[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘వేదనాభరిత సన్నాయి రాగం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నా మనసును ఎంతగానో నిగ్రహించుకున్నా!
అయినా అంతరంగంలోని భావోద్వేగాన్ని
నియంత్రించుకోలేకపోతోంది నాలుక!
నువ్వు పెట్టిన ఆంక్షల్ని ఉల్లంఘించి
నా గుండె లోతుల్లో దాగి వున్న ప్రేమ రహస్యం
అలవోకగా ప్రపంచానికి తెలిసిపోయింది!
నువ్వు పంచి ఇచ్చిన ఆకాశమంత ప్రేమను
పిడికెడు గుండెలో దాచుకోవటం నాకు సాధ్యమేనా?
రాజ్యాలేలిన రాజులెందరో..
మధుపాత్ర నుండి ‘సాకీ’ వంచి ఇచ్చే మధువు మత్తులో
తులతూగిన రాచరికపు ముచ్చట్లు
ఒకనాటి కథనాలైతే..
నీవు నా కోసమే దాచివుంచిన ప్రేమ మధుభాండం
నేను కోరి తెచ్చుకున్న నా జీవన నేస్తమై..
నన్ను అలరించిన వాస్తవ గాథ కదా ఇది!
‘సాకీ’ నిరంతరమూ కనిపించే ఓ మధుపాత్ర అయితే..
నువ్వు మాత్రం..
నా మది లోయల్లో దాగి వున్న భావావేశానివి!
అక్కడ ఆమె వంచేది మత్తునిచ్చే మధువునైతే..
ఇక్కడ నీవు అందించేది..
జీవితానందాన్ని పంచే అమృత కలశాన్ని!
సాకీ.. రాజులు.. మధుపాత్ర
చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన పాత్రలైతే
నువ్వు.. నేను.. ప్రేమామృత కలశం
వర్తమాన ప్రేమ జీవన పరిష్వంగంలో
పగలూ రేయీ కలిసే వుండాలని తపించే
అసాధారణ ప్రేమమూర్తులం కదా ప్రేయసీ!
కానీ.. ఎందుకో..
ఈ కుళ్ళు లోకానికి మనపై కసి!?
ఊహకైనా అందని సంప్రదాయ బంధాలు..
ప్రాణప్రదమైన ప్రేమానురాగాల సంబంధాలను
కర్కశంగా తునాతునకలు చేసి..
మన మధ్య వియోగపు గోడలు కట్టేశాయి!
ఇప్పుడు నాకు..
అక్కడెక్కడో..
నీ పెళ్ళి వేడుకల్లో మ్రోగుతోన్న
సన్నాయి వాయిద్యాలు
వేదనాభరిత రాగాలను
వినిపిస్తున్నాయి కర్ణకఠోరంగా!

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.