[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న ‘తులసీ రామాయణంలో అవాల్మీకాలు’ అనే వ్యాస పరంపర.]


కాలనేమిని సంహరించిన తర్వాత హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకుని ఆకాశమార్గానికి ఎగిరాడు. అలా పోతూ ఉండగా దారిలో అయోధ్యానగరం వచ్చింది. ఆకాశంలో వెళుతున్న ఈ బృహత్ స్వరూపాన్ని చూసిన భరతుడు ఎవరో మాయావి అయిన రాక్షసుడు అనుకుని బాణం సంధించి వదిలాడు. ఎంతైనా భరతుడు రఘువంశ వీరుడు. రాముడితో సమానమైన పరాక్రమవంతుడు. ఆ దెబ్బకు అంతటి హనుమంతుడు కూడా పర్వతంతో సహా కిందపడ్డాడు. పడుతూ పడుతూ “రామా రామా” అంటూ మూర్చపోయాడు. రామా అనే మాట వినగానే భరతుడు హనుమంతుడి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళాడు. స్పృహ తెప్పించటానికి అనేక ప్రయత్నాలు చేసాడు. చివరకు “నాకు శ్రీరాముడి చరణ కమలాల మీద నిశ్చలమైన భక్తి ఉంటే ఈ వానరుడు శ్రమనుండీ, బాధనుండీ బయటపడుగాక!” అని ప్రార్థించగానే హనుమంతుడు లేచి కూర్చున్నాడు.
“ఎవరు నువ్వు? శ్రీరాముడు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు భరతుడు. అరణ్యంలో ఉండగా రావణుడు సీతను అపహరించటం, వానరులు సేతువు నిర్మించటం, రాముడు రావణుడి మీదకు యుద్దానికి వెళ్ళటం, యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోవటం మొదలైన విషయాలు అన్నీ చెప్పాడు హనుమంతుడు. “అయ్యో! నా తమ్ముడు మూర్ఛపోయాడా! మేలు చేయబోయిన నీకు అపకారం తలపెట్టాను. నన్ను మన్నించు” అని హనుమంతుడిని కౌగలించుకున్నాడు భరతుడు.
“నాయనా! నువ్వు అక్కడికి చేరటంలో ఆలస్యం అయితే నీ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. కాబట్టి నువ్వు పర్వతంతో నా బాణముపైన అధిరోహించు. తెల్లవారకముందే నిన్ను అక్కడికి చేరుస్తాను” అన్నాడు భరతుడు.
“మీ ప్రతాపం నాకు తెలుసు. కానీ రామానుగ్రహం వలన నేను వేగంగా వెళ్ళగలను. సెలవు” అని చెప్పి హనుమంతుడు అయోధ్య నుంచీ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన కూడా వాల్మీకి రామాయణంలో లేదు. రామ చరిత మానస్‌లో ఉన్నది.
తర్వాత కుంభకర్ణుడిని గుణవంతుడిగా చిత్రీకరించాడు తులసీదాసు. రావణుడు అతడిని నిద్రలేపి యుద్ధానికి సంసిద్ధుడవు కమ్మని చెప్పినప్పుడు “సోదరా! నువ్వు చేసినది ఘోరమైన తప్పిదం. దేవదేవుడితో వైరం పెట్టుకున్నావు. ఇప్పటికైనా అహంకారం వదిలి రాముడిని శరణువేడుకో!” అని చెబుతాడు. అయినా వినకపోయేసరికి “సరే! నీకు సంతోషం కలిగించటానికి నా శక్తి కొద్దీ పోరాడతాను” అని చెప్పి యుద్ధానికి వెళతాడు. కుంభకర్ణుడిని చూడగానే విభీషణుడు ఎదురెళ్ళి అన్నకు పాదాభివందనం చేస్తాడు. తమ్ముడిని లేవనెత్తి గాఢ ఆలింగనం చేసుకుని “తమ్ముడూ! నువ్వు రాముడి పక్షం చేరి ధన్యుడవైనావు. నీ వలన మన వంశకీర్తి ఇనుమడిస్తుంది. నేను ప్రాణంపైన ఆశ వదులుకుని వచ్చాను. ఇక వెళ్ళు” అని పంపిస్తాడు.
