[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పాణ్యం దత్తశర్మ గారు రచించిన ‘తెలుగదేల యన్న..?’ అనే వ్యంగ్య కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆ రోజు టెల్గూ న్యూ యియర్! అంటే యుగాడీ! అర్థం కాలేదా? అదేనండి బాబు. ఉగాది! కూష్మాండ రావు ఎనిమిది గంటలకు నిద్రలేచాడు. ఆవులించి, స్మార్టుఫోన్ తెరిచాడు. వాట్సాప్‌లో అన్నీ సంవత్సరాది శుభాకాంక్షలే! ఇంగ్లీషులో ఉన్నాయి. చూసి, తాను కూడా కొందరికి పెట్టాడు. ఆయన భార్య కూర్మలక్ష్మి లేచి, తన ఫోన్ చూసుకుంటుంది. పది గంటలకు ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు, బిజినెస్ స్కూల్లో పి.జి.టి.ఎం. చదువుతున్న కూతురు లేచారు. అందరూ పెద్ద పెద్ద మగ్గుల్తో కాఫీ తాగుతున్నారు, హాల్లో కూర్చుని.
“ఏరా వృషభ్, మామిడుకులు, వేపపూత ఆన్లైన్లో ఆర్డర్ చేశావా?” అనడిగాడు కూష్మాండరావు.
“మామిడాకులు కాసేపట్లో వస్తాయి డాడ్, మామ్ ఏకంగా ఉగాది పచ్చడే ఆర్డర్ చేయమంది.”
ఈలోపు చట్నీస్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది స్విగ్గీలో. మైసూరు బోండా, పూరీ. రెండూ చల్లారిపోయి ఎలాస్టిక్ సాగినట్లు సాగుతున్నాయి. అయినా మహదానందంగా తినేశారా టెల్గూ ఫ్యామిలీ.
మామిడాకులు గుమ్మానికి నీవు కట్టమంటే నీవు కట్టమని బ్రో, సిస్ పోట్లాడుకున్నారు. ఇద్దరూ మానేస్తే కూష్మాండరావే కట్టాడు. మిట్టమధ్యాహ్నం స్నానాలు చేశారు. కూతురు బీభత్స – జుట్టు విరబోసుకొని, పట్టు పావడా, ఓణీ, పట్టు జాకెట్టు ధరించింది. లిప్‌స్టిక్ దట్టంగా పట్టించింది. వృషబ్ రామ్రాజ్ కాటన్ వారి రెడీమేడ్ ధోవతి, జుబ్బా, పైన కండువా ధరించాడు. కూష్మాండరావు, కూర్మలక్ష్మి పట్టుపంచె, పట్టుచీర కట్టుకున్నారు. ఇదేమిటి, వీళ్లింత సంప్రదాయవాదులా? అని ఆశ్చర్యపోతున్నారా? ఆగండి!
చక చకా ఆ డ్రస్ లలో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఎఫ్.బి.లో పోస్ట్ చేశారు. వాట్సప్ స్టేటస్‌లో పెట్టారు. అంతే! ఆ యుగాడీ డ్రెస్‌లు విప్పేసి, షార్ట్స్, టీ షర్ట్స్, మిడ్డీస్. నైటీస్లోకి మారిపోయారు! రెండున్నరకు లంచ్ ఆర్డర్ చేశారు, ‘భీమవరం బుచ్చయ్య’ హోటలు నుంచి. దాన్ని ‘గంప కూడు’ అంటారు. చాలా ఫేమస్. ‘చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడా’న్ని ఈ మధ్య డిగ్నిఫైడ్‌గా మార్చి ‘ఫాంచైజీ’ అంటున్నారు. ఈ భీమవరమాయిన పేర జంట నగరాల్లో చాలా బ్రాంచీలు పెట్టారు.
