***
ప్రముఖ గాయని శ్రీమతి మల్లాది కనకరత్నంగారు విజయవాడలో పుట్టి పెరిగారు. శ్రీ మోగంటి వెంకట సుబ్బారావు, హేమలతల గార్లకు ఈమె ద్వితీయ పుత్రిక. బాల్యం నుంచీ సంగీతం పట్ల ఎనలేని ప్రేమ వల్ల సంగీత శిక్షణలో ప్రవేశించడం జరిగింది. ప్రముఖ వయొలనిస్ట్- శ్రీ ఎన్ సీ హెచ్ కృష్ణమాచార్యులు మరియు శ్రీ మల్లాది సూరిబాబుగార్ల దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. అటు పిమ్మట శ్రీమతి కనకరత్నంగారు విజయవాడ ఆకాశవాణిలో బి గ్రేడ్ ఆర్టిస్టుగా పనిచేసారు.
చదువు, ఉద్యోగ రీత్యా సంగీతాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోయినా తన భర్త శ్రీ మల్లాది శ్రీ కృష్ణారావు గారి ప్రోత్సాహం వల్ల తను అనేక సంగీత కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని చెబుతారు. బాంక్ ఉద్యోగినిగా పదవీ విరమణ చేసాక సంగీతం పట్ల మరింత శ్రధ్ధ వహించడానికి వీలు చిక్కిందంటూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రముఖ విద్వాంసులయిన శ్రీమతి రేవతి రత్నస్వామిగారి శిష్యరికంలో హైదరాబాద్, బెంగళూరు, మైసూరు మరియు పలు అంతర్రాష్ట్రాలలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ట్విన్ సిటీస్‌లో జరిగే భక్తి, లలితగీతాలతో బాటు సినీ సంగీత కార్యక్రమాలలో తరచూ పాల్గొంటూ, తన మధుర గానంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లతా మంగేష్కర్ అంటే తనకి ప్రాణమంటూ వీరాభిమానిగా ప్రకటించుకునే శ్రీమతి కనకరత్నంగారు లత గారి పాటలను పాడి మెప్పించడంలో పెట్టింది పేరు. తెలుగులో సుశీల, జానకి, జమునారాణి, వాణీ జయరాలను గీతాలను అత్యంత అద్బుతంగా ఆలపించి ఔరా అనిపించే మధుర గాయని ‘సుస్వర రత్న’ శ్రీమతి కనకరత్నం గారితో జరిపిన ఈ ఇంటర్వ్యూని మీకు అందిస్తున్నాను. చదివి మీ విలువైన అభిప్రాయాలను అందచేస్తారు కదూ!
> నమస్కారమండి, కనకరత్నంగారు. ఎలా వున్నారు?
* నమస్తే అండి. బాగున్నా, సంగీతంలో మునిగి తేలుతూ.. (నవ్వులు)
> గానం అంటే మీకు ప్రాణమని చెబుతుంటారు. సంగీతం నేర్చుకోడానికి మీకు స్ఫూర్తినిచ్చినవారు ఎవరు?
* సంగీతం పట్ల అభిరుచి కలగడానికి కారణం మా అమ్మగారు కీర్తి శేషులు హేమలతగారు. వయొలిన్ కూడా నేర్చుకున్నారు. మా పిన్నిగారు కూడా మంచి గాయని. వీరిద్దరే నాకు స్ఫూర్తిప్రదాతలు అని చెప్పాలి.
> కీర్తనలు నేర్వడానికి ఎంత కాలం పట్టింది?
* ఒక యేడాది లోనే… కీర్తనలు నేర్పారు – మా గురువులు శ్రీ ఎన్.సీ.హెచ్.కృష్ణమాచార్యులు గారు. ఆయన శాస్త్రం బాగా తెలిసిన మహావిద్వాంసులు. ఆయన మమ్మల్నెప్పుడూ కోప్పడేవారు కారు. ఆనందంగా వుండేది సంగీతం నేర్చుకోడానికి.
> లలిత గీతాలు గానం చేస్తున్నప్పుడు మీరెలాటి అనుభూతిని పొందారు?
* లలిత గీతాలు పాడేటప్పుడు, రాగం, భావం ముఖ్యం. అవి దేశ భక్తి గీతాలయినా, భావ గీతాలైనా, భక్తి గీతాలయినా. అయినా ఏ గీతాన్ని ఆలపించినా ఆ యా రస భావాలను గుండెలో నింపుకుని, గళంలో కదిలించగలిగి వుండాలి. సంగీతంతో బాటు గళంలో భావానికీ ప్రాధ్యాన్యత ఇవ్వడం వల్ల శ్రోతల హృదయాలను రంజింపచేయగల్గుతారు సింగర్స్. మనం పాడే పాట – వింటున్న వారికి గుర్తుండి పోవాలంటే ముఖ్యంగా మెలోడీకి ప్రాధాన్యత నివ్వాలి. ఈ సూత్రాలన్నీ చిన్నప్పట్నించీ మా గురువులు మాకు నేర్పించడం జరిగింది. బాల్యంలో రేడియో ప్రోగ్రామ్స్‌కి వెళ్లినప్పుడు శ్రీ ఏడిద కామేశ్వరరావుగారు మాకివన్నీ నేర్పించారు. అలానే, లలిత గీతాలను శ్రావ్యంగా ఆలపించే విధానంలోని మెలకువలను నేర్పిన గురువు గారు – శ్రీ మల్లాది సూరిబాబు గారు! ఎంతో ఓర్పుగా నేర్పేవారు. చాలా మంచి గురువులు. వారితో కలిసి పాడేటప్పుడు మాకెంత ఆనందంగా వుండేదో!