కుంభకర్ణుడి మరణానికి ముందే ఇంద్రజిత్తు యుద్ధం చేసినట్లు, లక్ష్మణుడు మూర్ఛపోవటం, హనుమంతుడు సంజీవని తీసుకురావటం చెబుతాడు తులసీదాసు. కానీ వాల్మీకి మాత్రం ఇవన్నీ కుంభకర్ణుడి మరణం తర్వాత జరిగినట్లు చెబుతాడు. రామరావణ యుద్ధం గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడు తులసీదాసు. రావణుడు అనేక రూపాలతో వచ్చేసరికి వానరులు ఎవరితో పోరాడాలో తికమకపడతారు. అదే విధంగా రాముడు అనేక రూపాలతో వచ్చినట్లు కూడా భ్రమ కలిగిస్తాడు రావణుడు. రాముడు ఒక్కబాణంతో ఆ మాయలు అన్నీ పటాపంచలు చేస్తాడు. అలాగే రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రాముడు రావణుడి శిరస్సులు ఖండించగానే కొత్త శిరసులు మొలుస్తూ ఉంటాయి. అప్పుడు విభీషణుడు “రావణుడి నాభిలో అమృతభాండం ఉన్నది. అది ఉన్నంతవరకు రావణుడి శిరసులు మొలుస్తూనే ఉంటాయి. అమృతభాండాన్ని ముక్కలు చెయ్యి” అని చెబుతాడు. అప్పుడు రాముడు ముప్పైఒక్క బాణాలు వేస్తాడు. పదిశిరసులను, ఇరవై చేతులను ఖండించి, ఇంకొకటి నాభిలోని అమృతభాండాన్ని వ్రయ్యలు చేస్తుంది.
రావణుడి కుక్షిలో అమృతభాండం ఉన్నది అనేది కూడా అవాల్మీకం. సూర్యుడు పంపిన రథం మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు రాముడు. వంద బాణాలు వేసినా రావణుడు చావడు. అప్పుడు రథసారథి మాతలి “రామా! నువ్వు వీరుడవు. సమస్తాస్త్రాలు తెలిసినవాడవు. ఏమీ తెలియనివాడిలా ఏవేవో బాణాలు వేయటందేనికి? రావణుడికి వినాశకాలం దగ్గరకు వచ్చింది. బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతడిని వధించు” అని చెబుతాడు. రాముడు నూట ఒకటవదిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించగానే అది రావణుడి గుండెను తలను మొండెం నుంచీ వేరుచేస్తుంది. అతడు మరణిస్తాడు. వాల్మీకంలో చెప్పింది ఇది.
తులసీదాసు ప్రధానంగా రాముడు, లక్ష్మణుల యుద్ధాన్ని గురించి మాత్రమే చెబుతాడు. హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వారి పోరాటం గురించి చెప్పడు. వాస్తవానికి వానరవీరులు అందరూ పోరాడతారు. ధూమ్రాక్షుడు, అకంపనుడు హనుమంతుడి చేతిలో; విరుపాక్షుడు, మహోదరుడు సుగ్రీవుడి చేతిలో; నరాంతకుడు, మహాపార్శ్వుడు అంగదుడి చేతిలో; ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణిస్తారు. ఇలా వానరవీరులు కూడా అద్భుతంగా పోరాడతారు. కానీ అవన్నీ వదిలేశాడు తులసీదాసు.
