[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


అన్నం పరబ్రహ్మం
దిదృక్షవో యస్య పదం సుమంగలం
విముక్తసంగా మునయః సుసాధవః।
చరంత్యలోకవ్రతమవ్రణం వనే
భూతాత్మభూతాః సుహృదః స మే గతిః॥6॥
న విద్యతే యస్య చ జన్మ కర్మ వా
న నామరూపే గుణదోష ఏవ వా।
తథాపి లోకాత్యయసంభవాయ యః
స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి॥7॥
తస్మై నమః పరేశాయ బ్రహ్మణేఽనంతశక్తయే।
అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే॥8॥
నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే।
నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి॥9॥
సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా।
నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే॥11॥
(గజేంద్ర మోక్షం నుంచీ గజేంద్రుడు అందించిన స్తుతి – కొనసాగింపు)
క్రిందటి ఎపిసోడ్లో ప్రజాపతి గురించి తెలుసుకుంటూ జీవావిర్భావాన్ని దైవం హేతువుగా కాకుండా ఆధునిక శాస్త్రవేత్తలు ఎలా చెప్పటానికి ప్రయత్నించారో చూశాము. దాని గురించి ఒకసారి తెలుసుకుని, ముందుకు వెళదాము. ఉపనిషత్ వాక్యాలతో పోల్చి.
“ప్రిమోర్డియల్ సూప్” – దీనినే మనం ఆదిమ సాగరం అనుకుందాము – అనే పదం భూమి యొక్క ప్రారంభ మహాసముద్రాలలో సేంద్రీయ సమ్మేళనాల సమృద్ధిగా ఉండే మిశ్రమాన్ని సూచిస్తుంది, ఇది జీవం మొదట ఉద్భవించిన వాతావరణంగా భావింపబడుతోంది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, తొల్త భూ భాగం మొత్తం వివిధ ద్వీపాలుగా కాక ఏక ఖండంగా ఉంది. దాని చుట్టూ నీరు ఆవరించుకుని ఉంది.
ఈ భావన ఈ “సూప్” లోని సాధారణ అణువులు రసాయన ప్రతిచర్యలకు లోనయ్యాయని, చివరికి అమైనో ఆమ్లాలు మరియు న్యూక్లియోటైడ్లు వంటి సంక్లిష్ట సేంద్రీయ అణువుల ఏర్పాటుకు దారితీసిందని సూచిస్తుంది. ఈ అణువులు తరువాత సంకర్షణ చెంది కలిసిపోయి, మొదటి జీవులకు మార్గం సుగమం చేశాయి.
To put it simply, the primordial soup theory envisions a kind of ancient chemical broth where the building blocks of life could form, leading to the origin of life as we know it.
జీవావిర్భావానికి తగిన పరిస్థితులు ఏర్పడటంతో పాటూ జీవం ఆవిర్భవించటానికి కావలసిన ప్రాథమిక పదార్థాలు ఏర్పడటం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం.
మన ఉపనిషత్ల ప్రకారం,
- ఆకాశం నుంచీ వాయువు.
- వాయువు నుండి అగ్ని.
- అగ్ని నుండి జలం.
- జలం నుండి పృథ్వి.
సరిగ్గా చూడండి. ఈ వరుస.
దానికి ముందు..
ప్రారంభంలో సూర్యుని చుట్టూ ఉన్న పదార్థం నుండి భూమి ఏర్పడటం అనేది అనేక కీలక దశలను కలిగి ఉన్న ఒక మనోహరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ నీహారిక (Nebular) పరికల్పన అనే విస్తృత సిద్ధాంతంలో భాగం. ఇక్కడ ఒక క్లుప్తంగా దాని గురించి:
- సౌర నిహారిక నిర్మాణం (Solar Nebula formation): సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం, సౌర వ్యవస్థ వాయువు, ధూళితో తయారైన ఒక పెద్ద పరమాణు మేఘంగా ప్రారంభమైంది. సౌర నిహారిక అని పిలువబడే ఈ మేఘం దాని స్వంత గురుత్వాకర్షణ శక్తి కింద కూలిపోవడం ప్రారంభమైంది.
- సూర్యారంభం/సూర్యావిర్భావం (Formation of Sun): మేఘం కూలిపోయినప్పుడు, చాలా పదార్థం మధ్యలో కేంద్రీకృతమై, చివరికి సూర్యుడిగా (సూర్యుడు అనే ఒక నక్షత్రం. సూర్యభగవానుడు కాదు) మారిన ప్రోటోస్టార్ను ఏర్పరుస్తుంది. మిగిలిన పదార్థం ఈ యువ సూర్యుని చుట్టూ తిరిగే డిస్క్‌ను ఏర్పరుస్తుంది.
