మీరు సైన్స్ ఫిక్షన్ కథలు నవలలు ఏమన్నా చదివారా? కనీసం ఒక్కటన్నా సైన్స్ ఫిక్షన్ సినిమా తెలుగులో గాని ఇంగ్లీష్‌లో గాని చూసి ఉంటారా? తప్పకుండా చూసి వుంటారు. కానీ తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసిన సదాశివ రావు గారి పేరు తెలుసా? తెలుగులో సైఫీ కథలు రాసిన సదాశివ రావు గారిని చదవనేలేదా?
చాలా మంది చదవకుండా ఉండి ఉండటానికి అవకాశం ఎక్కువ. మరీ ఈ తరం వారు.
అసలు సైన్స్ ఫిక్షన్ అంటే అవగాహన, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది పాఠకుల్లో గాని మన రచయితల్లో విమర్శకుల్లో వున్నారో గాని ఈ సాహిత్యం గురించిన అవగాహన చాలా మందికి తక్కువే అని చెప్పాలి.
అసలు తెలుగులో సైన్స్ ఫిక్షన్ ఎవరు రాస్తున్నారు అండీ… లేనే లేదు, అనే వారి దగ్గర్నుంచి, రాసిన వాళ్ళందరూ ఇంగ్లీష్ నవలలకు కాపీ అనే వారూ ఆ ఫిక్షన్ని చదవలేము అనేవారూ, మీరు రాసింది సైన్స్ ఫిక్షన్ కానే కాదు అనేవారూ ఇలాంటి తూష్ణీంభావ విమర్శకులు, తమరికి తప్పఇంకెవరికీ ఏమీ రాదు అనే రచయితలూ అధికం మన తెలుగులో.
అలాంటి వాళ్లందరినీ తనదైన శైలిలో దూరంగానే పెట్టి అత్యున్నతమైన సైన్స్ ఫిక్షన్ కథలని అద్భుతంగా సృష్టించి ప్రపంచ సాహిత్యంలో ఉన్న సైన్స్ ఫిక్షన్ రచయితలు అందరి గురించి చక్కని సమాచారంతో సాధికారంగా వ్యాసాలు రాసి ప్రచురించి ఆ జానర్లో ఒంటరిగా మిగిలి ఉన్న నా బోటి కొద్ది రచయితలకి కొంచెం అయినా ప్రయోజనం కలిగించిన ఏకైక రచయిత శ్రీ. కె. సదాశివ రావు గారు.
సదాశివ రావు గారి ముందు కూడా సైన్స్ ఫిక్షన్ ఉంది. ఆయన తర్వాత కూడా అది ఉంటుంది. అది రాస్తున్న వాళ్ళు నేను, కస్తూరి మురళీకృష్ణ లాంటి వాళ్ళం ఇంకా ఉన్నాం. ఇంకా రాసేవారు వస్తారు తప్పకుండా. కొన్ని సినిమాలు కొన్ని ఓటీటీలో కూడా తీశారు పర్వాలేదు అనిపించేట్టు. అంతకుముందు కూడా ప్రఖ్యాత రచయితలు యండమూరి, మల్లాది, మైనంపాటి భాస్కర్, ఎన్.ఆర్.నంది, ఆర్.కె. మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వారు కూడా సైఫీ నవలలు కథలు సృష్టించారు.
కానీ ప్రపంచ స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలని ‘ఆత్మ ఫ్యాక్టర్’ కథా సంకలనంలో పొందుపరిచి ఎవరికీ అందనంత ఎత్తులో స్థాయిలో నిలబడి రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాకపోయినా అదే స్థానంలో నిలబడి దర్జాగా వెళ్ళిపోయిన సదాశివ రావు గారు తెలుగు సైన్స్ ఫిక్షన్ కథాసాహిత్యంలో ఒక అథారిటీ, ఒక సృజనకారుడు, వారి తర్వాత వరుసలో వున్న రచయితలకి ఆమడదూరం ఎత్తులో ఉంటారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఆయనని నేనెప్పుడూ చూడలేదు. ఆయనతో పరిచయం లేదు. రచన ముఖ్యం కానీ, రచయిత ఆయన వ్యక్తిగత జీవితం, సంఘంలో ఆయనకి వున్న స్థాయి ఇవన్నీ ముఖ్యం కాదనే ఆలోచనా సరళికి చెందినవాడిని.
ఆయన గురించి రాసిన వారిలో ఆయన కోపాన్ని గురించి అహంకారాన్ని గురించి చెబుతూనే ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించిన స్నేహితులుగా అని చెబుతూ వ్యాసాలు రాసిన వారిని చూస్తే ఆశ్చర్యం కలిగింది. ఎవరూ ఆయన సైఫీ కథల విషయం గురించీ సృజన గురించీ రాయలేదు.
