[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]


301
కలుషిత భారం మోయలేక భూమి
విలపించుచున్నది
కలవర పడుచున్నది ఏమి తోచక
విలయాలు సృస్టించితేనే నివారణని తేలింది
302
ప్రతి జీవి భగవంతుడే
మతితో ఆలోచిస్తే అర్థమౌతుంది
అంతులేని నిష్ఠతో ప్రతిమలను పూజిస్తారు
అంతే ప్రేమతో జీవిని ఆదరించరు
303
వాయు కాలుష్యంతో విల విల పట్టణాలు
ఆయుష్షును హరించి వేస్తుంది
భయంతో బ్రతుకు యీడుస్తున్న జనం
ట్రయల్ రన్లో ఎలట్రిక్ వాహనాలు
304
ప్రేమనే రెండు అక్షరాలతో
తమ తమ స్థితిని కూడా మర్చిపోవుచున్నారు
ప్రేమించుకుంటారు వడి వడిగా
కామాంధకారంలో కన్ను మిన్ను గానక
305
వర్షించాలంటే మానవ ప్రయత్నం కావలి
తరువులను బాగా పెంచాలి
కరువు పారిపోదా జల ధారలతో
నోరెళ్లబెట్టిన భూమి పులకించదా
306
వసంతం తమదే యైనట్లు
కాస్తంత వేచి చూస్తాయి తరువులు
వసంతంతో ఆకు రాల్చి చిగుళ్లు వేస్తాయి
వసంతములో పూలు పూచి ఆహ్లాదాన్నిస్తాయి
307
జీవులు బెంబేలు గ్రీష్మ తాపానికి
చెవులకు తలకు చల్లని బట్టలతో
పావు గంటకోసారి
చవులూరించే చల్లని పానీయాలతో సేదతీరె
308
వర్ష ఋతువు కొరకు ఎదురుచూపు
వరుణుని చల్లని దయతో
కారు మబ్బులు వర్షించె అంతటా
వరదలతో భూమి చల్లబడి ఆహ్లాదాన్నిచ్చె
309
శరదృతువులో చల్లని వెన్నెల
వర్ష ఋతువు అయిపోగానే వస్తుంది
తరువులు మెరిసి పోతుంటాయి
నరులందరూ వెన్నెలను ఆస్వాదింతురు
310
హేమంతం చల్లగా ఉంటుంది
ఏమంత సుఖప్రదమైనది కాదు
తమ ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు పాటించుతారు
నమ్మశక్యం కానీ వాతావరణము

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.