[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]


[తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో, వైనతేయ సంగీత విద్యాభ్యాసాలు మొదలవుతాయి. ఐదవ తరగతి పాఠాలు మొదలవుతాయి. హరికథ కోర్సు ప్రారంభమవుతుంది. మొదటి రోజున శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి క్లాసుకు వచ్చి పిల్లలని పరిచయం చేసుకుంటారు. హరికథ గురించి, హరికథకుల గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. తర్వాత వినాయక స్తుతితో పాఠం ప్రారంభిస్తారు. హరికథ ఎలా పుట్టింది, ఎవరెవరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు, హరికథలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలను గురించి చెప్తారు. రోజూ ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి, సదాశివశర్మ గారింటికి వెళ్తాడు. అమ్మగారు చెప్పిన పనులు చేయడం, శర్మగారి దగ్గర సంగీతం పాఠాలు నేర్చుకోవడం వాడి దినచర్య. హిందోళ రాగం గురించి చెప్తారు శర్మగారు. తాము ఈమధ్య చూసిన ‘అంతా మన మంచికే’ సినిమాలోని ‘నేనె రాధనోయీ, గోపాలా!’ అన్న పాట హిందోళమే కదా స్వామీ అని శర్మగారిని అడుగుతాడు. అవనని, బాగా గమనించావని మెచ్చుకుంటారాయన. తర్వాత తాను నేర్పిన కరుణశ్రీ పద్యాన్ని హిందోళంలో పాడి వినిపించమంటారు. శృతి తప్పకుండా పాడతాడు వైనతేయ. శర్మగారు మెచ్చుకుని, కొన్ని సూచనలు చేస్తారు. కొద్దిసేపటి క్రితం ఆయన పూజ చేసుకుంటుండగా, తన మనసులో కలిగిన సందేహాన్ని ఆయన ముందు వ్యక్తం చేస్తాడు వైనతేయ. దానికి ఆయన చక్కని వివరణ ఇస్తారు. మన కావ్యాలు, నాటకాలలోని పద్యాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలనీ; కథాగమనంలో సందర్భశుద్ధిగా వాటిని ఒప్పించి, ప్రేక్షకులను అలరించాలని చెప్తారు. ఇడ్లీలు తిని హాస్టల్‌కి వెళ్ళిపోతాడు వైనతేయ. – ఇక చదవండి.]
ఆ రోజు స్కూల్లో మునిరెడ్డి సారు ఇంగ్లీషు పాఠం చెబుతున్నారు. అప్పుడు హైస్కూలు వరకు ఇంగ్లీషు సబ్జెక్టు ఉండేది కాదు. ఆరవ తరగతి పెద్ద పరీక్షలు సమీపిస్తున్నాయి. ఐదవ తరగతిలో ఇంగ్లీషు అక్షరాలు, చిన్న చిన్న పదాలు నేర్పేవారు. ఆరులో చిన్నచిన్న పద్యాలు, ప్రోజ్ లెసన్స్ ఉండేవి.
ఇంగ్లీషు అంతే వైనతేయకు చాలా ఇష్టం పద్యాలను కంఠస్థం చేసేవాడు. స్పెల్లింగులు బట్టీపట్టకుండా, మునిరెడ్డి సారు, పదాన్ని ‘సిలబుల్స్’ గా విభజించుకొని, ఎలా సులభంగా నేర్చుకోవాలో చెప్పాడు.
లెక్కలు వాటికి కొరుకుడు పడేవి కాదు. లెక్కల మేడమ్ ‘మేరీ మగ్ధలే’ అమ్మగారు. ఆమె చాలా మంచిది. లెక్కలు బోర్డు మీద చేసి చూపేది. ఇక తెలుగు గరుడాద్రి నాయుడుగారు. ఆయనకు వైనతేయ అంటే చాలా ఇష్టం. క్లాసులో వాడితో పద్యాలు పాటించేవాడు.
సోషల్ సారు శామ్యూల్ గంభీరంగా ఉండేవాడు. ప్యాంటులో షర్ట్ ఇన్సర్ట్ చేసి, బెల్ట్ పెట్టుకుని టిప్ టాప్‌గా ఉండేవాడు. భూగోళశాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం అన్నీ సోషల్ స్టడీస్‌లో భాగాలుగా ఉండేవి. అది చాలా ఆసక్తికరంగా ఉండేది వైనతేయకు.