- అక్రెషన్ డిస్క్ మరియు ప్లానెటిసిమల్స్: వాయువు మరియు ధూళితో కూడిన ఈ డిస్క్ లోపల, చిన్న కణాలు ఎలెక్ట్రోస్టాటిక్ (స్థిర విద్యుత్) శక్తుల ద్వారా మిళితం కావటం ప్రారంభించాయి. కాల క్రమేణా అవి కాస్త పెద్ద ఆకృతులను (clumps లేదా ముద్దగట్టిన ఆకారాలు) సంతరించుకున్నాయి. వీటినే ప్లానెటిసిమల్స్ అని పిలుస్తారు. ఈ ప్లానెటిసిమల్స్ మీటర్ల నుండి కిలోమీటర్ల వరకు పరిమాణంలో ఉండేవి.
- పూర్వ గ్రహ రూపాలు (Protoplanets): ప్లానెటిసిమల్స్ ఒక దానితో ఒకటి ఢీకొంటూ, కొన్ని విలీనం అవుతూ, కొన్ని నూతనాకృతులను సంతరించుకుంటూ కాలక్రమేణా ప్రోటోప్లానెట్స్ అని పిలువబడే పూర్వ-గ్రహ రూపాలను ఏర్పరచాయి (ఈ గ్రహాలను మనం చెప్పుకునే నవ గ్రహాలకు సంబంధించినవిగా చెప్పరాదు). ఈ ఘర్షణలు తరచుగా విధ్వంసభరితంగా ఉండేవి. ఈ పద్ధతిలో విస్తృత ద్రవ్యరాశి ఏర్పరచుకున్నవి గ్రహాలుగా మారటం ప్రారంభించాయి.
- భూమి పుట్టుక: ఈ ప్రోటోప్లానెట్లలో ఒకటి చివరికి మనం ఇప్పుడు భూమిగా తెలిసిన దానిగా మారింది. అక్రెషన్ అనే ప్రక్రియ ద్వారా, భూమి క్రమంగా దాని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి, చిన్న చిన్న శకలాలను, ఆ పైన మరింత ద్రవ్యరాశి సంపాదించుకున్నాక ప్లానెటిసిమల్స్ను ఆకర్షించడం ద్వారా ఎక్కువ ద్రవ్యరాశిని పొంది క్రమంగా ఇప్పటి ఆకారానికి వచ్చింది. భూమి మీద వివిధ రకాలైన మట్టి, మనం చెప్పుకునే టెక్టానిక్ ప్లేట్లు దీని వలనే కావచ్చు. ఆధారం చూడకుండా చెప్పలేము.
- రూపుదిద్దుకుంటం: భూమి ద్రవ్యరాశి పెరిగేకొద్దీ, ఘర్షణలు, గురుత్వాకర్షణ సంపీడనం మరియు రేడియోధార్మిక మూలకాల క్షయం నుండి వచ్చే శక్తి కారణంగా అది వేడెక్కడం ప్రారంభించింది. ఈ వేడి, ఈ గ్రహం పాక్షికంగా కరిగిపోయేలా చేసింది, ఇనుము మరియు నికెల్ వంటి బరువైన మూలకాలు కేంద్రం వైపు మునిగిపోయి, కోర్‌ను ఏర్పరుస్తాయి, తేలికైన మూలకాలు మాంటిల్ మరియు క్రస్ట్‌ను ఏర్పరచాయి.
- చంద్రుని ఆవిర్భావం (చంద్రమండలాధినేత కాదు): అంగారక గ్రహం సైజు ఉన్న ఒక అంతరిక్ష ఆకృతి (ఖగోళ వస్తువు లేదా Celestial Object) భూమిని ఢీకొనడం జరింది. దానిని ఆధునిక శాస్త్రవేత్తలు థేయా (Theia) అని పిలుస్తున్నారు. అప్పుడు జరిగిన విస్ఫోటనంలో నుంచీ వెలువడిన అంతరిక్ష ధూళి భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వలన భూమి చుట్టూ తిరుగుతూ క్రమేణా ఒక కక్ష్యలో చేరి ఇప్పటి చంద్ర అనే ఉపగ్రహంగా మారింది.
- భూ-శీతలీకరణం: కాలక్రమేణా, భూమి ఉపరితలం చల్లబడి, ఘన పదార్థంగా మారటం పారారంభించింది. తొలుత క్రస్ట్ ఏర్పడింది. వేడి వలన ఆవిర్భవించిన అగ్నిరూప కార్యకలాపాలు భూమి ప్రారంభ వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డాయి. అదనంగా, నీటి ఆవిరి ఘనీభవించి పూర్వ మహాసముద్రాన్ని ఏర్పరిచింది, ఇది జీవ అభివృద్ధికి వేదికను ఏర్పాటు చేసింది.
ఇక్కడ భూమి అంటే భూ గ్రహం.
ఆ పైన ఉపనిషత్ వాక్యాలను పరిశీలిస్తే ఆకాశం నుండి వాయువుల సముదాయాలు, తరువాత అక్రెషన్ ద్వారా గ్రహాలు ఏర్పడ్డాయి సౌర కుటుంబంలో. తరువాత ఆ వాయువుల చర్యల వల్ల వేడి పుట్టి క్రమంగా అగ్నిరూప కార్యకలాపాలు వచ్చాయి. అవి భూ గ్రహాన్ని చల్లబరచటం ద్వారా నీరు, ఆ నీటిలో భాగంగా మనం చెప్పుకునే భూభాగం (land or landmass) ఏర్పడ్డాయి.
