[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా ‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]


భారతీయ మూలాలు గల అమెరికన్ రచయిత్రి అల్కా జోషీ రచించిన ‘జైపూర్ ట్రియాలజీ’ అనే నవలా త్రయంలో చివరిది ‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’. ఈ నవల పాఠకులను పరిమళాల ప్రపంచంలో సంచారం చేయించి, ఎన్నో జ్ఞాపకాల సువాసనలను వెదజల్లుతుంది. కథానాయిక రాధతో పాటు మనమూ ప్రయాణిస్తే, 1970లలో పారిస్ నగరంలో ఒక పెర్ఫ్యూమిస్ట్గా ఆమె ఆశలు, వృత్తిజీవితాన్నీ కుటుంబ జీవితాన్నీ సమన్వయం చేసుకోడంలో ఆమె ఎదుర్కున్న సవాళ్ళు – మనకు తారసపడతాయి. వ్యక్తిగత సాఫల్యత, గృహ నిర్వహణా బాధ్యతల నడుమ స్త్రీలు ఎదుర్కునే సాంఘిక ఒత్తిడులను ఈ నవల విశదం చేస్తుంది. రాధ పాత్రతో మనల్ని మనం పోల్చుకోవచ్చు, ప్రేరణ పొందచ్చు. వివాహం, మాతృత్వం, తనకంటూ ఓ గుర్తింపు వంటి విషయాలలో ఆమె కనబర్చిన పట్టుదలా, హుందాతనం ఆకట్టుకుంటాయి.
కథకి కీలకం – Edouard Manet పెయింటింగ్ ‘ఒలింపియా’ నుండి ప్రేరణ పొందిన రాధ తన మొదటి సొంత అత్తరుని రూపొందించే ప్రాజెక్టు. ఈ కళాత్మక ప్రయత్నం ఆమె కెరీర్లో ఒక మైలురాయిలా మిగలడమే కాకుండా, ఆమె తన గతాన్ని ప్రశ్నించుకునేలా చేసి, తన అస్తిత్వాన్ని సవాలు చేస్తుంది. అత్తరుని రూపొందించడమనే ప్రక్రియని – రాధ తనకంటూ ఓ సొంత గుర్తింపుకు చేస్తున్న కృషికి ఒక ఉత్ప్రేక్షగా ఉపయోగిస్తూ – రాధ వ్యక్తిగత, వృత్తిపరమైన గమనాలను రచయిత్రి నేర్పుగా కథనంలో అల్లారు. అత్తరులను మేళవించే ప్రక్రియలోని ఒక్కో దశ రాధ గత, ప్రస్తుత పోరాటాలను ప్రతిబింబిస్తూ, ప్రతిధ్వనిస్తూ కథనంలో భావోద్వేగాలను జొప్పిస్తుంది.
‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ నవలని ఆసాంతం ఆస్వాదించాలంటే, ఈ నవలా త్రయంలోని మిగతా రెండు నవలలనూ పరామర్శించడం అవసరం. మొదటి నవల ‘ది హెన్నా ఆర్టిస్ట్’, 1950వ దశకంలో పెళ్ళయి, భర్తతోనూ, అత్తింటివారితోనూ ఇబ్బందులు ఎదుర్కుని, వాటిని అధిగమించి ఒక హెన్నా కళాకారిణిగా తనని తాను నిరూపించుకున్న లక్ష్మి కథ. ఈ నవల ఓ స్త్రీ పట్టుదలని, స్వాతంత్య్రానికై ఆమె చేసిన ప్రయత్నాలను చాటుతుంది. తనకి తెలియని ఓ సోదరిని లక్ష్మి అనుకోకుండా కలవడంతో, కుటుంబంలో ఏర్పడిన ఊహించని బంధాలను ప్రస్తావిస్తుంది. ఈ ఉదంతం, కథను ముందుకు నడుపుతుంది.
రెండవ నవల ‘ది సీక్రెట్ కీపర్ ఆఫ్ జైపూర్’ లో, కథ 1969లో లక్ష్మి శిష్యుడు మాలిక్‌తో మొదలవుతుంది. అతను జైపూర్ రాయల్ ప్యాలెస్‌లో అప్రెంటిస్‌గా పనిచేస్తూంటాడు. ఒక సినీ థియేటర్లో జరిగిన ప్రమాదం, దాని వెనుక ఉన్న అవినితిని మాలిక్ వెలికితీస్తాడు. ఈ పుస్తకం నిమ్మీ వంటి కొత్త పాత్రలను పరిచయం చేస్తూ – సామాజిక హోదాలు, ఆశయాలు, వలసరాజ్యాల పాలన అనంతరం భారతదేశం అభివృద్ధి దిశగా సాగుతున్న వైనాన్ని వివరిస్తుంది. ఈ రెండు పుస్తకాలు, మూడవ నవల ‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ లో రాధ కథకు భూమికని అందిస్తాయి. వేర్వేరు తరాల వ్యక్తుల గాథలను – గుర్తింపు, ఆశయం, సాంస్కృతిక రూపాంతరం వంటి అంశాలతో మేళవిస్తూ, అల్కా జోషీ వైవిధ్యంగా కథని అల్లారు. అల్కా జోషి రాసినది చదువుతూంటే, వలసరాజ్య పాలన, దేశ విభజన కాలానికి సంబంధించి నేను చదివిన మరికొన్ని పుస్తకాలు గుర్తొచ్చి, వాటిల్లోని పాత్రలు నా మనోఫలకంపై తిరిగి ప్రాణం పోసుకున్నాయి.
‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ నవల విశిష్ట లక్షణాలలో ఒకటి – రచయిత్రి చేసిన స్పష్టమైన ఇంద్రియగ్రాహక వర్ణనలు. పదాల ద్వారా సువాసనలను రేకెత్తించే ఆమె సామర్థ్యం – రాధ ప్రయాణంలో మనం మరింత లీనమయ్యేలా చేస్తుంది. రాధ తన అత్తరు పరిమళాల పదార్థాలను సేకరించడానికి భారతదేశానికి వెళ్ళినప్పుడు నేను మల్లెలు, గంధపు చెక్కల సువాసనను ఆస్వాదించనంటే అతిశయోక్తి కాదు. ఈ నవల – ప్రేమ, కోల్పోవడం, విముక్తి అనే ఇతివృత్తాలతో సాగుతుంది. ఆగ్రాలోని వేశ్యలు రాధ అన్వేషణలో ఆమెకు సహాయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వారి ఉనికి కథనానికి గొప్పతనాన్ని జోడిస్తుంది, ఊహించని విధంగా ఒకరినొకరు ఆదరించే మహిళల శక్తిని ప్రస్ఫుటం చేస్తుంది. ఇటీవలి వెబ్ సిరీస్ ‘హీరామండీ’ -పుస్తకంలోని ఈ ఎపిసోడ్లకు న్యాయం చేస్తుంది. అంతేకాదు, ఈ పుస్తకం – నా ఇటీవలి తాజ్ మహల్ పర్యటనకు మరింత అర్థాన్ని జోడించింది.


