీసిన చిత్రాన్ని చూస్తూ పాడుతుంటే, అంతవరకూ చాటుకి తప్పుకున్న అతను ముందుకొచ్చి ఆమెను చూస్తూ సమ్మోహనుడైపోయాడు.
సాటిలేని జయదేవ కవి రచించిన ఆ ఎనిమిదవ అష్టపదిని ఆమె అద్భుతమైన రాగంతో పాడటం ముగించింది. సజల నేత్రాలతో అలా ఆ చిత్రాన్నే చూస్తూ నిలబడిపోయింది.
అతను పక్కనే కిందగా ఉన్న రాయి మీద నుంచి చెట్టు బెరడుతో చేసిన ఒక దొన్నె చేతిలోకి తీసుకున్నాడు. అందులో తనకు కావలసిన రంగు నింపుకున్నాడు. అశ్వం యొక్క కేశాలతో చేసిన చిన్న కుచ్చును చేతిలోకి తీసుకున్నాడు. ఆ రంగులో ముంచి వెలితిగా వదిలేసిన రాధ రూపాన్ని మెల్లగా రంగులతో నింపడం ప్రారంభించాడు.
అతన్ని చూసి చంద్రహాసిని ఉలిక్కిపడలేదు. నిద్రలో నడుస్తున్నదానిలా తను వేసుకున్న రక్షణ కవచాలు తీసి పక్కన పడవేసింది. ఆ చిత్రంలో రాధని ఏ ఆకృతిలో అయితే అతను ఊహించుకుని రంగులు వెయ్యకుండా వదిలేశాడో అదే ఆకృతిలో అతనికి అభిముఖంగా ఉన్న గోడకి ఆనుకుని నిలబడింది.
అతను చిత్రంలో వదిలిన తెలుపు రాధారాణి తన పూల పొదరింటి స్థంభానికి ఆనుకుని ఒక చేతిని పైకెత్తి తలకింద ఆసరాగా చేసుకుని మరో చేత్తో తన హృదయంపైన తామరాకులని నొక్కి పట్టుకుని విరహోత్కంఠితలా తల పక్కకి తిప్పి చందృని వంక కోపంగానూ, వేదన గానూ చూస్తున్నట్టుగా నిలబడినట్టు ఉంది. అచ్చంగా అలాగే నిలబడింది చంద్రహాసిని. ఆమె ముఖ కవళికలు అచ్చు తను రాధారాణిని ఊహించుకున్నట్టుగానే ఉండటం, ఆమె ముఖంలో విరహోత్కంఠత స్పష్టంగా కనిపించడం ఎక్కడా దొరకనంత ఆనందాన్ని ఇచ్చిందేమో అతనికి, చిరునగవుతో దీక్షగా ఆమెను గమనిస్తూ తన చిత్రానికి తుది రూపాన్ని ఇస్తున్నాడు.
అటువంటి చెట్టు బెరడుతో చేసిన దొన్నెలతో ఇంకా ఎన్నో రంగులు ఉన్నాయి. ఎన్నో రకాల కుచ్చుల పుల్లలు ఉన్నాయి. నెమలి ఈకలు ఉన్నాయి. సన్నటి రేఖలు అతను నెమలీకను రంగులో ముంచి గీస్తున్నాడు.
రాత్రి మొత్తం ఆ విధంగానే గడిచింది. తెల్లవారబోయే ముందు అత్యంత మనోహరంగా విరహ వేదనతో సతమతమవుతున్న రాధ రూపం పూర్తయింది. దానితో ఆ చిత్రం కూడా పూర్తయింది.
అంతసేపు అదే భంగిమలో కదలకుండా నిలబడిన చంద్రహాసిని కదిలి ఒళ్ళు విరుచుకుని అలాగే నేల మీద కూలబడింది. అతను వేగంగా ఆమె దగ్గరికి వచ్చి పట్టుకోబోయాడు కానీ అంతలోనే చంద్రహాసిని తనను తాను సంభాళించుకుంటూ నెమ్మదిగా నేల పైన కూర్చుంది.
అతను ఆమె దగ్గరగా వచ్చి కృతజ్ఞతగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది.
“మీరు?” మెల్లగా అంది అతని కళ్ళలోకి చూస్తూ. అప్పుడతన్ని నిశితంగా పరిశీలించింది. చెట్ల నుండి వచ్చే నారనే వస్త్రంగా ధరించి ఉన్నాడు. శిరోజాలు, గెడ్డం బాగా పెరిగి ఉన్నాయి. పెరిగిన శిరోజాలని ఒద్దికగా నడి నెత్తిన మునిలాగ ముడివేసుకున్నాడు.
మంచి శరీర ధారుఢ్యం చూస్తుంటే అతను సుశిక్షితుడైన సైనికుడిలా కనిపించాడు. చురుకైన అతని చూపులు అతను సామన్యుడు కాదని తెలుపుతున్నాయి.
ఆమె ప్రశ్నకి అతను బదులివ్వలేదు. కాసేపటి మౌనం తరువాత “మీరు చూడబోతే ఏ దేశానికో యువరాణిలా ఉన్నారు! ఇక్కడికి ఒంటరిగా ఎలా వచ్చారు? ఇంతసేపయినా మిమ్మల్ని వెతుకుతూ మీ పరివారమెవరూ రాలేదు?” అన్నాడు.
“చంగల్వ రాజ్యపు రాకుమారిని నేను. ఈ అడవి మధ్యన ఉన్న ఆ ఓషధీ గుణములు కల తోట చూడాలని వచ్చాను. అక్కడికి చేరుకునేలోపే అసలెప్పుడూ చూడని క్రూరమైన వింత జంతువుల వల్ల కొంతమంది భటులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని వెనకకు పంపించి నేనూ, మా సేనాపతి మాత్రం వచ్చాము. రాత్రి నేను నిద్రరాక ఆ కొలను ఒడ్డున కూర్చున్నప్పుడు నీటిలో ఎవరిదో నీడ గమనించాను. ఇంత భయంకరమైన అడవిలో ఎవరు ఉంటున్నారో తెలుసుకోవాలని ఒంటరిగానే ఈ గుట్ట దాటి ఇటువచ్చాను. మీ రహస్య మందిరాన్ని కనుగొన్నాను.” అంది నవ్వుతూ.
“ఈ అడవిలో ఒంటరిగా ఉంత దూరం వచ్చారంటే మీరెంత పరాక్రమవంతులో అర్థమవుతోంది యువరాణీ” అన్నాడతను.
“ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు. చూడబోతే చాలా రోజులుగా ఇక్కడే ఈ అడవిలోనే నివశిస్తున్నట్టుగా ఉన్నారు” అంది.
అతనొకసారి దీర్ఘంగా శ్వాసించాడు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™