> ఎన్ని లలిత గీతాలు పాడారు సుమారు?
* చాలా పాడాను. చిన్నప్పట్నించి, పాడుతునే వున్నాను. లెక్కబెట్టలేదెప్పుడూ..
> ఇప్పుడవన్నీ మేము వినాలంటే ఎలా?
* రికార్డ్ అయి లేవు కానీ, వినాలనుకుంటే, నా దగ్గరకు రావచ్చు.
> నిజమే అనుకోండీ, మీకు గుర్తున్న గీతాలను పాడి, రికార్డ్ చేసి, యూట్యూబ్‌లో వుంచితే ఎక్కువమంది వినే అవకాశం వుంటుంది కదా?
* నిజమేనండి. మంచి ఐడియా ఇచ్చారు. థాంక్స్. తప్పకుండా అలా చేస్తాను
> లలిత గీతాలు ఎంతో రమ్యంగా శ్రావ్యంగా వున్నా, వాటికి సినిమా పాటలకున్నంత పాపులారిటీ లేకపోడానికీ, ప్రజాదరణ పొందకపోడానికి కారణం ఏమై వుంటుందని భావిస్తున్నారు?
* సినిమా గీతాలూ లలిత గీతాల్లోంచి వచ్చినవే. ఘంటసాల, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, ఎస్. రాజేశ్వరరావు గారు వంటి మహామహా సంగీత ఘన ప్రావీణ్యులు సయితం లలిత గీతాల ద్వారా ప్రఖ్యాంతి గాంచిన వారు కాదూ?- అప్పట్లో ఆల్ ఇండియా రేడియో, హెచ్.ఎం.వి రికార్డ్స్ ద్వారా – లలిత గీతాలు తెలుగు నాట మారుమోగిపోతుండేది. బాలసరస్వతి దేవి గారు, ఘంటసాల, పి.బీ.శ్రీనివాస్, ఎస్.జానకి వంటి గొప్ప గొప్ప గాయనీ గాయకులు – లలిత గీతాలకు జీవం పోసారు. లలిత గీతాలనించి సినిమా పాటల వరకు ఎదిగినా, ఘంటసాల మాస్టార్ గారు, లలిత గీతాలను వీడలేదు. ప్రైవేట్ రికార్డ్స్ పాడి ప్రియ శ్రోతలకు మరింత దగ్గరయ్యారు అంటేనే మనకర్ధమౌతుంది, లలిత సంగీతానికి – సినీ గాయకులెంత ప్రాధాన్యత నిచ్చారో అన్న సంగతి! ఇప్పటికీ లలిత సంగీతానికి ప్రాముఖ్యత వుంది కానీ, అంతగా పాపులర్ కావడం లేదు. ముఖ్యంగా బాలలకి దేశభక్తిని ప్రబోధించే లలిత గీతాలు విస్తృతంగా రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే బాల్యంలోనే దేశం పట్ల పిల్లల మనసుల్లో దేశభక్తిని కలిగించాలి. ఆ భావాన్ని పెంపొందించే శక్తి లలిత గీతాలలో మెండుగా కనిపిస్తుంది.
> అలా లలిత పదాల మీద తేలుతూ… ఇలా సినీ గీతాలాపనలలోకి ఎలా మారారు?
* నేను అన్ని రకాల సంగీతాన్ని లైక్ చేస్తానండి. సంగీత శాస్త్రం, లలిత గీతాలు, సినీ గీతాలు అన్నిట్నీ ఇష్టపడతాను. ఇప్పుడు మనకి సినీ సాంగ్స్ షోస్ ఎక్కువగా అందుబాటులో వున్నాయి కాబట్టి, ఎక్కువగా సినిమా పాటల వేదికపై కనిపిస్తున్నాను కానీ ఇదే స్థాయిలో లలిత గీతాలు ఆలపించడానికి కనక అవకాశం కల్పిస్తే – ఆ వేదికలపై కూడానూ నేనెప్పుడూ సిధ్ధమే.
సినీ గీతాలు పాడినా మెలోడీకే నా ప్రాధాన్యత. దేశభక్తి గీతాలు కూడా ఎక్కువగా పాడుతుంటాను.
> మీకెన్నో బిరుదులు వున్నాయని తెలిసింది..!
