ఒక టీకా వేసుకున్నాక దాని ప్రభావం ఎంత కాలం నిలుస్తుంది అన్నది ఎలా తెలుసుకుంటారు? అన్న విషయాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వీ బీ సౌమ్య రాసిన వ్యాసం ఇది.
***
1781 లో ఒకసారి ఎక్కడో అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తరం వైపు ఐస్లాండ్, నార్వే ల మధ్య ఉన్న ఫారో దీవులలో మీజిల్స్/చిన్నమ్మవారు బాగా తీవ్రంగా వ్యాపించింది. దూరాన విసిరేసినట్లుండే ఈ దీవులలో తరువాత ఒక అరవై ఐదేళ్ళ పాటు మళ్ళీ ఎవరికీ ఈ వ్యాధి రాలేదు. 1846 లో బయట నుండి వచ్చిన పర్యాటకులెవరి వల్లో మరొకసారి ఆ ప్రాంతంలో చిన్నమ్మవారు ప్రబలింది. అయితే, 65 ఏళ్ళ క్రితం జీవించి ఉండి, అప్పుడు కూడా అక్కడే ఉన్న ఎవరికీ ఆ వ్యాధి సోకలేదట. అంటే వ్యాధి వచ్చి అరవై ఏళ్ళు దాటిపోయినా దాని వల్ల వచ్చిన రోగనిరోధకశక్తి అలా ఉండిపోయిందనమాట. ఏ వ్యాధికైనా టీకా రూపొందించే శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం, అంతిమ లక్ష్యం ఆ వ్యాధి రానివారికి కూడా ఇలాగే జీవితకాలం ఆ వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే అనుకుంటాను.
మనకి చిన్నతనంలో ఇచ్చే టీకాల మొదలుకుని, కొన్ని దేశాలలో ఏటేటా ఇచ్చే ఫ్లూ టీకాలు, ఇవ్వాళ్టి కోవిడ్ టీకాల దాకా అన్నింటి ప్రభావానికి ఏవో పరిమితులు ఉన్నాయి. కొన్ని టీకాల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. కొన్నింటి ప్రభావం కొన్ని సంవత్సరాలు..దశాబ్దాల దాకా ఉంటుంది. అయితే, బాగా పనిచేసే టీకాలు ఒక వ్యాధి వ్యాప్తిని అడ్డుకుని, క్రమంగా ఆపేస్తాయి కనుక నిజంగా మనకి ఆ టీకాలతో వచ్చిన నిరోధకశక్తి నిలిచిందా లేదా? అన్నది కొన్ని సందర్భాల్లో పట్టించుకోరు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. కోవిడ్ టీకాలు, అది స్వైర విహారం చేస్తున్న సమయంలోనే అందరూ వేసుకుంటున్నారు. కోవిడ్ తో మన ప్రయాణం నడుస్తున్న చరిత్రే కనుక ఇప్పుడీ విషయం ఎక్కువగా చర్చలోకి వస్తోంది.
ఒక టీకా పనిచేస్తుందో లేదో అది ఇచ్చేముందు పరిశోధనలు చేస్తారు. ఇచ్చాక చేస్తారు. చేస్తూనే ఉంటారు. బానే ఉంది. కానీ ఎంత పరిశోధన చేసినా ఆ టీకా పటుత్వం ఎన్నాళ్ళు నిలుస్తుంది? ఎప్పుడు తగ్గడం మొదలవుతుంది? ఇలాంటివి అన్నీ ఎలా తెలుసుకుంటారు? ఈమధ్య వచ్చిన ఒక వార్తలో కోవిషీల్డ్/ఆస్ట్రాజెనెకా టీకా జీవితకాలం రోగనిరోధకశక్తిని ఇస్తుందని తేలిందని రాశారు. అసలు ఇది ఎలా ఆంచనా వేస్తారు?
వీటిలోకి వెళ్ళేముందు మొదట అసలు మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో క్లుప్తంగా చూద్దాము: మన శారీరక వ్యవస్థలో తెల్లరక్తకణాలు ఏదన్నా వ్యాధి సోకినపుడు దానితో పోరాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో మళ్ళీ రకాలున్నాయి.
- మహాభక్షకాలు (macrophages) వ్యాధికారక క్రిములని, వ్యాధి సోకిన కణాలనీ మింగేస్తాయి. ఇవి మింగేయగా మిగిలిన వ్యాధికారక పదార్థాలని (antigens) శరీరం హానికారకాలుగా గుర్తించి వీటిమీదకి ప్రతిరక్షకాలని (antibodies) ని వదుల్తుంది.
