ఆ.. పిట్ట
ఎగిరిపొయింది,
ఉన్న గూటిని
వదిలిపెట్టి
కొత్తగూటిని
వెతుక్కుంటూ
వెళ్లి పొయింది
ఆ.. పిట్ట..!
చక్కని స్వరం
ఆ.. పిట్ట స్వంతం,
కూనిరాగాలనుండి,
కురుక్షేత్ర..
యుద్ధాన్ని కూడా
మిమిక్రీ చేయగల,
దిట్ట.. ఆ పిట్ట..!
అవధానాలనే కాదు,
అంత్యాక్షరీలూ
ఆడగలదు..
గూటిలోని
తోటి సహచర ప్రాణికి,
సర్వసుఖాలూ
అందివ్వగలదు,
పొగడ్తలకు
ఉప్పొంగిపోయి,
నెమలిలా..
పురివిప్పి
నాట్యం చేయగలదు!
పక్షి పరివారంతో
తగువు పెట్టుకుందో,
ఇతరపక్షుల
ఆగమనం చూచి,
ప్రేమపక్షుల
జాడ తెలిసి,
బెదిరిపోయిందో..
ఆ వలసపిట్ట,
ఉన్న గూడు వదలి
కొత్తగూడు
వెతుకుంటూ,
ఎగిరిపొయింది,
లౌక్యం తెలియని
తొందరపాటు
వలసపిట్ట..!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
1 Comments
Shyam Kumar Chagal
ఇంతకూ ఎవరా పక్షి