* (నవ్వి) – నిజం చెప్పాలటేనండీ, బిరుదులు సత్కారాలు అంటే బిడియపడుతుంటాను. ఏం సాధించానని బిరుదులివ్వడం? అని అనిపిస్తుంది. అయినా ఆత్మీయ సత్కారాలు అందుకున్నాను. అలానే బిరుదులూ స్వీకరించాను. ప్రముఖులు పిలిచి, ప్రేమగా ఆదరణగా ఇస్తున్నప్పుడు కాదనలేకపోయాను. గత మూడేళ్ళుగా ప్రొఫెసర్ శ్రీదేవి గారి సొంత సంస్థ – వీణాపాణి కళానిలయం – ఉషా ఉతప్ గారి మ్యూజిక్ వైబ్రేషన్స్ సంయుక్తంగా నిర్వహించే తెలుగు హిందీ సినీ గీతాల కార్యక్రమాలలో తరచుగా పాల్గోనడం జరుగుతోంది. వారు ‘సుస్వర రత్నం’ అని, వారి అనుబంధ సంస్థ – ‘పవర్ ఆఫ్ మెలొడీ’ (బోంబే) వారు ‘మెలొడీ క్వీన్’ అనీ బిరుదులిచ్చి సత్కరించారు. స్వర మాధురి సంస్థ అధినేత్రి శ్రీమతి సాయి పావని గారు – ‘సంగీత స్వర మాధురి’ అని, శ్రీదేవి గారు – ‘సుస్వర కోకిల’ అంటూ బిరుదులిచ్చారు. సంతోషంగానే వుంటుంది. కానీ, ఇవన్నీ సరస్వతి మాత కృప వల్ల అందుకున్న కానుకలు కాబట్టి, ఇవన్నీ ఆ తల్లికే చెందుతాయి.
> సాంప్రదాయ సంగీత పరిజ్ఞానం వల్ల లలిత గీతాలకున్నంత ప్రయోజనం సినీ గీతాలకు చేకూరదంటారు… ఎంత వరకు నిజమంటారు?- కనీసం మీ విషయంలో ఎంత వరకు ఋజువైందని తెలుసుకోవాలనుంది.
* ఇది అస్సలు నిజం కాదండి. సంగీత పరిజ్ఞానం గల గాయకునికి ఈ సంగీతం, ఆ సంగీతం అనే భేదముండదు. సంగీతంలో ఏ విభాగానికి చెందిన గీతమైనా సరే, దాని తత్వమెరిగి వుంటారు. ఏ గీతాన్ని ఎలా పాడాలో, ఆ పాటకి ఎంత వరకు న్యాయం చేయగలమా అని మాత్రమే ఆలోచిస్తారు. చిత్తూరు నాగయ్య గారి నించి, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, పి.బి. శ్రీనివాస్, చిత్ర, లత, రఫీ, మన్నాడే – ఆ కాలం నించి నేటి తరం శ్రియ వరకు – వీరందరూ అన్ని తరహాల పాటలూ పాడి మనల్ని మెప్పించారూ అంటే – సంగీత పరిజ్ఞానం వల్లే సాధ్యమైంది. నా వరకు నేను చెప్పాలీ అంటే, సంగీతంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించకున్నా, శృతి, లయ తాళం పట్ల మంచి అవగాహన వుందీ అంటే అది నా గురువులు నాకు పెట్టిన బిక్ష అని చెప్పుకుంటాను. రాగ ఛాయల అవగాహనలో శిక్షణనిచ్చారు.
> సంగీత ఛాయలేవీ పడనీకుండా సినీ గీతాలను ఆలపించడం కష్టమనిపించదా, సంగీతజ్ఞులకు?
* శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా, వాటి పోకడలు పడనీకుండా సినీ గీతాలను అద్భుతంగా ఆలపించే సామర్ధ్యం, కేవలం సంగీత పరిజ్ఞానం గల వారికి మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం. అందుకు బాలమురళీకృష్ణ, జేసుదాస్, బోంబే జయశ్రీలను ఒక గొప్ప సోదాహరణగా పేర్కొనాలి. వాళ్ళు సంగీతంలో మహ దిట్టలు అని అభివర్ణిస్తుంటారు. మరి, వారెన్ని సినీ గీతాలను పాడి ప్రేక్షకుల మనసులని చూరగొనలేదూ, చెప్పండి. అయితే కొందరు శాస్త్రీయ సంగీత పండితులు సినీ గీతాలను పాడేందుకు ఇష్టపడరు. వారు వారి రంగంలో నిష్ణాతులై, అదొక తపస్సుగా భావిస్తూ, ఆ రంగం లోనే వుండిపోతుంటారు. అది వారి వారి మనోభీష్టానికి సంబంధించిన విషయం. అంతే.
> శాస్త్రీయ సంగీతానికి – సినీ సంగీతానికి మధ్య గల దూరాభారాలు, లేదా దగ్గరతనాలేమిటంటారు?
* ఏ గీతానికైనా – సంగీతం లోని సరిగమపదనిస సప్తస్వరాలే మూలాధారం. ఏ సినిమా పాటైనా సరే సంగీత శాస్త్రంలో చోటు చేసుకున్న ఆ యా రాగాల్లోంచి రావాల్సిందే తప్ప మరో మార్గం లేదు. శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం లేని వారు సినీ సంగీత దర్శకులు కాలేరు, రాణించలేరు. సంగీతం తెలీకుండా, పాటలకు రాగాలను సమకూర్చలేరు. సినిమాలోని సన్నివేశాలకనుగుణంగా రసప్రధానంగా రాగాలను ఎంచుకుని, అందులో మెలోడీ జొప్పించి, గమకాలను గుప్పించి పాటలను కంపోజ్ చేయడం ఎలా సాధ్యమౌతుందంటే -సంగీతంలో మంచి పట్టు సాధించడం వల్ల మాత్రమే తప్ప మరొకటి కాదు. తెలుగు, హిందీ సినిమాలలో కొన్ని చిత్రాలు చూడండి, కేవలం పాటల వల్లే అవి ప్రాచుర్యం పొందిన సందర్భాలున్నాయి. మరి శాస్త్రీయ సంగీతం – సినీ సంగీతానికి ఎంత దగ్గరో కదూ?
