కేంద్ర సాహిత్య అకాడమీ, క్రియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ లోని జేఎన్‌టియూ ఆలుమ్ని ఆడిటోరియంలో 09 సెప్టెంబరు 2018 ఆదివారం నాడు “తెలుగులో యాత్రా సాహిత్యం” అనే అంశంపై ఒక రోజు సదస్సు జరిగింది.




“తెలుగులో యాత్రా సాహిత్యం – భిన్న కోణాలు” అనే మొదటి సమావేశానికి వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన సం.వె. రమేష్ “యాత్రా రచనల్లో మూలాల శోధన” అనే అంశంపై ఉపన్యసించారు. “జర్నలిస్టు యాత్రా రచనలు” అనే అంశంపై మాట్లాడిన రెహాన “జర్నలిస్ట్ ప్రయాణం యాత్ర కోసం కాదు. ఆనందం కోసం అంతకంటే కాదు. జర్నలిస్టుల ప్రయాణాలలో ఒక సామాజిక అవసరం ఉంటుంది. ఉత్పన్నమైన సమస్యలను, బాధితులను, వారి ఆవేదనను, అక్కడి పరిస్థితులను సమాజం ముందుపెట్టాలన్న తపన ఉంటుంది” అంటూ తాను ఇటీవల కవర్ చేసిన వార్తాంశాల కోసం తాను చేసిన ప్రయాణాలను వివరించారు. “ప్రయాణం నుంచి యాత్రలోకి” అనే అంశంపై మాట్లాడిన దేవులపల్లి కృష్ణమూర్తి తన పఠనాభిరుచిని, ప్రయాణల పట్ల ఇష్టాన్ని వివరిస్తూ 24 మందితో కలసి మినీ టూరిస్టు బస్సు మాట్లాడుకుని బాసర, షిరిడి, ఎల్లోరా, దౌలతాబాద్, అజంతా మొదలుకొని, అన్నవరం, భద్రాచలంతో మొత్తం 30 యాత్రాస్థలాలను దర్శించేందుకు బయల్దేరిన వైనాన్ని వివరించి తోటి యాత్రికులను పరిచయం చేశారు. యాత్ర ఆరంభంలో ముభావంగా ఉన్నవారు, యాత్ర ముగిసేనాటికి ఒకరికి ఒకరు ఆత్మీయులుగా మారిపోయారని చెప్పారు.


“తెలుగులో యాత్రా రచనలు – పరిశీలన” అనే రెండవ సమావేశానికి సి. మృణాళిని అధ్యక్షత వహించారు. తన చైనా పర్యటనలోని అనుభవాలను వివరించారు. “తెలుగులో యాత్రా రచనలు 1838 – 2000 వరకు” అనే అంశంపై ప్రసంగించిన దాసరి అమరేంద్ర తెలుగులో వచ్చిన మొదటి యాత్రా రచన కాశీయాత్ర నుంచి 2000 సంవత్సరం వరకు ప్రచురితమైన పలు యాత్రా రచనలు ప్రస్తావించి ఆయా రచయితల దృక్పథాన్ని వివరించారు. “2000 సంవత్సరం తర్వాత తెలుగులో యాత్రా రచనలు” అనే అంశంపై ప్రసంగించిన కొల్లూరి సోమ శంకర్ గత 18 ఏళ్ళలో యాత్రా సాహిత్యం పాఠకులను ఎలా ఆకర్షించిందో తెలిపి, ఈ కాలంలో వెలువడిన కొన్ని యాత్రా గ్రంథాలను ప్రస్తావించారు. ఆయా యాత్రా రచనలలోని మనుషులను, ప్రకృతినీ, సంవేదనాశీలతనీ వివరించారు. “యాత్రాసాహిత్యం – పరిశోధన” అనే అంశంపై తొలిసారి యాత్రాసాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందిన మచ్చ హరిదాసు ఉపన్యసించారు. తన పరిశోధనకు ఎంచుకున్న గ్రంథాలు, వాటిలోని అంశాలను ఏ రకంగా అధ్యాయాలుగా విభజించినదీ వివరించారు. యాత్రా చరిత్రల స్వరూప స్వభావాలను వివరించారు.
అనంతరం చర్చ జరిగింది. సభికులలోని కొందరు తమ యాత్రానుభవాలను వివరించారు. తదుపరి క్రియా సొసైటీ సంయుక్త కార్యదర్శి పి. జగన్నాథ రాజు వందన సమర్పణ చేయగా, సభ ముగిసింది.

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.