ఉత్తరకాండ
రామాయణం అనగానే బాలకాండ నుంచీ యుద్ధకాండ వరకే చెబుతారు చాలామంది. ఉత్తరకాండను అందులో కలపరు. ఎందుకంటే యుద్ధకాండ వరకూ జరిగినదంతా చూసి వాల్మీకి రచించాడు. కానీ ఉత్తరకాండలో చెప్పినవి అన్నీ అంటే రాముడు అవతారం చాలించటం వరకూ ఆయన తపోశక్తితో గ్రహించి రచిస్తాడు. అవన్నీ అప్పటికి జరగలేదు [భారతం విషయంలో కూడా ఇలాగే అనుకుంటారు. ఎర్రన భారతరచన పూర్తిచేసిన తర్వాత ఏదో అసంతృప్తిగా ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి వివరంగా చెప్పలేదే అనుకుంటూ హరివంశం రచిస్తాడు. హరివంశంతో కలిపి సంపూర్ణ మహాభారతం అవుతుంది. కానీ లాక్షణికులు భారతం స్వర్గారోహణ పర్వంతో ముగుస్తుంది అని చెబుతారు. హరివంశాన్ని ‘ఖిలపర్వం (తర్వాత చేర్చబడినది)’ గా వ్యవహరిస్తారు].
ఉత్తరకాండలో వాల్మీకి రావణ, కుంభకర్ణ, విభీషణాదుల పుట్టుక, వివాహాలు, తపస్సు చేసి వరాలు పొందటం, వరగర్వంతో రావణుడు కుబేరుడు, ఇంద్రుడు మొదలైన వారి మీద యుద్ధానికి వెళ్ళటం, సీతాపరిత్యాగం, లవకుశుల జననం, సీత భూగర్భంలోకి వెళ్ళిపోవటం, రామావతార సమాప్తి ఇత్యాది ఘట్టాల గురించి చెబుతాడు. కానీ తులసీదాసు రావణాదుల పుట్టుక, తపస్సు మొదలైనవి బాలకాండలోనే చెప్పేస్తాడు. ఉత్తరకాండలో రాముడు రావణ వధానంతరం అయోధ్యకు మరలిరావటం, శ్రీరామ పట్టాభిషేకం, మొదలైన ఘట్టాలను వివరిస్తాడు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు గుహుడు కూడా వెంటవచ్చినట్లు చెప్పాడు. ఆ వర్ణనలు చదువుతూ ఉంటే మళ్ళీ ఎంతకాలానికి అయోధ్యను చూశాము? అనే భావన మనకు కూడా కలుగుతుంది. రామ సోదరుల సమాగమం, తల్లులందరూ సీతారాములను చూసి ఆనందించటం మొదలైన ఘట్టాలు ఆనందం కలిగిస్తాయి. కౌసల్యాదేవికి పాదాభివందనం చేసిన వానరవీరులను చూసి “మీరు కూడా నాకు రాముడితో సమానం. మీ ఇష్టమొచ్చినంత కాలం అయోధ్యలో సుఖంగా ఉండండి” అని అశీర్వదిస్తుంది.
వీటికి అదనంగా సనకసనందనాది ఋషులు శ్రీరాముడిని దర్శించి స్తుతించటం, ఇంద్రుడు, నారదుడు, వేదపురుషులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి రావణ బాధ వదిలించి లోకాలను రక్షించినందుకు శ్రీరాముడికి కృతజ్ఞతలు తెలుపుకుని, స్తుతించి వెళ్ళటం, రామరాజ్య వర్ణన, రాముడు సోదరులకు, అయోధ్యా ప్రజలకు హితోపదేశం చేయటం మొదలైన ఘట్టాలు చేర్చాడు. ఈ రామాయణ కథంతా పరమేశ్వరుడు పార్వతికి చెబుతాడు. వాటితో పాటు కాకభుశుండి కథ కూడా చెప్పినట్లు తులసీదాసు కల్పన చేశాడు.