ఇక హిందీ సారు ఈశ్వరలింగం గారు. హిందీని కూడా శ్రద్ధగా నేర్చుకునేవాడు వైనతేయ. ఆరవ తరగతి పాసై, ఏడు లోకి వచ్చాడు. ఏడవ తరగతికి పబ్లిక్ పరీక్షలుంటాయి. అలా లౌకికమైన చదువును కూడా కొనసాగిస్తున్నాడు.
కాలం సెలయేరులా దూకుతూ ముందుకొసాగుతూంది. మరో మూడు నెలల్లో తిరుపతితో రెండు చదువులూ అయిపోతాయి. సంగీత కళాశాలలో ‘ప్రాక్టికల్స్’ జరుగుతున్నాయి. అంటే ప్రతి విద్యార్ధి, ఒక హరికథను స్వంతంగా ప్రదర్శించాలి. దానికి మార్కులు వేస్తారు గురువులు. టి.టి.టి వారి హార్మోనిస్టు ఆదికేశవులు, తబలిస్టు షేక్ మస్తాన్ వలీ, వయొలనిస్టు స్వర్ణప్రభ గారలు వచ్చి, ప్రాక్టికల్స్‌లో పిల్లలకు వాద్య సహకారం అందిస్తారు. నెలరోజులు ముందు గానీ పిల్లలకు కథాంశం కేటాయిస్తారు. వైనతేయకు ‘గజేంద్రమోక్షం’ అనే అంశాన్ని ఇచ్చారు.
క్లాసులో సింహాచల శాస్త్రిగారు, ఇంట్లో సదాశివ శాస్త్రిగారు వాడికి ‘గజేంద్ర మోక్షం’ హరికథాగానంపై శిక్షణ ఇచ్చారు. తన వంతు వచ్చినపుడు వాడు దానిని చక్కగా ప్రదర్శించాడు. గురువుల మన్ననలు అందుకున్నాడు
మరో నెల రోజులే ఉన్నాయి పబ్లిక్ పరీక్షలు. హరికథ సర్టిఫికెట్ కోర్సు పూర్తయింది. ‘ఎ’ గ్రేడ్ వచ్చింది.
ఆ రోజు ఉదయం సదాశివశర్మగారు వాడికి నాయక లక్షణాలు, నాయికా లక్షణాలు పాఠం చెప్పారు. దీర్ఘశాంతుడు ధరలలితుడు, ధీరోద్ధతుడు, ధీరోదాత్తుడు, ఇలా నాయకులు ఉంటారని ఉదాహరణలతో చెప్పాడాయన. కధానాయికలలో కూడ స్వాధీన పతిక, విరహోత్కంఠిక, వాసవసజ్ఞక వంటి భేదాలున్నాయన్నారు. వైనతేయ వినయంగా అడిగాడు.
“స్వామీ! నాయకుల్లో ప్రతివారికి ‘ధీర’ అనే శబ్దం ఎందుకు ఉంది? లలితుడు, ఉదాత్తుడు, శాంతుడు, ఇలా అంటే సరిపోయేది కదా!”
సదాశివశర్మగారు చికితుడైనాడు.
“నాయనా! మంచి ప్రశ్న! ఇలాంటి విషయాలు ఎలా తోస్తాయి రా నీకు?” అని వాడిని మెచ్చుకొని, ఇలా వివరించారు.
“శాంతం, లాలిత్యం, ఉదాత్తత, ఔద్ధత్యం ఇవన్నీ విభిన్న వ్యక్తిత్వాలు. కానీ ధీరగుణం అందరిలో ఉండాలి. ధీరత్వం అంటే చెక్కు చెదరని నిబ్బరం. అప్పుడే ఆయా వ్యక్తిత్వాలు సంపూర్ణమవుతాయి.”
“అర్థమయింది స్వామి!”
“సరేగాని సాయంత్రం ఆరుగంటలకల్లా వచ్చేయి. మహతి ఆడిటోరియంలో ఈ రోజు హరికథాసరస్వతి శ్రీమతి వేదుల హనుమాయమ్మ భాగవతారిణిగారి హరికథా ప్రదర్శన ఉన్నది. నీకెంతో నచ్చిన కథ – ‘భక్తప్రహ్లాద’! ముగ్గురం వెళదాము. రాత్రి ఇక్కడే భోజనం చేసి, పడుకుందువు గాని. మీ వార్డెన్‌తో చెప్పి రా!”
