పొద్దుట్నించీ ప్రపంచంలో ఎనిమిదో వింత జరిగినట్టు ఒకటే ఫోన్లు..
విమలక్క ఇంకా తెల్లారకుండానే ఫోన్ చేసి “విన్నావుటే.. పద్మ బలరామ్ని చేసుకోనందిట..” అని చెప్పగానే తెల్లబోయేను.
తర్వాత మణొదిన, శ్యామలపిన్నీ ఇలా ఒక్కొక్కళ్ళూ ఫోన్ చేసి ఇదే మాట చెపుతుంటే నమ్మక తప్పలేదు.
భాగ్యమయితే మరీనూ.. “ఇదెక్కడి చోద్యవే.. మొన్నటిదాకా ‘బావా బావా’ అంటూ వాడి వెనకాల తిరిగింది.. ఇప్పుడేం మాయరోగ మొచ్చిందనీ..” అంటూ సాగదీసింది.
సరళయితే “అసలు బలరామ్కి ఏం తక్కువనీ.. మంచి చదువూ, పెద్ద ఉద్యోగం అతనివి. అంతేకాకుండా తల్లిలా చూసుకునే మేనత్త. అంతకన్న ఏ అమ్మాయికైనా ఏం కావాలీ?” అంటూ ఆరాలు మొదలెట్టింది.
అందరి మాటలూ ఎలా వున్నా నా అంతట నాకే పద్మతో అయిన అనుభవం గుర్తొచ్చింది.
ఆర్నెల్ల క్రితం రమేష్ పెళ్ళిలో కలిసినప్పుడు తనని పక్కకి పిల్చీ, “పెద్దమ్మా, బలరామ్ బావకి నువ్వైనా చెప్పు పెద్దమ్మా నన్ను పెళ్ళి చేసుకోమనీ.. ఎవ్వళ్ళు చెప్పినా వినట్లేదు..” అంటూ చేతులు పట్టుకుని మరీ బతిమాలింది.
అందుకే పొద్దుణ్ణించీ వస్తున్న ఈ ఫోనుల సమాచారం అర్థం కాక వదినయితే సరిగ్గా చెప్తుందని వదినకి ఫోన్ చేసేను.
“నాకు తెల్సు నువ్వు ఫోన్ చేస్తావనీ. అందరూ పద్మనే తప్పు పడుతున్నారు కదా! కానీ నాకైతే మొదట్నించీ పద్మ ఈ బలరామ్ని చేసుకోడం అంతగా ఇష్టం లేదు. ఇన్నాళ్ళూ బావ అనే మాయలో కొట్టుకుపోయింది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచింది.” అంది.
“అదేంటి వదినా.. బలరామ్ మంచి పిల్లాడేగా..” అన్నాను ఆశ్చర్యంగా.
“మంచంటే.. చదువూ, ఉద్యోగం ఉంటే చాలా… స్వభావం బాగుండొద్దా!” ఎదురు ప్రశ్నించింది వదిన.
“అంటే…” అన్నాను అర్ధం కాక.
“నీకు ఇలా చెపితే అర్ధం కాదు. నీకే కాదు.. మాటల్లో చెపితే ఎవరికీ అర్ధం కాదు. అందుకే కథలా రాసాను. ఈమెయిల్లో పంపిస్తాను.. చదువుకో..” అని ఫోన్ పెట్టేసింది.
వదిన పంపించిన కథ ఇదిగో… మీరూ చదవండి..
***
“అబ్బే, ఈ పిల్ల జెండాకొయ్యలా పొడుగ్గా ఊగిపోతూ వుందమ్మా.. వద్దులే..”
“అబ్బే, ఈ పిల్ల మరీ పొట్టి బుడంకాయిలా వుందమ్మా.. కాన్సిల్ చేసెయ్యి..”
“ఊహు.. ఈ పిల్ల మరీ తెల్లగా, తెస్సోడుతున్నట్టుందమ్మా… మనకొద్దులే..”
“అబ్బెబ్బే.. ఈ పిల్ల నల్లగా, తేగతొక్కలా వుందమ్మా..వద్దని చెప్పై..”