ఎందుకంటే ఎవరూ వాటిని చదవలేదని తెలిసిపోతోంది. చదవలేక కావచ్చు. ఆసక్తి లేక కావచ్చు. బావుండక కావచ్చు.
అద్భుతమైన శైలితో భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీలని ఊహిస్తూ వేదాంతపరమైన విజ్ఞానశాస్త్రపరమైనవి అయిన భవిష్యత్ సంఘటనల్ని చిత్రీకరించిన ఆయన కథలు ఒక్కటైనా సమకాలీనులు చదివారా అని సందేహం కలుగుతుంది. బహుశా నా అవగాహన తప్పుకావచ్చు…
కానీ ఆయన కోపానికీ సీరియస్నెస్కీ కారణం “హి కెనాట్ సఫర్ ఫూల్స్ గ్లాడ్లీ…” అనే సూత్రమే అని నాకు అనిపిస్తుంది… విశ్లేషణలకు మనకు తెలిసిన కొలతలతోనే సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్ని కొలవటం చిన్న స్కేల్‌తో ఎవరెస్టు శిఖరాన్ని కొలవటానికి ప్రయత్నించినట్లు అవుతుంది. ఒక యాస తోనూ, ఒక సమాజ వర్గం తోనూ ప్రాంతాల తోను, లేక ఒక జెండర్ తోనూ మాత్రమే తమని తాము నిర్ణయించుకుని ఆ పరిధిలోనే కథలు సృష్టించే వారికి కాల ప్రయాణం, సింగ్యులారిటీ, టాకీయాన్ సిస్టంలు, హైపర్ స్పేస్, మార్స్ ప్రయాణం, దాని ఉపగ్రహాలు డిమోస్ ఫోబియస్, వివిధ రకాల పాలపుంతలు, నక్షత్ర కుటుంబాలు అంటే కాన్స్టెలేషన్స్ ఇవన్నీ ఎలా అర్థం అవుతాయి? ఐతరేయ బ్రాహ్మణం నుంచి కఠోపనిషత్తు దగ్గర్నుంచి, యజుర్వేదం దగ్గర్నుంచి జాన్ పాల్ సార్తర్ రాసిన ‘బీయింగ్ అండ్ నథింగ్నెస్’ పుస్తకం దాకా, త్యాగరాజు కీర్తనల దగ్గర్నుంచి దగ్గరనుంచి బీథొవెన్ ఐదవ సింఫనీ దాకా, జర్మన్ బాక్ సంగీతం, శ్రీశ్రీ కవిత్వం నుంచి జపాన్ బషో హైకూ లదాకా, అంతరించిన సరస్వతీ నదీ తీరం నుంచి ‘ఉర్స్సా మేజర్’ లోని పేరులేని గ్రహం దాకా, మానవ నాగరికతనే అవలీలగా ఔపోసన పట్టి కళ్ళకు కట్టినట్లు వర్ణించే ఈ కథలన్నిటినీ చదవాలంటే ఆ చదివే వారికి కూడా కొంత పరిజ్ఞానం, ఆసక్తి, భాషా ఉండితీరాలి. మనకి తెలియని దానిని చూసి చదివి విని అర్థం చేసుకోవటానికి అదే స్థాయిలో పరిజ్ఞానం కావాలి. లేకపోతే ఆరాధన స్థానంలో అవహేళన మిగులుతుంది. విశ్లేషణ స్థానంలో కువిమర్శ మిగులుతుంది.
ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ సాహిత్యం 20 – 21వ శతాబ్ద ఆధునిక కాలం నాటిది. ప్రస్తుత శాస్త్ర అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో జరిగే మార్పుల్నీ, అది మన జీవితాల్నీ, నాగరికతనీ భూమినీ, ఎలా మారుస్తుందో చెప్పే సాహిత్యం అది. ఇది ఎన్నో రకాలుగా వివిధ రకాల ఉప శాఖలుగా విరాజిల్లుతోంది.
పూర్తి సైన్స్ వివరాలతో హార్డ్‌కోర్ సైన్స్ ఫిక్షన్, కొంచెం సరళంగా సాఫ్ట్‌కోర్ సైఫీ, ఐటీ హారర్ సైబర్ పంక్, మిలిటరీ సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఫాంటసీ ఇలా ఎన్నో రకాలు. వీటికి సమాజ ప్రయోజనం ఎందుకు లేదు? ప్రస్తుతం మనం అల్లాడుతున్న కోవిడ్-19 మహమ్మారి గురించి లక్షల్లో చావుల గురించి, లాక్డౌన్ కష్టాల గురించి 10 సంవత్సరాల క్రితం రాస్తే ఇలా ఎందుకు జరుగుతుందని నవ్వేవారు కాదా! ప్రస్తుతం మొబైల్ ఫోన్లు శాటిలైట్ టీవీ డిజిటలైజేషన్ మన జీవితాల్నీ ఆర్థిక వ్యవస్థనీ కళలనీ, సమావేశాలు చేసుకునే వ్యవస్థనీ వ్యాపార పద్ధతుల్ని మార్చి వేయలేదా? ఒకప్పటి సైన్స్ ఫిక్షన్ నేటి వాస్తవం. ఇప్పటి సైన్స్ ఫిక్షన్ రేపటి నిజం. ఈరోజు జరిగిన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణ రేపటి ప్రళయమూ పీడకలలూ కావచ్చును.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లోనింగ్ జెనిటిక్ ఇంజనీరింగ్, గ్రహాంతర యాత్రలు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు, ఇవన్నీ జీవితాలని పెను మార్పులతో శాసించటం లేదా?