వైనతేయ వదనం పొద్దు తిరుగుడు పువ్వులా విచ్చుకుంది!
***
ముగ్గురూ ఒకే రిక్షాలు బయలుదేరారు. సైకిలు తెచ్చుకోవద్దన్నారు శర్మగారు. దారిలో చెప్పారు.
“నాయనా! వేదుల హనుమాయమ్మ భాగవతారిణిగారు మహావిదుషీమణి. హరికథావిశారద శ్రీమాన్ కోట సచ్చిదానంద శాస్త్రిగారి శిష్యురాలు. సింహచలం దేవస్థానం ఆస్థాన విద్యాంసురాలు. ఆమె ప్రదర్శనను జాగ్రత్తగా పరిశీలించు. కళ లోని లోతుపాతులు తెలుస్తాయి.”
సరిగ్గా ఆరున్నరకు కార్యక్రమం ప్రారంభమైంది. సభకు అధ్యక్షులు టి.టి.డి జె.ఇ.వో బలరామయ్య గారు. ఆయన ఐ.ఎ.ఎస్ ఆఫీసరు. అంతేకాదు, మంచి వక్త, నటుడు, ప్రయోక్త కూడా. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి. ఆయన భాగవతారిణి గారిని సభకు పరిచయం చేశారు.
“సభాయై నమః! హరికథాభిమానులకు వందనం. టి.టి.డి ‘ధర్మప్రతిష్టాపన’ లో భాగంగా ఈ రోజు శ్రీమతి వేదుల హనుమాయమ్మ గారి హరికథాగానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె విద్వన్మణి. ఎనిమిది సంవత్సరాల వయసు లోనే హరికథలు చెప్పడం ప్రారంభించారు, వీరి గురువర్యులు శ్రీమాన్ కోట సచ్చిదానందశాస్త్రిగారు.
ప్రొద్దుటారు అగస్త్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన రాష్ట్రస్థాయి హరికథల పోటీలో హనుమాయమ్మగారు గత సంవత్సరం ప్రథమా స్థానంలో నిలిచి, స్వర్ణకంకణ పురస్కారం అందుకున్నారు.”
సభలో కరతాళ ధ్వనులు!!
“వీరిని కేంద్ర ప్రభుత్వం, నాలుగేళ్ల క్రిందటే ‘పద్మ శ్రీ’ బిరుదముతో సత్కరించింది. వీరు తెలుగు సాహిత్యంలో ఎమ్.ఎ. చేశారు. సప్తస్వరాలు జిహ్వాగ్రమునందున్న అపర సరస్వతి. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు శ్రీవారి సేవ చేసుకొనే అదృష్టం లేదు. కారణం, నన్ను, కర్నూలు జిల్లా కలెక్టరుగా బదిలీ చేసింది ప్రభుత్వం. టి.టి.డి తరపున నేను హాజరయ్యే చివరి కార్యక్రమం ఇది.”
సభికులందరూ తమ విచారాన్ని వ్యక్తం చేశారు. బలరామయ్యగారు మృదుభాషి. తిరుమలలో ఎన్నో సౌకర్యాలు కల్పించారు. నిత్యసుస్మితులు. తన జాయింట్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాను, హోదాలా కాకుండా వేంకటేశ్వరస్వామికి భక్తునిగా నిర్వహించారు. అటు సిబ్బందికి, ఇటు యాత్రీకులకు ఆయన ఆత్మీయుడైనాడు. అటువంటి అధికారులు అరుదుగా ఉంటారు.
హనుమాయమ్మగారు తెల్లగా, సన్నగా ఉన్నారు. బంగారు ఫేం కళ్లజోడు. నుదుట కుంకుమ బొట్టు. పాపిట కూడ. వంగపండు రంగు ఉప్పాడ చీరె కాసెపోసి కట్టుకున్నారు. ఆమె వదనం పాండిత్యం వల్ల కాంతులీనుతూంది. ఒక చేతిలో చిడతలు. మెడలో కనకాంబరాల మాల. ఒక ఆకుపచ్చని పట్టు ఉత్తరీయాన్ని మెడలో వేసుకున్నారు. ఆమెకు యాభై సంవత్సరాలుంటాయి.