అల్కా జోషీ
సంక్లిష్టంగా అనిపించే వివరణాత్మక కథనం, ఆకర్షణీయమైన ఇంద్రియగ్రాహక అనుభవం, ఇంకా రెచ్చగొట్టే సమస్యల వంటివి ‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ నవలని చదివేలా చేస్తాయి. గుర్తింపు, ఆశయం, వృత్తి, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోడంలో మహిళల సామర్థ్యాన్ని అల్కా జోషి నేర్పుగా పరిశీలించినందున, రాధ ప్రయాణం చాలా వాస్తవికంగా ఉంటుంది. నవలలో పారిస్, ఇండియాల మధ్య ఉండే సాంస్కృతిక వైరుధ్యాలు కథకు సంక్లిష్టతను కల్పించినా, సుగంధపు మధురమైన వర్ణనలు పాఠకులను సుగంధ ద్రవ్యాల కళలో లీనం చేస్తాయి.
ఈ నవలలో భావోద్వేగాల ఉద్రిక్తతలు ఉన్నాయి, ముఖ్యంగా రాధ, ఆమె భర్త పియరీ బంధంలో. తన భార్య గృహిణిలా ఉండకుండా, కెరీర్ ఏర్పచుకోడాన్ని అతను ఇష్టపడకపోవడం -సమాజంలోని స్త్రీపురుష అసమానత్వాన్ని చాటుతుంది, ఒత్తిడిని కలిగిస్తుంది. తన గతం నుండి రాధ కొడుకు రావడం ఆమె జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది, చాలా కాలంగా దాచిపెట్టిన రహస్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె ఈ సవాళ్లతో పోరాడుతూండగా , ఈ నవల వ్యక్తిగత, వృత్తిపరమైన సాఫల్యాలను సాధించేందుకు చేసే త్యాగాలు, పడే రాజీలను ప్రస్తావిస్తుంది. చివరికి, ‘ది పెర్ఫ్యూమిస్ట్ ఆఫ్ పారిస్’ అనేది స్వీయ-ఆవిష్కరణ, గుర్తింపు, ఆశయం, కుటుంబం మధ్య సున్నితమైన సమతౌల్యతను సాధించదలచిన ఓ స్త్రీ కదిలించే కథ. రచయిత్రి కథని నడిపిన తీరు పాఠకులపై చెరగని ముద్ర వేస్తుంది, ఈ త్రయాన్ని మరపురాని సాహిత్య ప్రయాణంగా మారుస్తుంది.
***


Author: Alka Joshi
Published By: HarperCollins India
No. of pages: 352 pages
Price: ₹ 499
Format: Paperback
Link to buy:
https://www.amazon.in/Perfumist-Paris-Novel-Alka-Joshi/dp/9356993726

స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తస సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.