కేవలం ఒక బొంబాయి చట్నీ మీద హోటల్ మీద రాసిన మథ్యతరగతి కథని (మిడిల్ క్లాస్ మెలొడీస్) సినిమాగా తీస్తే అందరికీ మనసులకి తాకి ప్రశంసల వర్షం రివ్యూల వర్షం కురుస్తుంది.
కానీ శరీరంలోని అవయవాలన్నీ మార్పిడి జరిగి మనిషి మెదడు కూడా పాజిట్రాన్ బ్రెయిన్‌గా మారి ఆత్మ ఏమైపోయిందో అని వెతుక్కునే ‘ఆత్మ ఫ్యాక్టర్’ లాంటి కథని సదాశివ రావు గారు రాస్తే అది అర్థం కాకుండా అవగాహన లేకుండా చదవని పాఠకులే ఎక్కువ. ఒక్క విశ్లేషణ కూడా రాదు. ప్రఖ్యాత విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మెచ్చుకున్న కథ ఇది ఆత్మా ఫ్యాక్టర్. ఓ ముసలాయనకి అన్ని అవయవాలు క్రమంగా మార్పిడి చేస్తారు. నూరేళ్ళ పైన జీవిస్తూనే వుంటాడు. మానవుడిలో అవయవాలన్నీ యంత్రాలు అయినాక ఆత్మ ఏమై పోయినట్లు?
డాక్టర్ అశ్విని అతను కూడా రోబోట్ డాక్టరే, అడుగుతాడు. సుఖం, దుఃఖం ఇవన్నీ మానవులు అనుభవించే విషయాలు. యంత్రాలకు ఇవేవీ ఉండవు అని మాత్రమే తెలుసు. ఆత్మ భోగట్టా తెలియదు. ఆ విషయాన్ని బ్రహ్మ అనే సూపర్ కంప్యూటర్ని అడుగుతాడు. ఆత్మల గురించి నిశ్చితంగా ఏమీ చెప్పడానికి లేదనీ, దేవుడు, మతం అన్న భావాలు మనిషిని సంకుచితం చేశాయని బ్రహ్మ అనే కంప్యూటర్ చెబుతుంది.
అయితే విశ్వాన్ని పాలించేది ఎవరు అని అడుగుతాడు డాక్టర్…
భవిష్యత్తులో విశ్వాన్ని పరిపాలించేది యంత్రాలేననీ, మానవుల బతుకులని యంత్రాలు అదుపు చేస్తాయనీ బ్రహ్మ కంప్యూటర్ చెబుతుంది. మన జీవితాలన్నీ మనం సృష్టించిన యంత్రాలే పరిపాలిస్తాయి అని అనే ఊహ అనేక ఇంగ్లీష్ సినిమాలలో వచ్చింది. టెర్మినేటర్, మాట్రిక్స్,లాంటి సినిమాలలో ఇదే కనిపిస్తుంది. ఈ కథ సదాశివ రావు గారు 1980లోనే రాశారు అనుకుంటాను.
ఇది కాక మానవ ఫ్యాక్టర్ కథలో మళ్లీ మానవ జాతిని పునర్ నిర్మాణం చేయటం కూడా వర్ణించారు ఆశాజనకంగా.
ఈయన రాసిన కథలన్నిటిలో ఇంకా ఏలియన్ రిపోర్ట్, విశ్వ గానం, గెలాక్టిక్ బార్… ఇలాంటి ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి సైఫీ పరంగా. ఈయన ఏ యూరప్ లోనో, అమెరికా లోనో పుట్టి వుండి ఇలాంటివి కథలు రాసి ఉంటే ఫిలిప్ ఎస్.డిక్ లాగానో రే బ్రాడ్ బరీ లాగానో ఐజాక్ అసిమోవ్ లాగానో పేరుప్రఖ్యాతులు గుర్తింపు పొంది ఉండేవారేమో. తెలుగు సాహిత్య వాతావరణంలో మాత్రం ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానూ, కథలు సంగీతం తెలిసిన రచయితగానూ సాధికారంగా వ్యాసాలు రాసి అందరికీ సైఫీ రచయితల గురించి సాహిత్యం గురించి జ్ఞానాన్ని పంచిన మేధావిగా మాత్రమే మిగిలిపోయారు. ఆయనే తన ఉపోద్ఘాతంలో రాసినట్లు సాహిత్యం గురించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి 1. సాహిత్యం సామాజిక వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది 2. సాహిత్యం సామాజిక వాస్తవాన్ని సృష్టిస్తుంది.