ఆమెకు వాయిద్య సహకారం వయెలిన్పై శ్రీ కూర్మాచార్యులు గారు, మృదంగం శ్రీ ఏసుపాదం గారు, ఘటం పెంచలయ్యగారు. కంజీరా కుమారి విద్యుల్లత.
వారందరిని సభకు పరిచయం చేశారు భాగవతారిణి. వారి విద్వత్తును పొగిడారు. వారు లేకపోతే కథ రక్తి కట్టదన్నారు. ముందుగా విఘ్నేశ్వర స్తుతి. ఒక శ్లోకం. కల్యాణిలో అందుకున్నారామె. కూర్మాచారిగారు కృతిని అందించి, రాగప్రస్తారాన్ని సూచించారు వయొలిన్‌పై. ఆదిశంకరులవారు తమ కనకధారా స్తోత్రంలో మొదట గణసాధుని స్తోత్రం చేసిన శ్లోకం అది.
శ్లో॥
వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్
అమందానంద సందోహ బంధురమ్ సింధురాననమ్
“భక్తులారా! చూసినా రా పదముల సౌందర్యం. దీనితో ‘వృత్యనుప్రాసము’ అనే శబ్దాలంకారం ఉంది. బిందుపూర్వక ‘ద’కారాన్ని శంకరులు అద్భుతంగా అనేకమారు ప్రయోగించినారు. ఆ గణనాథుడు సకల శుభముల నొసగు గాక.”
తర్వాత ‘తిలాంగ్’ రాగంలో, అది తాళంలో తమిళ వాగ్గేయకారుడు తిరు అగత్తియార్ వ్రాసి స్వరపరచిన కీర్తన పాడారు హనుమాయమ్మగారు.
‘ప్రభో! గణపతీ! పరిపూరణ వాయ్యరు ల్వాయే’ అన్నది పల్లవి. అది తమిళ కీర్తన. కాని దానిలో సంస్కృత పదాలుండటం వల్ల ఎవరికీ పెద్దగా భాషతో ఇబ్బంది కలుగలేదు. మ్యూజిక్ హాజ్ నో లాంగ్వేజ్! సంగీతానికి భాష లేదని విజ్ఞులన్నారు. ఏ భాషలోనైనా సంగీతాన్నివిని ఆనందించవచ్చు.
“ఆదిమూల గణనాథ గజానన అద్భుత ధవళ స్వరూపా
దేవ దేవ జయ విజయవినాయక చిన్మయ పరశివ దీపా
ప్రభో! గణపతే”
అంటూ ఆమె నాట్యం చేస్తూ ఉంటే, భక్తులు పరవశించారు. సంగీత, సాహిత్య, నృత్య అభినయాలు ఒక చోట చేరితే ఇక చెప్పేముంది?
తర్వాత కథలోకి ప్రవేశించిందామె. హిరణ్యాక్ష వధ, హిరణ్యకశిపుని తపస్సు, ప్రహ్లాద జననం, నారదుల వారి ఆశ్రమంలో ఆశ్రయం, లీలావతీ దేవి పాతివ్రత్వం ఆమె వివరిస్తూ ఉంటే అంతా కళ్లముందు కనబడసాగింది.
బహుళ ప్రజాదరణ పొందిన ఎ.వి.ఎం వారి ‘భక్తప్రహ్లాద’ సినిమా ప్రభావం ఏ మాత్రం తన మీద పడకుండా ప్రదర్శన సాగించారు భాగవతారిణిగారు. ఎర్రన వారి నృసింహపురాణం, రేమిళ్ల వేంకట రామకృష్ణశాస్త్రిగారి వ్యాఖ్యానం తన హరికథకు మూలములని వినయంగా చెప్పుకున్నారు. తర్వాత లక్షీనరసింహ స్వామిని ఇలా స్తుతించారు, చక్రవాకరాగంలో-
“సత్యజ్ఞాన సుఖస్వరూప మమలమ్, క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలమ్
త్రక్ష్యం చక్రపినాక సాయుధ సాభయ వరాన్ బిభ్రాణమర్కచ్ఛవిన్
ఛత్రీ భూత ఫణీంద్ర మిందు ధరళమ్, లక్ష్మీనృసింహం భజే!”