- బి-సెల్/బి-లాసికాణువులు (B-Lymphocytes) పైన చెప్పిన ప్రతిరక్షకాలని తయారు చేస్తాయి. ఇవి దీర్ఘకాలంపాటు వ్యాధికారక పదార్థాలకి వ్యతిరేకంగా పనిచేయగలవు.
- టీ-సెల్/టీ-లాసికాణువులు (T-Lymphocytes) వ్యాధికి గురైన కణాలతో యుద్ధానికి దిగి వాటిని అదుపు చేస్తాయి. ఇవి వ్యాధి క్రిములని దీర్ఘకాలం గుర్తుంచుకుంటాయి. మళ్ళీ ఆ వ్యాధి సోకితే తక్షణం పనిలోకి దిగి మనల్ని కాపాడతాయి.
ఒక వ్యాధి వచ్చి తగ్గినపుడు అది మళ్ళీ వస్తే పోరాడ్డానికి శరీరం ఈ టీ-సెల్స్ కొన్నింటిని “స్మృతి కణాలు”గా అట్టిపెట్టుకుంటుంది. టీకాలు తయారు చేయడం లో ఉద్దేశం ఈ బీ/టీ కణాలని వ్యాధి రాకుండానే శరీరంలోకి పంపి మనకి వ్యాధినిరోధకస్మృతి (immunologic memory) ని ఇవ్వడం. “మనకి టీకాలు లభ్యమవుతున్న చాలా వ్యాధుల నుండి రక్షణకి వాటి వల్ల శరీరంలో పుట్టిన ప్రతిరక్షకాలు సరిపోతాయి. కొన్ని మరీ ఇబ్బంది పెట్టేవాటికి (క్షయ, మలేరియా, హెచ్ ఐ వీ వంటివి) ఇవొక్కటే చాలవు. టీ-సెల్స్ కూడా ముఖ్యం.” అంటాడు Mark Slifka అన్న శాస్త్రవేత్త. ఇదీ మన వ్యాధినిరోధక వ్యవస్థ ఒకసారి వ్యాధి వచ్చిపోవడం వల్లనో, లేదా టీకా వేసుకోవడం వల్లనో భవిష్యత్తులో వ్యాధి రాకుండా ఎలా నిరోధిస్తుంది? అన్న ప్రశ్నకి క్లుపంగా సమాధానం.
సరే కానీ వ్యాధినిరోధకశక్తికి కాలపరిమితి ఏమిటి? శాశ్వత వ్యాధినిరోధకస్మృతి ఎందుకు రాదు?
దీనికి కొని కారణాలు కనిపిస్తాయి:
- టీకాల తయారీలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని గురించి గతంలో రాసిన “కోవిడ్-19 టీకాల కథా, కమామిషు” అన్న వ్యాసంలో కొంచెం పరిచయం చేశాను. కొన్ని పద్ధతులు ఎక్కువ కాలం ప్రభావవంతంగా ఉంటాయి. కొన్నింటికి మళ్ళీ మళ్ళీ టీకా డోసు పడాలి. అయితే ఎప్పుడు పడితే అప్పుడు పడితే ప్రమాదం. కొన్ని ఎక్కువ కాలం ప్రభావం చూపవని ముందే తెలుస్తుంది. అయితే, వీటిలో ఏ పద్ధతి అత్యంత దీర్ఘకాలం, ఈ వ్యాధినిరోధక స్మృతిని ఇస్తుంది? ఎన్ని వ్యాధులకి బాగా పనిచేస్తుంది? అన్న విషయం మాత్రం ఇంకా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇవన్నీ నిరంతరం జరిగే పరిశోధనలు.
- టీకా రుచి తెలిసిన విష క్రిములు తమని తాము మార్చుకుంటూ (mutations) దాని ప్రభావం నుండి నెమ్మదిగా బయట పడి టీకా సాఫల్యత తగ్గించవచ్చు.
- ఒక వ్యాధికి టీకా తయారీ సమయంలో పరిగణనలోకి తీసుకోని ఏదో జన్యు జాతి ఒకటి కొత్తగా రావడం.
- మనిషికీ మనిషికీ మధ్య ఆరోగ్య పరమైన తేడాలు.
ఇలా చెప్పుకుపోవచ్చు. అయితే దీనర్థం కొన్నాళ్ళు పోతే టీకా అసలు పనిచేయదని కాదు. ముందున్నంత బలంగా మనల్ని కాపాడదు అని.