గంపనిండా, 27 రకాల డిషెస్ వచ్చాయి. పులిహర, బూరెలు, అరటికాయ ముద్దకూర, కొత్తిమీర పచ్చడి, మజ్జిగపులుసు, ఉలవచారు.. ఎన్నెనో! డైనింగ్ టేబుల్ మీద అన్నీ విప్పి, వాళ్లు పంపిన అరిటాకుల నిండా వడ్డించుకున్నారు. వాటిని ఫోటోలు తీసి ‘యుగాడీ లంచ్ విత్ భీమవరం బుచ్చయ్యాస్’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. తినడం కంటే అది ముఖ్యం కదా! ఉగాది పచ్చడి సేమ్ సూప్‌లా ఉంది.
వాళ్లు తింటుండగా బుచ్చయ్య స్టాఫ్ ఒకరు ఫోన్!
“నిదానంగా భోంచేయండి సార్. కొత్తిమీర పచ్చడి కలుపుకోండి. ఉలవచారు పోసుకోండి” అంటున్నాడు. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా, ఫోన్లో కొసరి కొసరి తినిపిస్తారట వాళ్లు! ‘మా వంట మీ ఇంట’ అనేది వారి ట్యాగ్ లైన్.
సాయంత్రం అందరూ ట్రెడిషనల్‌గా తయారై, కాలనీలోని కమ్యూనిటీ హాల్ చేరుకున్నారు. ఒక పంతులుగారు చేతికి వాచీ, ఇంకో చేతికి బ్రాస్లెట్ పెట్టుకున్నాడు. సెల్‌ఫోన్ చూస్తూ పంచాంగ శ్రవణం చేస్తున్నాడు.
“కెసిఆర్ కేంద్రంలో, పవన్ కల్యాణ్ ఆంధ్రాలో అధికారంలోకి వస్తారు” అన్నాడాయన.
“కలొచ్చిందా?” అనరిచారు యూత్.
“ప్లీజ్ బీ సైలెంట్! దిసీజ్ పంచాంగ శ్రవణ – నాట్ ఏ జోక్!” అన్నాడాయన కోపంగా. తర్వాత ఉగాది ప్రాశస్త్యాన్ని(?) గురించి కొందరు మాట్లాడారు. చివర్లో మన కూష్మాండం.
“ఐ విష్ అల్ అవర్ కాలనైట్స్(?) హ్యాపీ యుగాడి. వుయ్ షుడ్ కీప్ అవర్ కల్చర్ ఇన్ హై ఎస్టీమ్. వుయ్ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఫర్ ది ఫెస్టివిటీ. గురజాడా సెడ్; ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు’..”
అందరూ అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ మాటలన్నది గురజాడ కాదని, రాయలవారని తెలిసిన వారెవరక్కడ? ఒక ముసలాయన ఏదో గొణుగుతూ, లేవబోయాడు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు!
ఆ ఫంక్షన్ తర్వాత అందరూ కారులో బయలుదేరారు. వృషభ్ అన్నాడు “డాడ్ మమ్మల్ని వదిలేయండి ఇకనైనా. పొద్దున్నించి యుగాడీ ట్రెడిషన్ అని మమ్మల్ని చంపుకు తింటున్నారు. మేం హైటెక్ సిటీలోని, ‘చెర్కుగడ’ కెళ్తాం. అక్కడ టెల్గూ న్యూ యియర్ పార్టీ ఉంది.”
భీభత్స కూడా డిటో! ఇద్దరూ క్యాబ్ మాట్లాడుకొని వెళ్లిపోయారు. తిరిగెప్పుడొస్తారో మరి!
కూష్మాండం, కూర్మలక్షి, కొత్తపేట లోని అష్టలక్ష్మి గుడి కెళ్లి అక్కడినుంచి ‘కృతుంగా’ కెళ్లారు. డిన్నర్లో ట్రెడిషన్ బ్రేక్ చేయాలని!

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
2 Comments
తుర్లపాటి నాగేంద్ర కుమార్
పాణ్యం దత్త శర్మ గారికి అభినందనలు. మన సంస్కృతిని మరిచి, వింత సంస్కృతిని అలవరచుకుంటూ, తెలుగు భాషని ఏం చేస్తారో! ఈ తెలుగు వారు. ప్రస్తుత పరిస్థితిని చక్కగా వ్రాసారు.
DVSK MURTHY
భలేగా చెప్పారు