సుమేరు పర్వతానికి ఉత్తరదిశలో ఒక అందమైన నీలపర్వతం ఉంది. దాని శిఖరాలు స్వర్ణమయాలు. ఆ పర్వతం మీద రావి, జువ్వి, మామిడి మొదలైన వృక్షాలు ఉన్నాయి. దానికింద మనోహరమైన సరోవరం ఉన్నది. కామక్రోధ లోభాల వంటి అంతః శత్రువులు ఆ పర్వతం దరిచేరవు. అందులో ఒక వటవృక్షం మీద కాకభుశుండి అనే పేరు గల కాకి నివసిస్తూ ఉంది. అది పూర్వ పుణ్యం వలన హరిభక్తి కలిగి ఉంటుంది. అక్కడికి అనేక పక్షులు వచ్చి ఆ సరోవరంలో స్నానమాడి కాకభుశుండి చెప్పే రామకథలను వింటూ ఉంటాయి.
ఒకసారి గరుత్మంతుడికి ఒక సందేహం వస్తుంది. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగాస్త్రం చేత బంధించినప్పుడు గరుత్మంతుడు వచ్చి వారిని బంధవిముక్తులను చేస్తాడు. అంతటి మహానుభావుడైన శ్రీరాముడు కూడా సామాన్యుడిలా నాగాస్త్రం చేత కట్టుబడి పోవటానికి కారణం ఏమిటి? అనే సందేహం వస్తుంది. వెళ్లి కుబేరుడిని అడుగుతాడు గరుత్మంతుడు. ఆ విషయం నాకు తెలియదు, బ్రహ్మను అడగగమని సలహా ఇస్తాడు కుబేరుడు. బ్రహ్మ కాకభుశుండి దగ్గరకు వెళ్లి సందేహనివృత్తి చేసుకోమని చెబుతాడు.
గరుత్మంతుడు కాకభుశుండి దగ్గరకు వెళ్లేసరికి అతడు ఇతర పక్షులన్నిటికీ రామాయణం వినిపిస్తూ ఉంటాడు. అది ముగిసిన తర్వాత తన సందేహం అడుగుతాడు గరుత్మంతుడు. అదంతా రాముడి మాయ అని చెప్పి రామనామ మహిమ గురించి, రాబోయే కలియుగ లక్షణాల గురించి వివరించి, కలియుగంలో పాపాలనుంచీ విముక్తి పొందాలంటే రామనామం ఒక్కటే మార్గం అని వివరిస్తాడు కాకభుశుండి.
కాకి జన్మనెత్తిన నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది అని మళ్ళీ అడుగుతాడు గరుత్మంతుడు. “బాల్యంలో శ్రీరాముడు తిరిగిన అన్ని ప్రదేశాలలోనూ నేను తిరిగాను. అయన బాల్యక్రీడలకు ముగ్డుడనై అయిదు సంవత్సరాలు అక్కడే గడిపాను. శ్రీరాముడు బాల్యంలో నాతో ఆడుకున్నాడు. ఆ పుణ్యం వలన నాకు ఈ జ్ఞానం కలిగింది” అని చెబుతాడు. దానితో పాటు భక్తి మార్గ వైశిష్ట్యాన్ని కూడా చెబుతాడు. గరుడుడు అడిగిన “అన్నిటికంటే దుర్లభమైనది ఏది? సజ్జనుల లక్షణాలు ఎలా ఉంటాయి? దుర్జనుల లక్షణాలు ఎలా ఉంటాయి? శృతులలో చెప్పిన పుణ్యకార్యాలు ఏవి?” ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సందేహనివృత్తి చేస్తాడు కాకభుశుండి. ఈ కాకభుశుండి వృత్తాంతం కూడా అవాల్మీకం.