ఏదన్నా టీకా ఉన్న వ్యాధికి ఇలా తయారీ పద్ధతి, టీకాలు వచ్చాక కూడా ఆ వ్యాధి ఎక్కడైనా ఆకస్మికంగా వ్యాపించిన ఉదంతాలు, అలాగే మానవ శరీరాలలో ఆ వ్యాధి ప్రతిరక్షకాల స్థాయి హెచ్చుతగ్గులు, ఇలాంటి సమాచారాన్ని సేకరించి రూపొందించిన గణిత ప్రతికృతుల (mathematical models) సహాయంతో ఒక టీకా ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుందనేది ఒక ఆంచనాగా కొలుస్తారు.
అయితే, పైన చెప్పిన కారణాల వల్ల అన్ని జబ్బుల టీకాలకీ ఒకే కాలపరిమితి ఉంటుందని చెప్పడంకష్టం. ఉదాహరణకి అమెరికా వంటి చోట్ల ఏటా ఇచ్చే ఫ్లూ టీకా సాఫల్యత మూడు నెలల తరువాత తగ్గుముఖం పడుతుందట. కానీ, గవద బిళ్ళల టీకా (mumps) పదేళ్ళ దాకా బాగా పనిచేస్తుందట. అదే ధనుర్వాతం వంటి వ్యాధుల టీకా యాభై ఏళ్ళు దాటినా పటుత్వం తగ్గదట. డెబ్భై ఏళ్ళ దాకా కూడా బాగా ప్రభావవంతంగా ఉంటుందట! మళ్ళీ ఇందులో ఈ బీ/టీ సెల్స్ మధ్య తేడాలుండొచ్చు. ఉదాహరణకి మశూచి టీకాలు పొందిన వారిలో బీ-సెల్స్ ద్వారా వచ్చిన ప్రతిరక్షకాల సంఖ్య మొదటి మూడేళ్ళలో తగ్గుతూ పోయి తర్వాత స్థిరంగా ఒక స్థాయిలో దశాబ్దాల తరబడి ఉంటుందట. కానీ టీ-సెల్ ద్వారా వచ్చిన వ్యాధినిరోధకస్మృతి యాభై ఏళ్ళైనా అలాగే ఉంటుందట. ఇపుడు కోవిడ్ టీకాల విషయంలో కూడా ఈ టీ-సెల్స్ కీలకం అంటున్నారు.
కానీ ఇలా అయితే ఎలా?
ఒక టీకా ప్రభావం ఆర్నెల్లలో తగ్గిపోతోంది అనుకుందాం. అయినా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కనుక టీకా వేసుకోవడమే నయం – సరే. కానీ అలా తగ్గీ తగ్గీ ఎప్పుడో పూర్తిగా పొయ్యిందనుకోండి, ఏమిటి చేయడం? ఉదాహరణకి పోలియో టీకా పద్దెనిమిదేళ్ళ దాకా ప్రభావం చూపుతుందట. మనం పోలియో లేని చోట్లే ఉంటే సరే. ఏదో పోలియో కేసులున్న దేశానికి వెళ్ళాల్సి వస్తే ఎలా? ఇలాంటి సందేహాలకి సమాధానం బూస్టర్ షాట్. ఏటేటా ఇచ్చే ఫ్లూ టీకాలు ఇలాంటివే. కొన్ని దేశాల్లో పోలియో వంటి కొన్ని వ్యాధులకి బయటి దేశాలకి వెళ్ళే పౌరులకి ఇలాంటివి చూసుకుని బూస్టర్ టీకాలు వేస్తారు.
మరైతే ఇకనేం?
అందరికీ బూస్టర్ అవసరం అనుకుని ఏ ఐదేళ్ళకో పదేళ్ళకో అన్ని టీకాలూ ఓ రౌండు వేయొచ్చు కదా అందరికి? అసలు ఏడాది లోపు పిల్లల శరీరం కూడా వంద టీకా డోసులైనా తట్టుకోగలదని ప్రముఖ టీకా శాస్త్రవేత్త Paul Offit ఒక పుస్తకంలో అన్నారెప్పుడో. అలాంటప్పుడు ఏంటి సమస్య? ఒక టీకా వేయడం వేయకపోడం అన్న నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ దీనికి ఏమన్నా మార్పులు చేయాలా? అసలు భారీ స్థాయిలో ఎలా నిర్వహించాలి? ఎంత డబ్బు అవుతుంది? ఇవన్నీ ఆలోచించాలి. ధనుర్వాతం వంటి వ్యాధులకి చిన్నప్పుడు వేసిన టీకాలు కాక మళ్ళీ పెద్దయ్యాక వేస్తే దాదాపు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంట అమెరికాకి. మరి అందువల్ల అందరికీ అన్ని టీకాలు వెయ్యాలి మళ్ళీ మళ్ళీ .. అని ఊరికే అనేస్కుంటే కుదరదు మరి! అవసరమా లేదా? చూసుకోవాలి. చూసుకోవాలంటే టీకా ప్రభావం ఎంతకాలం నిలుస్తుందో తెలియాలి.