నా ఉద్దేశం ప్రకారం సైన్స్ ఫిక్షన్ రెండవ తరగతికి చెందినది.
సైన్స్ ఫిక్షన్ సైన్స్ టెక్నాలజీ పట్ల మన వైఖరి ఎలా ఉండాలో మన మానవత్వాన్ని విజ్ఞాన శాస్త్రపు వెర్రితలల నుంచి ఎలా కాపాడుకోవాలో చెబుతుంది. సైంటిఫిక్ దృక్పథాన్ని మానవ హక్కులతో సమన్వయం చేస్తుంది. అందుకనే సైన్స్ ఫిక్షన్ స్పెక్యులేటివ్ఫిక్షన్ అనీ, లిటరేచర్ ఆఫ్ ఐడియాస్ అని కూడా అంటున్నారు.


అవును ఇది ఐడియాల సాహిత్యమే. ఈ కథలేవీ మనకు తెలిసిన ప్రపంచంలో సమాజంలో జరగవు. ఇవి కొత్త ప్రపంచాలను కొత్త విలువలని ఆవిష్కరిస్తాయి. అలాంటివి సృష్టించిన సృష్టికర్తే సదాశివ రావు గారు. ఆయన రాసిన ఇతర కథల కంటే ‘ఆత్మ ఫ్యాక్టర్’ సంకలనం ఎవరూ కొన్నా కొనకపోయినా, చదివినా చదవకపోయినా తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలబడుతుంది. ఆ కథలను చదవటం కాదు అధ్యయనం చేయాలి. మిగిలిన కథలు క్రాస్ రోడ్స్ లాంటివి, మరొక రకం. ముఖ్యంగా యువకులు, యువతులు రచయితలు అయిన అందరూ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ చదువులు చదివి ఆదర్శ భావాలు ఉన్న వాళ్లు వీటిని చదివి ఇంకా ఉదాత్తమైన సైఫీ సాహిత్యాన్ని సృష్టించ కలగాలి. తెలుగు సాహిత్యంలో మరో అథ్యాయం మొదలు అవ్వాలి.
ఆ రకంగా కె. సదాశివ రావు గారి కృషి అజరామరంగా నిలబడుతుంది. ఆయన కూడా ఆయన పేరు పెట్టిన బ్రహ్మ కంప్యూటర్ లాగానే శాశ్వతంగా మన మేధస్సులో సామూహిక చేతనలో నిలిచిపోతారు.

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.
4 Comments
సిహెచ్.సుశీల
తన రచనల్లో ఎప్పుడు తన పదవిని సూచించని గొప్ప కథకులు కె సదాశివ రావు గారు. సైన్స్ ఫిక్షన్ ని తెలుగు పాఠకులు కేవలం శవ సాహిత్యం అని ఈసడించుకోవడం, అసలది సాహిత్యమే కాదనుకోవడం మన దురదృష్టం. ఇతర భాషా పాఠకులు, ముఖ్యంగా ఇంగ్లీషు నవలల గాని సినిమాలు గాని సైన్స్ ఫిక్షన్ ని ఎంతో ఆదరిస్తారు. సదాశివ రావు గారు సైన్స్ ఫిక్షన్ నవలలు నిజంగానే ఎవరి ఊహకీ అందనంత శిఖరాయమానంగా ఉంటాయి. చాలామంది వాటిని చదవలేదు అంటే, నిజమే, వాటిని అర్థం చేసుకోలేనంత ఎత్తులో ఉంటాయి కాబట్టి చదవలేదు. (ఆయనకి కోపం అన్నది కూడా సమంజసంగా కనిపించటంలేదు) చక్కని రచయిత, మంచి సంస్కారవంతుడు, సమర్థవంతమైన అధికారి . వారి హఠాన్మరణం ఆశ్చర్యంగా బాధాకరంగా ఉంది. వారికి నివాళి.
Anil అట్లూరి
చక్కని పరిచయం చేశారు, మధు గారు సదాశివరావు గారి సాహిత్యం గురించి.
Murthy Kvvs
Happy to read such a befitting tribute. He was and is a great writer and thinker and he will be remembered for what he has contributed to the Telugu literary world.
V Chowdary Jampala
The only eulogy that focused on Sri Sadasivarao’s scifi stories.