ఇవే కాదు…ఇలాంటి వంకలు చాలా చెప్పి చాలా పెళ్ళిసంబంధాలను తిప్పికొట్టిన వామన్రావుకి వంకల వామన్రావనే పేరొచ్చేసింది. మంచి చదువు, అంతకన్నా మంచి ఉద్యోగం వున్నా కూడా వామన్రావుకి నచ్చిన, వంకలేని సంబంధం కనపడటంలేదు. అతని ఈ ధోరణి మానుకోమని తండ్రి శంకర్రావు ఎంత చెప్పినా చెవిని పెట్టలేదు వంకల వామన్‌రావు.
ఇదంతా చూస్తున్న అతని తల్లి కనకమ్మ ఇంక కొడుక్కి ఎక్కడ పెళ్ళి కాదోనని భయపడిపోయింది. ఆఖరికి ఎప్పుడో వద్దని వదిలేసిన తన తమ్ముడి కూతురినైనా కట్టబెడదామని తమ్ముడు సాంబమూర్తికి ఫోన్ చేసి పిలిపించింది.
సాంబమూర్తి కూతురు శారద. శారదకి పాటలంటే పిచ్చి ఇష్టం. అలాగని తనేమీ గొప్ప పాటగత్తేమీ కాదు. గొంతూ బాగుండదు, సరిగ్గా పాడడవూ రాదు. అయినా సరే ఏమాత్రం తడబడకుండా ఏ సందర్భానికి తగ్గట్టు ఆ పాట పాడేస్తూ వుంటుంది. అది వినలేక అందరూ ఆ పిల్లకి చిన్నప్పుడే “పాటలక్క..” అని పేరు పెట్టేసేరు. ఆ పాటలక్కకి చిన్నప్పట్నించీ కూడా బావ వామన్రావంటే ఎంతో ఇష్టం. అందుకని అతను కనపడగానే “బావ” అనే మాటతో వచ్చే పాటలన్నీ పాడేసేది.
మరీ చిన్నప్పుడయితే “బావా బావా పన్నీరూ.. బావను పట్టుకు తన్నేరూ..వీధీ వీధీ తిప్పేరూ… వీసెడు గంధం పూసేరూ..” అంటూ వచ్చీరాని మాటలతో మొదలుపెట్టిన ఆ పాటలు పెద్దవుతున్నకొద్దీ వయసుకు తగ్గట్టు మారిపోయేవి. అలాగ “అందమైన బావా…అవు పాలకోవా.. విందుగా పసందుగా నా ప్రేమ నందుకోవా..” నుంచి “బావగారూ.. బాగున్నారా..” వరకూ వచ్చేయి.
అసలు వామన్రావుకి “బావా..” అన్న పిలుపంటేనే చిరాకు. ఎన్నిసార్లో చెప్పేడు శారదకి తనని పేరు పెట్టి పిలవమని. అబ్బే.. వింటుందా.. వద్దన్నకొద్దీ మరీ ఎక్కువగా వెనకాలే తిరుగుతూ “బావా..బావా..” అంటూ బావమీద తనకొచ్చిన పాటలన్నీ పాడుతూ వామన్రావుని తెగ విసిగించేసేది. అప్పట్నించీ వామన్‌రావు శారదని అసలు పేరుతో పిలవడం మానేసి అందరిలాగా “పాటలక్క” అనే పిలవడం మొదలెట్టేడు. తల్లితో అస్తమానం “మీ పాటలక్కని ఎవరు చేసుకుంటారో కానీ వాడికి పెళ్ళైన నాల్రోజులకే చెవుడొచ్చి తీరుతుంది..” అనేవాడు.
అలాంటి పాటలక్కని ఇప్పుడు వంకల వామన్రావుకే యిచ్చి కట్టబెట్టాలని కనకమ్మ, సాంబమూర్తిల ప్రయత్నం.
అక్క పిలుపుకి రెక్కలు కట్టుకుని వాలిపోయేడు సాంబమూర్తి.
“అల్లుడు వంక పెట్టకుండా ఒప్పుకున్నాడా అక్కయ్యా..” అనడిగిన తమ్ముడి ప్రశ్నకి “నా మొహం.. ఇంకా నేను వాడికీమాట చెప్పందే.. మనిద్దరం ఏదైనా చేసి వాణ్ణి పెళ్ళికి ఒప్పించాలి.” అంది కనకమ్మ.