ఇపుడు కోవిడ్ టీకా విషయానికే వస్తే: అదే టీకా మార్పులు లేకుండా మళ్ళీ ఇస్తే ఏం లాభం? కొత్త వేరియంట్లకి సరిగా పనిచేయదు అంటున్నారు కదా ఇప్పటికే. మరి ఇంకా పుట్టుకురాబోయే కొత్త వేరియంట్లకి చేస్తుందా? పైగా ఒక పక్క కొన్ని దేశాల్లో మొదటి డోసుకే దిక్కులేదంటే కొన్ని చోట మూడో కోవిడ్ వ్యాక్సిన్ డోసు గురించి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో అందరికీ మొదటి డోసు పడాలా? కొందరికి బూస్టర్ పడాలా? – ఇది కూడా ఒక ఆలోచించవలసిన ప్రశ్నే. అందువల్ల “బూస్టర్ వేసుకుంటే పోయే!” అని తేలిగ్గా కొట్టిపారేయలేము ఈ విషయాన్ని!
మొత్తానికైతే, 1957 నుండి టీకాల పరిశోధనల్లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త Stanley Plotkin మాటల్లో చెప్పాలంటే, “ఒక టీకా మనకి జీవితకాలం పాటు వ్యాధి నిరోధకశక్తిని ఇవ్వడానికి ఏం చేయాలో మనకి ఇంకా తెలియదు. వ్యాధినిరోధనశాస్త్రం (immunology) గురించి లోతుగా తెలియకుండానే మనం టీకాలని తయారు చేస్తున్నాము. మన శరీరంలో టీకా ప్రభావం నిలిచిపోవడం అన్నది వ్యాధినిరోధక స్మృతి మీద ఆధారపడి ఉంటుంది కానీ, దాన్ని కరెక్టుగా ఎలా కొలవాలి? అన్నది మనకి ఇంకా తెలియదు”. ఈయనే కాదు, దీర్ఘకాలం ఈ పరిశోధనల్లో ఉన్న చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇదే. ఈ “పూర్తిగా తెలియకపోవడం” మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో శాస్త్రజ్ఞులనంతా అంతకంటే ఎక్కువ చిరాకు పెడుతూ ఉంటుంది. “సాంక్రమిక రోగవిజ్ఞాన శాస్త్రవేత్తలు (epidemiologists), వ్యాధినిరోధకశాస్త్రవేత్తలు (immunologists) కలిసి పనిచేస్తే గానీ మనకీ చిక్కుముడులు వీడవు” అంటాడు Mark Slifka.
సరే, ఇదంతా అన్ని టీకాలకీ కామన్ కథ. కోవిడ్ టీకాల సంగతేమిటి? ఆ ఆస్ట్రాజెనెకా వాళ్ళు ఈ ఏళ్ళ తరబడి వివరాలు లేకుండా అసలు ఈ వ్యాధినిరోధకస్మృతికి మాడలింగ్ ఎలా చేశారు? జీవితకాల స్మృతి ఉంటుంది అన్నది ఎలా తేల్చారు? మరో పక్క ఆ మధ్య ఇజ్రాయెల్ లో ఒక ఉద్యమంలా వాక్సిన్ పోట్లు పొడిచాక ఇపుడు మళ్ళీ వేలల్లో కేసులు పుట్టుకొస్తున్నాయి రోజూ. అంటే ఏమిటన్నట్లు? ఈ టీకాల ప్రభావం కొన్ని నెలలేనా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెబుతుంది.
References:
- Cohen, J. (2019). How long do vaccines last? The surprising answers may help protect people longer. Science, News.
- Cohen, Jon. (2001) “Smallpox vaccinations: How much protection remains?.” Science. Vol. 294, Issue 5544. Page 985.
- Understanding how COVID-19 vaccines work (Centers for Disease Control and Prevention, CDC వారి వ్యాసం)
- Efficacy and Effectiveness (వివిధ టీకాల ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుందన్నది వివరిస్తూ న్యూజిలాండ్ లోని Immunization Advisory Center వారు రాసిన వ్యాసం)