ప్రహ్లాదుడు హరిభక్తిపరుడై తండ్రి మాట వినక పోవడం, తండ్రి అతన్నిరకరకాలుగా శిక్షించడం, అ భక్తాగ్రేసరుడు అచంచల విశ్వాసంతో స్వామినే నమ్ముకొని ప్రతిసారీ బయటపడడం, ఈ సందర్భంలోని పద్యాలను, పోతన భాగవతం లోని సప్తమస్కంధం నుంచి తీసుకున్నారు భాగవతారిణి. కాని, సినిమాలో పి. సుశీలగారు వాడిన రాగాలను వాడలేదు. తన స్వంత బాణీలను వాడారు.
“కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే”
“చదివించిరి నను గురువులు”
“ఎల్ల శరీరధారులకు”
“ముంచితి వార్దులన్” వంటి పద్యాలను ఆమె ఆలపిస్తూ ఉంటే శ్రోతలు మైమరచిపోయారు.
ప్రహ్లాదుడు చండామార్కుల వారివద్ద విద్య నేర్చుకొనే సందర్భంలో ప్రస్తుత విద్యావిధానంపై సున్నితమైన హాస్యంతో విమర్శలు గుప్పించారు. కథకు అనుషంగికమైన ఎన్నో విషయాలను ఆమె వివరించారు. చివరగా నృసింహావిర్భావ ఘట్టమును ఆ విదుషీమణి ఆవిష్కరించిన తీరు అనన్యసామాన్యం. సంస్కృత సమాస భూయిష్టమయిన ఒక పెద్ద వచనాన్ని అనర్గళంగా, లయబద్ధంగా పలుకుతూ ఆమె అభినయిస్తూ ఉంటే, వేదిక దద్దరిల్లింది.
చివరగా, శ్రీ అకళంకం తిరుమల వేంకట రమణాచార్య కృతమైన నృసింహ స్తంభావిర్భవ స్తోత్రమును ఆమె మధ్యమావతి రాగంలో గంభీరంగా పలికారు.
“కరాళవక్త్ర కర్కశోగ్రవజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతతోమరాంకుశోన్నఖాయుధమ్
మహాభ్రయూధభగ్నసంచలత్సటాజటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తిణం భజే”
అని ఆమె ఉచ్చశృతిలో గానం చేస్తూ ఉంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. స్తంభం నుండి వెలువడిన ఉగ్రనరసింహమూర్తి వారి కనుల ముందు సాక్షాత్కరించాడు! చాలామంది లేచి నిలబడి స్వామికి నమస్కరించుకున్నారు.
వైనతేయ ఇంకా ఆ మహానుభూతినుంచి తేరుకోలేదు! అతని కళ్ల వెంట ఆనంద బాష్పాలు కారుతున్నాయి. సదాశివశర్మ గారి వైపు చూశాడు. ఆ చూపులో ఒక పరవశం. రసగ్రహణ పారీణుడైన ఒక భావి హరికథకుని అపురూప స్పందన.
వాడు పొందిన అలౌకికస్థితిని గ్రహించి, దగ్గరకు తీసుకున్నారు శర్మగారు.
ఎనిమిదిన్నరకు కార్యక్రమం ముగిసింది. టి.టి.డి. జె.ఇ.వో. బలరామయ్యగారు భాగవతారిణి గారికి పట్టుచీరె, ఐదువేల రూపాయల నగదుతో సత్కరించారు.
ఇంటికి వచ్చిన తర్వాత శర్మగారు వైనతేయకు ఆమె ప్రదర్శన లోని ప్రత్యేకతలను; వాడు నేర్చుకోవలసిన విషయాలను చెప్పారు.
వకుళమ్మగారు బియ్యపు నూకతో ఉప్పుడు పిండి చేసి వడ్డించారు. హాల్లోనే ఆ రాత్రికి పడుకున్నాడు వైనతేయ. చాలాసేపు నిద్ర పట్టలేదు. హనుమాయమ్మగారి ఆహార్యం, గానం, అభినయం, నాట్యం వాడి కళ్ల ముందు కదులుతున్నాయి. హరికథకున్న అద్భుత శక్తి వాడికి అవగతమైంది.
‘రసోవైసః’ అన్న ఉపనిషత్ వాక్యసారం వైనతేయకు ఆ రోజు కార్యక్రమంలో దృశ్యమానం అయింది!
***
ఏడవ తరగతి సర్టిఫికెట్, టీసీ తీసుకున్నాడు. హరికథా సర్టిఫికెట్ కూడా. రెండు రోజుల్లో దస్తగిరి సారు వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది. రెండేళ్ల నుంచీ ఇంట్లో మెసులుతూ వారి హృదయాలకు చేరువైనాడు వైనతేయ. వాడు వెళ్ళిపోతాడంటే శర్మగారికి, వకుళమ్మకు ఏదో చెప్పలేని దిగులుగా ఉంది.