మొత్తానికి అక్కాతమ్ముళ్ళిద్దరూ కూడబలుక్కుని వామన్రావుకి ఊపిరాడకుండా ఊదరగొట్టేసేరు. పాటలక్క ప్రతిభని సాంబమూర్తి పొగుడుతుంటే, వంకల వామన్రావుకి పెళ్ళిళ్ళ గుంపుల్లో వచ్చిన నిందలు చెప్పి కనకమ్మ అతన్ని హడలగొట్టేసింది. తల్లి మాటలు విన్న వామన్రావుకి ఇలా వంకలు పెట్టుకుంటూపోతే తనకింక పెళ్ళవదేమోననే భయమేసేసింది.
కాస్త అయిష్టంగానే సాంబమూర్తి పిలవగానే ఎదురుగా వెళ్ళి నిలబడ్దాడు.
అక్క యిచ్చిన ధైర్యంతో “ఏమంటావ్ అల్లుడూ..” అనడిగేడు సాంబమూర్తి వామన్రావుని.
“అబ్బే.. ఆ పాటలక్క నాకు వద్దంటే వద్దు..” అంటూ బింకంగా చెప్పేసేడు.
“అబ్బే.. ఇప్పుడు శారద పాటలు పాడట్లేదుగా.. ఎప్పుడో మానేసిందీ..”
సాంబమూర్తి మాటలకి తెల్లబోయేడు వామన్‌రావు.
“మానేసిందా… నిజవే.. మరేం చేస్తోందిప్పుడూ!” అనుమానంగా అడిగేడు.
“అదేదో కోర్సు చేస్తోంది..”
“ఏంటీ.. కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేస్తోందా..”
“ఊహు కాదు.. అదేదో మరి.. నాకు పేరు తెలీదు. ముందు రెండువారాలు చేసింది. తర్వాత మళ్ళీ అందులోనే దాని పైకోర్సుట…అది.. నలభైరోజులు చేసింది. అది కూడా అయ్యేక ఇంకా పై కోర్సుట… ఇప్పుడు ఆ మూణ్ణెల్ల కోర్సు చేస్తోంది..”
“అదే.. ఏవిటది?” ఆతృత ఆపుకోలేకపోయేడు వామన్‌రావు.
“అదేంటో పేరు నాకు తెలీదు కానల్లుడూ… ఈ కోర్సు చెయ్యడం మొదలెట్టేక శారద పాటలు పాడడం ఆపేసింది. మొన్నేదో యథాలాపంగా గుర్తు చెయ్యబోతే ‘ఆ పిచ్చిపాటల మాట ఇంకెత్తకూ.. ఏదో చిన్నతనంలో తెలీనప్పుడు అలా పాడేదాన్ని. ఇప్పుడీ కోర్సు చేసేక నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి’…అంది.”
“అబ్బా.. అదే ఏం కోర్సు మావయ్యా..”
“దాని పేరు నాకు తెలీదు కానీ.. ఈ మూణ్ణెల్లకోర్సూ అయేక అది ఆన్లైన్లో బోర్డు కూడా కట్టెయ్యొచ్చుట..”
మూణ్ణెల్ల కోర్సు చేసేసి ఆన్లైన్లో డబ్బు సంపాదించేసే అంత గొప్ప కోర్సేవిటో వామన్రావుకి అర్ధం కాలేదు.
బుర్ర గోక్కున్నాడు సాంబమూర్తి. ఆఖరికి జుట్టు పీక్కునేదాకా వచ్చినా ఆ కోర్సేంటో చెప్పలేకపోయేడు పాపం.
ఇంకప్పుడు కనకమ్మ కల్పించుకుంది.
“తెలీనప్పుడు వాడేం చెపుతాడ్రా.. అయినా నీకు కావల్సింది శారద పాటలు పాడడం మానేయడం.. అంతేగా.. అది మానేసిందని చెపుతూనే వున్నాడాయె.. నీకంతగా కావాలంటే దానికే ఫోన్ చెసి కనుక్కో..” అంది కొడుకుతో..
“అవునవును.. ఆ పనిచెయ్యి..” అంటూ అక్కయ్యని సమర్ధించేడు తమ్మయ్య.
ఈ సలహా ఏదో బాగుందనుకుంటూ శారదకి ఫోన్ చేసేడు వామన్‌రావు.
“హాయ్ మిస్టర్ వామన్రావ్.. హౌ ఆర్ యూ..”
శారద పలకరింపుకి షాకయ్యేడు వామన్‌రావు. కాసేపటిదాకా నోట మాట రాలేదు.