పంచభూతాల సృష్టి క్రమమిది. పృథ్వి నుండి ఔషధులు, ఓషధుల (RNAs) నుండి అన్నం (proteins and carbohydrates), అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి. ఒపారిన్ చెప్పింది లేదా చెప్పబోయినది అదే.
ఒపారిన్ ప్రతిపాదన, మిల్లర్-యురే ప్రయోగం.
ఈ ప్రయోగం ప్రారంభ భూమిని పోలి ఉండే పరిస్థితులలో సాధారణ అణువుల నుండి అమైనో ఆమ్లాలను సంశ్లేషణ చేయవచ్చని నిరూపించింది. జీవం ఆవిర్భావానికి సంబంధించి పూర్తిస్థాయి నిరూపణ జరుగలేదు.
కానీ,
అన్నమే ప్రాణం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి. అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు. అన్నాన్ని పారవేయకూడదు, ప్రశంసించాలి. అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది.
అన్నం వల్లనే ప్రాణ రక్షణ, శరీర రక్షణ. ప్రాణ, శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు. అన్నమును నిషేధింపరాదు. అన్నం ఉండీ కూడా లేదని చెప్పడాన్ని నిషేధం అంటారు.
అన్నము అంటే మనం తినే వరి అన్నము అని కాదు. జీవావిర్భావానికి, పోషణకు, రక్షణకు ఉపయోగ పడేది అని. Carbohydrates, amino acids.. వాటిగా భావించాలి.
పైన చెప్పుకున్న ప్రైమార్డియల్ సూప్ లేదా ఆదిమ సాగరం, దాని నుంచీ క్రమంగా జీవావిర్భావం జరుగటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఉపనిషత్ వాక్యాలకు కొత్త అర్థాలు గోచరిస్తాయి.
ఆదిమ సాగర సిద్ధాంతం భూమి యొక్క ప్రారంభ వాతావరణం యొక్క కూర్పుతో ప్రారంభమవుతుంది. ఈ వాతావరణం మీథేన్ (CH₄), అమ్మోనియా (NH₃), హైడ్రోజన్ (H₂), మరియు నీటి ఆవిరి (H₂O) వంటి వాయువులతో సమృద్ధిగా ఉండేది, కానీ ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ తరువాత వచ్చింది. జీవుల పుట్టుకకు కొంత మునుపు మాత్రమే.
సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహితాల (UV) వికిరణం, అగ్ని కార్యకలాపాలు వంటి వివిధ శక్తి వనరులు ఈ వాయువుల మధ్య రసాయన ప్రతిచర్యలను నడపడానికి అవసరమైన చోదనను అందించాయి.
ఈ వనరుల నుండి వచ్చే శక్తి సాధారణ సేంద్రీయ అణువుల ఏర్పాటుకు దారితీసిన రసాయన ప్రతిచర్యలను ప్రేరేపించింది. ఈ అణువులలో ప్రోటీన్ల నిర్మాణ కారకాలు అమైనో ఆమ్లాలు మరియు DNA మరియు RNA వంటి న్యూక్లియిక్ ఆమ్లాల నిర్మాణ కారకాలు న్యూక్లియోటైడ్లు ఉన్నాయి.
ఈ సాధారణ సేంద్రీయ అణువులు సంకర్షణ చెందుతూనే ఉండటంతో, అవి పెప్టైడ్లు (అమైనో ఆమ్లాల చిన్న గొలుసులు) మరియు న్యూక్లియిక్ ఆమ్లాలు వంటి మరింత సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరి. ఈ సంక్లిష్ట అణువులు జీవావిర్భావానికి పునాదులు వేస్తాయి.
దీనినే భాగవతంలో చెప్పిన విధంగా బ్రహ్మ గారు, ప్రజాపతులని క్రతువులు జరుపమని ఆదేశించటంగా చూడవచ్చు.
చివరికి, ఈ సంక్లిష్ట అణువులు సాధారణ కణ త్వచాలను పోలి ఉండే నిర్మాణాలు సంతరించుకుని, ప్రోటోసెల్లను ఏర్పరుస్తాయి. ప్రోటోసెల్లు తదుపరి రసాయన ప్రతిచర్యలకు స్థిరమైన వాతావరణాన్ని అందించి, మొదటి ఆదిమ జీవుల అభివృద్ధికి దారితీసి ఉండవచ్చు.
సహజ ఎంపిక మరియు పరిణామ ప్రక్రియ ద్వారా, ఈ ప్రోటోసెల్లు మరింత అధునాతనమైన జీవ రూపాలుగా పరిణామం చెంది, నేడు మనం చూస్తున్న జీవన వైవిధ్యానికి దారితీశాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
బేక్టీరియా వైరస్లు మాత్రమే కాదు అమీబా తదితర ఏక కణ జీవులు వ్యాధి కారకాలే. కశ్యప సంతానమే. అనసూయ, సింహికల ద్వారా.
ఇంత కథ ఉన్నది.
ఇప్పుడు ప్రజాపతి అనే నామాన్ని త్రిమతాచార్యులు ఎలా నిర్వచించారో చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య