వాడిని బట్టలషాపుకు తీసుకుని వెళ్లి, రెండు జతల రెడీమేడ్ దుస్తులు కొనిచ్చారు శర్మగారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన ‘నవరసతరంగిణి’ (1922) అన్న కావ్యాన్ని వాడికి బహమతిగా ఇచ్చారు. ఇస్తూ, ఇలా చెప్పారు – “నాయనా అతి అరుదైన గ్రంథమిది. చాలా ఏళ్లుగా నా వద్ద పదిలంగా దాచుకున్నాను. నా ప్రియ శిష్యుడవైన నీకిస్తున్నాను. మహాకవి కాళిదాసు, షేక్స్పియర్ రచనల నుండి, నవరసాలను వర్ణించే ఖండికలను దాసుగారు తెలుగులోకి అనువదించి, మనకు ప్రసాదించారు. వాటిని బాగా చదువు. ముందు ముందు నీ హరికథా ప్రస్థానంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి.”
ఆ గ్రంథాన్ని కళ్ల కద్దుకొని, తన సంచీలో భద్రపరచుకొన్నాడు వైనతేయ.
వకుళమ్మగారు జంతికలు, మైసూర్ పాక్ చేసి ఇచ్చారు వాడికి.
దస్తగిరిసారు వచ్చేశాడు. ఆయన పాదాలకు నమస్కరించాడు వాడు. ఆయన నవ్వుతూ, “నాకెందుకురా మొక్కుతావు? గురుశ్రేష్ఠులైన శర్మగారికి, అమ్మగారికి మొక్కు. కౌతాళం స్వామి గారికి మొక్కు. నేను చేసిందేముంది?” అన్నాడు.
ఆయన సౌశీల్యానికి శర్మ దంపతులు ఆశ్చర్యపోయారు. శర్మగారిలా అన్నారు –
“నాయనా, వజ్రాన్ని, మట్టిలో నుంచి వెలికితీసి, శుభ్రపరిచి, మాకిచ్చావు నీవు. నేను, ఆంజనేయ శర్మగారు దాన్ని సానపట్టినామంతే. నీ తర్వాతే మేము!”
అదీ నిగర్వితనమంటే.
“ధీలక్ష్మీకృపాపాత్రులీ వసుధన్ గర్వము నొంద
నేరరు కదా ప్రఖ్యాతులై యొప్పినన్” అన్నారు విజ్ఞులు.
దస్తగిరిసారుకు, ఆయన భార్య కాశింబీకి బట్టలు పెట్టారు శర్మ దంపతులు. ఆయన వారికి పాదాభివందనం చేశాడు. “నాయనా, వీడికి లౌకికమైన చదువు చెప్పించు. హరికథలను వృత్తిగా చేసుకునే అవకాశం రాను రాను తగ్గిపోతూన్నది. దాన్ని ప్రవృత్తి చేసుకుని, అది అంతరించి పోకుండా సంరక్షించి, దాని ద్వారా సమాజ కల్యాణానికి పాటుబడే బాధ్యత వైనతేయ లాంటి బాల మేధావుల మీద ఉంది” అన్నారు శర్మగారు.
వారు బయలుదేరే సమయం వచ్చింది. వైనతేయ వెక్కివెక్కి ఏడుస్తూ, వకుళమ్మగారిని చుట్టుకుపోయాడు. ఆమె కూడ కళ్లనీళ్ల పర్యంతం అయింది. శర్మగారు ఎంత ధీరగంభీరులైనా, ఆయన వదనం కూడా వాడు తమను విడిచి వెళ్ళిపోతున్నందుకు విషాద భరితమయింది.
“ఎప్పుడయినా తిరుపతికి వచ్చి మమ్మల్ను చూసిపోతూ ఉండరా!” అని అన్నాడా విద్వన్మణి.