కాస్త తేరుకున్నాక “ఏవిటీ.. పాటలు పాడడం మానేసేవుట..” సరదాగా మాట కలుపుతూ అన్నాడు.
“మనిషిలో ఎదుగుదల వుండాలికదా మిస్టర్ వామన్రావ్..”
“అదే.. ఇప్పుడే నీ విషయం మావయ్య చెప్పేడు. ఇంతకీ నువ్వేం కోర్సు చేస్తున్నావ్?”
“సైకాలజీ.. కన్సల్టింగ్ సైకాలజీ కోర్సు చేస్తున్నాను. ఇంకో నెలయితే ఆన్లైన్ లోనే కన్సల్టెన్సీ మొదలెట్టేస్తాను. ఎంచక్క ఇంట్లో వుండే బోల్డు సంపాదించొచ్చు..”
తెల్లబోయేడు వామన్‌రావు.. ఆర్నెల్లపాటు ఓ కోర్సు చేసి కన్సల్టెన్సీ మొదలెట్టడమేంటో అతనికి అర్థం కాలేదు.
సర్లే.. ఆ విషయం ఇప్పుడెందు కనుకుంటూ అసలు విషయం కదిపేడు.
“ఇప్పుడే మావయ్య నిన్నీ ఇంటికోడల్ని చేస్తా నంటున్నాడు. ఇదివరకయితే ఆ పాటలక్క వద్దనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వే ఏదో ఎదిగాననీ, కన్సల్టెన్సీ గట్రా అంటూ ఏదో అంటున్నావు కనక ఇంక నాకు అభ్యంతరమేవుంటుంది చెప్పు.. అందుకే మావయ్యకి ఓకే చెప్పేద్దామను కుంటున్నాను.”
కాసేపు అట్నించి ఏ శబ్దమూ లేదు. వామన్‌రావు చెవులు మొబైల్‌కి అతికించేసేడు.
ఓ నిమిషమయ్యేక “కానీ నాకు ఓకె కాదు మిస్టర్ వామన్రావ్..” అని అట్నించి స్పష్టంగా వినిపించింది.
ఖంగుతిన్నాడు వామన్‌రావు. చిన్న కేకలాంటిది చాలా సన్నగా వామన్‌రావు నోట్లోంచి బైట కొచ్చింది.
“అవును మిస్టర్ వామన్రావ్.. ఈ సైకాలజీ కోర్సు చేసేక నాకు ఒక విషయం బాగా తెల్సింది. అదేంటంటే మనిషన్నవాడికి పాజిటివ్ ఆటిట్యూడ్ వుండాలి. అలా లేనివాడు తనూ సుఖంగా వుండలేడు.. ఎదుటివాళ్లనీ వుంచలేడు. నీలో పూర్తిగా నెగటివ్ ఆటిట్యూడ్ వుంది. అందుకే ఎదుటవున్న ప్రతివారిలోనూ నీకు లోపాలే అదే వంకలే కనిపించేయి. నీలాంటివాడితో జీవితం పంచుకోవడం నాకిష్టం లేదు. అందుకే నీతో పెళ్ళి నాకు ఓకే కాదు..”
అట్నుంచి మొబైల్ కట్ చేసిన శబ్దం వినిపించింది. వంకల వామన్‌రావు చేతిలోని మొబైల్ అతనికి తెలీకుండానే చేతిలోంచి జారిపోయింది.
కథ చదివారుగా… నాకైతే పద్మ బలరామ్ని ఎందుకు పెళ్ళి చేసుకోనందో అర్ధమైంది.. మరి మీకో!……
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
బావుంది..థాంక్స్ to సైకాలజీ result..నేనూ చేస్తా లక్ష్మి గారూ…good idea ఇచ్చారు
ధన్యవాదాలండీ..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
దేవీ నమోస్తుతే
మహతి-11
ప్రఖ్యాత కవి, రచయిత, విమర్శకులు డా. అట్టెం దత్తయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ
క్రౌర్యం
లేనితనం..!!
సంపాదకీయం అక్టోబరు 2020
మధురమైన బాధ – గురుదత్ సినిమా 23
మహిళా డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్యశాల – వార్త
“అంతరిక్షం”లో కవిత్వమూ, ముద్దూ
మరుగునపడ్డ మాణిక్యాలు – 10: ద బిగ్ సిక్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®