> సినిమా గీతాలు పాడి మెప్పించేందుకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అవసరమంటారా? విని పాడలేమా?
* శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం వుంటే పాట వినికిడితో, పాటలోని మెలకువలను ఇట్టే పట్టేయొచ్చు. బాలూ గారు, జానకి గారు కూడా వినికిడి జ్ఞానంతోనే సినీ రంగంలో ప్రవేశించిన మేధావులు అని చెప్పాలి. అయితే, వృత్తి రీత్యా, మహా విద్వాంసుల వద్ద చేరి, వారి సలహాలు, సూచనలు పాటించడం జరిగింది. మరి ఎంత గొప్ప గొప్ప సంగీత దర్శకుల బాణీలను పాడి మెప్పించగలిగారని!! ఇదంతా కూడా శాస్త్రీయ సంగీత పరిజ్ఞాన్ని పుణికిపుచ్చుకోవడమే కదా!
> ఒక సినిమా పాట పాడుతున్న గాయని గాత్రం విని, ఈమెకి సంగీతంలో ప్రవేశముందో లేదో ఇట్టే తెలుసుకోగలమా?
* తెలుసుకోవచ్చు. లేకపోనూ వచ్చు. ఈ రోజుల్లో, పాటలను సాధన చేసుకునే అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి కరఓకె. ఈ ప్రాక్టీస్‌తో బాగా రాణిస్తున్నారు. సినిమా పాటలను చక్కగా ఆలపిస్తున్న నూతన గాయనీ గాయకులని మనం చూస్తున్నాం కదా!
> సినిమా పాటల వల్ల, శాస్త్రీయ సంగీత కచేరీలకు ప్రాముఖ్యత తగ్గిందంటుంటారు.. మీ అభిప్రాయం?
* కొంత కాలం క్రితం వరకు ఈ స్టేట్మెంట్ నిజమే. కానీ ఈ కాలంలో శాస్త్రీయ సంగీత ప్రాముఖ్యతని గుర్తించి తిరిగి ఆదరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అని అన్ని వసతులూ అందుబాట్లో వుంటం వల్ల, పిల్లలు తమ గానాన్ని నానాటికి మెరుగు పరుచుకోగల్గుతున్నారు. సంగీతం రంగంలో ఇదొక మంచి పరిణామమని చెప్పడానికి సంతోషంగా వుంది.
> శంకరాభరణం చిత్రంపై మీ అభిప్రాయం?
* గొప్ప సినిమా కదండీ. మంచి తరుణంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన శంకర శాస్త్రి గారి రూపకల్పన ఎంత గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందీ అంటే, తెలుగునాట చాలా మందిని ఉర్రూత లూగించింది. శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని మనదైన కర్నాటక సంగీతానికి జీవం పోయాలనిపించేంత గొప్ప ఉత్తేజాన్ని నింపింది. దర్శకుని కృషి ఫలించింది. అప్పట్నించే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చేవారి సంఖ్య పెరిగిందని చెప్పాలి. అందుకే అంటారు, సినిమా పవర్ఫుల్ మీడియా అని. ఈ సినిమాకి ఆశయ సిధ్ధి వుంది. అది సిధ్ధించింది.
> మీకు అవకాశం వస్తే, సంగీత కచేరీలు చేయడానికి సిధ్ధమేనా?
* లేదండి.. అంత ప్రాక్టీస్ లేదు.
> సినిమా పాట పాడటం వల్ల సంతృప్తి కలుగుతుందా లేక శాస్త్రీయ సంగీత కృతులు పాడటం వల్ల ఆనందం కలుగుతుందా?
* నాకు భక్తి సంగీతం అంటే ఇష్టం. త్యాగయ్య, జయదేవులు, అన్నమయ్య, పురంధర దాసు, కబీర్ దాసు, రామదాసు, తులసీ దాసు, నారాయణ తీర్ధులు, సదా శివబ్రహ్మేంద్ర కీర్తనలు, మీరా భజన్స్ – వీరి భక్తి తత్వ సాహిత్యంలో లీనమై, పాడుకుంటాను. అవి పాడుతూ, భగవంతుణ్ణి దర్శించుకుంటున్న మధురానుభూతికి లోనవుతాను.
> హిందీ సినిమా పాటలకీ, తెలుగు పాటలకీ మధ్యన ఏదైనా వ్యత్యాసం వుందని గుర్తించడం జరిగిందా, వుంటే అది ఏమిటి, ఎలా?
* శ్రావ్యమైన రాగాలతో కూడిన సినీ గీతాలంటే నాకు మహా ప్రాణం. భాషా భేదం వుండదు అలాటి మెలోడీస్కి. అలానే, భక్తి సంగీతం పాడుతూ దేవుడికి చేరువలో వున్నట్టు ఫీలౌతాను. అదే అల్టిమేట్ కదా, జీవితానికి. మనం మాట్లాడే భాషల్లో వ్యత్యాసమున్నట్టే, హిందీ లోనూ వుంటుంది. ప్రాంతాలవారీగా కొంచెం యాస వున్నా, భావం ఒకటే.. సాహిత్యం ఏదైనా సంగీతం ఒక్కటే. తెలుగు సింగర్స్ పర భాషా చిత్రాలలో పాడేటప్పుడు వారు ఆ భాషని సొంతం చేసుకుని పాడుతుంటం గమనిస్తే, నాకెంతో గర్వంగా వుంటుంది. వారే నాకు ఆదర్శం…సాధ్యమైనంత వరకు, పర భాషా గీతాలను ఆలపించే ముందు ఉచ్చారణా దోషాలు పలకకుండా జాగ్రత్త పడతాను.