***
కోనేటయ్య, తిరుపాలమ్మ, కొడుకును గుండెలకు హత్తుకొన్నారు. రమణమ్మక్కకు పెళ్లి కుదిరిందనీ, పెళ్లి ఖర్చు అంతా పెదరెడ్డిగారే పెట్టుకుంటున్నారనీ శుభవార్త చెప్పారు. పెళ్లికొడుకుది గుంతకల్ దగ్గర ‘తుగ్గలి’ గ్రామం. అతని పేరు అంజనప్ప. ఆ పిల్లవాడు గుంతకల్-బళ్లారి ప్రయివేటు బస్సు డ్రైవరు. వారి కాపురం గుంతకల్ లోనే ఉండబోతుంది.
నెల లోపే రమణమ్మ పెండ్లి. అక్క పెండ్లిలో ఉత్సాహంగా పనులు చేశాడు వైనతేయ. శేషశయనారెడ్డిగారు పెళ్లికూతురికి పట్టుచీర, వెయ్యినూట పదహార్లు చదివించారు. దస్తగిరిసారు దంపతులు పెండ్లికి వచ్చారు. పెండ్లి కోటకొండలోని రాములవారి దేవళంలో జరిగింది. రమణమ్మ భర్తతో వెళ్లిపోయింది.
మళ్లీ స్కూళ్ళు తెరిచారు. దస్తగిరిసారుకు జలదుర్గం నుంచి బేతంచెర్ల హైస్కూలుకు బదిలీ అయింది, సెకండరీ గ్రేడ్ టీచర్ ఆయన. ఆరు ఏడు తరగుతులకు మాత్రమే చెపుతాడు.
దస్తగిరిసారు కోనేటయ్యతో, తిరుపాలమ్మతో చెప్పాడు – “నేను వైనాగాని నాతో బాటు బేతంచెర్లకు తీసుకోపోయి, అక్కడ నేను పని చేసే హైస్కూల్లోనే ఎనిమిదిలో చేరుస్తాను. ప్యాపిలి మీకు దగ్గర కాని, రోజూ వెళ్లి రావడం కష్టం. పదో తరగతి వరకు నా దగ్గర ఉంటాడు. జూనియర్ కాలేజీ గురించి, టెంత్ తర్వాత చూద్దాం.”
తిరుపాలమ్మ అన్నది – “సారు, మేం వాడిని కన్నాం అంతే! వాడి బాగోగులు మాకంటే మీకే బాగా తెలుసు. మీ దగ్గర ఉంటే అంత కంటే కావలసినదేముంది?”
పెదరెడ్డి, రమణమ్మ పెండ్లికి డబ్బు పెట్టినాడు గాని, ఊరికే ఇవ్వలేదు. కోనేటయ్య రెండెకరాల వెలిపొలం (మెట్ట) తనఖా పెట్టుకున్నాడు. అదే విషయం దస్తగిరిసారుకు చెప్పాడు కోనేటయ్య. ఆయన నవ్వి, ఇలా అన్నాడు –
“నీవు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేవని రెడ్డికి తెలుసు. మెల్లగా ఆ చేనిని తనకు రాసివ్వమంటాడు. నాకు చెప్పకుండా ఆ పని మాత్రం చేయకండి. ఇంతకూ పాప పెండ్లికి ఎంత ఇచ్చినాడు?”
“ఐదువేలు సారు!”
“నీవు వంట చేసినందుకు నెలకెంత యిస్తాడు?”
“ఐదు నూర్లు. రెండు జతల బట్టలు. రోజుకొక బీడీ కట్ట. మిగిలిన కూరలు తెచ్చుకుంటాము.”
“చేతంచెర్లకు పోయిన తర్వాత ఏదైనా మిలటరీ హోటలులో నీకు పని దొరుకుతుందేమో చూస్తాను. అది పెద్ద టవును. మేజర్ పంచాయితీ. మన ప్యాపిలి కన్న పెద్దది. అక్కడ జీతం ఎక్కువ దొరుకుతుంది. తిరుపాలమ్మ కూడా ఏదో పని చేసుకోవచ్చును. చేను గుత్తకిచ్చి మీరు కూడ వద్దురు గాని.”
“మీ దయ సారు”
“మీ చేను ప్యాపిలి – బనగానిపల్లె రోడ్డుకు దగ్గరగా ఉంది. ముందు ముందు దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. పొరపాటున కూడా పెదరెడ్డికి బాకీ క్రింద దాన్ని రాసివ్వకండి. ఒకవేళ ఆయన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తే నాకు చెప్పండి. ఏదో మార్గం చూద్దాము” అన్నాడు దస్తగిరి సారు.
(ఇంకా ఉంది)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.