సూర్య భగవానుడికి ఏమాత్రం
దయ దాక్షిణ్యాలు వుండవు.
తన పనేదో తాను చేయటం తప్ప.
భూమ్మీద జరిగే కార్యక్రమాలన్నీ
చూస్తూనే ఉంటాడు.
కానీ ఏ కార్యక్రమానికి సాక్ష్యానికి
నిల్వడు.
భూమికి, అన్నిజీవరాసులకు
తన శక్తిని (ఎండని) పంచుతుంటాడు .
కానీ ఏమాత్రం ఫలితం ఆశించడు.
ఎవ్వరు ఏ పని చేసినా నిరోధించడు.
చూస్తూ ఊరుకుంటాడు.
చూస్తూ ఊరుకోవటమే నీ లక్ష్యమా అంటే
అవుననే జవాబు.
సగరుని తన తీక్షణతో నిద్ర లేపి భూమ్మీదకు
పంపి వర్షాలను సృష్టిస్తాడు
వర్షాలేకాక మిగిలిన భూతాలతో కలసి
పంటలు బాగా పండటానికి తోడ్పడుతుంటాడు.
మబ్బులు తనకి అడ్డంగా వచ్చినప్పుడు
తొంగి తొంగి భూమ్మీద కార్యక్రమాలు
చూస్తూ ఉంటాడు.
భూమ్మీద జరిగే కార్యక్రమాలన్నిటికి
తానే సాక్ష్యం. ఏవి తన రికార్డులో వుంచుకోడు.
సాక్ష్యానికి నిలబడడు
అన్ని జీవరాసులును పెంచి పోషించుచుంటాడు.
తాను చేసేది పరోపకారమని ఏనాడూ
తలంచడు. తనపని తాను నిర్వర్తించడం తప్ప.
మొత్తం భూగ్రహం తన చుట్టూ తిరిగి రావటానికి
ఇరవై నాలుగు గంటలుగదా. క్షణం క్షణం చూస్తూనే
ఉంటాడు. ఏవి గుర్తు వుంచుకోడు. ఆ అవసరం
తనకు లేదంటాడు.

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.