> సింగర్‌గా మీ కెరీర్లో మీరు మరచిపోలేని జ్ఞాపకంగా జరిగిన సంఘటన ఏమైనా వుందా?
* మా గురువు గారు మల్లాది సూరిబాబు గారి ప్రశంస నాకు వెలలేని అవార్డ్ వంటిదని ఒప్పుకోవాలి. ఎలా అంటే, ఆయన అంటుండేవారు, లతాజీ పాట వింటుంటే నీ స్వరం గుర్తొచ్చింది అన్నప్పుడు – గురువు గారి ఆశీస్సులకి చెప్పలేనంత ఆనందమేసేది. మరో మరపు రాని ఘట్టం – వీణాపాణి సంస్థ ద్వారా బిరుదులు, ప్రశంసలనందుకుంటున్నప్పుడు కూడా.. ఒక మరపు రాని ఘట్టం అనే చెప్పాలి. తలచుకుంటే ఎంతో గర్వం గా వుంటుంది. ప్రొఫెసర్ శ్రీదేవి గారు నిర్వహించే ప్రోగ్రామ్స్ – మ్యూజిక్ వైబ్రేషన్స్ సంస్థతో అనుబంధమై వుంటం ఒక విశేషం. సుశీల గారిలా పాడారన్న అభినందన నేనెప్పటికీ మరువలేను. ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది ఏ సింగర్‌కైనా!! అని సంతృప్తి కలుగుతుంది. అంతటి మహా గాయనీ మణులతో పోల్చడం కేవలం ఒక ఉపమానంగా తీసుకోవాలి మనం. అలాటి భావన కల్గించింది నా స్వరం అని ఆనందం తప్ప నిజానికి ఆ మహా గాయనీమణుల వంటిదాన్ని అని భావం కాదు అని మనవి చేసుకుంటున్నానంతే.
మరో మధుర సంఘటన ఏమిటంటే –
ఒకసారి మా బాంక్ ఆధ్వర్యాన జరుగుతున్న ఫంక్షన్‌కి యన్.టి.రామారావుగారు విచ్చేసారు. అప్పుడు వారెదుట నేను పాట పాడాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ.. పాట పూర్తి చేసి స్టేజ్ దిగి వెళ్తుంటే, ఆయన నన్నాగమని చెప్పి, పూల హారాలు ఇచ్చారు. ఇస్తూ ‘చాలా బాగా పాడారు’ అంటూ ప్రశంసించేసరికి ఏనుగు అంబారి ఎక్కినంత ఆనందమేసింది. అంతటి గొప్ప నటుడు – ఆ నిండు సభా ప్రాంగణంలో నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, ప్రశంసించడం – ఎంతో అద్భుతమైన సన్నివేశం అని చెప్పాలి. – ఆ పరవశానుభవం నాకెప్పటికీ మరువరాని మధుర జ్ఞాపకం.
> మనం నేర్చిన కళ – ప్రదర్శనల ద్వారా కానీ వెలుగొందవు. కానీ అవన్నీ కాసుతో కూడుకునుంటాయి అని బాధపడుతుంటారు కళాకారులు. మరి మీరేమంటారు?
* మీరన్నది నిజమే. అయితే పెద్ద పెద్ద కళాకారుల జీవిత చరిత్రలను చదువుతుంటే మనకు అర్థమౌతుంది, వారెన్ని కష్హ్టాలూ పడ్డారో, ఎన్నేసి అవమానాలను దిగమింగారో, ఎన్ని ఆటంకాలను అవరోధాలను దాటుకుని ముందుకడుగేసారో కదా, ఇంత గొప్ప విజయాన్ని సాధించే ముందు అని తెలుసుకుంటే మనం పడుతున్న కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అయితే ఈ రోజుల్లో అందరకీ తొందరే. రాత్రికి రాత్రే సక్సెస్ రావాలని, సెలెబ్రెటీ అయిపోవాలని.. ఆశపడుతుంటారు. పక్క దార్లను నమ్ముకుంటారు. కానీ అది పొరబాటు అని నా అభిప్రాయం. సాధన వల్లే సంగీతం సాధ్యమౌతుందని నా నమ్మకం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నండి.
> కళలను పోషించడం, రాజుల బాధ్యత కదా, మరి ప్రభుత్వం నించి సింగర్స్‌కి ఎలాటి ప్రోత్సాహ సహాయ సహకారాలు దొరుకుతున్నాయని భావిస్తున్నారు?