చివరిగా శ్రీరామ కథాశ్రవణ ఫలము గురించి కూడా చెప్పి “భవానీ! నా బుద్ధిబలముతో ఈ కథను నీకు వినిపించాను. ఈ రామకథ జననమరణ రూప వ్యాధులను నిర్మూలించు సంజీవని వంటిది. ఈ కథ విన్నవారికి, వినిపించిన వారికి, గానంచేసిన వారికి సంసార సాగరం గోష్పాదంలా దాటగలిగి చివరికి ముక్తిని ఇస్తుంది” అని చెప్పి ముగిస్తాడు పరమేశ్వరుడు. ఇవీ రామచరిత మానస్‌లో వాల్మీకి రామాయణంలో లేని కల్పనలు!
కొసమెరుపు: హనుమంతుడి గుణాలు అయిన బుద్ధిబలం, ధైర్యం, జ్ఞానం, బ్రహ్మచర్యం, రామభక్తి మొదలైనవి తెలియజేసే ‘హనుమాన్ చాలీసా’ తులసీదాసు అవధి భాషలో రచించిన రామచరిత మానస్ లోనిదే! చాలీస్ అంటే హిందీలో నలభై అని అర్ధం. ఇది నలభై ‘దోహా (శ్లోకాలు)’ లుగా రచించబడింది. రామచరిత మానస్‌నే తులసీ రామాయణం, తులసీదాస్ రామాయణం, మానస్.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు.
“శ్రీరామకృతి కర్తారం, భక్తలోక శిరోమణిమ్
వందేహం తులసీదాసం, మహాకవి వతంసకంమ్”
(శ్రీరామకృతిని రచించినవాడు, భక్తులలో శిరోమణి వంటివాడు, మహాకవి వతంసుడైన తులసీదాసుకు నమస్సులు)
(సమాప్తం)

గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
8 Comments
గంగిశెట్టి లక్ష్మీనారాయణ
గోనుగుంట గారి కృషి ప్రశంసనీయమైంది. తులసీలో అవాల్మీకాలను సరళ సుందరంగా తెలియబరిచారు. అభినందనలు.

గోనుగుంట మురళీకృష్ణ
ధన్యవాదాలు లక్ష్మీ నారాయణ గారూ! జనబాహుళ్యంలో ప్రచారంలో లేని లోతైన విషయాలు రాయటం నాకు ఇష్టం…చదివే వారు ఉంటే ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
Shyamkumar Chagal. Nizamabad
రామాయణం కు సంబంధించిన విషయాల ను వ్యాస రూపంలో అందించిన రచయిత గారికి ధన్యవాదాలు. ప్రత్యేక అభినందనలు.
గోనుగుంట మురళీకృష్ణ
ధన్యవాదాలు శ్యామ్ గారూ! నేను ఎప్పుడూ ప్రశంసలే కోరుకోను. సద్విమర్శలు కూడా స్వీకరిస్తాను. నా రచనల్లో మీకు నచ్చని పాయింట్స్ ఉంటే నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
నంద్యాల సుధామణి
‘రామాయణంలో అవాల్మీకాలు’ అప్పుడే అయిపోకుండా మరికొన్ని రోజులు కొనసాగి వుంటే బాగుండేదనిపించింది. రచయితగారికి అభినందనలు!!
గోనుగుంట మురళీకృష్ణ
ఒక రచన అప్పుడే అయిపోయిందా అనిపిస్తే ఆ రచన సక్సెస్ అయినట్లే అని నేను భావిస్తాను. యద్దనపూడి సులోచనారాణి నవల 300 పేజీలు చదివినా, అప్పుడే అయిపోయిందా , ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది………మీ సానుకూల దృక్పథానికి ధన్యవాదాలు.
GitacharYa
Very well researched series with great details. Not many people are capable of reading both texts to know what is what. This series helps the readers to understand popularised myths that’re included in Sri Ramayana narrative based on these A-Valmika threads. But these, especially from the likes of Tulsidas and Molla added new flavours to the great itihaasa.
Sri Gonuguntla Murali Krishna గారు pulled off an excellent feat.
గోనుగుంట మురళీకృష్ణ
Thank you for your encouragement and positive response Sir!