* ప్రభుత్వం కాలేజీల ద్వారా అనేక కోర్సులని ప్రవేశపెట్టి ప్రోత్సహించినా, ఎంతమంది కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారనేది పెద్ద ప్రశ్న. అలానే, ప్రభుత్వం వారు ప్రతి నగరంలోనూ – కళాకారుల ప్రదర్శనల కోసం ఉచిత కళా నిలయాలను, ఆడిటోరియం వసతులను నెలకొల్పాలి. తద్వారా ప్రదర్శనలకయ్యే ఖర్చు తగ్గుతుంది. అందుచేత కళాప్రదర్శనలకి విస్తృతమైన వీలు, తద్వారా కళలు ప్రాచుర్యం పొందడం జరుగుతుంది. కళాకారులకి తమ కళలల్ని ప్రదర్శించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ అంశం గురించి – సాంస్కృతిక శాఖ వారు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను.
> కళా పోషకుల అవసరం వుందంటారా?
* కళా పోషకులు అవసరం ఎంతైనా అవుందండి. ఇప్పుడూ మనకూ వున్నారు, కానీ తక్కువమంది మాత్రమే ముందుకొస్తున్నారు. ఇంకా ఎందరో దాతలు ఈ అభిరుచిని పెంచుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అందరూ చేయూతనిస్తేనే కళలు పది కాలాలపాటు ప్రదర్శనలతో కళకళలాడుతూ వర్ధిల్లుతాయి.
> మీకు తమ సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు కానీ, సంస్థలు గానీ వున్నాయా?
* నాకు నా కుటుంబపరంగా చూసుకుంటే నాకు నా వాళ్ళ ప్రోత్సాహం పూర్తిగా వుంది. మా నాన్నగారు చాలా అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. బేటీ బచావ్, బేటీ పఢావో అనే నినాదానికి నిండు నిర్వచనంగా నిలిచారు. ఆడపిల్లలందరకీ మగపిల్లలతో సమానంగా చదువులు చెప్పించారు, బయటనించి ఐతే, ప్రొఫెసర్ శ్రీదేవి గారి వీణాపాణి సేవా సాంస్కృతిక సంస్థ – మ్యూజిక్ వైబ్రేషన్స్ వారి సమ్యుక్త ఆధ్వర్యాన ప్రతి నెలా రెండు సినీ గీతాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఆ యా వార్షికోత్సవాల సందర్బంగా టాలెంటెడ్ సింగర్స్‌కి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తూ, బిరుదు ప్రదానాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు సింగర్స్. కేవలం ప్రతిభ పాటవాల ఆధారంగానే ఈ సంస్థలో గుర్తింపు దొరుకుతుంది. ఈ పాటలను జాతీయ స్థాయి సీనియర్ సింగర్స్ పరిశీలిస్తారు. వారి పర్యవేక్షణలోనే టాలెంటెడ్ సింగర్స్‌ని విజేతలుగా నిర్ణయిస్తారు. గాన కళా పోషణలో ఇలాటి సాంస్కృతిక సంస్థలు ఇంకా ఎన్నెన్నో ముందుకు రావాలని ఆభిలషిస్తున్నాను.
> మీ సిస్టర్స్ గురించి.. కూడా చెప్పండి వాళ్ళకీ సంగీతంలో ప్రవేశం వుందని విన్నాను.
* మా సిస్టర్స్ అందరకీ సంగీతం అంటే ఇష్టం. మా అక్క సౌందర్య గారు బాంక్ ఆఫీసర్‌గా పనిచేస్తునే వీణలో ఎం.ఎ. చేశారు. ఇప్పుడు ఎంతోమంది విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నారు. శిక్షణా తరగతులను నిర్వహిస్తూ మంచి గురువుగా గుర్తింపు పొందారు. నా తర్వాత సిస్టర్స్ ముగ్గురూ పి.హెచ్.డి. చేసి, వారి వారి రంగాలలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, సంగీతాన్ని హాబీగా చేసుకున్నారు. సంగీతం వింటారు. సద్విమర్శలు చేస్తారు. నాకు వారి సలహాలూ సూచనలూ ఎంతగానో తోడ్పడతాయి.
> మీ అబ్బాయి డాక్టర్ కం సింగర్ కదూ? మీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకునారా?
* మా అబ్బాయి డా. బాల విద్యాధర్. స్కూల్ నించి కూడా ఆల్‌రౌండర్. క్రమశిక్షణని పాటిస్తాడు. కొంతవరకు సంగీతం నేర్చుకున్నాడు. స్కూల్ లో రామాచారి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. చిన్నప్పుడే పియానోలో లండన్ కాలేజ్ వారి ఎగ్జాంలో టు గ్రేడ్స్ సర్టిఫికెట్స్ విత్ మెరిట్ – పొందాడు. ఇప్పుడు సమయం దొరకట్లేదు. స్టేజ్ మీద పాడతాడు కానీ ప్రొఫెషన్లో బిజీగా వుంటంతో.. అప్పుడప్పుడు సినీ గీతాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. సంగీత విద్వాంసుల గురించి విశేషాలు చెబుతుంటాను, అన్నీ శ్రధ్ధగా వింటాడు.
> మీరు ఏం చేస్తుండేవారు ప్రొఫెషనల్‌గా? ఇప్పుడు?
* నేను బాంక్‌లో ఆఫీసర్‌గా పని చేస్తూ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అంతకు ముందు ఎమ్మెస్సీ బాటనీ కాబట్టి, తెనాలిలో కాలేజ్ లెక్చరర్‌గా చేసాను. బాంక్ జాబ్ తర్వాత, రామోజీ ఫిల్మ్ సిటీలో రీజినల్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చర్‌గా కూడా పని చేసాను. ఇప్పుడు మాత్రం, పాటల మీదే మక్కువ చూపిస్తున్నాను.
> భవిష్యత్తు లో సంస్థ స్థాపించాలనుకుంటున్నారా?
* సొంత సంస్థ వుంటే బావుంటుందనిపిస్తోంది కానీ, అందులో సాధక బాధకాలున్నాయని తెలుస్తోంది.. ఏమో ఏం చేస్తానో మరి తెలీదు.
> మీ అభిమాన గాయని? గాయకులు?
* నా అభిమాన గాయని ఆరాధ్య దేవత గాన కోకిల లతామంగేష్కర్ గారు. ఆమె పాట అంటే పడి చస్తాను. ఘంటసాల, సుశీల, రఫీ, మన్నాడే జేసుదాస్ గారు అంటే చాలా చాలా ఇష్టం.
> కర్నాటక సంగీతంలో – మీరభిమానించే గాయకులు, గాయనీమణులు?
* ముందుగా మహా విద్వాంసులు – బాల మురళీ కృష్ణ గారు, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు, శ్రీ రంగం గోపాల రత్నం, వింజమూరి లక్ష్మి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మా గురువు గారు శ్రీ మల్లాది సూరిబాబు గారు, వీరందరంటే ఎంతో నాకు చాలా ఇష్టమండి. మా గురువు గారి పిల్లలు – చిరంజీవి ప్రసాద్, రవి కూడా ప్రఖ్యాత కర్నాటక సంగీత కళాకారులయ్యరు. చాలా సంతోషంగా ఉంటుంది వారిని అలా ఉన్నత స్థాయిలో చూస్తున్నందుకు. హిందుస్తానీలో – బడే గులాం ఆలీ ఖాన్, బిస్మిల్లా ఖాన్, అమీర్ ఖాన్ గారు, హరిప్రసాద్ చౌరాసియా, గిరిజా దేవి గారు, ఇలా చాలా పెద్ద లిస్టే వస్తుంది, చెప్పుకుంటూ పోతుంటే. కిషోరి అమోంకర్ గారంటే చాలా అభిమానం. ఆవిడ గాన తపస్విని. స్వర సాక్షాత్కారం చేసుకున్న గాయనీమణి. వీరు నాదోపాసన చేసిన, సరస్వతీ మాత సంతానం. ముద్దు బిడ్డలని భావిస్తాను. స్వర సాక్షాత్కారం పొందిన మహానుభావులు. వారందరకీ నా పాదాభివందనాలు.
> మీరు స్వయంగా సంగీతం సమకూర్చి స్వరపరచిన గీతాలేమైనా వున్నాయా?
* ఏమీ లేవండీ. ఒక సారి ప్రయత్నించాను కానీ సంతృప్తి కలగక, మానేసాను.
> లలిత సంగీతం లో మీకిష్టమైన సింగర్స్?
* ముందుగా చెప్పాలంటే ఘంటసాల గారే. రావు బాల సరస్వతిగారు, ఎస్ రాజేశ్వరరావుగారు, మా గురువు గారు మల్లది సూరిబాబు గారు. – మా గురువు గారైతే, ఇటు శాస్త్రీయ సంగీతము, అటు లలిత సంగీతంలో కూడా నిష్ణాతులు. రెండూ అద్భుతంగా పాడతారు. వారి దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.
> స్వరానికీ వయసుంటుందనుకుంటున్నారా?
* గాయకులు కంఠ స్వరాన్ని కాపాడుకునే జాగ్రత్తలని బట్టి వుంటుంది.
> పాటకి మీరిచ్చే నిర్వచనం?
* పాట అంటే – చెవులకు శ్రావ్యంగా వినిపిస్తూ మనసుని ఆహ్లాదపరిచేదే స్వరాల రవాల కూర్పు అని నా అభిప్రాయం.
> సినీ గీతాల్లో ఏ పాట అతి కష్టమైన కంపోజిషన్ అని అనుకుంటున్నారు?
* తెలుగులో చాలా వున్నాయి. పెండ్యాల గారి కంపోజిషన్స్ క్లిష్టంగా వుంటాయి. శివశంకరి, రసిక రాజ తగువారము… – అలానే నీ లీల పాడెద దేవా, సంగీతలక్ష్మి చిత్రంలో గీతం, గోపాల జాగేలరా.. లీల వసంతకుమారి గారు పోటీ పడి పాడారు. ఇలా చాలానే వున్నాయి. హిందీలో ఐతే, లతాజీ పాటలు చాలా వున్నాయి. మన్మోహన్, సావరే, రవి శంకర్ గారు కూర్చిన సంగీతంలోని పాటలు, రఫీ గారు, మన్నాడే గారు ఆలపించిన క్లిష్టమైన గీతాలెన్నో వున్నాయి. చిత్రమేమిటంటే ఇవన్నీ ఈ తరం పిల్లలు నేర్చుకుని పాడుతున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతంగా వుంటుంది.
> ఈనాటి సంగీతానికి, అప్పటి సినిమా పాటలను పోల్చి చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
* చాలా వ్యత్యాసం వుంది. ఎటు దారి తీస్తున్నాయని ఆవేదన చెందుతుంటాం అని మా తరం వారం అనే మాట మాత్రం వాస్తవం. గాయకులలో, కంపోజిషన్స్‌లో, సాహిత్యంలో చిత్రీకరణలో.. ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక దశలో ఏమనిపించిందంటే – విని ఎలా భరించడం? అనీ బాధ కలిగేది. ఈ మధ్య ఆ ధోరణి తీవ్రత తగ్గిందని చెప్పాలి. హృద్యమైన సాహిత్యాన్ని వింటున్నా. అలానే వినసొంపైన శ్రావ్యమైన గానాలు అప్పుడప్పుడు చెవులకు వినొస్తున్నాయి. ఐతే ఐటం సాంగ్స్‌కి – అర్ధమూ పరమార్ధమూ ఏమిటీ అనేది పెద్ద ప్రశ్న! సంగీత సాహిత్యాలు సమాజ శ్రేయస్సుకి శ్రీరామరక్ష వంటివి. అవి కలుషితం కారాదని భావిస్తాను. యువతరం వారికి నేనెప్పుడూ ఇచ్చే సలహా ఒకటే, సంప్రదాయ సంగీత విలువలని కాపాడే ప్రయత్నం చేయండి కానీ, కళంకాలు మాత్రం తీసుకురావద్దు. అది మహా పాపం అని చెబుతుంటాను. పేరు కోసమో, పాపులారిటీ కోసమో హద్దు దాటాల్సి వచ్చినప్పుడు ఒక్క క్షణం తమ వ్యక్తిత్వ విలువలను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని నా సూచన. రియాల్టీ షోస్‌లో – కొన్ని పొరబాట్లు జరుగుతున్నాయి. వెంటనే సరిదిద్దుకోకపోతే.. సమాజానికే ప్రమాదం.
> కొత్తగా పాడుతున్న వారికి మీరిచ్చే సలహా?
* చాలా మంది యువ గాయనీ గాయకులు చాలా చక్కగా పాడుతున్నారు. క్రమశిక్షణతో నేర్పుతున్న గురువుల దగ్గర వారు శిక్షణ పొందుతున్నారు. సంతోషం. కానీ మరికొందరికి పాడాలనే ఉత్సాహం ఎక్కువ, సాధన తక్కువగా వుంటోంది. తల్లితండ్రులు పిల్లలకి శాస్త్రీయ సంగీతాన్ని వినే అలవాటు చేయాలి. ఒక్కసారిగా క్లాస్‌లో చేర్చితే వారికి అంతా గందరగోళంగా వుండి సంగీతం పట్ల ఆసక్తి పోతుంది. మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. అలానే, దేశభక్తి గీతాలను నేర్పాలి. లలిత గీతాలు, ప్రబోధాత్మక గీతాలు, జానపదాలు ఇలా అన్ని తరహా పాటలని పరిచయం చేయాలి. హిందుస్తానీలోని పోకడలు విశదీకరించి చెబుతుంటుండాలి. విద్వాంసుల ఇంటర్వ్యూలు, వారి మంచి సలహాలు వినిపిస్తుండాలి. వారి సంగీతానుభవాలను పరిశీలింపచేయాలి. వాళ్ళకి వినడం అలవాటైతే, పాడటం సులభంగా వుంటుంది. అన్నిటికంటే ముఖ్యం – సాధన. నాద సాధనే సరస్వతి దేవికి పూజ అంటారు. ఆ తల్లి మనందరిలోని ప్రాణశక్తి నిచ్చే స్వరూపిణి. అందుకని ప్రాణాయామం చేయాలి. పెద్దల నించి ఒద్దికగా సంగీతంలోని మెళకువలను నేర్చుకోవాలి. సంగీతం – హృదయ సంస్కారాన్ని పెంచుతుంది… మరో వంక ఆరోగ్యాన్ని, మనసుకూ ప్రశాంతతని చేకూరుస్తుంది.
> సంగీతం నేర్పుతారా?
* నేర్పుతానండి. పాటలు కూడా నేర్పుతాను.
> మా సంచిక పై మీ అభిప్రాయం?
* సంచిక చాలా బావుంది. వివిధ కళా రంగాలలో ప్రజ్ఞా పాటవాలు కలిగి విజయం సాధించిన పాపులర్ కళాకారులనే కాకుండా, అజ్ఞాత కళాకారులను సాహిత్యం పరిచయం చేస్తూ, తద్వారా వారికి పదిమందిలో గుర్తింపునిచ్చి, వెలుగులోకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ మీ నూతన ప్రక్రియ చాలా వినూత్నంగా వుంది. అందుకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే, ఈ వేదిక పై నా మనోభావాలను మీతో కలిసి పంచుకునే అవకాశాన్ని కలిగించిన సంచిక సంపాదకులకు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పాఠక దేవుళ్ళకి నా నమస్కారాలు.
> థాంక్సండి.
* థాంక్ యూ!
https://youtu.be/0VVVSo4v_U4
https://youtu.be/18p9Y9niQwQ
https://youtu.be/M2pJ-uzL-ak
Smt Mallaadi kanakaratnam
cell : 94411 184719
email : kanakaratnammalladi@gmail.com
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాజాల్లాంటి బాజాలు-69: ఇంటికంటె గుడి పదిలం
మిణుగురులు-4
మానస సంచరరే-64: అవిరామ అన్వేషణ!
సత్యాన్వేషణ-49
గిమ్మిక్కులు
పావురాలు – పెంపకాలు
కలక నీరు
శ్రమరత్న
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®